మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్‌ను 1919లో స్థాపించారు. నాయకర్ పెద్దగా చదువుకోకపోయినా, తాను కోరంగి నుంచి రంగూన్ వెళ్ళి సంపాదించిన లక్షలాది రూపాయల్లో ఎనిమిది లక్షలని విద్యాసంస్థల స్థాపనకి, నిర్వాహణకీ; గుడులు, గోపురాలు నిర్మించడానికి వెచ్చించాలని ఒక శాసనాన్ని రంగూన్‌లో జిల్లా కోర్టులో రిజిస్టరు చేయించారట. దానితో చొల్లంగిలో ఉన్న దేవాలయాలని, కాకినాడ-యానం రోడ్డులో విద్యాలయాలనీ నిర్మించారు. విద్యార్థులు చాలా దూర ప్రాంతాలనుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకొనేవారట. గత శతాబ్ధానికి పైగా కొన్ని లక్షల మందికి విద్యని అందించిన చారిటీస్ ఫోటోలని మనకాకినాడలో బ్లాగ్ పాఠకులకోసం ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ చదువుకొన్న వాళ్ళకి తప్పని సరిగా ఎన్నో తీపి జ్ఞాపకాలని ఇవి అందిస్తాయని అనుకొంటున్నాను.
పర్యావరణానికి హాని చెయ్యని గణేష నిమజ్జనం కావాలి అందరికీ. ప్లాస్టరాఫ్ పారిస్‌తో తయారు చేసిన ప్రతిమలు, వాటికి వేసిన రంగులు జలకాలుష్యానికి కారణమౌతాయని, కాబట్టి వాటికి బదులుగా మట్టివినాయక ప్రతిమలు వాడాలని ప్రతీఒక్కరికీ అర్థమవ్వవలసిన ఆవశ్యకత ఉంది. మా వంతు ప్రయత్నంగా మట్టి వినాయకుడ్ని తయారు చేసుకొన్నాం.
ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలనుంచీ వర్షం మొదలయ్యింది. మధ్యాహ్నం అయ్యేకొలదీ ఎక్కువయ్యింది. సాయంత్రం అయ్యిందికానీ వర్షం తగ్గడం లేదు. అలాగని జనాలు బయటకు వెళ్ళడం మానడం లేదు. గొడుగులు వేసుకొని మెయిన్ రోడ్డుకి ఇరువైపులా పెట్టిన అంగళ్ళదగ్గర కావలసినవి కొనుక్కొంటూ ఉన్నారు. ఊరంతా సందడిగా ఉంది. రేపటి పూజకి పత్రి కొనుక్కోవాలి, పాలవెల్లులకి కట్టుకోవడానికి రకరకాల పళ్ళు కావాలి, ప్రసాదాలకీ, పిండివంటలకి సరుకులు తెచ్చుకోవాలి...
ప్రసాదం అంటే జ్ఞాపకం వచ్చింది - మట్టి వినాయకుడి చేతిలో లడ్డు మట్టితో చేసిందే పెడతారా? చాలా కాలం క్రితం గణేశ నవరాత్రుల సమయంలో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మల్లిబాబు అనే ఆయన కూతురికి ఇదే సందేహం వచ్చిందట. ఆయన వెంటనే `మనకి మండపేటలో స్వీట్ స్టాల్ ఉందికదా, మనమే స్వామికి మహాలడ్డూ తయారుచేయించి పంపుదాం. అప్పుడు మట్టిలడ్డూకి బదులుగా నిజందే పెడతారు,` అని అన్నాడట. ఇంకేముంది అప్పటి నుంచీ క్రమం తప్పకుండా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఖైరతాబాదుకి మహాలడ్డూలు వెళుతున్నాయి. వీటి తయారీ ప్రత్యేకంగా గణేష మాలధారణ చేసిన వ్యక్తుల చేతులమీదుగా భక్తి ప్రవత్తులతో జరుగుతుంది. ప్రతీ ఏడాదీ ముందరి సంవత్సరం కంటే పెద్ద లడ్డూ పంపిస్తున్నారు. ఈసారి మహాలడ్డు బరువు ఎంతో తెలుసా? 5000 కిలోలు! జై బోలో గణేష్ మహారాజ్‌కీ.... అందరూ ఆనందంగా వినాయకచవితి జరుపుకోండి!
కాకినాడ నుంచి యానం వెళ్ళేదారిలో మునసబుగారి జంక్షన్ దాటిన తరువాత నూకలమ్మ గుడి ఆ తరువాత జమ్మిచెట్టు సెంటరు ఉంటాయి. కనకదుర్గ గుడిని జమ్మిచెట్టు దగ్గరే కట్టారు. ప్రతీ శుక్రవారం ఈ అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొనేవాళ్ళు వందలకొద్దీ ఉంటారు. ఇక దసరా వచ్చిందంటే సందడే సందడి. పందిళ్ళు వేసి, లైటింగు ఏర్పాటు చేసి, మైకులో పాటలతో అదరగొడతారు. నవరాత్రుల్లో ప్రతీసాయంత్రం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. గుడి వెనుక ముసిపల్ పార్కు, వాటర్‌ట్యాంకు వున్నాయి. వంద సంవత్సరాలకు పూర్వం ప్రారంభించిన మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్‌కి వెళ్ళాలన్నా, ఆంధ్రా పాలిటెక్నిక్‌కి వెళ్ళాలన్నా జమ్మిచెట్టు సెంటరు మీదుగానే వెళ్ళాలి. తెలుగు సినిమాల్లో అగ్రశ్రేణి హాస్యనటుల్లో ఒకరైన రేలంగి స్వస్థలం కాకినాడ అనే సంగతి తెలిసిందే కదా? ఆయన ఇల్లు ఈ సమీపంలోనే ఉండేదట. జగన్నాథపురంలో నివశించిన చాలామందికి జమ్మిచెట్టు సెంటరూ, కనకదుర్గ గుడితో చాలా పరిచయం, జ్ఞాపకాలు ఉంటాయి. వారందరికోసం ఈ ఫోటో.
పద్దెనిమిదవ శతాబ్దంలో దేశంలో ప్రధానమైన రేవు పట్టణాలలో కేప్‌కోరి ఒకటి. 1759లో బ్రిటిష్‌వాళ్ళు దీనిని నిర్మించారట. ఒక లైట్ హౌస్ కూడా కట్టారు. గత కాలపు వైభవానికి శిధిలావస్థలో ఉన్న అప్పటి లైట్‌హౌస్ ఒక గుర్తు. ప్రస్తుతం దేశంలో ఉన్న అతి పురాతనమైన లైట్‌హౌసుల్లో ఇది ఒకటి. అసలు కేప్‌కోరీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారా? కాకినాడకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరంగే అప్పటి కేప్‌కోరీ. ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమ ప్రపంచ ప్రఖ్యాతి చెందిందట. 1500 టన్నుల సామర్ధ్యం గల నౌకలను కూడా ఇక్కడ తయారు చేసేవారు. విదేశాలనుంచి వచ్చిన నౌకలను ఎంతో నైపుణ్యంతో బాగుచేసేవారు. అప్పట్లో కలకత్తాకి, మద్రాసుకీ మధ్య ఉన్న ప్రధానమైన రేవుపట్టణం కనుక నిరంతరం ఎగుమతి దిగుమతులు జరుగుతూ ఉండేవి. ధాన్యం, పప్పులు, హోమియోపతీ మందులు, కాటన్ వస్త్రాలు, పీచు మొదలైనవి కేప్‌కోరీ నుంచి ఎగుమతి అవుతుంటే - సైకిళ్ళూ, మోటారు సైకిళ్ళూ, యంత్రసామాగ్రి, ఇనుము, పంచదార, కిరోసిను మొదలైనవి దిగుమతి అయ్యేవి. 1870-80ల్లో ఆ తరువాత కొంతకాలం వరకూ కూడా ఒక వెలుగు వెలిగిన ఈ పోర్టు 1905 నాటికి పూర్తిగా మూతపడిందట. దానికి కారణం ఇసుకమేటలు వెయ్యడం అంటారు. నౌకా నిర్మాణం కూడా నిలచిపోయింది. హిందూ న్యూస్ పేపర్లో చాలా కాలం క్రిందట ఈ విశేషాలని అందించారు.
రోజులుమారాయి సినిమాలో `ఏరువాకా సాగారో రన్నో సిన్నన్న` అనే పాటలో నటించే సమయానికి వహీదా రెహమాన్‌కి పదిహేడు సంవత్సరాల వయసట. జిల్లా కలెక్టరుగా పనిచేసే తండ్రి అంతకు నాలుగు సంవత్సరాల ముందే మరణించారు. హోదా, ఆర్థిక పరిస్థితీ తగ్గాయి. వహీదా తన సోదరితో కలిసి నాట్యం నేర్చుకొని నాట్యప్రదర్శనలు ఇస్తూ ఉండేది. ఆమె తండ్రికి పరిచయస్తుడయిన సి.వి.రామకృష్ణ ప్రసాద్ రోజులు మారాయి(1955) సినిమాకి నిర్మాత. వేషం ఇచ్చారు. వహీదా సినిమా మొత్తానికి ఈ ఒక్క పాటలోనే కనిపిస్తుంది. `ఏరువాకా సాగారో రన్నో సిన్నన్న` అని కొసరాజు రాస్తే మాష్టర్ వేణు స్వరకల్పన చేశారు. జిక్కీ హుషారుగా పాడారు. వహీదా రెహమాన్ అభినయం అత్యద్భుతం!
తరువాత కాలంలో ఈమె హిందీ సినిమాల్లో గొప్ప స్టార్‌కావడం అందరికీ తెలిసున్నదే. భారతదేశ మహా సౌందర్యవతులైన నటీమణుల్లోని వహీదా ఒకరని చాలా మంది అభిప్రాయం. నేనుకూడా ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తాను :). ఈ పాట నాకు నచ్చడానికి ఉన్న కారణాలలో ఇది మూడవది. ఒకటవ, రెండవ కారణాలు ఏమిటంటారా? మొదటిది జిక్కీ స్వరం. రెండవది లలితలలితమైన తెలుగు మాటల్లో రైతు జీవనచిత్రాన్ని ఆవిష్కరించే సాహిత్యం. పాటలోని కొన్ని కొన్ని మాటలు ఇప్పుడు వాడుకలో లేవు. కోటేరు అంటే నేలను ఆనే నాగలికొన అయివుండవచ్చు. పన్నుకో మంటే పట్టుకో మనేనా!? సాలుతప్పక కొందవేసుకోవడం, పడమర దిక్కున వరద గుడేయ్యడం, తట్టిని గమనించడం... లాంటి ప్రయోగాలు ఎంత బాగుంటాయో!
రైతు దమ్ము చేసుకొని, విత్తనాలు జల్లుకొనే కమనీయ దృశ్యాన్ని మూడవ చరణం నాలుగు మాటల్లో బొమ్మ కట్టడం కవి గొప్పతనం. మా చిన్నప్పుడు ఉగాదికి కందాయఫలాల్లో ఎవరికి సున్నా లేదో చూసుకొని వాళ్ళచేత ఏరువాక చేయించేవారు. నాగలికి యెడ్లను కట్టి ఒక సాలు దున్నించేవారు. దున్నడం ఒక్క సాలయినా(ఒక పొడవు), నాగలి పట్టుకొన్న ఆనందం సాలంతా(సంవత్సరమంతా) ఉండేది. ఈ పాట వింటున్నప్పుడు అప్పటి జ్ఞాపకాలన్ని వచ్చి కళ్ళముందు నిలుస్తాయి.