Pages

Thursday, 29 September 2016

సమయం ఎంచుకొని కొట్టాలి!

కమర్షియల్ సినిమాలో క్లైమాక్స్ సీన్ జరుగుతూ ఉంటుంది...నేల ఈనినట్టు గూండాలు కథానాయకుడి మీద తెగబడుతూ ఉంటారు.

 `ఒరేయ్, నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను. ఎంతమందిని పంపుతావో పంపు. కానీ, నన్ను మాత్రం బ్రతకనివ్వకు. నీకు ఇచ్చిన టైం పూర్తైన తరువాత నేను ప్రాణాలతో ఉంటే, నీ పని పులుసులోకి ముక్కల్లేకుండా అయిపోతుంది,` అంటాడు విలన్‌తో. 

కుర్చీ చివరకు జరిగిపోయి, ఊపిరి బిగబట్టి చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం సొల్లు కబుర్లు చెప్పి, సవాల్ విసురుతున్న హీరోని చూసి వొళ్ళు మండిపోతుంది. `చెయ్యగలిగిన పని చేసి చూపించడం మానేసి, ఎదుటివాడితో తన్నులు తినే వరకూ ఆగడం ఎందుకు?` అని విసుక్కొంటాడు. గూండాలు ఎగిరెగిరి తన్నుతుంటే... తన్నుతన్నుకీ రక్తం కక్కుకొంటున్న హీరోని ఉత్సాహపరచడానికి ప్రేక్షకుడు పిడికిలి బిగించి `తిరిగి కొట్టు...కొట్టు` అని మౌనంగానే ఆక్రోశిస్తాడు. 

ఇచ్చిన ఐదు నిమిషాల గడువూ పూర్తయిన తరువాత పోతున్న ప్రాణాలని బలవంతంగా వెనక్కి తెచ్చుకొని, పిడికిళ్ళని ఉక్కు గదల్లా మార్చుకొని వొక్కొక్కడినీ కొడుతుంటే... ప్రేక్షకుడు రోమాంచితమైపోయి, విజిల్స్ వేస్తాడు. అది సినిమా.

అణుగుతుంది కదా అని ఇనుప స్ప్రింగు మీద కాలేసి తొక్కుతూ ఉంటే... అణిగి... అణిగి... అణిగి... ఒక్కసారే విస్పోటనం లాంటి శక్తితో తొక్కినవాడిని విసిరి కొట్టేస్తుంది. అగామంటే తిరిగి కొట్టలేక కాదు. సమయం ఎంచుకొని కొట్టాలి.ఇక్కడ స్ప్రింగ్ వ్యక్తి అయినా సరే, దేశమైనా సరే .... రిజల్ట్ సేం టు సేం!

 కావాలంటే భారత్ సర్జికల్ స్ట్రైక్ చూడండి. దానికి ప్రజలనుంచి వస్తున్న స్పందనని చూడండి.


© Dantuluri Kishore Varma

Sunday, 18 September 2016

ఆకాశంలో మామిడిచెట్టు

స్కూల్ గార్డెన్ కోసం మొక్కలు కొందామని చీడిగ వెళ్ళాం. చిన్ని చిన్న గార్డెన్‌లకి మొక్కలు కావాలంటే కాకినాడవాళ్ళు కడియపులంక వరకూ పోవలసిన అవసరం లేకుండా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చీడిగలో రెండు పెద్ద నర్సరీలు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఒకటి వినాయకా నర్సరీ, రెండవది విగ్నేశ్వరా నర్సరీ! ఏ నర్సరీకి వెళదాం అని ఒక నిమిషం సందిగ్ధంలో చూస్తుంటే... అశోకచెట్లని ప్రవేశద్వారంలా పెంచిన నర్సరీ మా చూపులని ఆకర్షించింది. 

అశోకచెట్లు సైప్రస్ చెట్లలాగ నిటారుగా పెరుగుతాయి. కానీ ఒక్కొక్కసారి కొమ్మలు రావచ్చు. ఈ నర్సరీలో ప్రవేశానికి అటూ ఇటూ వేసిన అశోక మొక్కల్లో ఒకదానికి ఓ కొమ్మ అడ్డంగా పెరిగి రెండవ చెట్టుకు తగిలే వరకూ వచ్చింది. చెట్టు అందం చెడకుండా ఉండడానికి సాధారణంగా అడ్డంగా పెరిగిన కొమ్మల్ని నరికేస్తుంటారు. కానీ ఇక్కడ కొమ్మని వదిలి, చెట్టుకి పైభాగాన్ని నరికేశారు. రెండవ చెట్టుని కూడా ప్రక్క చెట్టు కొమ్మ తగిలిన ప్రదేశం వరకూ ఉంచి, ఆ పై భాగాన్ని తొలగించారు. వాళ్ళ ఈ ఐడియా ఎక్కువమంది ఖాతాదారుల్ని ఆకర్షించడానికి ఉపయోగ పడుతుంది!   

   *          *          *
నర్సరీలో ఈ చివరినుంచి ఆ చివరివరకూ నాలుగైదుసార్లు తిరిగి, కావలసిన మొక్కల్ని ఎంచుకొని, వాటికి సరిపోయే కుండీలు కూడా తెప్పించి, మొక్కల్ని కుండీలలో వేసే పనిని నర్సరీ వాళ్ళకి అప్పగించాం. మాకోసం రెండు కుర్చీలు తెప్పించి అక్కడ వేసి, వాళ్ళు పనిలో పడ్డారు. సాయంత్రపు చల్లగాలి హాయిగా వీస్తుంది. అస్తమించడానికి పశ్చిమానికి ప్రయాణిస్తున్న సూర్యుడు చెట్ల కొమ్మల సందుల్లోనుంచి ఏటవాలు కిరణాలని భూమిమీద చల్లుతున్నాడు. ఆకాశంలో నీలంరంగు చిక్కబడుతుంది. తెల్లని మేఘాలు నీళ్ళు తాగడానికి కొండవాగు దగ్గరకి వెళుతున్న ఏనుగుల గుంపుల్లాగ మెల్లగా కదిలిపోతున్నాయి. మేఘమాలికలకి, అనంతమైన నీలానికి మధ్య ఉండే లోతైన(!) దూరం సాయంత్రపు ఆకాశానికి అనిర్వచనీయమైన అందాన్నిస్తుంది. మీరెప్పుడైనా గమనించారా? 
 
`ఈ మావిడి చెట్టు చూడండి ఎంత పొడవుందో!` అంది ఆమె. నిటారుగా సుమారు ముప్పై అడుగులు పెరిగిన మానుకి చివర గొడుగులాగ విచ్చుకొన్న మావిడాకుల గుత్తులు! `ఇదేంటి ఇలా ఉంది?` అని అడిగాను నర్సరీ యజమానిని. చిన్నప్పుడు ఈ చెట్టు కొమ్మలు వేస్తుంటే విరిచేసే వాళ్ళమండి. దానితో టేకు చెట్టులాగ పెరిగిపోయింది. దీని కాయలేమీ బాగోకపోయినా, చెట్టు అందంగా ఉందని అలా ఉంచేశాం,` అన్నాడు. `పొడవుగా పెరగాల్సిన ఆశోకచెట్టు, గుబురుగా పెరగవలసిన మావిడిచెట్టూ అది-ఇది, ఇది-అదీ అయ్యాయి!   

`కొన్నింటికి లాజిక్కులుండవు` అంది ఆమె.

`ఉంటాయి - ఎందుకంటే లాజిక్కుని నిర్ణయించేది సందర్భమే కానీ, జనరలైజేషన్ కాదు,` అన్నాను. నిజానికి అలాగ ఎందుకన్నానో నాకు తెలియదు. `ఎలాగ,` అని వివరణకోసం ఆమె అడగలేదు. కానీ అడిగుంటే....!?
*          *          *
ఒక కథ....

ఒక స్వామీజీ తన భక్తులనందరినీ ఒక మావిడి చెట్టుక్రింద కూర్చో బెట్టుకొని ఉపన్యాసం చెపుతూ ఉన్నారు. అందరూ మంచి భక్తి పారవశ్యంలో ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద రాయి వచ్చి స్వామీజీ నడి నెత్తిమీద పడింది. భక్తులు హడావుడిగా నాలుగు వైపులకీ పరిగెత్తుకు వెళ్ళి, రాయి విసిరిన వాడిని పట్టుకొని స్వామీజీ ముందు నిలబెట్టారు. 

నెత్తిమీద కట్టిన బొప్పి నొప్పిని కలిగిస్తున్నా, మొహమ్మీద చిరునవ్వును పోనివ్వకుండా ప్రయత్నిస్తూ, `రాయి ఎందుకు విసిరావు నాయనా?` అని స్వామీజీ సహనంతో అడిగారు వాడిని. 

`రెండు రోజుల నుంచి ఎక్కడా పని దొరకలేదండి. తిండి లేక ఆకలితో ఉన్నాను. దారి ప్రక్కన మావిడి చెట్టుకి కాసిన పళ్ళను చూసి వాటితో కడుపు నింపుకొందామని చెట్టుపైకి రాయి విసిరాను. మీరు ఇటువైపు ఉన్నారని నేను చూసుకోలేదు. నాకు రెండు పళ్ళు దొరికాయి. కానీ మీకే దెబ్బ తగిలింది. నన్ను క్షమించండి,` అన్నాడు.

భక్తులంతా కోపంతో ఊగిపోతున్నారు. `వీడిని ఏమి చెయ్యమంటారో చెప్పండి స్వామీజీ?` నరికి పోగులు పెట్టమంటారా, లేకపోతే కాలూ, చెయ్యి విరిచెయ్యమంటారా?` అని ఉద్రేకపడిపోతున్నారు. 

`వద్దు నాయనలారా. వాడి తిండికి లోటులేకుండా ఉండేలాంటి సంపాదనని ఇచ్చే పని ఇప్పించండి` అన్నారు స్వామీజీ. 

*          *          *
రెండవ కథ...

దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి పరమేశ్వరుని భార్య. ఒకసారి దక్షుడు యజ్ఞం చేస్తూ  ఈశ్వరుడికి ఆహ్వానం పంపడు. సతీదేవి తండ్రి చేస్తున్న యాగమే కనుక ఆహ్వానం లేకపోయినా వాత్సల్యంతో అక్కడికి వెళ్ళి అవమానింప బడుతుంది. అవమానభారంతో ఆమె అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. శివుడు తపస్సుకోసం హిమాలయాలకు వెళ్ళిపోతాడు.  సంవత్సరాలు గడచిపోతాయి... సతిదేవి తిరిగి పార్వతిగా జన్మిస్తుంది. తారకేశ్వరుడనే రాక్షసుడిని సంహరించే లోక కళ్యాణ కారణం శివపార్వతుల వివాహంతో ముడిపడి ఉంది. వాళ్ళకి జన్మించే పుత్రుడే ఆ కార్యాన్ని పూర్తిచెయ్యగలడు. ధ్యానంతో సమాధిస్థితికి చేరుకొని ఉన్న శివుడిని మేల్కొలిపి పార్వతితో సమాగమం చేయ్యగల చమత్కారం మన్మధుని బాణాలకే ఉంది. అందుకే, దేవతలందరూ అతనికి ఈ బాధ్యత అప్పగిస్తారు. ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుని ముందు పార్వతి నాట్యం చేస్తుంటుంది, కామదేవుడు తన పుష్ప బాణాలు సంధిస్తాడు. శివుడికి తపోభంగం అవుతుంది. అతని ఆగ్రహజ్వాలలకి మన్మదుడు దహింపబడతాడు. కానీ మన్మద బాణాల ప్రభావంతో శివపార్వతులు ఏకమౌతారు.
*          *          *
మొదటి కథలో... కొట్టినవాడిని తిరిగి కొట్టడమో, లేకపోతే క్షమించి విడిచి పెట్టడమో చెయ్యాలి కానీ.. పని ఇప్పించడం ఏమిటి? రెండవ కథలో... మన్మథుడికి గొప్ప ఉపకారం జరగాలి.  నిజానికి జరిగిందేమిటి?

`అందరూ సాధారణంగా చేసే పనే మనం కూడా చెయ్యడం లాజిక్ అనుకొంటాం. కానీ సందర్భానికి అనుగుణంగా చేసేదే నిజమైన లాజికల్ పని, రాయిదెబ్బ తిన్న మావిడి చెట్టు ఆలోచన లేనిదైనా, కొట్టిన వాడికి రెండు పళ్ళు ఇచ్చింది. ఆలోచన ఉన్న మనం చెట్టు ఇచ్చిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఇవ్వడమే అసలైన లాజిక్ కదా?` 

ఇక ఒక గొప్ప అవసరం కోసం పూలబాణంతో కొట్టి శివ తపోభంగం చేసిన మన్మథుడికి కాలి బూడిదవ్వడం మనలాజిక్కులకి అందని లాజిక్.  దానిలో ఆంతర్యం ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!