Pages

Monday, 11 January 2016

కెరటం

ప్రారంభించిన పని విజయవంతం కాకపోతే,
ఆశించిన ఫలితం చేతికందకపోతే
వచ్చే ప్రతికెరటం తీరాన్ని చేరదనీ...
లేచే ప్రతికెరటం ఆకాశాన్ని అంటదనీ...
కెరటం కొందరికి తాత్వికత నేర్పుతుంది

విజయలక్ష్మి వెక్కిరించిందని నిస్పృహతో చేతులు ముడుచుకొని కూర్చుంటే
బలాన్ని కూడదీసుకొని ముందడుగు వెయ్యకపోతే
విశ్వమంతా వెతికిచూసినా ఒక్క విజేతా కనిపించడు
`గొప్పతనం ఎగిసి పడడంలో కాదు, పడిన ప్రతిసారీ లేవడంలో ఉంది!` అని వివేకానందుడు చెప్పినట్టు 
కెరటం కొంతమందికి స్పూర్తినిస్తుంది

సీతారాములు సినిమాలో దాసరి నారాయణరావు వ్రాసిన ఈ పాట (See the link here) వివేకానందా రాక్ మెమోరియల్ దగ్గర చిత్రీకరించినట్టు అనిపిస్తుంది. సముద్రం మధ్యలో శిలమీద కట్టడం వివేకానందా రాక్ మెమోరియల్ దగ్గర కన్యాకుమారి మండపంలా ఉంది. అవునో, కాదో ఈ పాట చిత్రీకరణ విశేషాలు గురించి తెలిసున్న వారు చెప్పాలి. పాటని సత్యం సంగీత దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. భావుకత్వం అత్యద్భుతంగా ఉంటుంది. చిత్రీకరణ హుందాగా ఉంటుంది. 1980లో చిత్రం విడుదలైంది. పాట జనాలకి విపరీతంగా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చినపాటల్లో ఇది ఒకటి. 

పాటలో భావుకత్వాన్ని చదువుతూ ఆనందించండి...  

తొలి సంజ వేళలో - తొలి పొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో - వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

జీవితమే రంగుల వలయం
దానికి ఆరంభం సూర్యుని ఉదయం

గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం 
వెదికే ప్రతి ఉదయం - దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యారాగం - మేలుకొలిపే అనురాగం

సాగరమే పొంగులనిలయం
దానికి ఆలయం సంధ్యాసమయం

వచ్చే ప్రతికెరటం చేరదు అది తీరం
లేచే ప్రతికెరటం అది అంటదు ఆకాశం

ఆ ఆకాశంలో ఒక మేఘం - మేలుకొలిపే అనురాగం

ఇంతకీ వివేకానందా రాక్ మెమోరియల్ గురించి మీకు తెలుసా?

భారతదేశపు దక్షిణపు కొన నుంచి సముద్రంలోకి ఏభై మీటర్ల దూరంలో హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతాలు కలిసే చోట ఒక చిన్న ద్వీపంలాంటి శిల ఉంది. బుద్దుడికి భోది వృక్షం ఎలాగో, వివేకానందునికి కన్యాకుమారి వద్ద ఈ శిల అలాగ. 1970లలో దీనిని వివేకానందా రాక్ మెమోరియల్‌గా అభివృద్దిచేశారు. (వివేకానందా రాక్ మెమోరియల్ గురించి పూర్తి టపా ఇక్కడ చదవండి) .

© Dantuluri Kishore Varma

2 comments:

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!