Wednesday, 7 November 2012

నేడే చూడండి!

ఒక రిక్షాకి మూడువైపులా  చతురశ్రాకారపు అట్టలు కట్టి, వాటిమీద కొత్తగా హాలుకి వచ్చిన సినిమా వాల్ పోస్టర్లు అంటించి మైకులో "నేడే చూడండి - నాగేశ్వరరావు, సావిత్రీ నటించిన కనీ వినీ ఎరుగని కుటుంబ కథా చిత్రం......," అని ఊరంతా తిప్పి చెవుల్లో తుప్పు వదల గోట్టేసేసరికి, రిక్షా వెనుక కుర్రళ్ళు గోల, గోల గా పరుగెత్తేవాళ్ళు. సంక్షిప్తంగా సినిమా కథ కొంత ముద్రించి, `....అప్పుడేమయ్యిందో వెండితెరమీద చూడండి,`  అని అచ్చువేసిన పాంప్లెట్లు అంది పుచ్చుకొని, ఇంటికి పట్టుకెళ్ళిపోతే (ఇటువంటి రిక్షా ప్రచారం ఇప్పటి తరానికి పరిచయంచెయ్యడానికి ఆమధ్య విడుదలయిన బాపూ సినిమా శ్రీరామరాజ్యం కోసం కొన్నిచోట్ల చేస్తే జనాలు ఆసక్తిగా చూసారని ది హిందూ పేపర్లో వేసారు); సాయంత్రం ఆటకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు గుర్రబ్బండిని కబురు పంపేవారు.

అలాగని వచ్చిన ప్రతీ సినిమాకీ చెక్కేసేవాళ్ళనికాదు. ఏక్టర్లు నచ్చినవాళ్ళు అయ్యి ఉండాలి, సినిమా బాగుందని ఆనోటా ఈ నోటా విని ఉండాలి. అప్పుడే  పక్కఊళ్ళో ఉన్న సినిమా హాలుకి ప్రయాణ సన్నాహాలు చేసుకోవడం. ఈ గుర్రబ్బండి సవారీ కుర్రవాళ్ళకోసం కాదు. ఇంటిలో ఆడవాళ్ళ కోసం. వాళ్ళు బండి ఎక్కిన తరువాత ఒకటో, రెండో సీట్లు ఖాళీ ఉంటే పిల్లల్లో అదృష్ఠవంతులకో, లేదా బాగా పెచీ పెట్టగలిగిన కళ ఉన్నవాళ్ళకో అవి దక్కేవి.  

సాయంత్రం ఆరుగంటలు అవకుండానే భోజనం చేసేసి తాతగారు నిద్రపోయిన తరువాత, గుర్రబ్బండి వెనుక గుమ్మం దగ్గరకి వచ్చేది. సినిమా విషయం ఏ మాత్రం ఆయనకి తెలిసినా అక్షింతలు పడిపోయేవి. అందుకే రహస్యం.  అప్పటి గుర్రబ్బండి అంటే, ఇప్పటి లగ్జరీ కారు అన్నమాట. లోపల సీట్లు కూడా కూర్చోవడానికి మహా అనుకూలంగా ఉండేవి. చల్లని పచ్చగడ్డి ఒక అర అడుగు మందాన పరచి దానిమీద ముతక బరకం వేస్తే ఎంత గతుకుల రోడ్డులో నడిపించినా నొప్పి తెలిసేదికాదు. లోపల కూర్చున్న ప్రయాణీకులు బయటకు కనిపించకుండా ముందూ, వెనుకా తెరలు కట్టేవారు. ఎప్పుడయినా బండినడిపేవాడి ప్రక్కన కూర్చుంటే సవారీ భలే ఉండేది. వాడి చేతిలో  ఒక అడుగున్నర పొడవైన అతి సన్నని వెదురు గడకి కట్టిన చెర్నోకొలా ఉండేది . దీనికి రెండు ఉపయోగాలుండేవి - గుర్రాన్ని నడపడం, ఎవరైనా అడ్డువచ్చినప్పుడు కర్రని వెనక్కి త్రిప్పి తిరుగు తున్న బండి చక్రపు ఆకుల(స్పోక్స్)కి తగిలేలా ఉంచడం. అప్పుడు వచ్చే టృ)))))) అనే చప్పుడుకి `అహా....హె్‌య్ హె్‌య్`  అని అదిలింపు కలిపితే స్వారీ మేఘాలలో తేలుతున్నట్టు ఉండేది. 

మావూరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకే ఒక హాలులో వేసే సినిమాలు  అప్పటికే విడుదలయ్యి ఐదో పదో ఏళ్ళు పూర్తయ్యి, రాష్ట్రమంతా తిరిగి, కాళ్ళు నెప్పులు పెట్టెసి, చతికిలబడే సమయానికి  ఆఖరి మజిలీగా వచ్చేవి. లవకుశ, మాయాబజార్, గుండమ్మకథ, ప్రేమనగర్, భక్తకన్నప్ప, సుమంగళీ, బడిపంతులు, కార్తీకదీపం, అమరదీపం, చుట్టాల్లున్నారుజాగ్రత్త, ఇంటింటి రామాయణం, ప్రేమాభిషేకం, బుర్రిపాలెం బుల్లోడు, పదహారేళ్ళ వయసు, దేవత..... నేను ఇక్కడే చూసినట్టు గుర్తు. పేరు భాస్కర్ థియెటర్ అయినా దానిని టూరింగ్ టాకీస్ అని పిలిచేవారు. కుర్చి, బెంచీ, నేల అని మూడు క్లాసులు ఉండేవి. ఫోల్డ్ చెయ్యడానికి అనువుగా ఉండే గోడ్రేజ్ కంపెనీ ఇనుప కుర్చీలు వేసిన  క్లాసుకి వెళ్ళేవాళ్ళకి అమ్మా, నాన్నా మధ్యన కూర్చుని సినిమా చూసే అదృష్టం లేదు. ఈ క్లాసుని నిలువుగా రెండుభాగాలు చేసి, మధ్యన తెర కట్టేవారు - ఒకవైపు మగవాళ్ళకి, మరో వైపు ఆడవాళ్ళకి. 

మసక లైట్ల కాంతిలో, ఘంటశాల పాడిన `నమో వెంకటేశా, నమో తిరుమలేశా.....' అనే పాట వస్తూ ఉండగా లోపలికి వెళ్ళి; చుట్టా, సిగరెట్టు, బీడీ పొగలు మధ్య చిత్రరాజాన్ని అస్వాదించి, మళ్ళీ అదే ఘంటశాల పాట నేపధ్యంలో బయటకు వచ్చేయ్యడమే. హాలు బయట విస్తరాకులతో కోను ఆకారంలో చిన్ని చిన్ని పొట్లాలు కట్టి, పావలాకి ఒకటి చొప్పున అమ్మే కరకజ్జం తప్పని సరిగా కొనుక్కొని బండికోసం ఎదురు చూసేవాళ్ళం. దియేటరు దాటి కొంచం ముందుకు వెళ్ళగానే అప్పుడే చేసిన నేతి సున్నుండల వాసన వచ్చేది. "తాచుపాము ఉన్నచోట ఇలాంటి వాసన వస్తుంది," అని బండి వాడు చెప్పేవాడు. ఊరు నిద్రపోతుండగా రెండు సరిహద్దులకీ మధ్య ఉన్న కంకర గోతులు అనే ప్రదేశంలో ఉండే మర్రి చెట్టు దాటుకొని మావూరు తిరిగి వెళ్ళాలి. ఆ మర్రిచెట్టుమీద దెయ్యాలు ఉంటాయని చెప్పుకొనేవారు. అక్కడి వరకూ సినిమాకబుర్లు చెప్పుకొంటూ ఖుషీ, ఖుషీగా వచ్చేసినా...ఆ ప్రదేశాన్ని సమీపించే సరికి పెద్దవాళ్ళు ఒక్కసారి నోటిమీద వెలు పెట్టి, నిశ్శభ్దంగా ఉండమని సూచిస్తూ `హ్హుష్!' అనేవారు. చీకట్లో కీచురాళ్ళ అరుపులు, నల్ల కంకర రోడ్డు మీద గుర్రపు డెక్కల టక టకలు, తిరిగే బండిచక్రాల చప్పుళ్ళతో గుండే చేసే లబ్‌డబ్‌లు కలిసి వాద్య సంగీతం అదిరిపోయేది. చిరుచెమటమీద చల్లటిగాలి తగిలేసరికి మర్రిచెట్టు దాటి వచ్చేసినట్టు లెక్క.  

చిన్నప్పటి సినిమా అంటే తెరమీద బొమ్మ, ఘంటశాల `నమో వెంకటేశా` పాట, కరకజ్జం రుచి, సున్నుండల వాసన, దెయ్యల మర్రిచెట్టు దాటాక వొంటికి చల్లగా తగిలే గాలి.... ఆ జ్ఞాపకానికి పంచేంద్రియాలూ స్పందిస్తాయి.

© Dantuluri Kishore Varma

6 comments:

 1. భలేగా రాస్తారండి మీరు. మాదీ కాకినాడే. కాకినాడ గురించి ఎంత చెప్పినా తక్కువే.
  మీ బ్లాగు రెగులర్ గా చదువుతూ ఉంటాను. చాలా బాగా రాస్తున్నారు. వీలైతే ఒక సారి గౌతమి ఎక్ష్ప్రెస్స్ ప్రయాణం గురించి వ్రాయండి.

  ReplyDelete
 2. ధన్యవాదాలు దుర్గ గారు. మీకు నచ్చేలా ఇక ముందు కూడా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. నా టపాల మీద మీ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తారని భావిస్తున్నాను. మీ ఇండియన్ రెసిపీస్ బ్లాగ్ ఐడియా చాలా బాగుంది. పోస్టులు రాయడం మొదలుపెట్టండి మరి. గౌతమీ గురించి `అందమైన అమ్మాయి ఆత్మ కథ' అని రాశాను చదవండి.

  ReplyDelete
 3. Karakajjam ante emito konchem cheppandi Varma garu..

  ReplyDelete
 4. బాగా లావుగా చేసిన శెనగపిండి కొమ్ములకి బెల్లం పాకం పడితే దానినే కరకజ్జం అంటారు. అచ్చుగా కాకుండా విడి కొ్మ్ములుగా ఉంటుంది. నా బ్లాగుని చదివినందుకు ధన్యవాదాలు. ఐడీ తో మీ కామెంటు పెట్టడానికి ప్రయత్నించండి ఇక ముందు.

  ReplyDelete
 5. venkata chowdary Mutyala6 November 2013 at 19:19

  mi blog chala bagundi sir

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు చౌదరిగారు.

   Delete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!