Pages

Tuesday, 17 February 2015

చూడకుండా ఉండగలమా?

కాకినాడ నుంచి పిఠాపురం మీదుగా ఉప్పాడ వెళ్ళి అక్కడి నుంచి బీచ్ రోడ్ ద్వారా తిరిగి కాకినాడ రావడం - పనిమీద చిన్న ట్రిప్.

పిఠాపురం మొక్కజొన్న పొత్తులకి ప్రసిద్ది. ఇక్కడి పొత్తులు చాలా రుచిగా ఉంటాయి. రైల్వే ట్రాక్ మీద వోవర్‌బ్రిడ్జ్ కట్టక ముందు రైల్‌గేట్ పడినప్పుడు అటూ ఇటూ ఆగిపోయిన వందల కొద్దీ వాహనాల దగ్గరకి కాల్చిన పొత్తులు తీసుకొని వచ్చి అమ్మేవారు. వోవర్‌బ్రిడ్జ్ నిర్మించి పిఠాపురం మహారాజా వారధి అని పేరు పెట్టారు. `ఇక పొత్తుల వ్యాపారానికి తెరపడినట్టే,` అనుకొన్నారు అందరూ. కానీ, పరిస్థితి అలా ఏమీ లేదు. ఇప్పుడు కూడా మొక్కజొన్న పొత్తుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వెళ్ళేవాళ్ళు ప్రత్యేకంగా ఆగి - కాల్చిన, ఉడకబెట్టిన పొత్తులు కొనుక్కొని వెళుతున్నారు. 
 
ఎండ వేడి పెరుగుతుంది. ఏడారిలో ఒయాసిస్సుల్లా పుచ్చకాయ పందిళ్ళు ఇదిగో ఇలా ఉంటాయి. ఎండతోపాటూ వీటి దగ్గర రద్దీ కూడా క్రమంగా పెరుగుతుంటుంది. 
పచ్చని వరిచేలు, గట్టుమీద నీడనిచ్చే మావిడి చెట్లు, వింజామరలు విసురుతున్న కొబ్బరి చెట్లు, వాటిమీదనుంచి వచ్చే చల్లని గాలి.. ప్రయాణం ఆపుచేసి కొంచెం సేపు అక్కడే ఉండిపొమ్మని వొత్తిడి చేస్తాయి.  
కొత్తగా శివాలయం నిర్మిస్తున్నట్టున్నారు. పనివాళ్ళు ఉన్నారు. రంగులవీ వెయ్యకపోయినా ఎంతబాగుందో చూడండి.
బీచ్‌రోడ్ మరామత్తులు జరుగుతున్నాయి. కెరటాలు రోడ్డును కోసెయ్యకుండా రాళ్ళు పేరుస్తున్నారు. రోడ్డు విస్తరణ కూడా చేస్తున్నారు. ఉప్పాడ వంతెనకు సమాంతరంగా కొంచెం ఎడంగా మరొక వంతెనను నిర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే తుఫానుల సమయంలో కూడా ప్రమాదం లేకుండా ఈ మార్గంలో ప్రయాణించవచ్చు.

ఎండకి బీచ్ కూడా నిర్మానుష్యంగా ఉంది. కెరటాలు నెమ్మదిగా వొడ్డును తాకుతున్నాయి. 
 ఓ వంటరి పడవ వాటికి అందకుండా దూరంగా నిలిచి ఉంది.
హరితా బీచ్‌రిసార్ట్స్ స్వాగతద్వారం బై, బై చెపుతుంది. ఈ ఫోటో తీసే సరికి మద్యాహ్నం మూడయిపోయింది. ఆకలి నకనక లాడుతుంది. కొంచెం వేగంగా వెళ్ళాలి.   
దారిలో అందమైన దృశ్యాలు కనిపిస్తే కెమేరా కంటితో చూడకుండా ఉండగలమా? వాటిని ఇలా పంచుకోకుండా ఉండగలమా??

© Dantuluri Kishore Varma

Monday, 16 February 2015

వర్షించే కళ్ళు

మహాశివరాత్రి సందర్భంగా భారతదేశంనుంచి ఇరవైఒక్క మంది హిందూ భక్తులు పాకిస్థాన్‌లోని కటాస్‌రాజ్ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళారని నిన్నటి వార్త. పాకిస్తాన్‌లో మైనార్టీ వర్గాల దేవాలయాలని పరిరక్షించే ఎవాక్యుఈ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్(ఈటీపీబీ) అధికారులు ఈ హిందూ భక్తులకి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేశారని పేపర్లలో రాశారు. ఈ వార్త చూసిన తరువాత కటాస్‌రాజ్  దేవాలయం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. గూగుల్‌లో వెతికితే చాలా సమాచారం లభ్యమయ్యింది. ఆ విశేషాలు మీకు కూడా నచ్చవచ్చని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.  
Photo from the net
లాహోర్‌ నుంచి 270 కిలోమీటర్ల దూరంలో, పంజాబ్‌లో చక్వాల్ జిల్లాలో సుమారు 900 సంవత్సరాల పురాతనమైన కటాస్‌రాజ్  దేవాలయం ఉంది. కటాస్‌ అనే కోనేరుకి చుట్టూ ప్రధానంగా ఏడు దేవాలయాలు ఉంటాయి. ఇవికాక ఇంకా కొన్ని చిన్న చిన్న మందిరాలు కూడా ఉంటాయి. శివాలయం, రామాలయం, హనుమంతుని మందిరాలు ఉన్నాయి. కటాస్‌ కోనేరులో జలం చాలా మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. ఈ కోనేరులో తప్పక స్నానాలు చేస్తారు. స్థల పురాణం ప్రకారం సతీదేవి మరణం తరువాత శివుడు ఎంతో ధు:ఖించాడట. అతని కన్నీరే ఈ కోనేటిలో నీరుగా మారిందని అంటారు. సంస్కృతంలో కేటాక్ష అంటే వర్షించే కళ్ళు అని అర్థమట. పాండవుల వనవాస సమయంలో నాలుగు సంవత్సరాలు ఇక్కడే గడిపారట. ఈ కోనేటి దగ్గరే యక్ష ప్రశ్నలకి సమాధానాలు చెప్పి ధర్మరాజు తన సోదరులని రక్షించుకొన్నాడని చెపుతారు.

కటాస్‌రాజ్ దేవాలయాల సముదాయాన్ని ప్రపంచ వారసత్వ సంపద(వాల్డ్ హెరిటేజ్ సైట్) గా గుర్తించాలని యునెస్కో్‌కి పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాధనలు పంపిందట. కటాస్‌రాజ్ దేవాలయం పేరుమీద పాకిస్థానీయులు నిర్వహిస్తున్న రెండు ఫేస్‌బుక్ పేజీలు కూడా చూశాను. వాటిలో చాలా చక్కని ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు.

కటాస్‌రాజ్ విశేషాలు ఈ డాక్యుమెంటరీలో చూడండి.    

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

© Dantuluri Kishore Varma

Wednesday, 11 February 2015

ఆయుర్‌వేదం డాక్టర్‌గారి కాంపౌండర్

`తలంతా పట్టేసింది. వొళ్ళు నొప్పులూ, జొరం. ఇక్కడ నిలబడలేకపోతుంటే లోనకి ఎల్లినోళ్ళు ఓ పట్టాన రారూ, ఖర్మ!` అన్నాడు బోసు జనాంతికంగా. అంగుళం పొడవుండేటట్టు సమానంగా కత్తిరించిన వొట్టిగడ్డిని కపాలం మీద అంటించినట్టు ఉంది వాడి తెల్లజుట్టు.  దానిని విసుగ్గా చేతితో నిమురుకొన్నాడు.

`మందు మింగావా?` ఆయుర్వేదం డాక్టరు రంగారావుగారి గదిలోకి వెళ్ళడానికి తనవంతుకోసం ఎదురుచూస్తున్న ఓ పేషంట్ అడిగాడు బోసుని.  

`ఆ....` 

`మీ డాక్టర్ గారిదేనా?`

`ఇంగ్లీసు మందు,` అన్నాడు తన చెయ్యిని ఆర్.ఎం.పీ డాక్టరు గారి క్లీనిక్ ఉన్న దిక్కుకి చూపిస్తూ. అలా అంటూ అతిశయంతో కనుబొమ్మలు ఎగరేశాడు.

కన్సల్టింగ్ రూంలా వాడుతున్న వసారాకి జేర్చిఉన్న కటకటాల చావిట్లో ఆరు పాత ప్లాస్టిక్ కుర్చీలున్నాయి. వాటిలో కూర్చొన్న పేషంట్లూ, కటకటాల బయట చప్టాల మీద చతికిల బడ్డ సుమారు పది పదిహేను మందీ, ఇంకొంచం దూరంలో ప్రహారీగోడకి చేతులూ, కాళ్ళూ దాపెట్టి నిల్చొన్న ఇంకొక పది మందీ వాడి మాటలు విన్నారు.  విని అదేదో జోకయినట్టు  ముసిముసిగా నవ్వుకొన్నారు. ఒకళ్ళిద్దరయితే గట్టిగానే నవ్వేశారు. ఏలూరునుంచి వచ్చిన నాయుడికి గుండె గతుక్కుమంది. నడుం నొప్పి వస్తుందని ఇంగ్లీషు డాక్టర్ దగ్గరకి వెళితే నెలరోజులపాటు అవీ, ఇవీ అడ్డమైన మందులూ వాడించాడు. ఫలితం కనిపించలేదు. పదిరకాల టెస్టులు, ఎం.ఆర్.ఐ. స్కాన్‌లు అని చాంతాడంత లిస్టు ఇచ్చి వాటికే పదివేలు వదిలించాడు. చివరికి `రెండు పూసలు అరిగాయి, డిస్కు పక్కకి తప్పుకొంది, ఆపరేషన్ పడొచ్చు, చేయించుకొన్నా నయం అవుతుందన్న గ్యారంటీ లేదు,` అని చావు కబురు లాగ చల్లగా చెప్పాడు. ఇంగ్లీష్ డాక్టర్లు చేతులెత్తేసిన ఇలాంటి రోగాలకి రంగారావుగారు మందు ఇస్తే తిరుగుండదని ఎవరో చెపితే తూగోజిల్లా వరకూ ఓ.. ఎగేసుకొంటూ వచ్చేశాడు. ఇక్కడ చూస్తే డాక్టరుగారి ముసలి అసిస్టెంటుకే ఆయన మీద గురి ఉన్నట్టు కనిపించడం లేదు!  తాను కూడా నవ్వుతున్నట్టు ముఖంపెట్టి `ఏమయ్యా మీ డాక్టరు గారి మందు జ్వరానికి కూడా పనిచెయ్యదా?` అని పక్కనున్న ఆయన్ని  అడిగాడు నాయుడు.

 `బోసుగాడియ్యి అన్నీ ఎకసెక్కాలండీ బాబూ,` అన్నాడు ఆ ఆసామి

ఇంతలో లోపలికి వెళ్ళినవాళ్ళు మందుపొట్లాలతో బయటకి వచ్చారు. టిప్పుకోసం బోసు చెయ్యిచాచాడు. ఓ పదిరూపాయలు తీసి వాడి చేతిలో పెట్టారు వాళ్ళు. `ఇరవై!` అన్నాడు. `డాక్టరు గారి చీటీకి పది రూపాయలయితే నీకు ఇరవయ్యా?` అని విసుక్కొంటూ ఇంకో పది కుక్కారు.

అట్టముక్కల వెనుక పెన్నుతో ఒకటి, రెండు మూడు... అని అంకెలువేసి ఉన్న చీటీలని వైద్యంకోసం వచ్చిన రోగులకి ప్రతీరోజు ఉదయం పదిగంటల వరకూ ఇస్తాడు బోసు. అవి ఆయుర్వేదం డాక్టరు రంగారావుగారిని కలవడానికి అపాయింట్‌మెంట్లు లాంటివి. రోగులో, వాళ్ళ వెంటవచ్చే సహాయకులో వాటిని స్వయంగా తీసుకోవలసిందే. ఫోన్‌లో అపాయింట్‌మెంట్లు ఇవ్వరు. డాక్టరుగారి కన్సల్టేషన్ ఫీజు పదిరూపాయలు చీటీ తీసుకొంటున్నప్పుడే కట్టాలి.

`డబ్బు బాగా మరిగేశాడు తిక్క సచ్చినోడు. పెదరాజుగారి గరువుమీద కొత్తిల్లు కట్టాడు సాలదు గావాల్న,` అని అమ్మాజీ తిట్టుకొంటుంది. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తుంది ఇక్కడ. సీటీ ఇవ్వటం లేదు బోసు. `పది దాటితే ఇవ్వనని తెలుసు కదా? మళ్ళీ అడుగుతావే కొత్తోళ్ళలాగా. పోయి, రేపు రా!` అని చిరాకు పడిపోతున్నాడు. ఇరవైరూపాయలు వాడి చేతిలో పెడితే పనిజరుగుతుంది. కానీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది? అరగంట క్రితం కారులో  ఏలూరు నుంచి వచ్చిన నాయుడు దగ్గర అందరూ చూస్తుండగానే వంద రూపాయలు తీసుకొని కూర్చోబెట్టాడు. 

రంగారావు గారి తాతగారు కన్సల్టేషన్ ఫీజుగా నాలుగు అణాలు తీసుకొనేవారట. తరువాత రంగారావు గారి తండ్రిగారి కాలానికి అది ఒక రూపాయి అయ్యింది. ఇప్పుడు పది రూపాయలు. అసలు వంశపారంపర్యంగా  వైద్యం చేస్తున్న ఈ కుటుంబానికి ఫీజు తీసుకోవలసిన అవసరం లేదు. వాళ్ళకున్న వందల ఎకరాలని సరిగా పండించుకొంటే చాలు. మరి ఎందుకు చేస్తున్నారూ అంటే ఇదొక సేవ అంతే.  ఆపరేషన్ చేసినా నమ్మకంగా తగ్గుతుందని చెప్పలేం అని ఇంగ్లీషు డాక్టర్లు నిర్ధారించేసిన జబ్బులకి కూడా పొడాలతో, లేహ్యాలతో, చూర్నాలతో నయం చేసేసిన చరిత్ర ఉంది వీళ్ళకి. `దీన్ని అరటిపండులో పెట్టి మింగెయ్యి; ఈ పొడాన్ని తేనెలో కలిపి నాకు; ఇది బంగారంతో చేసినమందు. క్రమంతప్పకుండా వాడితే ఫలితం ఉంటుంది. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. నువ్వు అంతా పెట్టుకోలేకపోతే సగం కట్టు మిగిలినది నేనే భరిస్తాను,` అని రోగులకి రకరకాల మందులు ఇస్తారు. డాక్టరుగారు చెప్పింది చెప్పినట్టూ వాడితే ఖచ్చితంగా గుణం కనిపిస్తుంది. కానీ ఆయుర్వేదం ఆసుపత్రి అని ఒక బోర్డు కూడా ఎక్కడా ఉండదు. ఎక్కడెక్కడినుంచో పిఠాపురం వరకూ వచ్చేసి, అక్కడి నుంచి  ఈ ఊరికి వచ్చిన తరువాత `పలానా రంగారావు గారి ఇంటికి దారేది?` అని అడిగితే మాటలు అప్పుడప్పుడే వస్తున్న కుర్రోడి దగ్గరనుంచి, పండు ముసిలోడి వరకూ `అల్లదిగో, అదే!` అని చూపించేస్తారు.  

ఒక్కొక్కళ్ళూ లోపలికి వెళుతున్నారు, వస్తున్నారు. సమయం గడుస్తుంది కానీ, నాయుడు వంతు మాత్రం రావడం లేదు. రెండుమూడు సార్లు బోసుదగ్గరకి వెళ్ళి లోపలికి పంపించమని అడిగాడు. అభయ బాబా దీవించినట్టు చెయ్యి చూపించి `నేనున్నాను కదా, నీకెందుకు,` అన్నట్టు చిద్విలాసంగా నవ్వుతున్నాడు కానీ పనిజరగడం లేదు. కూర్చొని, కూర్చొని విసుగు పుడుతుంది..  వందరూపాయలు తీసుకొని ఇలా నిరీక్షింప చేస్తున్నందుకు ఉక్రోషం వచ్చేస్తుంది.  ఇంకొక అరగంట గడిచింది. నాయుడు ఒక్క ఉదుటున కుర్చీలోనుంచి లేచాడు. రెండంగల్లో బోసు దగ్గరకి వెళ్ళి, `పంపించవా నన్ను?` అని విసురుగా అడిగాడు. 

`తాపీగా పదకొండు గంటలకి వచ్చి గదమాయిస్తున్నావు. అందరూ అయ్యాకా పంపిస్తాను. నచ్చితే ఉండు. లేకపోతే వెళ్ళు,` బోసు కూడా గొంతుపెంచి నాయుడు మీద `కయ్యి` మన్నాడు. 

నాయుడికి పెద్ద అవమానం జరిగినట్టు అయిపోయింది. చుట్టూ ఉన్న అందరికేసీ చూశాడు. వాళ్ళందరూ తమాషా చూస్తున్నారు. `మరి వందరూపాయలు ఎందుకు తీసుకొన్నావు?` అని అడగాలని ఉంది. కానీ ఆ విషయాన్ని గట్టిగా అడిగితే `లంచం ఇచ్చి లైన్ జంప్ చేద్దామనుకొన్నావా?` అని ఎవరైనా గొడవపెడతారని భయపడ్డాడు. అవమానాన్ని దిగమింగి నిశ్సబ్ధంగా వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు.   

`వొరేయ్! పేషంట్లని భయపెట్టకూడదురా. వారిని పంపించు,` అని రంగారావుగారు లోపలినుంచి బోసుని కేకలేశారు. 

ఎట్టకేలకు నాయుడి వంతు వచ్చింది. రంగారావు గారితో మాట్లాడాకా తనరోగం తగ్గచ్చు అనే నమ్మకం కుదిరింది. మందు తీసుకొన్న తరువాత ఆయనతో మెల్లగా అన్నాడు, `మీకున్న మంచి పేరు బోసు వల్ల చెడిపోతుంది. . ` అని. 

`రోగలక్షణాలను పరిశీలించి మందు ఏమిటో నిర్ణయించేది నేనే అయినా దానిని తయారు చేసేది వాడే. ఆకులు, బెరడులు, మూలికలు సరిగ్గా గుర్తించి బోసే తీసుకొని వస్తాడు`.

`కానీ మీ సేవని వాడు వ్యాపారంగా మార్చుకొంటున్నాడు.`

`కార్పొరేట్ వైద్యానికి వేలల్లో ఖర్చుపెట్టే వాళ్ళకు ఓ వంద రూపాయలు లంచం ఇవ్వడం సునాయాసమైన విషయం. పని తొందరగా ముగించుకోవడానికి  వాడికి టిప్పులు అలవాటు చేశారు. వాడిప్పుడు ఇవ్వలేని వాళ్ళని కూడా పీడించి మరీ తీసుకొంటున్నాడు.  తీసుకోవడం తన హక్కుగా భావిస్తున్నాడు. సేవని వ్యాపారంగా మార్చింది వాడు కాదు. ఇక్కడికి వచ్చే కొంతమంది పేషంట్లు మాత్రమే.`

రంగారావు గారి మాట సూటిగా నాయుడి మనసుని తాకింది. న్యూనత భావం కలిగింది. దానిని ముఖం మీద కనిపించకుండా ఉండేలా కష్టపడి ప్రయత్నించాడు. `అటువంటి పేషంట్లలో నేను లేను సుమా,` అనే భావం వచ్చేటట్టు  ఒక శుష్క మందహాసం చేసి, `మందు వాడిన తరువాత పదిహేను రోజులకి మళ్ళీ వస్తానండి,` అని చెప్పి, డాక్టరు గారికి నమస్కారం చేసి బయటకు నడిచాడు.        

© Dantuluri Kishore Varma

Tuesday, 3 February 2015

శ్రీ మద్రమారమణ గోవిందో హరి..

రోజులకొద్దీ సాగేది హరికథా కాలక్షేపం. ఊరంతా తరలివచ్చి, హరిదాసుగారు చెప్పే పురాణగాథని విని, రాగుయుక్తంగా పద్యం పాడుతుంటే `అహా!` అనుకొని, మధ్యమధ్యలో పిట్టకథలు చెపుతుంటే వాటిలో హాస్యానికి నవ్వుకొని,  ప్రేక్షకులు చదువుకొన్న వాళ్ళైతే దాసుగారి ప్రజ్ఞకి అబ్బురపడి, చదువుకోని సామాన్యులైతే `దాసుగారికి సానా తెలుసు` అనేసుకొని, ఆయన చిన్నగా చేసే నృత్యాభినయానికి, శ్రావ్యంగా పాడే స్వర మాధుర్యానికి `శభాష్!` లు ఇచ్చుకొని. అర్థరాత్రి దాటాకా నిద్రమత్తులో తూగుతూ ఇంటిముఖం పట్టేది ఊరు ఊరంతా. పట్టుపంచ కట్టుకొని, కండువా నడుముకు బిగించి, కాళ్ళకి గజ్జెలు ఘల్లు మంటుంటే, ఒకచేతిలో చిడతలు, మెడలో పూలహారం, నుదుటిన  దిద్దిన తిరునామంతో `శ్రీ మద్రమారమణ గోవిందో హరి..` అని కథా ప్రారంభం చేసి, అలవోకగా పద్యాలు పాడి అలరించే హరిదాసు గారు ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశారు. 

హరికథలు మళ్ళీ, మళ్ళీ వినాలనిపించినా అవకాశంలేని కాలంలోకి వచ్చేశాం. కానీ, అదృష్టంకొద్దీ వాగ్ధానం సినిమాలో ఈ సీతాకళ్యాణం హరికథ వీడియో యూట్యూబ్‌లో లభ్యమౌతుంది. చూసి ఆనందించండి. ఈ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించింది ఆత్రేయ గారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. అత్యంత రమణీయంగా పాడింది శ్రీ ఘంటసాలగారు. ఈ హరికథను శ్రీశ్రీ రాసారట. కాకపోతే 

"ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము...
ఒక నిమేషమ్ము నందే
నయము జయమును భయము విస్మయము గదురా" 

అనే భాగాన్ని కరుణశ్రీ గారు రాసిన ఒక కవితా ఖండికనుంచి తీసుకొన్నారట. అలాగే..

"భూతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
పృధుగుణమణి సంఘాతన్ భాగ్యోసేతన్ సీతన్" 

అనే చిన్న ముక్క పోతన భాగవతం లోనిదట.  

శ్రీ నగజా తనయం సహృదయం || శ్రీ ||
చింతయామి సదయం త్రిజగన్మహోదయం || శ్రీ ||
శ్రీరామ భక్తులారా ! ఇది సీతా కళ్యాణ సత్కథ 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను అంచేత, కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది.
నాయనా... కాస్త పాలు మిరియాలు ఏవైనా...
చిత్తం ! సిద్ధం
భక్తులారా ! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరిని ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి. ఆహ్హా ! అతడెవరయ్యా అంటే
రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడు
వాడు నెలఱేడు సరిజోడు మొనగాడు
వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాలు జాలురా || వాని కనులు ||
వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్ కొనెడు మరోమరుడు మనోహరుడు
రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
సనిదని, సగరిగరిగరిరి, సగరిరిగరి, సగగరిసనిదని,
సగగగరిసనిదని, రిసనిద, రిసనిద, నిదపమగరి రఘురాముడు
ఔను ఔను
సనిసా సనిస సగరిరిగరి సరిసనిసా పదనిసా
సనిగరి సనిస, సనిరిసనిదని, నిదసనిదపమ గా-మా-దా
నినినినినినిని
పస పస పస పస
సపా సపా సపా తద్ధిమ్ తరికిటతక
శభాష్, శభాష్
ఆ ప్రకారంబున విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో
ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే
మనసింతలోనె దోచినాడే ఎంత సొగసుగాడే
మోము కలువఱేడే... ఏ... మోము కలువఱేడే
నా నాము ఫలము వీడే ! శ్యామలాభిరాముని చూడగ
నామది వివశమాయె నేడే
ఎంత సొగసు గాడే
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై యుండగా అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను జూచి
అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగుపుత్రి సీత !
వినయాధిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడు ఊ... ఊ ఊ
అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరు ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా "హా ! ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము దీనిని స్పృశించుటయే మహాపాపము" అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట. తదనంతరంబున...
ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజగమనము తోడ స్వయంవర వేదిన చెంత
మదన విరోధి శరాసనమును తన కరమున బూనినయంత
ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము...
ఒక నిమేషమ్ము నందే
నయము జయమును భయము విస్మయము గదురా
ఆ... శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
భక్తులందరు చాలా నిద్రావస్థలో ఉన్నట్లుగా వుంది
మరొక్కసారి
జై! శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు అంతట
భూతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
పృధుగుణమణి సంఘాతన్ భాగ్యోసేతన్ సీతన్ || భూతల ||
శ్రీ మద్రమారమణ గోవిందో హరి
 Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!