Pages

Friday, 27 October 2023

ఇంకా బ్లాగ్స్ చదువుతున్న వారు ఎవరైనా ఉన్నారా?

నిన్న ఒకాయన, 'మీ బ్లాగ్ చూశానండి. ఒక్కొక్క పోస్టూ చదువుతూ వెళుతున్నాను. రాయడం మనేయకుండా కొనసాగిస్తుంటే బాగుండేది,' అని చెప్పారు. 

నా దృష్టి బ్లాగ్ వైపు తిరిగింది. ఎందుకు రాయడంలేదో అని ఆలోచిస్తే కొన్ని కారణాలు కనిపించాయి. 

1. ఒక బ్లాగ్ పోస్ట్ రాసిన తరువాత సంవత్సరానికి కూడా వెయ్యి వ్యూస్ రావు. అదే యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాముల్లో ఏ వీడియోకైనా లక్షల వ్యూస్ ఉంటాయి. జనాల్లో చదవడం అలవాటు పోయి, చూడడం అలవాటు ఎక్కువయ్యింది.

2. పెర్సనల్ బ్లాగ్  మనం రాసుకొన్న నోట్‌బుక్ లాంటిదయితే, ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు జనసమ్మర్ధం ఉన్న రోడ్డులో స్వీట్ షాపుల్లాంటివి. అందుకే కొంతమంది బ్లాగ్‌లు మానేసి నేరుగా వాళ్ళ ఫేస్‌బుక్ వాల్ మీద రాసుకొంటున్నారు. స్పందన బాగుంటుంది. నిజమైన రచ్చబండలోలాగ వాదప్రతివాదాలు, చమత్కారాలు, రుసరుసలూ, మెచ్చుకోళ్ళూ జోరుగా జరుగుతున్నాయి. 

3. ఎందుకో బ్లాగ్‌లోకి వస్తే లోన్లీగా అనిపిస్తుంది. అంతరించిపోతున్న తెగలో  చివరకు మిగిలిన వాళ్ళకు ఇలాంటి ఫీలింగే ఉంటుందేమో! జనాలకి చేరువచేసే బ్లాగర్ ఆగ్రిగేటర్‌లు కనుమరుగైపోయాయి. ప్రత్యేకంగా బ్లాగ్‌లోకి వచ్చి చూస్తేనే గానీ మనం రాసింది ఎవరికీ కనపడదు. అందుకే ఇప్పటికీ బ్లాగ్‌లో రాసే వాళ్ళు పాఠకుల కోసం కాదు, తమకోసమే రాసుకొంటున్నారేమో అనుకొంటున్నాను. ఈ పరిస్థితి మారి బ్లాగింగ్‌కి పూర్వ వైభవం రావాలటే బ్లాగర్ ఇంటర్‌ఫేస్ మారాలి. మన బ్లాగ్ ఎకౌంట్ నుంచి నచ్చిన బ్లాగ్స్‌ని లైక్ చేసుకొంటే మన టైంలైన్‌లోకి వాళ్ళు రాసింది వచ్చేసేలా ఉండాలి. మనం రాస్తూ పోవడమే కాదు, మన బ్లాగర్ ఫ్రెండ్స్ రాసింది చదవగలిగి కూడా ఉండాలి. అప్పుడు ఇది కూడా ఫేస్‌బుక్కే ఐపోతుంది కదా అని మీరు అనవచ్చు. కానీ యూట్యూబ్‌ని చూసి ఫేస్‌బుక్ వాడు షార్ట్ వీడియో అప్లోడ్ చెయ్యడానికి ఏనేబుల్‌చేస్తే - ఇప్పుడది యూట్యూబ్‌కి గట్టి పోటీ ఇస్తుంది.

4. బ్లాగ్ రాయకపోవడానికి పై మూడూ కాకుండా ఇంకొక కారణం ఉంది. అది.. అశ్రద్ధ!

ఈ టపాకి ట్యాగ్‌లైన్ ఏమిటంటే...

నేను రాయగలను అనే నమ్మకాన్ని ఇచ్చిన బ్లాగ్ అంటే ఇష్టం ఎక్కువ.  ఎప్పుడైనా  నా బ్లాగ్ చదివి ఎవరైనా ఒక మాట చెపితే, బ్లాగ్‌లు మంచిగా నడచిన బంగారు రోజులు గుర్తుకువచ్చి 'అయ్యో' అనిపిస్తుంది.

చూద్దాం ఇంకా బ్లాగ్స్ చదువుతున్న వారు ఎవరైనా ఉన్నారా? అని.

18 comments:

  1. ఇప్పుడు ఎవరికీ తెలుగు చదవడం , రాయడం రావడం లేదు.. అసలు బ్లాగ్ అంటే కూడా తెలీదు .. పాత కాలం వాళ్ళకు తప్ప

    ReplyDelete
    Replies
    1. అవునండి, ఇది కూడా ముఖ్యమైన పాయింటే.

      Delete
  2. మంచి వ్యాసం. ఆలోచించదగ్గ మాటలు చెప్పారు.
    ప్రశ్న: బ్లాగులు ఎవరు వ్రాస్తున్నారు?
    జవాబు: కొద్ది మంది బ్లాగర్లు
    ప్రశ్న: బ్లాగులు ఎవరు చదువుతున్నారు?
    జవాబు: అతి కొద్దిమంది బ్లాగర్లు.
    ప్రశ్న: బ్లాగులను ఎవరు సీరియస్సుగా తీసుకుంటూన్నారు?
    జవాబు: కొద్ది మంది అమాయక బ్లాగర్లు.

    ReplyDelete
    Replies
    1. నమస్కారం శ్యామలరావు గారూ, ఒకప్పుడు పెర్సనల్ బ్లాగ్ కలిగి ఉండడం అంటే ఒక గౌరవం... చాలామంది పాఠకుల్ని రచయితలుగా మార్చింది ఈ మాధ్యమమే! ఇప్పుడు సెలబ్రిటీలు కూడా తమ బ్లాగ్‌కి బదులుగా ట్విట్టర్‌ని వాడుతున్నారు. మళ్ళీ బ్లాగ్‌లకి పూర్వ వైభవం రావాలని కోరుకొందాం. అది అత్యాశే కావచ్చు!

      Delete
  3. బ్లాగులు పల్లెటూరు వంటివి. ఫేస్ బుక్, ట్విట్టర్ లు పట్టణాలు వంటివి. పల్లెటూరు లో ఎవరు ఉండటం లేదు. అపుడపుడు చూడటానికి వస్తారంతే ! పల్లెటూరు కి పూర్వ వైభవం కష్టమే !

    ReplyDelete
    Replies
    1. ఇటీజ్ సాడ్ రియాలిటీ!

      Delete
  4. నేను తిరిగి వ్రాద్దామని ప్రయత్నిస్తున్నాను. కానీ మీలాగా వ్రాయాలని కోరిక. మీరు, తృష్ణగారు, మధురవాణిగారు, ఇలాంటి హేమాహేమీలు వల్లనే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం యేర్పడింది. దానికి మీకు ఎప్పుడూ నా ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. కొనసాగించండి బాగుంటుంది. ఇంగ్లిష్‌లో మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయి. వాళ్ళకి రీడర్‌షిప్, బ్లాగుల్లో ఇంటరాక్షన్ కూడా మనకంటే బాగుంటుంది. పర్వత ప్రాంతాల్లో, నదీ తీరాల్లో, అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు - వాళ్ళ రోజువారీ జీవన విధానం గురించి వ్రాస్తూ ఉంటారు. అవి చాలా ఆసక్తిసరంగా ఉంటాయి. వివిధ వృత్తుల్లో, ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, గౄహిణులు రాస్తూన్నారు. బ్లాగర్ అనిపించుకోవడం వాళ్ళకి ఒక ప్రివిలేజ్. తెలుగులో చాలామందికి బ్లాగ్‌లు అంటే తెలియదు. వ్రాయగలిగిన అందరూ - వివిధ రంగాల్లో నిష్టాతులు, సెలబ్రిటీలూ, ప్రముఖ రచయితలు వాళ్ళ సొంత బ్లాగుల్లో రాస్తూ ఉంటే కొంతకాలానికి బ్లాగింగ్‌కి తెలుగులో కూడా మంచి గుర్తింపు వస్తుందని అనుకొంటున్నాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete
    2. తెలుగు బ్లాగులకు శోధిని వంటి అగ్రిగేటర్లు ఉన్నట్లే ఇంగ్లీషు బ్లాగులకు కూడా అగ్రిగేటర్ల వంటివి ఉన్నాయా?

      వీలుంటే ఇంగ్లీషు బ్లాగులను గురించి సమగ్రంగా ఒక వ్యాసం వ్రాయగలరా ఇక్కడ? ఎందరికీ ఉపకరించవచ్చును.

      Delete
    3. మన దేశంలో ఇండిబ్లాగర్ అని ఇంగ్లిష్ బ్లాగ్ ఆగ్రిగేటర్ ఉంది. వాళ్ళు నిరంతరం థీమేటిక్ బ్లాగ్ పోస్ట్‌ల కాంపిటీషన్‌లు పెడతారు. ప్రొడక్ట్ ప్రమోషన్‌కి లింక్ చేస్తారు. గిఫ్ట్ వోచర్లు, క్యాష్ ప్రైజ్‌లు ఇస్తారు. మన బ్లాగ్‌లో పోస్ట్‌లు రాసి ఎంట్రీ పంపవచ్చు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. గూగుల్‌లో సెర్చ్ చేస్తే బోలెడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. విదేశాల విషయానికి వస్తే - ఇంగ్లిష్‌లో రాసే వారిలో చాలామంది ప్రొఫెషనల్ బ్లాగర్లు. వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కం బ్లాగింగ్ నుంచే వస్తుంది. దీని గురించి సమగ్రమైన పోస్ట్ రాయాలంటే చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ రాసినా చదివేది ఎందరు? దయచేసి అనామకంగా కాకుండా మీ ఐడీతో కామెంట్ చేస్తే బాగుంటుంది

      Delete
    4. తెలుగుబ్లాగుప్రపంచం చాలా నిరుత్సాహకరంగా ఉంది! పాపం ఉబలాటం కొద్దీ వ్రాసేవాళ్ళే కాని అసక్తిగా చదివేవాళ్ళు ఆట్టే మంది (సాటి బ్లాగర్లతో సహా) కనిపించటం లేదు. దానికితోడు తెలుగుబ్లాగుల్లో వస్తున్నరొట్టను చూస్తుంటే ఎవరికీ మనం తెలుగు బ్లాగుల్ని చదవండి బాగుంటాయి అని చెప్పే సాహసం చేయలేం. ఇక్కడనుండి జెండా ఎత్తెయ్యక్కరలేదు కాని, మన వాళ్ళలో ఆసక్తి ఉన్న బ్లాగర్లు ఇంగ్లీషు బ్లాగుప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం మంచిది అనిపిస్తోంది. లేకపోతే ఎన్నాళ్ళని అరణ్యరోదనం చేస్తూ పోతారూ అని.

      Delete
    5. మరొక ముఖ్యవిషయం ప్రస్తావించటం మరచిపోయాను. Anonymous11 November 2023 at 21:05 వ్యాఖ్య నాదే. ఆవ్యాఖ్యను వ్రాయటానికి ఉపయోగించిన డివైస్ మీద నా ఐడీతో లాగిన్ వీలుపడలేదు. ఐనా ఆవ్యాఖ్య క్రింద నా సంతకం చేయవలసింది!

      Delete
    6. మీరు చెప్పిన దానిలో 'ఉబలాటం కొద్దీ వ్రాయడం', 'రొట్ట' అనేవి వంద శాతం కరెక్ట్. తెలుగులో వెబ్ పత్రికల్ని ప్రక్కన పెడితే మంచి కంటెంట్‌తో వచ్చే వంద బ్లాగ్‌లు ఉన్నా బాగుండేది.

      Delete
  5. కొన్ని మంచి కంటెంట్ (మీమాటనే వాడుతున్నాను, తెలుగుముక్క వాడవచ్చును కాని) ఉన్న బ్లాగులూ ఉన్నాయనే అనుకుంటున్నానండీ. కాని వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. రొట్టబ్లాగులే ఎక్కువ. పంటచేనులో తొంభైశాతం కలుపుమొక్కలే ఉన్నట్లుగా. చివరికి చదువరులకు చాలా అసౌకర్యం తప్ప మరేమీ లేదు. బ్లాగులోకం మంచి సాహితీవనంగా విలసిల్లుతుందని అత్యాశపడ్డాను దశాబ్దం క్రిందట. చివరికి అది శ్మశానసదృశంగా ఉంది. చాలా బాధగా ఉంది ఆవిషయంలో.

    ReplyDelete
    Replies
    1. కేవలం సాహితీ వనం గా అన్ని బ్లాగులు ఎందుకు ఉండాలి? సమాజం లోని అనేక విషయాల పై ఉండవచ్చు కదా. శ్మశాన సదృశం అని చెప్పడం భావ్యం కాదు. మీకు సాహిత్యం ఇష్టమైతే అన్ని బ్లాగులు అలాగే ఉండాలని ఆశించడం సరికాదు. అయితే పేరు పొందిన రచయితలు బ్లాగులు వ్రాయటం లేదు అన్నది నిజం.

      Delete
  6. కేవలం సాహితీ వనం గా అన్ని బ్లాగులు ఎందుకు ఉండాలి? ఈ ప్రశ్న సబబుగానే ఉంది. బ్లాగులు రకరకాల సామాగ్రి ఉండే దుకాణాల్లా ఉండకూడదని ఏమీ లేదు. కాని ఏబ్లాగుకైన ఒక స్పష్టమైన గుర్తింపునిచ్చే ధోరణి ఉండటం ముఖ్యం. ఆధోరణి సమాజానికి ఉపకరించేదిగా ఉండటం ముఖ్యం. సమాజానికి ఉపకరించటం అంటే తాత్కాలికంగానా, దీర్ఘకాలికంగానా అన్న ప్రశ్న వస్తుంది. సినిమారివ్యూలూ, రాజకీయసంఘటనలపై స్పందనలూ, క్రీడలకు సంబంధించినవీ వగైరాలు ఎక్కువగా తాత్కాలికమైన సంగతులు. వాటితో కూడా నడిచే బ్లాగులు ఉండవచ్చును. సాంస్కృతిక, సాహిత్య, చారిత్రక విషయాల గురించినవీ, అధ్యాత్మిక, శాస్తీయవిషయాల గురించినవీ వంటికి మచ్చుకు కొన్ని దీర్ఘకాలికప్రయోజనాలకు సంబంధించిన విషయాలు అనుకుంటే అటువంటి ధోరణులుకల బ్లాగులూ ఉండవచ్చును. లోకో భిన్నరుచిః. అనేకరకాల బ్లాగులు ఉండవచ్చును. నిరుపయోగమైన విషయాలతో కూడిన బ్లాగులూ ఉండవచ్చును కాని అవి మిక్కుటం ఐతే చదువరులు నిలువరు.

    ReplyDelete
    Replies
    1. ఇది నిజం. నేను సమర్థిస్తున్నాను.

      Delete
  7. Naku kuda ade anipistundi chala sarlu. Naa blog lo appatlo regular ga rasevaadini. And koncham chadive varu. Raanu raanu chadivevaalla sankhya baaga taggipoindi. Your post is so relatable.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!