`తలంతా పట్టేసింది. వొళ్ళు నొప్పులూ, జొరం. ఇక్కడ నిలబడలేకపోతుంటే లోనకి ఎల్లినోళ్ళు ఓ పట్టాన రారూ, ఖర్మ!` అన్నాడు బోసు జనాంతికంగా. అంగుళం పొడవుండేటట్టు సమానంగా కత్తిరించిన వొట్టిగడ్డిని కపాలం మీద అంటించినట్టు ఉంది వాడి తెల్లజుట్టు. దానిని విసుగ్గా చేతితో నిమురుకొన్నాడు.
`మందు మింగావా?` ఆయుర్వేదం డాక్టరు రంగారావుగారి గదిలోకి వెళ్ళడానికి తనవంతుకోసం ఎదురుచూస్తున్న ఓ పేషంట్ అడిగాడు బోసుని.
`మందు మింగావా?` ఆయుర్వేదం డాక్టరు రంగారావుగారి గదిలోకి వెళ్ళడానికి తనవంతుకోసం ఎదురుచూస్తున్న ఓ పేషంట్ అడిగాడు బోసుని.
`ఆ....`
`మీ డాక్టర్ గారిదేనా?`
`ఇంగ్లీసు మందు,` అన్నాడు తన చెయ్యిని ఆర్.ఎం.పీ డాక్టరు గారి క్లీనిక్ ఉన్న దిక్కుకి చూపిస్తూ. అలా అంటూ అతిశయంతో కనుబొమ్మలు ఎగరేశాడు.
కన్సల్టింగ్ రూంలా వాడుతున్న వసారాకి జేర్చిఉన్న కటకటాల చావిట్లో ఆరు పాత ప్లాస్టిక్ కుర్చీలున్నాయి. వాటిలో కూర్చొన్న పేషంట్లూ, కటకటాల బయట చప్టాల మీద చతికిల బడ్డ సుమారు పది పదిహేను మందీ, ఇంకొంచం దూరంలో ప్రహారీగోడకి చేతులూ, కాళ్ళూ దాపెట్టి నిల్చొన్న ఇంకొక పది మందీ వాడి మాటలు విన్నారు. విని అదేదో జోకయినట్టు ముసిముసిగా నవ్వుకొన్నారు. ఒకళ్ళిద్దరయితే గట్టిగానే నవ్వేశారు. ఏలూరునుంచి వచ్చిన నాయుడికి గుండె గతుక్కుమంది. నడుం నొప్పి వస్తుందని ఇంగ్లీషు డాక్టర్ దగ్గరకి వెళితే నెలరోజులపాటు అవీ, ఇవీ అడ్డమైన మందులూ వాడించాడు. ఫలితం కనిపించలేదు. పదిరకాల టెస్టులు, ఎం.ఆర్.ఐ. స్కాన్‌లు అని చాంతాడంత లిస్టు ఇచ్చి వాటికే పదివేలు వదిలించాడు. చివరికి `రెండు పూసలు అరిగాయి, డిస్కు పక్కకి తప్పుకొంది, ఆపరేషన్ పడొచ్చు, చేయించుకొన్నా నయం అవుతుందన్న గ్యారంటీ లేదు,` అని చావు కబురు లాగ చల్లగా చెప్పాడు. ఇంగ్లీష్ డాక్టర్లు చేతులెత్తేసిన ఇలాంటి రోగాలకి రంగారావుగారు మందు ఇస్తే తిరుగుండదని ఎవరో చెపితే తూగోజిల్లా వరకూ ఓ.. ఎగేసుకొంటూ వచ్చేశాడు. ఇక్కడ చూస్తే డాక్టరుగారి ముసలి అసిస్టెంటుకే ఆయన మీద గురి ఉన్నట్టు కనిపించడం లేదు! తాను కూడా నవ్వుతున్నట్టు ముఖంపెట్టి `ఏమయ్యా మీ డాక్టరు గారి మందు జ్వరానికి కూడా పనిచెయ్యదా?` అని పక్కనున్న ఆయన్ని అడిగాడు నాయుడు.
`బోసుగాడియ్యి అన్నీ ఎకసెక్కాలండీ బాబూ,` అన్నాడు ఆ ఆసామి
ఇంతలో లోపలికి వెళ్ళినవాళ్ళు మందుపొట్లాలతో బయటకి వచ్చారు. టిప్పుకోసం బోసు చెయ్యిచాచాడు. ఓ పదిరూపాయలు తీసి వాడి చేతిలో పెట్టారు వాళ్ళు. `ఇరవై!` అన్నాడు. `డాక్టరు గారి చీటీకి పది రూపాయలయితే నీకు ఇరవయ్యా?` అని విసుక్కొంటూ ఇంకో పది కుక్కారు.
అట్టముక్కల వెనుక పెన్నుతో ఒకటి, రెండు మూడు... అని అంకెలువేసి ఉన్న చీటీలని వైద్యంకోసం వచ్చిన రోగులకి ప్రతీరోజు ఉదయం పదిగంటల వరకూ ఇస్తాడు బోసు. అవి ఆయుర్వేదం డాక్టరు రంగారావుగారిని కలవడానికి అపాయింట్‌మెంట్లు లాంటివి. రోగులో, వాళ్ళ వెంటవచ్చే సహాయకులో వాటిని స్వయంగా తీసుకోవలసిందే. ఫోన్‌లో అపాయింట్‌మెంట్లు ఇవ్వరు. డాక్టరుగారి కన్సల్టేషన్ ఫీజు పదిరూపాయలు చీటీ తీసుకొంటున్నప్పుడే కట్టాలి.
అట్టముక్కల వెనుక పెన్నుతో ఒకటి, రెండు మూడు... అని అంకెలువేసి ఉన్న చీటీలని వైద్యంకోసం వచ్చిన రోగులకి ప్రతీరోజు ఉదయం పదిగంటల వరకూ ఇస్తాడు బోసు. అవి ఆయుర్వేదం డాక్టరు రంగారావుగారిని కలవడానికి అపాయింట్‌మెంట్లు లాంటివి. రోగులో, వాళ్ళ వెంటవచ్చే సహాయకులో వాటిని స్వయంగా తీసుకోవలసిందే. ఫోన్‌లో అపాయింట్‌మెంట్లు ఇవ్వరు. డాక్టరుగారి కన్సల్టేషన్ ఫీజు పదిరూపాయలు చీటీ తీసుకొంటున్నప్పుడే కట్టాలి.
`డబ్బు బాగా మరిగేశాడు తిక్క సచ్చినోడు. పెదరాజుగారి గరువుమీద కొత్తిల్లు కట్టాడు సాలదు గావాల్న,` అని అమ్మాజీ తిట్టుకొంటుంది. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తుంది ఇక్కడ. సీటీ ఇవ్వటం లేదు బోసు. `పది దాటితే ఇవ్వనని తెలుసు కదా? మళ్ళీ అడుగుతావే కొత్తోళ్ళలాగా. పోయి, రేపు రా!` అని చిరాకు పడిపోతున్నాడు. ఇరవైరూపాయలు వాడి చేతిలో పెడితే పనిజరుగుతుంది. కానీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది? అరగంట క్రితం కారులో ఏలూరు నుంచి వచ్చిన నాయుడు దగ్గర అందరూ చూస్తుండగానే వంద రూపాయలు తీసుకొని కూర్చోబెట్టాడు.
రంగారావు గారి తాతగారు కన్సల్టేషన్ ఫీజుగా నాలుగు అణాలు తీసుకొనేవారట. తరువాత రంగారావు గారి తండ్రిగారి కాలానికి అది ఒక రూపాయి అయ్యింది. ఇప్పుడు పది రూపాయలు. అసలు వంశపారంపర్యంగా వైద్యం చేస్తున్న ఈ కుటుంబానికి ఫీజు తీసుకోవలసిన అవసరం లేదు. వాళ్ళకున్న వందల ఎకరాలని సరిగా పండించుకొంటే చాలు. మరి ఎందుకు చేస్తున్నారూ అంటే ఇదొక సేవ అంతే. ఆపరేషన్ చేసినా నమ్మకంగా తగ్గుతుందని చెప్పలేం అని ఇంగ్లీషు డాక్టర్లు నిర్ధారించేసిన జబ్బులకి కూడా పొడాలతో, లేహ్యాలతో, చూర్నాలతో నయం చేసేసిన చరిత్ర ఉంది వీళ్ళకి. `దీన్ని అరటిపండులో పెట్టి మింగెయ్యి; ఈ పొడాన్ని తేనెలో కలిపి నాకు; ఇది బంగారంతో చేసినమందు. క్రమంతప్పకుండా వాడితే ఫలితం ఉంటుంది. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. నువ్వు అంతా పెట్టుకోలేకపోతే సగం కట్టు మిగిలినది నేనే భరిస్తాను,` అని రోగులకి రకరకాల మందులు ఇస్తారు. డాక్టరుగారు చెప్పింది చెప్పినట్టూ వాడితే ఖచ్చితంగా గుణం కనిపిస్తుంది. కానీ ఆయుర్వేదం ఆసుపత్రి అని ఒక బోర్డు కూడా ఎక్కడా ఉండదు. ఎక్కడెక్కడినుంచో పిఠాపురం వరకూ వచ్చేసి, అక్కడి నుంచి ఈ ఊరికి వచ్చిన తరువాత `పలానా రంగారావు గారి ఇంటికి దారేది?` అని అడిగితే మాటలు అప్పుడప్పుడే వస్తున్న కుర్రోడి దగ్గరనుంచి, పండు ముసిలోడి వరకూ `అల్లదిగో, అదే!` అని చూపించేస్తారు.
ఒక్కొక్కళ్ళూ లోపలికి వెళుతున్నారు, వస్తున్నారు. సమయం గడుస్తుంది కానీ, నాయుడు వంతు మాత్రం రావడం లేదు. రెండుమూడు సార్లు బోసుదగ్గరకి వెళ్ళి లోపలికి పంపించమని అడిగాడు. అభయ బాబా దీవించినట్టు చెయ్యి చూపించి `నేనున్నాను కదా, నీకెందుకు,` అన్నట్టు చిద్విలాసంగా నవ్వుతున్నాడు కానీ పనిజరగడం లేదు. కూర్చొని, కూర్చొని విసుగు పుడుతుంది.. వందరూపాయలు తీసుకొని ఇలా నిరీక్షింప చేస్తున్నందుకు ఉక్రోషం వచ్చేస్తుంది. ఇంకొక అరగంట గడిచింది. నాయుడు ఒక్క ఉదుటున కుర్చీలోనుంచి లేచాడు. రెండంగల్లో బోసు దగ్గరకి వెళ్ళి, `పంపించవా నన్ను?` అని విసురుగా అడిగాడు.
`తాపీగా పదకొండు గంటలకి వచ్చి గదమాయిస్తున్నావు. అందరూ అయ్యాకా పంపిస్తాను. నచ్చితే ఉండు. లేకపోతే వెళ్ళు,` బోసు కూడా గొంతుపెంచి నాయుడు మీద `కయ్యి` మన్నాడు.
నాయుడికి పెద్ద అవమానం జరిగినట్టు అయిపోయింది. చుట్టూ ఉన్న అందరికేసీ చూశాడు. వాళ్ళందరూ తమాషా చూస్తున్నారు. `మరి వందరూపాయలు ఎందుకు తీసుకొన్నావు?` అని అడగాలని ఉంది. కానీ ఆ విషయాన్ని గట్టిగా అడిగితే `లంచం ఇచ్చి లైన్ జంప్ చేద్దామనుకొన్నావా?` అని ఎవరైనా గొడవపెడతారని భయపడ్డాడు. అవమానాన్ని దిగమింగి నిశ్సబ్ధంగా వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు.
`వొరేయ్! పేషంట్లని భయపెట్టకూడదురా. వారిని పంపించు,` అని రంగారావుగారు లోపలినుంచి బోసుని కేకలేశారు.
ఎట్టకేలకు నాయుడి వంతు వచ్చింది. రంగారావు గారితో మాట్లాడాకా తనరోగం తగ్గచ్చు అనే నమ్మకం కుదిరింది. మందు తీసుకొన్న తరువాత ఆయనతో మెల్లగా అన్నాడు, `మీకున్న మంచి పేరు బోసు వల్ల చెడిపోతుంది. . ` అని.
`రోగలక్షణాలను పరిశీలించి మందు ఏమిటో నిర్ణయించేది నేనే అయినా దానిని తయారు చేసేది వాడే. ఆకులు, బెరడులు, మూలికలు సరిగ్గా గుర్తించి బోసే తీసుకొని వస్తాడు`.
`కానీ మీ సేవని వాడు వ్యాపారంగా మార్చుకొంటున్నాడు.`
`కార్పొరేట్ వైద్యానికి వేలల్లో ఖర్చుపెట్టే వాళ్ళకు ఓ వంద రూపాయలు లంచం ఇవ్వడం సునాయాసమైన విషయం. పని తొందరగా ముగించుకోవడానికి వాడికి టిప్పులు అలవాటు చేశారు. వాడిప్పుడు ఇవ్వలేని వాళ్ళని కూడా పీడించి మరీ తీసుకొంటున్నాడు. తీసుకోవడం తన హక్కుగా భావిస్తున్నాడు. సేవని వ్యాపారంగా మార్చింది వాడు కాదు. ఇక్కడికి వచ్చే కొంతమంది పేషంట్లు మాత్రమే.`
రంగారావు గారి మాట సూటిగా నాయుడి మనసుని తాకింది. న్యూనత భావం కలిగింది. దానిని ముఖం మీద కనిపించకుండా ఉండేలా కష్టపడి ప్రయత్నించాడు. `అటువంటి పేషంట్లలో నేను లేను సుమా,` అనే భావం వచ్చేటట్టు ఒక శుష్క మందహాసం చేసి, `మందు వాడిన తరువాత పదిహేను రోజులకి మళ్ళీ వస్తానండి,` అని చెప్పి, డాక్టరు గారికి నమస్కారం చేసి బయటకు నడిచాడు.
© Dantuluri Kishore Varma
చెంప పెట్టులా సమాధానం ఇచ్చారు డాక్టర్ గారు.. తొందరగా పనై పోవాలని మనమే డబ్బాశ చూపడం వల్లనే .. చేసే ప్రతి పనికి లంచం ఇవ్వడం ఆనవాయితీ అయ్యింది. మనం తీసుకున్న గోతిలో మనమే కదా పడుతున్నాం . లంచగొండి తనాన్ని విమర్శించే అందరూ ఇది గమనించాలి . మంచి post . అలాగే ఆయుర్వేద వైద్యం గురించి తెలిపినందుకు ధన్యవాదములు . బాగా వ్రాశారండీ .. అభినందనలు .
ReplyDeleteమీ కథలు చదువుతూ ఉంటే నేను కూడా అలా రాయగలనా అనిపిస్తూ ఉంటుంది వనజ గారు. ఈ కథ మీకు నచ్చడం ఆనందంగా ఉంది. మీ ప్రశంసకి ధన్యవాదాలు.
DeleteReflected Contemporary Society...particularly at Temples!
ReplyDeleteThank you NN garu :)
Delete