Pages

Saturday, 16 August 2014

మార్పు మననుంచే మొదలుకావాలని..

అబద్దం చెపుతున్నప్పుడు
లంచం తీసుకొంటున్నప్పుడు
లంచం ఇస్తున్నప్పుడు
మోసం చేస్తున్నప్పుడు
నిబందనలని అతిక్రమిస్తున్నప్పుడు..
వింటామేమో అని ఒకటి రెండు సార్లు 
`వద్దు, వద్దు` అని 
మన వెర్రి మనశ్శాక్షి హెచ్చరిస్తుంది..
వినం!
కానీ, అవినీతిరహిత సమాజం కావాలని కోరుకొంటాం
మనలాంటి మనుషులందరూ కలిస్తేనే సమాజం 
అనే సంగతి విస్మరిస్తాం!
`తప్పు` అని హెచ్చరించే మనశ్శాక్షి కూడా నోరు మూసుకొంటుంది.

*     *     *

`బి ద చేంజ్ యూ వాంట్ టు సీ,` అని చెప్పిన మహాత్మాగాంధీ 
స్వయంగా చేసి చూపించారు.
`I have nothing new to teach this world.
Truth and non violence are as old as hills,` 
అని గాంధీజీనే మరొక చోట చెప్పినట్టు 
మనం చేసేవాటిలో కొన్ని చెయ్యకూడని తప్పులే అని
మనకు ఎప్పటినుంచో తెలుసు
కానీ, చేస్తున్నాం కదా?
చేసే ముందు ఒక్కక్షణం ఆలోచిస్తే!?

నిద్రపోతున్న మన మసశ్శాక్షిని తట్టిలేపడానికి 
అలోచింపజేసే ఇన్స్పిరేషన్ కావాలి.
అలాంటి ఇన్స్పిరేషన్ కలుగుతుందేమో.

 © Dantuluri Kishore Varma

Tuesday, 12 August 2014

కేప్ కోరి గురించి మీకు తెలుసా?

పద్దెనిమిదవ శతాబ్దంలో దేశంలో ప్రధానమైన రేవు పట్టణాలలో కేప్‌కోరి ఒకటి. 1759లో బ్రిటిష్‌వాళ్ళు దీనిని నిర్మించారట. ఒక లైట్ హౌస్ కూడా కట్టారు. గత కాలపు వైభవానికి శిధిలావస్థలో ఉన్న అప్పటి లైట్‌హౌస్ ఒక గుర్తు. ప్రస్తుతం దేశంలో ఉన్న అతి పురాతనమైన లైట్‌హౌసుల్లో ఇది ఒకటి. అసలు కేప్‌కోరీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారా? కాకినాడకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరంగే అప్పటి కేప్‌కోరీ. ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమ ప్రపంచ ప్రఖ్యాతి చెందిందట. 1500 టన్నుల సామర్ధ్యం గల నౌకలను కూడా ఇక్కడ తయారు చేసేవారు. విదేశాలనుంచి వచ్చిన నౌకలను ఎంతో నైపుణ్యంతో బాగుచేసేవారు. అప్పట్లో కలకత్తాకి, మద్రాసుకీ మధ్య ఉన్న ప్రధానమైన రేవుపట్టణం కనుక నిరంతరం ఎగుమతి దిగుమతులు జరుగుతూ ఉండేవి. ధాన్యం, పప్పులు, హోమియోపతీ మందులు, కాటన్ వస్త్రాలు, పీచు మొదలైనవి కేప్‌కోరీ నుంచి ఎగుమతి అవుతుంటే - సైకిళ్ళూ, మోటారు సైకిళ్ళూ, యంత్రసామాగ్రి, ఇనుము, పంచదార, కిరోసిను మొదలైనవి దిగుమతి అయ్యేవి. 1870-80ల్లో ఆ తరువాత కొంతకాలం వరకూ కూడా ఒక వెలుగు వెలిగిన ఈ పోర్టు 1905 నాటికి పూర్తిగా మూతపడిందట. దానికి కారణం ఇసుకమేటలు వెయ్యడం అంటారు. నౌకా నిర్మాణం కూడా నిలచిపోయింది. హిందూ న్యూస్ పేపర్లో చాలా కాలం క్రిందట ఈ విశేషాలని అందించారు.  
The Hindu Photo
© Dantuluri Kishore Varma

Wednesday, 6 August 2014

ఏరువాకా సాగారో

రోజులుమారాయి సినిమాలో `ఏరువాకా సాగారో రన్నో సిన్నన్న` అనే పాటలో నటించే సమయానికి వహీదా రెహమాన్‌కి పదిహేడు సంవత్సరాల వయసట. జిల్లా కలెక్టరుగా పనిచేసే తండ్రి అంతకు నాలుగు సంవత్సరాల ముందే మరణించారు. హోదా, ఆర్థిక పరిస్థితీ తగ్గాయి.  వహీదా తన సోదరితో కలిసి నాట్యం నేర్చుకొని నాట్యప్రదర్శనలు ఇస్తూ ఉండేది.  ఆమె తండ్రికి పరిచయస్తుడయిన సి.వి.రామకృష్ణ ప్రసాద్ రోజులు మారాయి(1955) సినిమాకి నిర్మాత. వేషం ఇచ్చారు. వహీదా సినిమా మొత్తానికి ఈ ఒక్క పాటలోనే కనిపిస్తుంది. `ఏరువాకా సాగారో రన్నో సిన్నన్న` అని కొసరాజు రాస్తే మాష్టర్ వేణు స్వరకల్పన చేశారు. జిక్కీ హుషారుగా పాడారు. వహీదా రెహమాన్ అభినయం అత్యద్భుతం! 

తరువాత కాలంలో ఈమె హిందీ సినిమాల్లో గొప్ప స్టార్‌కావడం అందరికీ తెలిసున్నదే. భారతదేశ మహా సౌందర్యవతులైన నటీమణుల్లోని  వహీదా ఒకరని చాలా మంది అభిప్రాయం. నేనుకూడా ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తాను :).  ఈ పాట నాకు నచ్చడానికి ఉన్న కారణాలలో ఇది మూడవది. ఒకటవ, రెండవ కారణాలు ఏమిటంటారా? మొదటిది జిక్కీ స్వరం. రెండవది లలితలలితమైన తెలుగు మాటల్లో రైతు జీవనచిత్రాన్ని ఆవిష్కరించే  సాహిత్యం. పాటలోని కొన్ని కొన్ని మాటలు ఇప్పుడు వాడుకలో లేవు. కోటేరు అంటే నేలను ఆనే నాగలికొన అయివుండవచ్చు. పన్నుకో మంటే పట్టుకో మనేనా!? సాలుతప్పక కొందవేసుకోవడం, పడమర దిక్కున వరద గుడేయ్యడం, తట్టిని గమనించడం... లాంటి ప్రయోగాలు ఎంత బాగుంటాయో!    

రైతు దమ్ము చేసుకొని, విత్తనాలు జల్లుకొనే కమనీయ దృశ్యాన్ని మూడవ చరణం నాలుగు మాటల్లో బొమ్మ కట్టడం కవి గొప్పతనం.  మా చిన్నప్పుడు ఉగాదికి కందాయఫలాల్లో ఎవరికి సున్నా లేదో చూసుకొని వాళ్ళచేత ఏరువాక చేయించేవారు. నాగలికి యెడ్లను కట్టి ఒక సాలు దున్నించేవారు. దున్నడం ఒక్క సాలయినా(ఒక పొడవు), నాగలి పట్టుకొన్న ఆనందం సాలంతా(సంవత్సరమంతా) ఉండేది.  ఈ పాట వింటున్నప్పుడు అప్పటి జ్ఞాపకాలన్ని వచ్చి కళ్ళముందు నిలుస్తాయి. 

 ఓ.. ఓ.. ఓ.. ఓ..
కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా                 
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

నవధాన్యాలను గంపకెత్తుకుని
చద్ది యన్నము మూటగట్టుకుని
ముల్లుగర్ర నువు చేత బట్టుకుని 
ఇల్లాలును నీ వెంటబెట్టుకుని                    

పడమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానలు కురిసె           
వాగులు వంకలు వురవడి జేసె
ఎండిన బీళ్ళు చిగుళ్ళు వేసె                     

కోటేరును సరిజూసి పన్నుకో
యెలపట దాపట యెడ్ల దోలుకో
సాలు తప్పక కొంద వేసుకో
యిత్తనమ్ము యిసిరిసిరి జల్లుకో                

పొలాలమ్ముకుని పోయేవారు
టౌనులొ మేడలు కట్టేవారు
బ్యాంకులొ డబ్బు దాచేవారు
ఈ తట్టిని గమనించరు వారు                     

పల్లెటూళ్ళలో చల్లనివాళ్ళు
పాలిటిక్సుతో బ్రతికేవాళ్ళు
ప్రజాసేవయని అరచేవాళ్ళు                      
ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు                     

పదవులు స్థిరమని భ్రమిసేవాళ్ళే
ఓట్లు గుంజి నిను మోసేవాళ్ళే
నీవే దిక్కని వత్తురు పదవో                         
రోజులు మారాయ్! రోజులు మారాయ్!
మారాయ్! మారాయ్! రోజులు మారాయ్!  

మీకు కూడా ఈ పాట ఇష్టమేనా?

© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!