గాలికి తలలూపే గరిక పోచలు
పిచ్చి గడ్డిలో పూచే పూల సొగసులు
కురిసే చినుకులో అందం
తడిసిన మట్టి తెచ్చే మధురమైన సువాసనలు
జలజల మని పారే నదీమ తల్లులు
విరిగి పడే కెరటాలతో సందడి చేసే సముద్రుడు
అల్లనల్లన సాగే మేఘమాలికలు
కురిసే మంచులో తన్మయత్వం
చలిలో ఆనందం
ఉదయపు ఏటవాలు సూర్యకిరణాలలో నులివెచ్చని హాయి
భయపెట్టే ఉరుములు
అబ్బురపరిచే ఇంద్రదనుస్సు..
అన్నట్టు... ప్రకృతి అంటే దేవుడా?
సకల చరాచర ప్రపంచానికీ దేవుడి ప్రేమని అందించే మాధ్యమమా?
ప్రకృతి అందించే ఫలాలను, ఆనందాలను అందుకొనే చేయీ, మనసూ మనవై నప్పుడు... ఇచ్చే చేయి ఎవరిది?
టాగోర్ రాసిన గీతాంజలికి చలం చేసిన అనువాదం చదివారా?
కవి ఈశ్వరుడ్ని అడుగుతాడు, `నేనే లేకపోతే నీ ప్రేమ ఏమవుతుంది?` అని. నా హృదయాన్ని వలలో బంధించు కొనేందుకు సౌందర్యంతో అలంకరించుకొన్నావు` అంటాడు.
మరొక చోట భహుశా ఈశ్వరుడి దృక్పదాన్ని ఎరుక పరచడానికి పిల్లలకి బహుమతులిచ్చి ఆనందించే తండ్రి హృదయాన్ని ఆవిష్కరిస్తాడు. కవి చెప్పిన ఈ మాటలు చూడండి-
నీకు రంగురంగుల బొమ్మలు తెచ్చి ఇచ్చినప్పుడు నాకు అర్థమౌతుంది నా పాపా,
మేఘాలపైనా నీటిపైనా ఇన్ని రంగులు ఎందుకు నాట్యమాడతాయో.
ఎన్నో చిన్నెలతో పువ్వులు ఎందుకు చిత్రితమౌతాయో...
నిన్ను చిందులు తొక్కించేదుకు నేను పాడినప్పుడు నాకు సరిగా తెలుస్తుంది.
ఆకుల్లో సంగీతం ఎందుకుందో.
చెవివొగ్గి వినే భూ హృదయానికి తమ కంఠరవాల్ని అలలు ఎందుకు వినిపిస్తాయో,
ఆశకొన్న నీచేతులకి మిఠాయి తెచ్చి ఇచ్చినప్పుడు తెలుస్తుంది.
పుష్పపాత్రలో తేనె ఎందుకు దాక్కొని ఉంటుందో.
మధురరసం పళ్ళల్లో రహస్యంగా ఎందుకు దాక్కొని ఉందో.
నిన్ను చిరునవ్వు నవ్వించాలని నీ ముఖాన్ని నేను ముద్దు పెట్టుకొన్నప్పుడు
కన్నా, నాకు నిశ్చయంగా తెలుస్తుంది.
ఉదయ కాంతిలో ఆకాశం నించి దొర్లి ప్రవహించే ఆనంద మేమిటో.
ఎండాకాలపు గాలి నా వొంటికి తెచ్చే సౌఖ్యమేమిటో...
తండ్రి ఇచ్చే బహుమతి ఆనందంగా తీసుకొనే పిల్లవాడిలాగే ప్రకృతి ఇచ్చే ఫలాలనూ, ఆనందాలనూ కృతజ్ఞతతో తీసుకోవడమే మనిషి దేవుడికి తిరిగి ఇచ్చే బహుమతి.
© Dantuluri Kishore Varma
చాలా బావుంది . అనంత సౌందర్యాన్ని మధురమైన ఫలాలని ఇచ్చేది భగవంతుదే అయినప్పుడు కృతజ్ఞతతో తీసుకోవాలి కదా !
ReplyDeleteచలం గారి వాక్యం చాలా అందంగా ఉంటుందని విశ్వనాధ వారు కూడా స్వయంగా అనడం ఒక ఇంటర్ వ్యూ లో విన్నాను . గీతాంజలి అనువాదం రమణాశ్రమమానికి వెళ్ళిన తర్వాత చేసారట . ఆ అనువాద గీతానజలిని చదవాలని నిన్ననే అనుకున్నాను . మీరు ఇక్కడ ఇచ్చారు . చాలా బావుంది . ధన్యవాదాలు కిషోర్ గారు .
మీరు చదవాలనుకొన్నప్పుడు ఈ ఆర్టికల్ రావడం ప్లెజంట్ కో ఇన్సిడెన్స్ వనజ గారూ. చలం గీతాంజలిని తప్పక చదవండి. మీకు నచ్చుతుంది అనుకొంటున్నాను. ధన్యవాదాలు.:)
Deleteనీకు రంగు రంగుల బొమ్మలు తెచ్చి ఇచ్చినపుడు అర్ధమవుతుంది నా పాపా,
ReplyDeleteమేఘాల పైన నీటి పైన ఇన్ని రంగులు ఎందుకు నాట్యమాడతాయో
ఇంతకి క్రెడిట్ దేముడిదా లేక భక్తుడిదా?
చక్కని పోస్ట్ కిషోర్ సర్!
ఇద్దరిదీ సీతగారూ. దేవుడి ఇచ్చిన బహుమతిని చూసి మనిషి ఆనందించకపోతే ఒక తండ్రిలాగే ఆయన చిన్నబుచ్చుకోవచ్చు. :)
Deleteచలం గారి అనువాదం అతి సుందరమైనది అన్నిటిలోకెల్లా..!టాగోర్ మహాశయుడు ఎంత అదృష్టవంతుడు అనిపిస్తుంది చదివినపుడల్లా..!ధన్యవాదాలు జ్ఞాపకం చేసిన మీకు..!
ReplyDeleteతెలుగులోనీ, ఇంగ్లీష్‌లోనీ చక్కని పుస్తకాలన్నింటినీ చదువుతున్న మీ అభిరుచికి అభినందనలు మూర్తిగారూ.
DeleteReally impressed to see ur blog dear sir. Hatsoff!
ReplyDeleteThanks a million Suresh garu :)
Delete