Pages

Monday, 7 January 2013

సాగర సంబరాలు

కాకినాడ ప్రజలకి, ఇంకా చెప్పాలంటే మన జిల్లా ప్రజలందరికీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ నిజంగా సంబరాల పండుగే. ఈ నెల పదకొండవ తారీకు నుంచి పదమూడు వరకూ సూర్యారావు పేట వద్ద బీచ్ వేదికగా సాగర ఉత్సవాలు జరుగబోతున్నాయి. సాగర ఉత్సవ కమీటీ అద్యక్షులు కాకినాడ రూరల్ ఎం.ఎల్.ఏ. శ్రీ కురసాల కన్నబాబు గారు, ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ,  జిల్లా కలెక్టర్ శ్రీమతి నీతూప్రసాద్, జాయింట్ కలక్టర్ శ్రీ బాబు,  అడిషనల్ జాయింట్ కలెక్టర్ శ్రీ రామారావు, జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ప్రోజెక్ట్ డైరెక్టర్(DRDA) మధుకర్ బాబు,  మిగిలిన అధికారులూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ఉత్సవాన్ని జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నగరంలో మూడు ఓవర్‌బ్రిడ్జీల మీద, ప్రభుత్వ కార్యాలయాల, కాలేజీల గోడలమీద జిల్లా సంసృతి, జీవనవిధానం, జీవనవైవిధ్యం, చరిత్ర మొదలైన విషయాలకు సంబంధించి రంగురంగుల బొమ్మలు చిత్రిస్తున్నారు. స్వాగత హోర్డింగులు కడుతున్నారు, సాగరసంబరాల ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయి. బీచ్‌లో ప్రత్యేక విద్యుత్‌లైన్లు వేసి లైట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ మూడు రోజులూ ఉదయం 11 గంటల నుంచి రాతి 9 గంటల వరకూ వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్థానిక కళాకారులూ, వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థుల కళా,జానపద,సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి విధ్యుత్ దీపాల వెలుగులో ప్రముఖ కళాకారులచే సినిమా, మిమిక్రి, సాహిత్య, సంగీత, వినోద కార్యక్రమాలు, లేజర్ షోలు నిర్వాహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వేదికలు ఏర్పాటుచేశారు. సాగరతీరంలో స్టాల్స్ నిర్మిస్తున్నారు.  కడియపు పూల సోయగాలు సందర్శకులకి కనువిందుచేయనున్నాయి. ఇరవై స్టాల్స్‌ని కడియపు పూలమొక్కల కోసం కేటాయిస్తున్నారు.

ఉత్సవాల ప్రారంబోత్సవానికి ముఖ్యమంత్రి శ్రీ కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తారు. కేంద్రమంత్రులు శ్రీ పళ్ళంరాజు, శ్రీ చిరంజీవి కూడా ఈ సాగర సంబరాల్లో పాల్గొంటారట.
ఇవే కాకుండా సందర్శకులకి కనువిందు చెయ్యడానికి ఏడుకోట్ల రూపాయల వ్యయంతో శిల్పారామం రూపుదిద్దుకొంటుంది. ఫ్లవర్‌షోలు, సైకత శిల్పాలూ కూడా మన మనసులని ఉర్రూతలూగించడానికి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తుర్పుగోదావరి జిల్లా విశేషాలను తెలియజేసే చాయాచిత్రాల ప్రదర్శన కూడా ఉంటుంది.  సాంప్రదాయక రుచులని, అందుబాటు ధరలలోనే  అందరికీ అందించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇది రుచుల పండుగ కూడా. సాంప్రదాయ రుచులతో 36 ఫూడ్‌స్టాల్స్‌ని ఏర్పాటుచేస్తున్నారు.  చివరిరోజు ముగింపు ఉత్సవాలకి రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సెలబ్రిటీల సమక్షంలో ఫైర్ వర్క్స్ షో జరుగుతుంది.  

కార్యక్రమాల షెడ్యూల్ ఈ రకంగా ఉంది:

11.01.2013 : 3 గంటల నుంచి 6 గంటలవరకు - ప్రారంభోత్సవ కార్యక్రమాలు  తరువాత - మృదంగ విద్వాంశులు యల్లా వెంకటేశ్వరరావు, శాస్త్రీయ నృత్యకళాకారిణి రమావైధ్యనాథన్ ల ప్రదర్శనలు, విద్యసాహు,  సంగీత దర్శకుడు కోటి ల సంగీతవిభావరులూ ఉంటాయి. 

12.01.2013: 10.30 నుంచి 1.00 గంట వరకూ, తిరిగి 3 గంటల నుంచి 6 గంటల వరకూ విద్యార్ద్థులచే సాస్కృతిక కార్యక్రమాలు. తరువాత సినీ గాయకులు, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. శివారెడ్డి మిమిక్రీ ఉంటుంది. 

12.01.2013: 10.30 నుంచి 1.00 గంట వరకూ, తిరిగి 3 గంటల నుంచి 6 గంటల వరకూ విద్యార్ద్థులచే సాస్కృతిక కార్యక్రమాలు. తరువాత సినీ గాయకులు, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి.

మొట్టమొదటిసారి కాకినాడ సాగరతీరంలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్‌లో అందరూ పాల్గొని ఆనందిస్తారని అనుకొంటున్నను. ఈ తరహా ఉత్సవాలకి ఇది నాందీ కావాలని, ఇకముందు ప్రతీ సంవత్సరం బీచ్ ఫెస్టివల్ జరిగితే చాలా బాగుంటుందని అనుకొంటున్నాను. మరి మీరేమంటారు?

వివరాల సేకరణకి సహకరించిన జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ప్రోజెక్ట్ డైరెక్టర్(DRDA) మధుకర్ బాబు గారికి, ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ శ్రీ రామారావు గారికి కృతజ్ఞతలతో.

© Dantuluri Kishore Varma

Saturday, 5 January 2013

ఆదికుంభేశ్వర స్వామి దేవాలయము

రావణా బ్రహ్మ రాజనీతిజ్ఞుడు, వీరుడు, బలశాలి, సకల వేదవేదాంగ పండితుడు అన్నింటినీమించి శివ భక్తుడు. ఎన్నో సుగుణాలు ఉన్నా, కొన్ని అవలక్షణాల వల్ల సర్వనాశనం కావడం మనం రావణుడి నుంచి నేర్చుకోవలసిన పాఠం. రావణాసురుని అసలు పేరు  దశగ్రీవుడు లేదా దశకంఠుడు. అంటే పదితలలు కలవాడు అని అర్ధం. నేను గొప్పవాడిని అన్న అహంతో శివుడు తప్పస్సు చేసుకొంటున్న పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తున్న రావణుడికి బుద్దిచెప్పడానికి శివుడు పర్వత శిఖరం మీద తనబొటనవేలితో అదుముతాడట. ఆ వొత్తడికి నలిగిపోయిన దశకంఠుడు బాధతో రోధిస్తాడట. అప్పటినుంచే అతనికి బాధతో రోదించేవాడని అర్ధం ఇచ్చే రావణుడు అని పేరు వచ్చింది అంటారు. ఆ సంఘటన తరువాత రావణుడు పరమ శివభక్తుడు అవుతాడు.   ఈ కథని గుర్తుకు తెచ్చేలా దశగ్రీవుడి తలలమీద నిలచిన శిఖరంతో ఆదికుంభేశ్వరుడి దేవాలయం మనకి కాకినాడ బీచ్‌రోడ్‌లో కనిపిస్తుంది. 
రావణుడి భారీ విగ్రహంలాగానే దేవాలయానికి మిగిలిన మూడువైపులా మహిషాసురమర్ధిని, పంచముఖ ఆంజనేయస్వామి, సప్తాశ్వాలకు కట్టిన ఒంటిచక్రపు రధమ్మీద ప్రయాణిస్తున్న సూర్యభగవానుడి విగ్రహాలూ కట్టారు. 
రావణాసురుడి కాళ్ళమధ్యనుంచి ఏర్పాటుచేసిన ప్రవేశద్వారం గుండా లోపలికి వెళ్తే విశాలమైన స్థలంలో పెద్ద నంది విగ్రహం, పొడవైన ధ్వజస్థంభం ఉంటాయి. రెండు అంతస్థుల్లో ఉండే గుడి అంతర్భాగంలో, ప్రతీ అంతస్థులోనూ వరుస గదులగా ఏర్పాటు చేసిన మందిరాల్లో దశావతారాలు, అష్ఠలక్ష్ములు, ప్రముఖ శివక్షేత్రాలలో ఉండే శివలింగాలు, నందులు, ఇంకా చాలా దేవతామూర్తులను ఉంచారు. అందంగా మలచిన విగ్రహాలు బాగుంటాయి. కానీ, ఈ గదులను బిల్డింగ్ మెటీరియల్ వేసే స్టోర్ రూములు గా వాడకుండా ఉంటే ఇంకా అందంగా ఉండి ఉండేవేమో!  

ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రతీ సంవత్సరం కార్తీక అమావాశ్యరోజు భారత యజ్ఞపీఠం ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం జరుగుతుంది. సుమారు లక్షమంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఒకకోటీ ఎనిమిది లక్షల శివలింగాలకి అభిషేకం చేస్తారు. మరి ఇన్ని శివలింగాలు ఎక్కడినుంచి వస్తాయి అని అనుమానం రావచ్చు. చిన్న చిన్న లింగాలని ఒకే పెద్దలింగంగా ఏర్పాటుచేసి అభిషేకం జరుపుతారు. తరువాత వాటిని అన్నింటినీ సంచులలో పెట్టి ప్యాక్ చేసి అట్టిపెడతారు. ఒకసారి ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు అలా కనిపించిన శివలింగాలు ఇవి.  
సముద్రపుపోటు సమయంలో కెరటాలు దేవాలయం వరకూ వచ్చేస్తాయి. నీరు వెనుకకు వెళ్ళిపోయినప్పుడు గుడి ముందువైపు మినహా మిగిలిన మూడువైపులా చిత్తడిగా ఉంటుంది. చేపల వాసన కూడా ఉంటుంది. భారీ విగ్రహాలు సిమ్మెంటుతో చేసినవి, ముక్కులూ, ముఖాలు కొంతవరకూ ముక్కలు ఊడిపోయాయి. ఇటువంటి కొన్ని అప్రియంగా కనిపించే విషయాలు ఉన్నా, సముద్రమ్మీద దూరంనుంచి కనిపించే ఓడలు, దగ్గరగా కనిపించే రంగురంగుల చేపల పడవలు, మత్యకారుల కార్యకలాపాలు, కెరటాల హోరూ బాగుంటాయి. కాబట్టి, తప్పనిసరిగా చూడవలసిన దేవాలయమే ఇది.  

© Dantuluri Kishore Varma

Friday, 4 January 2013

కుప్ప నూర్పుళ్ళు

పెద్దపండుగ ముందు కొన్నిరోజులు నాన్నగారు పొలంలోనే ఉండిపోవలసి వచ్చేది. ఉదయం, సాయంత్రం పాలికాపు ఇంటికి వచ్చి భోజనం క్యారేజీ తీసుకొని వెళ్ళేవాడు. ఎప్పుడయినా ఉదయంపూట క్యారేజీ కోసం వచ్చిన పాలికాపుతో పొలం వెళ్ళేవాళ్ళం.  వరిపొలం మధ్యలో మకాం ఉండేది. మకాం అంటే ఒక ఎకరం పొలంలొ మట్టినింపి, మెరకచేసిన ప్రదేశం. ఒక పెద్ద నుయ్యి,   మావిడి చెట్లు,  ఆవులు, ఎడ్లు, గేదెలని కట్టడానికి కట్టురాటలు,  ఎడ్లబళ్ళు, నాగళ్ళు లాంటి పనిముట్లు పెట్టుకోవడానికి కొంతజాగా, ఒక పాక, ప్రక్కవాళ్ళ పొలం సరిహద్దుని తెలియజేడానికి కట్టవ ఉండేవి.  నేనువాడిన కొన్నిమాటలకి కొంతమందికి అర్థం తెలియకపోవచ్చు, అందుకే వాటి గురించి కొంచెం చెబుతాను. కట్టు రాటలు అంటే పశువులని కట్టడానికి భూమిలోకి దిగగొట్టిన లావుపాటి కర్రముక్కలు - ఇప్పటి క్రికెట్ ఆటలో వికెట్ల లాంటివి.  కట్టవ అంటే మట్టితో ఒక అడుగు ఎత్తు గట్టు ఏర్పాటుచేసి దానిమీద బ్రహ్మజెముడు లాంటి ముళ్ళ మొక్కలని వేస్తారు.  సరిహద్దు అవతలినుంచి మనుషులు, పశువులు రాకుండా చేసే అడ్డుకట్టు ఇది. 

పండుగ నెలలో కుప్పనూర్పుళ్ళ హడావుడి ఉండేది. కోసిన వరిచేనుని ఆరిన తరువాత, మకాంలోకి చేరవేసి, ఎడ్లబళ్ళతో తొక్కించేవారు. దీనిని కుప్పనూర్పు అంటారు. వరికుప్పమీద మూడు, నాలుగు బళ్ళని వొకదానివెనుక మరొకటిగా గుండ్రంగా తిప్పేవారు. వరికంకుల్ని తొక్కించడం వల్ల పూర్తిగా రాలిపోయి క్రిందకి చేరిన వరిని, వరిగడ్డినీ వేరుచేసేవారు. తరువాత చేటలతో ధాన్యాన్ని ఎగరబోసి, దుమ్ము, దూళీ వేరుచేసేవారు.  ఈ కార్యక్రమం పూర్తికావడానికి వారంరోజులో, పదిరోజులో పట్టేది. అందుకే యజమాని ఈ సమయంలో తప్పనిసరిగా మకాంలో ఉండిపోవలసి వచ్చేది.  అందుకోసం మంచె వేసేవారు. మంచె అంటే పాతకాలపు పందిరి మంచంలా ఉండేది. పట్టెడకు బదులుగా తాటి పట్టెలు, పరుపుకి బదులుగా వరిగడ్డీ, దానిమీద గోనెసంచులు కలిపి కుట్టిన బరకం. పైనుంచి మంచు పడకుండా తాటాకు గుడారంలాంటి ఏర్పాటు.

పొలంలోకి వెళ్ళిన తరువాత మాకు రైతు ఆట మొదలయ్యేది. ఒక టవల్ తీసుకొని తలపాగా చుట్టేసి, మంచె ఎక్కేసేవాళ్ళం. కరకజ్జం అనే స్వీట్ మాకోసం తయారుగా ఉండేది అక్కడ. శనగపిండితో చేసిన లావు కారప్పూసని లేత బెల్లంపాకంపట్టి, మకాంల దగ్గరకి తెచ్చి, కొత్త ధాన్యానికి మార్పిడిగా అమ్మేవారు. మాకు చాలా ఇష్టమైన కరకజ్జాన్ని మా నాన్నగారు ఖాళీ భోజనం క్యారేజీల్లో నిలువచేసి ఉంచేవారు.  దాన్ని తింటూ కొంతసేపు పనివాళ్ళ మీద అజమాయిషీ చెయ్యడం. వాళ్ళు ఏదయినా ఆట పట్టిస్తే ఉడుక్కోవడం.    కుప్ప నూర్పుళ్ళ బళ్ళు అన్నింటినీ ఎవరో ఒకరు నడపనవసరం లేదు. మొదటి బండిమీద ఒక వ్యక్తి ఉంటే, వెనుకవి ముందున్న బండిని అనుసరిస్తూ తిరుగుతాయి. మా ఎడ్లబండి సవారీ సరదా ఇక్కడ బాగా తీరేది. రెండవ బండిలోనో, మూడవదానిలోనో ఎక్కి, ఒక చేత్తో కళ్ళెం, ఇంకొక చేతితో అదిలింపు కర్రా పట్టుకొని `హొ్‌య్, హో్‌య్` అంటుంటే, విమానం నడుపుతున్నంత సరదాగా ఉండేది.
నూర్పుళ్ళు, ఎగరబోతలు అయిపోయినతరువాత పాలేర్లకి జీతాలు కొలిచేవారు. పెద్దపాలేరుకి పదిహేను కాటాలు, చిన్నపాలేరుకి పదో ఎన్నో కాటాలూ కొలిచేవారు. కాటాలంటే ధాన్యం బస్తాలు. కమతంలో ఉండే వాళ్ళతో పాటూ మిగిలిన సేవలు అందించేవారికి కూడా ఇటువంటి జీతబత్యాలే ఉండేవి. వాళ్ళందరూ కూడా వార్షిక జీతాలు కొలిపించుకొని వెళ్ళేవారు. మిగిలిన ఫలసాయాన్నీ పెద్ద త్రాసు(దీనినే కాటా అనేవారు) లో తూచి, బస్తాలు దబ్బనం, పురుకోసలతో మూతులు కుట్టి, బళ్ళమీద ఎక్కించేవారు. `బండెనుక బండికట్టి, పదహారుబళ్ళు కట్టి...` అన్నట్టు బళ్ళన్నీ ధాన్యలక్ష్మితో ఇంటిదారి పట్టేవి. వాటితో పాటూ మేమూనూ. 

పొలంలో పనులన్నా, వ్యవసాయదారులన్నా జ్ఞాపకాల గుబాళింపుతో కూడిన ఇష్టం,  ప్రత్యక్షంగా వ్యవసాయం చెయ్యకపోయినా కూడా..

© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!