Pages

Saturday, 25 July 2015

ఓ మహా సందడి సద్దుమణిగింది!

`పుష్కరాలు అయిపోతున్నాయి అంటే బెంగగా ఉంది. రేపటినుంచి ఈ సందడి అంతా ఉండదు కదా?` అంటున్నాడు ఒకాయన. ఆయన నోరు తెరిచి మనసులో మాట బైట పెట్టాడు కానీ, టీవీలో గోదావరి హారతి కార్యక్రమం లైవ్‌లో ప్రసారమౌతుండగా చూస్తున్న చాలా మందికి కలిగిన అభిప్రాయం కూడా అదే. నదీ స్నానాలు, పుణ్యక్షేత్రాల సందర్శనం ఈ దఫా జరిగినంత కోలాహలంగా ముందు ఎప్పుడూ జరగలేదని చెప్పుకొంటున్నారు. (మొదటిరోజు రాజమండ్రీ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగి ఉండకపోతే ఎంత బాగుండును!) జనాలు దూరభారాల్ని లెక్కపెట్టకుండా రాజమండ్రీకో, కొవ్వూరుకో, కోటిపల్లికో, మరో రేవుకో వచ్చి గోదావరిలో మునకలు వేశారు. సామాన్యుల దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ పుష్కరాల యూఫోరియా ఊపి, ఊపి వదిలిపెట్టింది. `గతంలో ఏదో ఒకసారి ములిగితే సంతృప్తిగా అనిపించేది. ఇప్పుడయితే ఎన్నిరేవుల్లో మునిగినా తనివితీరటంలేదు,` అని రచ్చబండ దగ్గర ఒక పెద్దాయన చెపుతుంటే చుట్టూ కూర్చొన్న వాళ్ళు `అవునని` తలలూపుతున్నారు. టీవీల ద్వారా ప్రచారం బాగా జరిగడంవల్లో, ప్రజల్లో అధ్యాత్మికత ఎక్కువయ్యిందో తెలియదు కానీ ప్రతీ రేవులో మునిగిన వాళ్ళ లెక్కలు లక్షల్లో తేలడం, ఒక్కోచోట అయితే కోట్లలో కూడా హాజరు ఉండడం ఈ మహా పుష్కరాల ప్రత్యేకత. 

కార్లలో, టూరిస్టు బస్సుల్లో, ఆర్టీసీలో, బైకులమీద ఎక్కడేక్కడి నుంచో జనాలు వచ్చారు. రోడ్డుప్రక్కన భోజనాలు వండుకోవడం, స్మార్ట్‌ఫోన్లతో సెల్ఫీలు తీసుకోవడం బాగా కనిపించాయి. మైళ్ళకొద్దీ ట్రాఫిక్ జాంలు, అక్కడక్కడా రోడ్డుప్రమాదాలు జరిగాయి. దానాలు ఇవ్వడంకోసం యాత్రికులు డబ్బులు ఇబ్బిడిముబ్బిడిగా ఖర్చుపెట్టారు. చాలా షాపుల్లో వ్యాపారం పెరిగింది. ఈ పన్నెండు రోజులూ పురోహితులు ఫుల్లు బిజీ. పుణ్యక్షేత్రాల ఆదాయాలు బాగా పెరిగాయి.  

`గోదావరి నదీ జలాల్ని తాకి పునీతులవుదామని దూరతీరాల్నుంచి వస్తే అథిది దేవో భవ అన్న మాటకి అర్థం తెలిసింది. దాహమంటే గోదావరి వాసులు మజ్జిగతో గొంతుతడిపారు. ఆకలి అనకపోయినా అమ్మకంటే ఎక్కువగా కొసరి కొసరి తినిపించారు. నీ బిడ్డలకు అదంతా నువ్వునేర్పిన సంస్కారమే అయివుంటుందా?`  అని ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఒకాయన స్టేటస్ అప్డేట్ పెట్టాడు.  యాత్రికులకి మంచినీళ్ళూ, మందులూ సరఫరా చెయ్యడం, అవకాశం ఉన్నవాళ్ళు అన్నసంతర్పణలు చెయ్యడం, సేవా దళాలుగా ఏర్పడి వృద్దులకీ, పిల్లలకీ, వికలాంగులకీ గోదావరి రేవులదగ్గర చేయూత నివ్వడం... హృద్యమైన చిత్రాన్ని ఇంద్రదనుస్సులాగ ఆవిష్కరించిన సందర్భం ఇది. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు `మనుష్యుల్లో మంచితనం ఇంత ఉందా!` అని ముచ్చటపడతాం. 

ఆగండాగండి! అంతా మంచే కాదు పుష్కరాల సందర్భంగా చెడునూ చూశాం! ముసలి తల్లితండ్రుల్ని వెంటబెట్టుకొని వచ్చి, జనసందోహం మధ్యలో వదిలించుకొని, చడీచప్పుడూ లేకుండా ఊరిబస్సు ఎక్కేసిన స్వార్థపరుల కథలుకూడా న్యూస్‌పేపర్లలో చదివి నివ్వెరపడ్డాం, కదూ?   

వేతనాల పెంపు కోసం సమ్మెబాట పట్టిన పారిశుద్ద కార్మికులతో ప్రభుత్వ మంతనాలు సఫలీకృతం అయ్యాయట. వాళ్ళు రేపటినుంచి యాత్రికులు వదిలిపెట్టిన చెత్తను తొలగిస్తారు. జనసామాన్యం మునిగి, మునిగి వదిలించుకొన్న వంటిమురికిని గోదావరి మాత కూడా సాగరుడిలో కలిపేస్తుంది. కానీ పుష్కరుడి మాట ఏమిటి? మనసుల్లో మురికిని కడిగే సామర్ధ్యం పుష్కరుడికి ఉండి ఉంటుందా?  అదే జరిగితే ఎంత బాగుండును! 

ఏదేమైనా గోదావరి పుష్కరాలు నేటితో ముగిసాయి. ఓ మహా సందడి సద్దుమణిగింది. 

© Dantuluri Kishore Varma  


Monday, 13 July 2015

గోదావరి మహాపుష్కరం 2015

మహారాష్ట్రాలోని నాసిక్‌కి సమీపంలో త్రయంబకేశ్వరం నుంచి ప్రయాణం మొదలు పెట్టిన గోదావరి 1465 కిలోమీటర్లదూరం ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దారిలో భూముల్ని సస్యశ్యామలం చేస్తుంది, మనసుల్ని పులకరింపజేస్తుంది, ప్రజల్లో భక్తి భావనలని నింపి అధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది. మహారాష్ట్రాలో, తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి ప్రవహించే మార్గంలో ఎన్నో అందమైన పల్లెటూళ్ళు ఉన్నాయి, పట్టణాలూ, నగరాలూ ఉన్నాయి, ప్రశిద్ద దేవాలయాలు ఉన్నాయి. కొండకోనల నడుమ ప్రవహిస్తూ గోదావరి నది ఎన్నెన్నో ఒయ్యారాలు పోతుంది. ప్రకృతి శోయగాలతో పరిసరాలను మనోజ్ఞంగా మారుస్తుంది. అందుకే అడవి బాపిరాజుగారు... 

ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి
కొండల్లో ఉరికింది
కోనల్లో నిండింది
ఆకాశ గంగతో
హస్తాలు కలిపింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

అడవి చెట్లని
జడలోన తురిమింది
ఊళ్ళ దండలు గుచ్చి
మెళ్ళోన దాల్చింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

వడులలో గర్వాన
నడలలో సుడులలో
పరవళ్ళు తొక్కుతూ
ప్రవహించి వచ్చింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

శంఖాలు పూరించి
కిన్నెర్లు మీటించి
శంకరాభరణ రా
గాలాప కంఠియై
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

నరమానవుని పనులు
శిరమొగ్గి వణీకాయి
కరమెత్తి దీవించి
కడలికే నడిచింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

... అంటారు

గోదావరి ప్రాంతంలో నివశించే ప్రజలకి ఈ నదీమతల్లితో ఎంత ఆత్మీయత ఉంటుందంటే... అంటే.. దాని గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే,  పన్నెండేళ్ళకు ఒక్కసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలు రేపటి నుంచి మొదలవుతున్నాయి.
ఎక్కడ చూసినా సందడే సందడి. పుష్కర స్నానం యొక్క ఫలితం గురించి, ఈ సమయంలో చెయ్యవలసిన దానాల గురించి పత్రికల్లో, టీవీ చానళ్ళలో విరివిగా ప్రచారం జరిగిందేమో షాపుల దగ్గర దానాలుగా ఇవ్వడానికి కావలసిన వస్తువులు కొనడం కోసం జనాలు ఎగబడుతున్నారు. `గోదానం చెయ్యడం చాలా మంచిదట. మా అమ్మాయి చేస్తానంటే ఆవును కొనడానికి సంతకి వెళ్ళాను. ఒక్కటంటే ఒక్క ఆవు అమ్మకానికి రాలేదు,` అంటున్నాడు ఒకాయన. ఆవుల్ని సంతవరకూ రానివ్వకుండా దొరికిన దగ్గర దొరికినట్టుగా సరాసరి కొనేస్తున్నారట!     

రాజమండ్రీలో పుష్కరఘాట్‌లు నిర్మించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గోదావరి వొడ్డున ఉన్న పట్టణాలలో, పల్లెటూర్లలో కూడా నదీ స్నానాలకు ఏర్పాట్లు చేశారు. యానంలో చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పుష్కరుడికి స్వాగతం పలికారు. రాష్ట్రాలు, జిల్లాలు దాటి ఎక్కడెక్కడి నుంచో జనాలు పుష్కర స్నానం కోసం గోదావరి వైపుకు ప్రయాణం మొదలు పెట్టారు. పవిత్ర స్నానాలు చేసి, వెళ్తూ వెళ్తూ కూడా గోదావరి జలాల్ని తీసుకొని వెళ్ళి తమ ప్రాంతంలో కాలువల్లో, చెరువుల్లో కలుపుతారట. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని విశ్వాసం. స్వయంగా వెళ్ళి గోదావరి నదిలో స్నానం చెయ్యలేని వాళ్ళకోసం తపాలా శాఖవారు గాడ్‌జల్ పేరుతో ఇరవై రూపాయలకే పుష్కర గోదావరి జలాల్ని అందుబాటులోనికి తెస్తున్నారు.  పుష్కరాలు జరిగే 12 రోజులూ విద్యాసంస్థలకి శెలవులు ఇవ్వాలని విద్యాశాఖామాత్యులు ఉత్తర్వులు ఇచ్చారని ఇప్పుడే ఎవరో అంటున్నారు. కానీ, ఎవ్వరూ ఇంకా శెలవులు ప్రకటించినట్టుగా సమాచారం లేదు.  

శెలవులు ఉన్నా లేకపోయినా పుష్కరస్నానానికి చలో! 

© Dantuluri Kishore Varma  
     

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!