Pages

Tuesday, 2 October 2012

వాన

గ్రీష్మంలో ఎండవేడికి అలసిసొలసిన భూదేవికి జ్యేష్ఠమాసం తీసుకొనివచ్చే పరిమళాల సందేశం.  తొలకరి జల్లులు, తడిసిన మట్టి వాసన, హాయిగా వీచే వర్షపుగాలి...

వినీలాకాశానికి నల్లదుప్పటి కప్పినట్టు దట్టంగా కమ్ముకొనే మబ్బులు, అప్పటివరకూ ఏ చెట్ల ఆకుల్లో దాక్కుంటుందో తెలియని ఈదురుగాలి  `వర్షాగమనం` గురించి ప్రతీఒక్కరినీ  పేరుపేరునా పలుకరించి చెబుతుంది. 

నేలంతా చిత్తడి, చిత్తడి. `కమ్మని పకోడీ తింటూ వర్షాన్ని చూస్తూ గడిపేద్దాం` అంటే. ఆఫీస్ లోనో, షాపులోనో పనిరాక్షసుడు- కష్టమో, నష్టమో; గొడుగులోనో, రెయిన్కోటులోనో; బైకులోనో, ఆటోలోనో -  వెళ్ళక తప్పదుగా.
చినుకు వానై, వాన వరదై నదులు నిండితే అన్నదాతకు ఎక్కడిలేని ఆనందం. దుక్కుదున్నుకోవాలి, ఆకుమడి జల్లుకోవాలి, నాట్లువేసుకొని, పొలంలో ఊడుపులు పూర్తిచెయ్యాలి. 

ముందు  చెప్పకుండా హఠాత్తుగా వచ్చే వరాల జల్లు స్కూలుకి శెలవు ఇచ్చేస్తే, ఇంటి ముందు ప్రవహించే వాన నీటి కాలువలో కలల కాగితపు పడవల ప్రయాణం...

ఊహించని అవకాశం బస్ స్టాప్ దగ్గర నుంచున్నప్పుడు ప్రియురాలో/ఫ్రేమికుడో గొడుగులో చోటిస్తే `ఒకే అడుగు, ఒకే గొడుగు, ఒకే నడకగా... ఒకరికి ఒకరుగా...` అని పాడుకోంటూ, కళ్ళల్లొ కళ్ళుపెట్టి చూసుకొంటూ ప్రపంచం అవతలి వరకూ నడిచేయవచ్చు.  
© Dantuluri Kishore Varma 

Monday, 1 October 2012

ఎన్ని `లైకు` లు కావాలి?


ఫేస్ బుక్ – పాస్ వర్డ్ టైప్ చేసి, ఎకౌంట్లోకి వెళ్ళిన వెంటనే టాప్ బార్ మీద ఎరుపురంగు నోటిఫికేషన్స్ ఉంటే, ఎన్ని లైకులు, ఎన్నిషేర్లు, ఎన్నికామెంట్లు తెలుసు కోవడానికి ఉత్సాహ పడతాం; లేకపోతే మళ్ళీ… ` గాడిద గుడ్డు లే` అనే ఫేస్ బుక్ ఎకౌంట్ నుంచి 1,563  లైకులు, 1,368  షేర్లూ ఉన్న ఒక పోస్ట్ వెతికి -
  • మీలో మానవత్వం ఉంటే లైక్ కొట్టండి…
  • ప్రతీ షేర్ కీ ఫేస్ బుక్ ఈ పేషంటు కి ఒక డాలర్ పే చేస్తుంది…
  • మహేష్ బాబు నవ్వుకి లైక్, పవన్ కల్యాణ్ నవ్వుకి షేర్…
  • నువ్వు నిజమైన భారతీయుడివైతే లైక్ చెయ్యి…
అని మన కామెంట్ కలిపి షేర్ చేస్తాం –

మనవి కాని ఫోటోలకి, అభిప్రాయాలకి మనమెందుకు ఇతరులనుంచి ప్రశంశలు ఆశిస్తున్నాం? మీరు లైక్ బటన్ హిట్ చేస్తే ఫేస్బుక్కో, మరొకరో ఎందుకు ఎవరికో డాలర్లు చెల్లిస్తారు? నిజంగా అభాగ్యులకి సహాయం చెయ్యాలంటే మీలైకులకోసం ఆగవలసిన అవసరంలేదు కదా?

అసలు మనకి ఎన్ని లైకులు కావాలి? ఎందుకు కావాలి?
***
డేనియల్ డీఫో రాసిన `రాబిన్సన్ క్రూసో` నవలలో హీరో ఒక నిర్మానుష్యమైన ద్వీపంలో 35 సంవత్సరాలు ఒంటరిగా జీవించవలసి వస్తుంది. నిజానికి మరొక మనిషి సాహచర్యం లేకుండా మనుగడ సాగించడం దాదాపు అసాధ్యం అని ట్రాన్సక్షనల్ ఎనలిస్టులు చెపుతారు. ముఖ్యంగా ఎరెక్ బెర్న్ తన పుస్తకం `గేంస్ పీపుల్ ప్లే` లో సమాజంలో ఉన్న మిగిలిన వ్యక్తులచేత గుర్తించబడటం మనిషిని బ్రతికించి ఉంచడానికి కావలసిన ప్రధానమైన అవసరాలలో ఒకటని చెపుతాడు.

ఆహారం లాగే గుర్తింపు ఒక జీవితావసరం. ఇది వచ్చే కొలదీ మరింత ఆశిస్తాం. దీనినే `రికగ్నిషన్ హంగర్` అంటారు. ఇది మనుషుల్లో పుట్టినప్పటినుంచే ప్రారంభమౌతుంది. చిన్నిపిల్లల్లో గుర్తింపబడాలనే ఆశ – తల్లితండ్రులు, బందువులు వాళ్ళని ఎత్తుకోవడం, ముద్దుపెట్టుకోవడం, చిటికవెయ్యడం, బుగ్గగిల్లడం మొదలైనవి చెయ్యడం ద్వారా నెరవేరితే; పెద్ద వాళ్ళలో – పలుకరింపు, హేండ్ షేక్, సంభాషణ, ప్రశంస మొదలైనవి ఆ పాత్రని నిర్వర్తిస్తాయి.

ఈ సాంఘిక అవసరం నుంచి వ్యక్తులని దూరం చేసి చూసినపుడు వాళ్ళల్లో నిస్పృహ  కనిపించింది. పోను పోను అది డిప్రెషన్ గా మారి, ఆకలి మందగించింది. తత్ఫలితంగా శరీరానికి సరైన పోషక విలువలు అందక వాళ్ళు క్రమంగా మరణానికి చేరువవయ్యారని పరిశోదనలు తెలియచేశాయట. ఇది కేవలం తాను ఉన్నాననే స్పృహని తెలియచెప్పడానికి మరొక వ్యక్తి చేరువలో లేకపోవడమేనట! ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది సైంటిఫిక్ గా నిరూపించబడిన విషయం.

ఒక వ్యక్తికి ఎంత గుర్తింపు కావాలి అనేది అతను చేసే వృత్తి మీదా, ఉండే పరిస్థితుల మీదా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, ఒక పాపులర్ హీరో ప్రతిరోజూ కొన్ని వందల ప్రశంశలని ఫోన్ కాల్స్ ద్వారా, ఈ మెయిల్ ద్వారా, మీడియా ద్వారా పొందుతూ ఉంటాడు. ఏదైనా కారణం చేత వరుస అపజయాలు ఎదురై లైంలైట్ కి దూరమైతే –   అప్రీసియేషన్  తగ్గి, డిప్రెషన్ కి గురిఅవుతాడు. అదే ఒక సామాన్యుడి కి వచ్చే చిన్న మెచ్చుకోలే గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.

టీ, సిగరెట్, మందు లాగ ప్రశంస కూడా వ్యసనమే. ఒక్కసారి అలవాటు అయితే మళ్ళీ, మళ్ళీ కావాలనిపిస్తుంది.

అందుకే……ఎన్ని లైకులైనా సరిపోవు. ఇది ఒక సైకొలాజికల్ నెసెసిటీ.
© Dantuluri Kishore Varma 

Saturday, 29 September 2012

అనంత పద్మనాభ స్వామి

వారం రోజుల క్రితం ద్వారపూడి దేవాలయాలను చూడటానికి వెళ్ళాను. కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రీ వైపు వెళ్ళే కెనాల్ రోడ్డు ప్రక్కన ద్వారపూడి ఉంది. ఇక్కడ ఒకే ప్రాంగణంలో సుమారు పది పెద్ద దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శ్రీ అనంతపద్మనాభ స్వామిది. నిజానికి ఇది ఒక ప్రత్యేకమైన గుడికాదు. శిరిడీ సాయిబాబా ఆలయంలో సాయినాధుని విగ్రహానికి వెనుకవైపు ఒక గర్భ గుడిలాంటి చాంబర్లో పవళించి ఉన్న మూర్తి. సుమారు రెండు సంవత్సరాలకు ముందు కుడా ఒకసారి ఇక్కడికి వెళ్ళాను. అప్పుడు ఈ పద్మనాభుడిని చూసిన జ్ఞాపకం లేదు. దానికి కారణం అప్పడు దీనిని నేను దర్శించి ఉండకపోవచ్చు, లేదా అనంతపద్మనాభుడు అంటే ఎవరో సరి అయిన అవగాహన లేక చూసిన విషయం నాకు గుర్తుండలేదో!
ద్వారపూడి  అనంతపద్మనాభుడు
ప్రస్తుత పోస్టు యొక్క ఉద్దేశ్యం ద్వారపూడి దేవాలయాల గురించి తెలియజేయడం కాదు - ఈ గుడిలో ఉన్న అద్బుతమైన అనంతపద్మనాభుని విగ్రహం ఈ పోస్టు వ్రాయడానికి ఒక ప్రేరణ మాత్రమే.
* * *
గత సంవత్సరం తిరువనంతపురం ఆలయంలో నేల మాళిగలలోనుంచి బయటపడిన బంగారు నాణాలు, నగలు, విగ్రహాలు, వజ్రవైఢూర్యాలు మొదలనవాటి విలువ లక్ష కోట్ల రూపాయలని  (వాటి ప్రాచీన విలువని -antique value- మదింపు చేస్తే దీనికి పదిరెట్లు ఉంటుందని అంచనా) ప్రపంచవ్యాప్తంగా మీడియాలో వార్తలు రావడంతో మన అందరి దృష్ఠీ ఈ పురాతన దేవాలయం మీదకి మళ్ళింది. ఇప్పుడు ప్రపంచంలో ది రిచ్చెస్ట్ గాడ్ ఈయనే. వంద అడుగుల ఎత్తయిన గోపురం, 18 అడుగుల పొడవైన పవళించి ఉన్న స్వామి విగ్రహం, 108 పవిత్ర విష్ణు నివాసాలలో ఇది ఒకటి అనే ప్రఖ్యాతి...అన్నీ కలిపి ఎవరికయినా ఒక్కసారి తిరువనంతపురం అనంతపద్మనాభుడిని దర్శించుకోవాలనే కోరికని కలిగిస్తాయి.
క్షీరసాగరం అనబడే పాల సముద్రంలో అనంతుడు అనే శేషతల్పంపై యోగనిద్రలో శయనించి ఉండే విష్ణువే అనంత పద్మనాభుడు. వేంకటేశ్వర స్వామికి చాలా దేవాలయాలు ఉన్నా, తిరుమలకి గొప్ప ప్రత్యేకత ఉన్నట్లే; అనంతపద్మనాభ స్వామికి కూడా,  కేరళలో తిరువనంతపురంలోది ప్రసిద్ద దేవాలయం.

ఈ దేవాలయం 1000 సంవత్సరాల పూర్వం కట్టబడిందట. తరువాత 18వ శతాబ్దంలో ట్రావెంకోర్ చేర రాజ వంశానికి చెందిన మార్తాండ వర్మ తనను తాను పద్మనాభ దాసునిగా ప్రకటించుకొని, ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. అప్పటినుంచీ ఇప్పటి వరకూ అతని వంశంవారే దేవాలయ బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది.

అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఈ దేవుడి ప్రస్తావన పురాణాలలో ఉంది. కేరళ రాష్ట్రంలో విల్వమంగలత్తు స్వామియార్ (ఈయననే దివాకర ముని అనికూడా అంటారు) విష్ణుమూర్తి దర్శనం గురించి ప్రార్ధిస్తుండగా, ఆయన ఒక అల్లరి బాలుడి రూపంలో అక్కడికి వస్తాడట. పూజలో ఉంచిన సాలగ్రామ శిలని తీసుకొని నోటిలో పెట్టుకోవడంతో విల్వమంగలుడికి కోపం వచ్చి ఆ బాలుడిని పట్టుకోవడానికి అతని వెంటపడతాడు. కొంతదూరం పోయిన తరువాత ఆబాలుడు ఒక వృక్షంలోనికి చొచ్చుకొనిపోవడం కనిపిస్తుంది. అప్పుడు ఆ వృక్షం క్రిందపడి శేషసయనంగా మారుతుంది. విష్ణువు అత్యంత పొడవైన మూర్తిగా దానిమీద దర్శనం ఇస్తాడు. అంత పొడవైన రూపాన్ని ఒకేసారి చూడగలగడం అసాద్యమౌతుందని విల్వమంగలుడు ప్రార్ధించగా, భగవంతుడు తన పొడవుని తగ్గించుకొంటాడట. అప్పుడు కొన్నిచెట్లు అడ్డు రాగా వాటి వెనుకనుంచి విల్వమంగలుడు, విష్ణుమూర్తిని మూడు భాగాలుగా చూస్తాడు. ఇప్పటికీ తిరువనంతపురం దేవాలయంలో మనం అనంత పద్మనాభుడిని ఆవిధంగానే మూడు ద్వారాలద్వారా మూడుభాగాలుగా దర్శించుకోగలం. విల్వమంగలుత్తు స్వామియార్ నిర్దేశించిన ప్రకారంగానే సాంప్రదాయబద్దంగా ఇప్పటికీ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.
Tiruvanamtapuram temple 
ఆ విషయాలు ప్రక్కనపెడితే, అసలు ఈ దేవాలయ నేల మాళిగలలో నికి లక్ష కోట్ల రూపాయల సంపద ఎలా వచ్చింది?

పద్నాలుగు, పదిహేను శతాబ్ధాలకాలంలో యూరోపియన్ దేశాలు, మన దేశంతొ సుగందద్రవ్యాల వ్యాపారం చేసేటప్పుడు, మలాబార్ తీరంలో ఉన్న ఈ ప్రాంతానికి అనంతంగా సంపద వచ్చిచేరిందని చెబుతారు. దానితో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగరరాజులు, చేరరాజులు, పురప్రముఖులు, సాధారణ ప్రజలు.ఇబ్బిడి ముబ్బిడిగా పద్మనాభుడికి కానుకలు సమర్పించి ఉండవచ్చు. తరువాతి కాలంలో డచ్చివారినుంచి, బ్రిటిష్ వారినుంచి, పొరుగు రాజయిన టిప్పు సుల్తాన్ నుంచి ఈ రాజ్యానికి ముప్పుపొంచి ఉండడంతో 18 శతాబ్ధంలో ఈ గుడిని పునర్నిర్మించినప్పుడు సంపదనంతా నేలమాళిగలలో బద్రపరిచారు. అదే ఇప్పుడు బయటపడిన బంగారు గని.
ట్రావెంకోర్ వంశీయుల రాజభవనం. ఫోటో సోర్స్: ద హిందూ న్యూస్ పేపర్
ప్రస్తుత మహారాజా ఆఫ్ ట్రావెంకోర్: Thirunal Marthanda Varma
ప్రపంచం అంతా లక్షల కోట్ల సంపద గురించి అబ్బురపడుతుంటే, ఈ గుడి యొక్క అనువంశిక ధర్మకర్త, ప్రస్తుత రాజు తిరుణాల్ మార్తాండ వర్మ, తాను కేవలం ఆ స్వామికి దాసుడిని మాత్రమే అనీ, ఆ సంపద అంతా కేవలం దేవుడికే చెందుతుందని చెబుతారు. ఇంత సంపద దేవాలయ నేళమాలిగల్లో ఉందని వాటిని తెరవక ముందే వీళ్ళకి తెలుసు. దేవాలయం నుంచి  వెళ్ళేటప్పుడు కాలికి అంటుకొన్న ఇసుకరేణువులనికూడా శుబ్రంచేసుకొని అడుగు బయటకు వేస్తారట. దేవుడికి చెందిన ఇసుకరేణువు కూడా తీసుకోరాదనే నియమమే దీనికి కారణం. ఆయన మాటలలో దేవుడి పట్ల అచంచల విశ్వాసం కనిపిస్తుంది. 90 సంవత్సరాల వయసులో ప్రతిరోజూ దేవాలయానికి వెళతారు. ఏదయినా కారణంతో ఒకరోజు వెళ్ళలేక పోతే అది ఒక శిక్షగా భావించి, 166 రూపాయల 35 పైసలు పెనాల్టీగా దేవాలయానికి చెల్లిస్తారు. ఇది ఒక సాంప్రదాయం. ఈ రాజ వంశంలో మాత్రుస్వామ్య వ్యవస్థ నడుస్తుందట; ఈయన తరువాత మేనగోడలు వారసురాలిగా రాణీ అవుతుంది. రాజ్యాంగ పరంగా మిగిలిన పౌరులు లాంటి వాళ్ళే అయినా, ప్రజలు మాత్రం ఈయనని మహారాజు లానే వ్యవహరిస్తారట. కొంతకాలం క్రితం ద హిందూస్తాన్ టైంస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్తాండ్ వర్మ ఈ విశేషాలు చెప్పారు. ధనం కోసం, అధికారం కోసం గడ్డి కరుస్తున్న నాయకులున్న ప్రస్తుత సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండడం ముదావహం.

-అందుకే ఈ పోస్టు.

కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి అనంతసంపద గురించిన వీడియోలు ఇక్కడ చూడండి.

1. Seven Wonders of India: Sri Anantha Padmanabha Swamy:

2. తిరుమల వేకటేశ్వరుని కంటే అనంతపద్మనాభుడే ధనవంతుడయిన దేవుడు:




6. దేవాలయ చరిత్ర ఫార్ట్ -3:
© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!