విజయదశమి మంచి కార్యక్రమాలను ప్రారంభించడానికి అనువైన రోజు. ఓ వైపు అమరావతిలో నూతనరాజధాని నిర్మాణానికి శంకుస్థాపనా కార్యక్రమం ఘనంగా జరుగుతుంటే మరోవైపు ఊరూరా, వాడవాడలా కొత్త వ్యాపార సంస్థల ప్రారంభాలు ఆర్భాటంగా చేస్తున్నారు. పాతషాపుల వాళ్ళు కొత్త స్కీములతో దసరా - దీపావళి సంబరాలు మొదలు పెట్టేసి హల్‌చల్ చేస్తున్నారు. జనాలు టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్లు, కార్లు, బైకులు కొనుక్కోవడానికి షోరూంల బయట అమ్మవారి దేవాలయం దగ్గర దర్శనం కోసం క్యూలైన్‌లో నుంచొన్నంత భక్తిగా తమవంతు కోసం పడిగాపులు పడుతున్నారు. అమ్మవార్ల దేవాలయాలన్నీ భక్తులతో కిటికిటలాడుతుంటే మిగిలిన దేవుళ్ళ, దేవతల ఆలయాలన్నీ సామాన్యమైన సందడితో ఉన్నాయి. కానీ.... ఈ చిన్న గుడి - విఘ్నేశ్వరుడిది - కాకినాడ మెయిన్‌రోడ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎదురుగా ఉన్నది అమ్మవారి గుడి అంత, ఈ రోజే ఓపెన్ చేసిన కొత్త షోరూమంత సందడిగా ఉంది. గుడికి ఎదురుగా అప్పుడే షోరూంనుంచి బయటకు తెచ్చిన ఓ డజను బైకులు వరుసగా నిలబెట్టి ఉన్నాయి. చుట్టూ గిఫ్ట్ రిబ్బన్లు చుట్టిన ఒకట్రెండు కొత్తకార్లు కూడా ఏ సైకిలు వాడు వచ్చి గీత పెట్టేస్తాడో అన్న ఆందోళనతో ట్రాఫిక్ మధ్యలోనుంచి ఈ గుడివైపే మందగమనంతో కదులుతున్నాయి. మెయిన్‌రోడ్‌లో విఘ్ననాయకుడి బ్లెస్సింగ్స్ అవసరం మరి దేనికైనా!
© Dantuluri Kishore Varma