తిరుపతి పట్టణానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగ్రిగి వెళ్ళేసరికి సాయంత్రం ఐదున్నర అయిపోయింది. రాతితో కట్టిన కోటగోడలు, ప్రవేశద్వార మండపాలు, రహదారికి కొంచెం ఎడంగా ఉన్న పురాతన దేవాలయాల గోపురాలు చూసుకొంటు రాజమహల్ దగ్గరకి చేరుకొన్నాం. అప్పటికే సందర్శకులని అనుమతించే సమయం దాటిపోవడంతో గేట్లు మూసేస్తున్నారు. `చాలాదూరంనుంచి వచ్చామని, అనుమతించమని కోరడంతో,` ఏమనుకొన్నారో, `తొందరగా చూసి వచ్చేయండి` అని గేట్లు తెరిచారు. కృతజ్ఞతలు చెప్పి లోనికి వెళ్ళాం.
ఎప్పుడో పదకొండవ శతాబ్ధంలో నిర్మించిన కోట. శత్రుదుర్భేద్యంగా ఉండడం కోసం కొండవాలులో కట్టారు. అర్థచంద్రాకారపు కొండ కోటకు మూడువైపులా పెట్టని గోడలా ఉంది. రాజమహల్, రాణీమహల్, వాటి నడుమ ఉద్యానవనం, చిన్న నీటి కొలను, రాణీమహల్‌కి సమీపంలో దిగుడు మెట్లున్న మంచినీటి బావి... కొండమీదనుంచు వస్తున్న చల్లని సాయంత్రపు గాలి ఆహ్లాదంగా ఉంది.
రాజమహలులో కవితాగోష్టులు, యుద్దతంత్రాలు, రహస్యమంతనాలు, మంత్రిమండలి సమావేశాలు జరిగేవేమో. రాణీమహల్ గవాక్షాలనుంచి యువరాణులు బయటకు చూస్తూ ఏమి పాటలు పాడుకొనేవారో, చెలికత్తెలతో కలిసి మహలులో చప్టాలమీద ఏమి ఆటలు ఆడుకొనేవారో, వేటకు వెళ్ళిన రాజుగారు చీకట్లు ముసురుకొంటున్న సాయంత్రం - రాత్రిగా మారుతున్నా రాకపోతే మహారాణులు దిగుళ్ళను ఎవరితో పంచుకొనేవారో!
సాళువ నరసింహరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడట. శ్రీకృష్ణదేవరాయలు కొంతకాలం ఈ కోటలో ఉన్నాడని చెపుతారు. తన ఇద్దరు భార్యలలో ఒకరైన చిన్నమదేవిని చంద్రగిరిలోనే కలిశాడట. విజయనగర రాజులు పెనుగొండను రాజదానిగా చేసుకొని పరిపాలిస్తున్న కాలంలో, గోల్కొండ నవాబుల దండయాత్ర కారణంగా విజయనగర రాజదానిని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చారట. తరువాత చంద్రగిరి మైసూర్ పాలకుల ఆధీనంలో కూడా ఉంది.
ప్రస్తుతం రాజమహల్‌లో ఆర్క్యలాజికల్ మ్యూజియం ఉంది. మేము వెళ్ళినరోజు శుక్రవారం కావడంతో మ్యూజియంకు శలవు. కానీ సాయంత్రం ఆరున్నర గంటలనుంచి, ఏడుగంటల పదిహేను నిమిషాల వరకూ - ముప్పావుగంట సేపు ప్రదర్శించే మ్యూజిక్ అండ్ లైట్ షో ఉంది. ఈ షో చూడడానికి పెద్దలకు టిక్కెట్టు అరవై రూపాయలు. పిల్లలకు నలభై ఐదు. `నేను చంద్రగిరి కోట అంతరాత్మను...` అని మొదలు పెట్టిన గంభీరమైన స్వరం చంద్రగిరి చరిత్రను చక్కటి రూపకంలా వివరించి చెపుతుంది. ఈ షో చూసినవాళ్ళకి నిస్సందేహంగా మంచి అనుభూతికి కలిగిస్తుంది.
ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఒకపూట కేటాయించగలిగితే చంద్రగిరి కోటను చూడవచ్చు.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment