Tuesday, 3 February 2015

శ్రీ మద్రమారమణ గోవిందో హరి..

రోజులకొద్దీ సాగేది హరికథా కాలక్షేపం. ఊరంతా తరలివచ్చి, హరిదాసుగారు చెప్పే పురాణగాథని విని, రాగుయుక్తంగా పద్యం పాడుతుంటే `అహా!` అనుకొని, మధ్యమధ్యలో పిట్టకథలు చెపుతుంటే వాటిలో హాస్యానికి నవ్వుకొని,  ప్రేక్షకులు చదువుకొన్న వాళ్ళైతే దాసుగారి ప్రజ్ఞకి అబ్బురపడి, చదువుకోని సామాన్యులైతే `దాసుగారికి సానా తెలుసు` అనేసుకొని, ఆయన చిన్నగా చేసే నృత్యాభినయానికి, శ్రావ్యంగా పాడే స్వర మాధుర్యానికి `శభాష్!` లు ఇచ్చుకొని. అర్థరాత్రి దాటాకా నిద్రమత్తులో తూగుతూ ఇంటిముఖం పట్టేది ఊరు ఊరంతా. పట్టుపంచ కట్టుకొని, కండువా నడుముకు బిగించి, కాళ్ళకి గజ్జెలు ఘల్లు మంటుంటే, ఒకచేతిలో చిడతలు, మెడలో పూలహారం, నుదుటిన  దిద్దిన తిరునామంతో `శ్రీ మద్రమారమణ గోవిందో హరి..` అని కథా ప్రారంభం చేసి, అలవోకగా పద్యాలు పాడి అలరించే హరిదాసు గారు ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశారు. 

హరికథలు మళ్ళీ, మళ్ళీ వినాలనిపించినా అవకాశంలేని కాలంలోకి వచ్చేశాం. కానీ, అదృష్టంకొద్దీ వాగ్ధానం సినిమాలో ఈ సీతాకళ్యాణం హరికథ వీడియో యూట్యూబ్‌లో లభ్యమౌతుంది. చూసి ఆనందించండి. ఈ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించింది ఆత్రేయ గారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. అత్యంత రమణీయంగా పాడింది శ్రీ ఘంటసాలగారు. ఈ హరికథను శ్రీశ్రీ రాసారట. కాకపోతే 

"ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము...
ఒక నిమేషమ్ము నందే
నయము జయమును భయము విస్మయము గదురా" 

అనే భాగాన్ని కరుణశ్రీ గారు రాసిన ఒక కవితా ఖండికనుంచి తీసుకొన్నారట. అలాగే..

"భూతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
పృధుగుణమణి సంఘాతన్ భాగ్యోసేతన్ సీతన్" 

అనే చిన్న ముక్క పోతన భాగవతం లోనిదట.  

శ్రీ నగజా తనయం సహృదయం || శ్రీ ||
చింతయామి సదయం త్రిజగన్మహోదయం || శ్రీ ||
శ్రీరామ భక్తులారా ! ఇది సీతా కళ్యాణ సత్కథ 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను అంచేత, కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది.
నాయనా... కాస్త పాలు మిరియాలు ఏవైనా...
చిత్తం ! సిద్ధం
భక్తులారా ! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరిని ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి. ఆహ్హా ! అతడెవరయ్యా అంటే
రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడు
వాడు నెలఱేడు సరిజోడు మొనగాడు
వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాలు జాలురా || వాని కనులు ||
వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్ కొనెడు మరోమరుడు మనోహరుడు
రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
సనిదని, సగరిగరిగరిరి, సగరిరిగరి, సగగరిసనిదని,
సగగగరిసనిదని, రిసనిద, రిసనిద, నిదపమగరి రఘురాముడు
ఔను ఔను
సనిసా సనిస సగరిరిగరి సరిసనిసా పదనిసా
సనిగరి సనిస, సనిరిసనిదని, నిదసనిదపమ గా-మా-దా
నినినినినినిని
పస పస పస పస
సపా సపా సపా తద్ధిమ్ తరికిటతక
శభాష్, శభాష్
ఆ ప్రకారంబున విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో
ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే
మనసింతలోనె దోచినాడే ఎంత సొగసుగాడే
మోము కలువఱేడే... ఏ... మోము కలువఱేడే
నా నాము ఫలము వీడే ! శ్యామలాభిరాముని చూడగ
నామది వివశమాయె నేడే
ఎంత సొగసు గాడే
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై యుండగా అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను జూచి
అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగుపుత్రి సీత !
వినయాధిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడు ఊ... ఊ ఊ
అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరు ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా "హా ! ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము దీనిని స్పృశించుటయే మహాపాపము" అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట. తదనంతరంబున...
ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజగమనము తోడ స్వయంవర వేదిన చెంత
మదన విరోధి శరాసనమును తన కరమున బూనినయంత
ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము...
ఒక నిమేషమ్ము నందే
నయము జయమును భయము విస్మయము గదురా
ఆ... శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
భక్తులందరు చాలా నిద్రావస్థలో ఉన్నట్లుగా వుంది
మరొక్కసారి
జై! శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు అంతట
భూతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
పృధుగుణమణి సంఘాతన్ భాగ్యోసేతన్ సీతన్ || భూతల ||
శ్రీ మద్రమారమణ గోవిందో హరి
 Dantuluri Kishore Varma

6 comments:

 1. అవునండి ఈ హరికథ శ్రీశ్రీగారు కూర్చినదే. ఇక మీరు ఉటంకించిన ఆ హరికథలోని పద్యాల సాధుపాఠాలు చూదాం.

  కరుణశ్రీపద్యం -
  తే.గీ. ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనె గు
  భిల్లుమనె గుండె నృపులకు ఝల్లుమనియె
  జానకీ దేహ మొక నిమేషమ్ము నందె
  నయము జయమును భయము విస్మయము గదుర

  మాష్టారు పాడటంలో భాగంగా కొన్ని విసంధులూ, కొన్ని అదనపు దీర్ఘాలూ చేరాయి. అది సహజమే. దోషం లేదు.

  భాగవత పద్యం -
  కం. భూతలనాథుడు రాముడు
  ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
  ఘాతన్ భాగ్యోపేతన్
  సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు శ్యామలరావు గారూ :)

   Delete
  2. బాగు బాగు కిషోర్ గారు,

   ఆ హరికథ వీడియో కూడా జత చేసి ఉంటె టపా కి మరింత సొబగు !@!

   చీర్స్
   జిలేబి

   Delete
  3. వీడియోలని సరాసరి టపాలోనికి తీసుకొస్తుంటే ఒక్కొక్కసారి అవి మిస్సయిపోతున్నాయి. అందుకే రేలంగి గారి ఫోటోకి పైన ఉన్న "పాట చూస్తూ పాతరోజుల్లోకి పరిగెత్తుకొంటూ వెళ్ళిపోతాం. నాకు చాలా నచ్చిన పాట ఇది. మీరుకూడా చూసి ఆనందించండి." అన్న వాఖ్యం దగ్గర వీడియో లింక్ ఇచ్చాను జిలేబీ గారు. మీ ప్రశంసకి ధన్యవాదాలు.

   Delete
  4. చిన్నప్పుడు ఈ పాటకోసం చకోరపక్షుల్లా ఎదురుచూసేవాళ్ళం. రేడియోవాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేది మన కోరిక తీరటం. ఈ పాట వినపడితే చాలు ఎక్కడ ఉన్నాసరే పరిగెత్తుకుంటూ వచ్చి వినేవాళ్ళం. ఇప్పుడు ఆ పాట ఆడియో, సినిమా వీడియో ఇంట్లో ఉన్నా కూడా మన దగ్గర ఉన్నదే కదా అన్న నిర్లిప్తత. మళ్ళీ ఆ పాటను వినే ఉత్సాహాన్నిచ్చే ఉపోధ్ఘాతంతో ఒక వ్యాసంవ్రాసి అనేక తెలియని వివరాలు అందించినందుకు ధన్యవాదాలు.

   Delete
  5. ఈ పాటకి సంబంధించి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు బాగున్నాయి శివరామప్రసాద్ గారు. ధన్యవాదాలు.

   Delete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!