ఈమధ్యకాలంలో బాగా కళ్యాణ మండపాలు, హైటెక్ ఫంక్షన్ హాళ్ళూ వచ్చేశాయి కానీ - వేళ్ళమీద లెక్కబెట్ట గలిగినన్ని ఏళ్ళ క్రితం పచ్చటి తాటాకు పందిళ్ళలో లేదంటే కనీసం షామియానాల క్రింద చాలా మంది పెళ్ళిళ్ళు చేసేసుకొనేవారు. అక్కడక్కడా మైకులు కూడా ఉండేవి. పెళ్ళి పందిరి దగ్గర నుంచి `వివాహ భోజనంబు..` పాట వస్తుందంటే భోజనాలు జరుగుతున్నాయని అర్థం. మాదవపెద్ది సత్యం గంభీరమైన స్వరం గారెలు, బూరెలు, జిలేబీలు అని పాడుతుంటే రైలు పెట్టెల్లాగ పలహారం పళ్ళాలన్నీ వరుసలోవెళ్ళి ఎస్.వీ.రంగారావు ముందు అమరిపోయి, లడ్డూలు వాటంతట అవే ఎగిరెళ్ళి అతని నోట్లో పడిపోవడం చప్పున గుర్తుకు వచ్చేసి, `భళీరే! వవ్హారే!!` అనేసుకొంటూ జనాలు భోజనాలకు తయారయిపోవడం చూసిన జ్ఞాపకం ఉందా మీకు? ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మాయాబజార్ సినిమా మన మనసుల్లో రాగిరేకు మీద చెక్కిన తెలుగు అక్షరంలా అచ్చుబడిపోయింది. సినిమాలో ప్రతీ మాటా, పాటా, బొమ్మా ఎవేవో స్పందనలని కలిగిస్తాయి. అదిగో... సరిగ్గా ఆదే పాయింట్‌ని పట్టుకొని ఒక పచ్చళ్ళ షాపాయన ఎస్.వీ.ఆర్ ని తన ఉత్పత్తులకి బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టేసుకొన్నాడు. `ఈ బొమ్మ చూసిన తరువాత నోరూరిపోయి కొనుక్కోకుండా ఉంటారా!` అనేమో ఉద్దేశ్యం.
© Dantuluri Kishore Varma