శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండపైకి నడకదారిలో వెళ్ళాలనుకొనే భక్తులకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ఎప్పటినుంచో భక్తులు ఉపయోగిస్తున్న అలిపిరిమెట్టు మార్గం. రెండవది ఈ మధ్యకాలంలో క్రమంగా ప్రాచుర్యాన్ని పొందుతున్న దగ్గర దారి - శ్రీవారిమెట్టు.
మొన్న, 2018 జనవరి నెలలో మేము శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్ళాం. `ఏ దారిలో కొండపైకి వెళ్ళాలి? శ్రీవారి మెట్టు మార్గం సౌకర్యంగా ఉంటుందా? `వంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఈ మార్గానికి సంబంధించి పూర్తి సమాచారం కూడా అందుబాటులో లేదు. అందుకే, నేను తెలుసుకొన్నంత వరకూ సమాచారాన్ని ఫోటోలతో కలిపి ఇస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇది వ్రాస్తున్నాను.
తిరుపతి నుంచి (రైల్వే స్టేషన్/బస్‌స్టాండ్) శ్రీవారిమెట్టుకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. దేవస్థానం వారి ఉచిత బస్సులు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. కానీ, అవి సాధారణంగా రద్దీగా ఉండడం వల్ల లగేజీతో వాటిలో ప్రయాణం కొంచెం కష్టం. ఆర్టీసీ వాళ్ళ లైను బస్సుల్లో కానీ, అద్దె వాహనాల్లో కానీ వెళ్ళవచ్చు. తిరుపతి ట్రాఫిక్ పోలీసు వారు ఏర్పాటు చేసిన టేక్సీ కౌంటర్ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంది. మా బృందంలో ఏడుగురి సభ్యులకీ సరిపోయే విధంగా ఒక జీపుని 750 రూపాయలకి మాట్లాడుకొన్నం. దారిలో శ్రీనివాస మంగాపురం చూపించి, శ్రీవారి మెట్టు దగ్గర దించే ఏర్పాటు చేసుకొన్నాం. ఇదే మార్గంలో తిరుపతి జూపార్క్ కూడా తగులుతుంది. సమయాభావం వల్ల మేము అక్కడ ఆగలేదు.
తిరుపతి నుంచి (రైల్వే స్టేషన్/బస్‌స్టాండ్) శ్రీవారిమెట్టుకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. దేవస్థానం వారి ఉచిత బస్సులు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. కానీ, అవి సాధారణంగా రద్దీగా ఉండడం వల్ల లగేజీతో వాటిలో ప్రయాణం కొంచెం కష్టం. ఆర్టీసీ వాళ్ళ లైను బస్సుల్లో కానీ, అద్దె వాహనాల్లో కానీ వెళ్ళవచ్చు. తిరుపతి ట్రాఫిక్ పోలీసు వారు ఏర్పాటు చేసిన టేక్సీ కౌంటర్ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంది. మా బృందంలో ఏడుగురి సభ్యులకీ సరిపోయే విధంగా ఒక జీపుని 750 రూపాయలకి మాట్లాడుకొన్నం. దారిలో శ్రీనివాస మంగాపురం చూపించి, శ్రీవారి మెట్టు దగ్గర దించే ఏర్పాటు చేసుకొన్నాం. ఇదే మార్గంలో తిరుపతి జూపార్క్ కూడా తగులుతుంది. సమయాభావం వల్ల మేము అక్కడ ఆగలేదు.
ప్రయివేట్ వాహనాలని పై ఫోటోలో కనిపిస్తున్న స్టాప్ బోర్డ్ వరకే అనుమతిస్తారు. నేరుగా లగేజ్ కౌంటర్ వరకూ అనుమతించరు. కాబట్టి ఇక్కడి నుంచి కొంతదూరంలో ఉన్న కౌంటర్‌కి మన సామాన్లని మనమే మోసుకొని వెళ్ళాలి. నడకదారి ద్వారా తిరుమలకి వెళ్ళే భక్తుల కోసం దేవస్థానం వాళ్ళు కొన్ని సౌలభ్యాలని కలుగజేశారు. అవి - ఉచిత బస్సు, సామాన్లని ఉచితంగా కొండపైకి చేరవెయ్యడం, శ్రీవారి దివ్య దర్శనం, ఉచితంగా లడ్డూప్రసాదం మొదలైనవి. శ్రీవారిమెట్టు మార్గం స్వయంగా వేంకటేశ్వరుడు తిరుమలకు నడచి వెళ్ళిన దారి అట. అందువల్లనే పాదరక్షలతో వెళ్ళవద్దని ప్రారంభంలోనే బోర్డులు పెట్టారు. చెప్పుల్ని కూడా ఓ సంచిలో పెట్టుకొని లగేజీతో పాటూ పైకి పంపే ఏర్పాటు చేసుకోవాలి. తాళాలు వేసిన బ్యాగ్లని, సూట్కేసులని మాత్రమే తీసుకొంటారు. వాటిని స్కాన్ చేస్తారు. ఏవైనా విలువైన వస్తువులూ, డబ్బూ, శ్రీవారి ముడుపులూ వగైరా ఉంటే తీసివేయమని సూచిస్తారు.
అలిపిరిమెట్టు దారికంటే శ్రీవారిమెట్టు మార్గంలో నడక తేలికగా ఉంటుంది. ఎందుకంటే, అలిపిరి మార్గం క్రిందనుంచి కొండపైకి తొమ్మిది కిలోమీటర్ల దూరం, 3550 మెట్లు ఎక్కాలి. కానీ శ్రీవారి మెట్టు మార్గం కేవలం 3 కిలోమీటర్ల దూరం, 2388 మెట్లు.
కాలినడక భక్తులకు ప్రతిరోజూ 20వేల దివ్యదర్శనం టిక్కెట్లు జారీ చేస్తారు. వీటిలో 14వేల టిక్కెట్లు అలిపిరి మార్గంద్వారా వెళ్ళేవారికీ, మిగిలిన ఆరువేల టిక్కెట్లూ శ్రీవారిమెట్లు మార్గంలో వెళ్ళేవాళ్ళకీ ఇస్తారు. భద్రతా కారణాల రీత్యా శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకూ మాత్రమే అనుమతిస్తారు. ఉదయం ఆరు గంటల నుంచి టిక్కెట్లు జారీచెయ్యడం మొదలుపెట్టి, ఆరువేల వరకూ ఇస్తారు. ఈ కోటా పూర్తయిన తరువాత నడిచి వెళ్ళిన వారు కూడా సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి.
సుమారు 1250వ మెట్టు దగ్గర దివ్యదర్శనం టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ ఉంది. |
దివ్యదర్శనం టిక్కెటు |
ఇచ్చిన టిక్కెట్ పైన మళ్ళి 2050వ మెట్టు దగ్గర ఉన్న మరొక కౌంటర్‌లో స్టేంప్ వేస్తారు. |
ఎనిమిది వందల మెట్ల వరకూ పెద్దగా అలసట తెలియకుండా వెళ్ళిపోవచ్చు. అక్కడినుంచి కొండపైకి ఏటవాలుగా ఎత్తు పెరుగుతుంది. దర్శనం టిక్కెట్లు చేతికి వచ్చేంత వరకూ వేగంగా వెళ్ళినా... ఆ తరువాత విశ్రాంతి తీసుకొంటూ, తీరుబడిగా నడచి వెళ్ళవచ్చు. వెంట చిన్న తేలిక బ్యాగ్‌లో మంచి నీళ్ళు, టీ, స్నాక్స్, అత్యవసరమైన మందులు లాంటివి తీసుకొని వెళితే మంచిది.
ఎండనుంచి, వర్షాన్నుంచి రక్షణ ఇవ్వడం కోసం దారంతా తొంభై శాతం వరకూ షేల్టర్లు నిర్మించారు. ప్రతీ యాభై మెట్లకూ ఒక్కో మంచినీటి ట్యాప్ ఉంది. మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. చిరువ్యాపారులు ఏర్పాటు చేసిన చిన్న చిన్న తాత్కాలిక అంగళ్ళు ఉన్నాయి. నిమ్మసోడాలు, మజ్జిగ, కూల్‌డ్రింకులు, బిస్కెట్లు లాంటివి... పిడతకింద పప్పూ, ఉడికించిన పల్లీలూ అమ్ముతున్నారు.
మంచి వాతావరణంలో, ఉదయాన్నే బయలుదేరితే ఆహ్లాదకరమైన పరిసరాలనీ, ప్రకృతినీ ఆస్వాదిస్తూ, గోవింద నామ స్మరణ చేసుకొంటూ, ఫోటోలు తీసుకొంటూ, సత్కాలక్షేపంతో తిరుమల చేరవచ్చు. ఈ ప్రయాణం చక్కని అనుభూతిని ఇస్తుంది.
కాకపోతే అలిపిరి మార్గం ద్వారా వెళ్ళినప్పుడు కనిపించే జింకల పార్కు, ఆంజనేయస్వామి విగ్రహం, గాలిగోపురం, దశావతారాల విగ్రహాలు, ఏడుకొండలను తెలియజేసే బోర్డులూ, రోడ్డు మార్గంలో(అలిపిరి మార్గంలో కొంతదూరం రోడ్డుపైన నడాలి) జలపాత దారలు (వర్షాకాలంలో మాత్రమే)... శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేటప్పుడు మిస్సవుతాం.
చివరి మెట్టు మీద ఒక వ్యక్తి కర్పూరం బిళ్లల్ని పెద్ద బస్తాలో వేసుకొని అమ్ముతూ కనిపిస్తాడు. ఒక్కొక్కటీ పదేసి చొప్పున కొనుక్కొని, వెలిగించి వేంకటేశ్వర స్వామిని మనసులో ధ్యానించుకొని ముందుకు కదలడమే.
పైకి వెళ్ళిన తరువాత లగేజీ కౌంటర్‌లో మన బ్యాగేజ్ తీసుకొని తిన్నగా మనం ఏర్పాటు చేసుకొన్న కాటేజీకో, రూంకో వెళ్ళిపోవడమే.
గోవిందా...గోవింద!
© Dantuluri Kishore Varma