Pages

Wednesday 13 January 2016

ఆముక్తమాల్యద

శ్రీకృష్ణదేవరాయల్ని సాహితీ సమరాంగణ సార్వభౌముడు అంటారు. క్రీస్తుశకం పదిహేను - పదహారు శతాబ్ధాల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పుడు రాజ్యవిస్తరణ కోసం ఒక ప్రక్క దండయాత్రలు చేస్తూనే మరొక ప్రక్క తీర్థయాత్రలు కూడా చేసేవాడట. వెంట పట్టపురాణి తిరుమలదేవి, చిన్నరాణి చిన్నమదేవి ఉండేవారు. అష్టదిగ్గజకవులు కూడా వెంట వెళ్ళవలసిందే. తాను సహజంగానే కవి కనుక, మిగిలిన కవులు కూర్చిన కృతులను ఆస్వాదించడం, చక్కనైన సాహితీ చర్చలు నెరపడం, తాను స్వయంగా వ్రాసిన కావ్యాలను వారికి వినిపించడం చేసేవాడు. అందుకే ఆయనని కవిరాజు, రాజకవి అని అంటారు. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో మదాలస చరిత్ర, సత్యవధూప్రీణనము, సకలకథాసార సంగ్రహము, జ్ఞాన చింతామణి, రసమంజరి అనే కావ్యాలు రాశాడట. కానీ దురదృష్టవశాత్తూ అవేవి ఇప్పుడు లభ్యం అవడంలేదు. తెలుగులో రచించిన ఆముక్తమాల్యద మాత్రం సాహిత్య ప్రియుల్ని ఇప్పటికీ అలరిస్తుంది.   పద్యాలను చదివి, కావ్యమాధుర్యాలని పూర్తిగా ఆస్వాదించలేని వాళ్ళకోసం వాటిని వచన రూపంలో ముద్రిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదని వచనరూపంలోనే చదివాను.  జయంతి పబ్లికేషన్స్ విజయవాడ వాళ్ళు చాలా కాలం క్రితం ప్రచురించిన పుస్తకం అది.

ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళంలో ఉన్న ఆంధ్రమహా విష్ణువుని దర్శించిన తరువాత, ఆయన మహారాజుకి కలలో కనిపించి ఆముక్తమాల్యదని తెలుగులో వ్రాయమని ఆదేశించాడట. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ప్రాచీన వైష్ణవ గురుచరిత్ర నుంచి గోదాదేవి వృత్తాంతాన్నీ; విష్ణుపురాణం, వరహాపురాణం మొదలైనవాటినుంచి కొందరు విష్ణు భక్తుల కథల్నీ కలిపి ఆముక్త మాల్యదని రచించాడు. మూల కథలకు మార్పులూ చేర్పులూ చేసి, అద్భుతమైన వర్ణనలను జోడించి ఈ ప్రబంధకావ్యాన్ని అనన్యసామాన్యంగా రచించాడు. ఈ కావ్యరచనకి నాలుగు సంవత్సరాల సమయం పట్టిందట.

శ్రీ విలుబుత్తూరు అనే నగరంలో విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుడికి తులసివనంలో దొరికిన గోదాదేవి, విష్ణువునే ప్రేమిస్తూ పెరిగి పెద్దదయి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాదుడిని వివాహం చేసుకోవడం ఆముక్తమాల్యదలో ప్రధామైన కథ.  విష్ణుచిత్తుడు ప్రతీరోజూ సువాసనలు ఇచ్చే తులసిదళాలలో మాలలు కట్టి దేవాలయంలోని మన్ననారు స్వామికి సమర్పిస్తూ ఉంటాడు. కానీ, మాలలు కట్టిన తరువాత, దేవుడికి అలంకరించడానికి ముందే గోదాదేవి తండ్రికి తెలియకుండా వాటిని తన తలలో ధరించి, బావి నీటిలో తన ప్రతిబింబం చూసుకొని ముచ్చటపడిపోయి, తులసి మాలల్ని యదాస్థానంలో ఉంచేది. ధరించిన పూలని దేవుడికి ఇచ్చేది కనుక ఆమె ఆముక్తమాల్యద అయ్యింది.

మధురాపురాన్ని పరిపాలించే మహారాజు మత్స్యద్వజుడు ఓ రాత్రిపూట పరివారాన్ని వెంటబెట్టుకొని తన వేశ్యఐన భోగిని వద్దకు వెళుతూ ఉండగా, మధురాపురంలో కొండమీద ఉన్న దేవుడికి జరిగే తెప్పతిరునాళ్ళ ఉత్సవం చూడడానికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఊరిలోనే బసచేసి, తనకు ఆతిద్యం ఇచ్చిన గృహస్తుకి చెపుతున్న సూక్తులు ఆయన(మహారాజు) చెవిన పడ్డాయి. `వర్షాకాలంలో లభ్యమవని వాటిని అంతకు ముందు ఎనిమిది నెలలపాటూ సేకరించుకొని నిలువచేసుకోవాలనీ.. అలాగే, రాత్రి అవసరాలకు పగలు, వృద్దాప్యంలో అవసరాలకు యవ్వనంలో, పరలోకంలో సౌక్యాలకు ఈ లోకంలో సమీకరించుకోవాలని` ఆ మాటల అర్థం. ఆ మాటలు విన్నవెంటనే రాజుకి మోక్షం పొందాలన్న చింత మొదలయ్యింది. మోక్షాన్ని ప్రసాదించే దేవుడు ఎవరో చెప్పినవాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తానని ప్రకటించాడు. ఎంతోమంది విజ్ఞులు రాజ సభకు వచ్చి రకరకాల దేవుళ్ళ గురించి చెప్పారు - కానీ అవేవీ రాజుని సంతృప్తిపరచలేకపోయాయి. చివరకి శ్రీ విలుబుత్తూరులో మన్ననారుస్వామి విష్ణుచిత్తునితో స్వయంగా మాట్లాడి - మధురాపురం వెళ్ళి మత్స్యద్వజుడినికి విష్ణువు గొప్పతనాన్ని చెప్పి, ఆతనిని వైష్ణవుడిగా మార్చమని ఆజ్ఞాపిస్తాడు. విష్ణుచిత్తుడు పెద్ద పండితుడు కాకపోయినా, రాజ సభకు వెళ్ళి, తర్కంలో అందరినీ ఓడించి, విష్ణువే ఆదిదేవుడని చాందోగ్యోపనిషత్తునీ, శ్రుతులనీ ఉదహరిస్తూ నిరూపిస్తాడు. ఆ సందర్భంలోనే ఖాండిక్య, కేశిధ్వజుల కథని చెపుతాడు.  

విష్ణుచిత్తుడు మధురాపుర రాజు మత్స్యద్వజుడికి ఏవిధంగా విష్ణుమూర్తి గొప్పతనాన్ని తెలియజేశాడో, అదేవిధంగా యామునాచార్యుడు అనే ఒక బ్రాహ్మణుడు మత్స్యద్వజుని పూర్వికుడైన మరొక పాండ్యరాజుని వైష్ణవునిగా మారుస్తాడు. ఈ యామునాచార్యుని కథని స్వయంగా విష్ణుమూర్తే, లక్ష్మీదేవికి చెప్పినట్టుగా శ్రీకృష్ణదేవరాయలు కవితా కల్పన చేశాడు.  

శ్రీరంగనాధుని మీద పిచ్చి ప్రేమతో, విరహంతో రోజురోజుకీ చిక్కిశల్యమౌతున్న కూతురి అవస్థచూసి, విష్ణుచిత్తుడు మన్ననారుస్వామికి మొరపెట్టుకొంటాడు. `మాకు పూలను మాలగా గుచ్చి నీకు సమర్పించడమే తెలుసు, ఆమె వాటిని పక్కగా చేసుకొని పడుకొంటుంది. మేము నీ పాదతీర్థాన్ని పుచ్చుకొని దాహంతీర్చుకొంటాం, ఆమె ఆనీటిని వొళ్ళంతా పూసుకొంటుంది. మేము యోగాభ్యాసం చేస్తూ నిన్ను స్మరిస్తాము, ఆమె మరీబారంగా - దీర్ఘంగా ఊపిరితీసి వొదులుతుంది. ఈ అతి తపస్సు ఏమిటో నువ్వే తెలుసుకొని మాకు చెప్పాలని` కోరతాడు. అప్పుడు మన్ననారుస్వామి  భక్తునితో మాట్లాడుతూ మాలదాసరి అనే ఒక విష్ణుభక్తుని కథను చెపుతాడు. నిరంతరం విష్ణు సంకీర్తన చేసే మాలదాసరి తాను పాడిన ఒక కీర్తనలో చివరిచరణం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఒక రాక్షసుడికి దారబోయడంద్వారా అతనికి శాపవిమోచనం కలిగిస్తాడు. `ఈ కథలు తెలిసిన భూదేవి నాలో చేరాలనే కోరికతో నీ కూతురిగా పెరుగుతూ, నన్నే ప్రేమించి విరహతాపం పొందుతుంది. అదే ఆమె చేసే తపస్సు` అంటాడు. 

ఆముక్తమాల్యదలో ఉపకథల్ని ప్రథాన కథలో అనుసంధానించడం, కథని నడిపే తీరు అమోఘం. కావ్యం విష్ణు భక్తుల కథల సమహారం కనుక, దేవదేవుని వర్ణనలు కూడా ఆద్యంతమూ ఉంటాయి. వీటికి తోడు భక్తి, వేదాంత చర్చలు, తత్వబోధలు ఉంటాయి.  ఖాండిక్యుడు, కేశిధ్వజుడు అనే అన్నదమ్ముల మధ్య సంవాదంలో భగవధ్గీత సారాన్ని, ముఖ్యంగా జ్ఞానయోగాన్ని సరళంగా చెప్పిన విధానం బాగుంటుంది. అలాగే యామునా చార్యుడనే రాజు తన కుమారుడికి రాజ్యపట్టాభిషేకం చేసి, రాజనీతి బోదిస్తాడు. ఆ రాజనీతి ఇప్పటికీ ఆచరణయొగ్యంగానే ఉందని అనిపిస్తుంది. ప్రతీ వ్యక్తీ యామునాచార్యుడి రాజనీతిసూత్రాలని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకొంటే మంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చు.  
  
నగరాల్ని, నగరాల్లో ఉండే ఉద్యానవనాల్ని, కోటల్ని, కొలనుల్ని, నగర స్త్రీలనీ, పువ్వులను సేకరించి మాలలు కట్టి అమ్మే పుష్పలావికల్నీ, పువ్వులు కొనడానికి వచ్చే వ్యక్తులతో వాళ్ళు జరిపే సరస చమత్కార సంభాషణల్నీ, వేశ్యలనీ చక్కగా వర్ణిస్తాడు కవి. ముఖ్యంగా ఋతువుల వర్ణన అమోఘం. గ్రీష్మ, వర్ష, శరత్, వసంత ఋతువుల్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. వర్ణనల్ని చదువుతూ ఉపమానాల వెల్లువలో ఆనందంగా కొట్టుకొనిపొతాం. పనుల వొత్తిడిలో పడి ప్రకృతిలో వచ్చే మార్పుల్ని గమనించడం మానేసాం. వర్షాన్ని, వెన్నెలని,  సూరోదయాల్ని, మంచుని, చలిని, గ్రీష్మంలో వచ్చే మావిడిపళ్ళ మాధుర్యాల్ని, పూచే పువ్వుల్ని, వీచే గాలుల్ని, పక్షుల కూతల్ని మనసుపెట్టి ఆస్వాదించం. కానీ, ఈ కావ్యం చదివితే ఆ స్పృహ కొంచెమైనా తిరిగి వస్తుందేమో!  

ఆముక్తమాల్యద గురించి ఒక్కమాటలో చెప్పాలంటే భక్తి, శృంగారం, భావుకత్వం, వ్యవహారదక్షత, విజ్ఞానం, ఆనందం... ఆన్నీ ఉన్నాయి ఈ పుస్తకంలో.

శ్రీకృష్ణుని కోసం గోపికలు చేసినటువంటి వ్రతాన్ని గోదాదేవి కూడా ముప్పైరోజులు ఆచరించి శ్రీరంగనాధుడిని పొందింది. శ్రీరంగనాధుడు ఆమెను స్వీకరించిన రోజే `భోగి` - అందుకే ఈ రోజు ప్రత్యేకంగా ఆముక్తమాల్యద గురించి ఈ వ్యాసం.

© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!