Pages

Thursday 22 October 2015

ఈ రోజు వినాయకుడు బిజీ!

విజయదశమి మంచి కార్యక్రమాలను ప్రారంభించడానికి అనువైన రోజు. ఓ వైపు అమరావతిలో నూతనరాజధాని నిర్మాణానికి శంకుస్థాపనా కార్యక్రమం ఘనంగా జరుగుతుంటే మరోవైపు ఊరూరా, వాడవాడలా కొత్త వ్యాపార సంస్థల ప్రారంభాలు ఆర్భాటంగా చేస్తున్నారు. పాతషాపుల వాళ్ళు కొత్త స్కీములతో దసరా - దీపావళి సంబరాలు మొదలు పెట్టేసి హల్‌చల్ చేస్తున్నారు. జనాలు టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్లు, కార్లు, బైకులు కొనుక్కోవడానికి షోరూంల బయట అమ్మవారి దేవాలయం దగ్గర దర్శనం కోసం క్యూలైన్‌లో నుంచొన్నంత భక్తిగా తమవంతు కోసం పడిగాపులు పడుతున్నారు.  అమ్మవార్ల దేవాలయాలన్నీ భక్తులతో కిటికిటలాడుతుంటే మిగిలిన దేవుళ్ళ, దేవతల ఆలయాలన్నీ సామాన్యమైన సందడితో ఉన్నాయి. కానీ.... ఈ చిన్న గుడి - విఘ్నేశ్వరుడిది - కాకినాడ మెయిన్‌రోడ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎదురుగా ఉన్నది అమ్మవారి గుడి అంత, ఈ రోజే ఓపెన్ చేసిన కొత్త షోరూమంత సందడిగా ఉంది. గుడికి ఎదురుగా అప్పుడే షోరూంనుంచి బయటకు తెచ్చిన ఓ డజను బైకులు వరుసగా నిలబెట్టి ఉన్నాయి. చుట్టూ గిఫ్ట్ రిబ్బన్లు చుట్టిన ఒకట్రెండు కొత్తకార్లు కూడా ఏ సైకిలు వాడు వచ్చి గీత పెట్టేస్తాడో అన్న ఆందోళనతో ట్రాఫిక్ మధ్యలోనుంచి ఈ గుడివైపే మందగమనంతో కదులుతున్నాయి. మెయిన్‌రోడ్‌లో విఘ్ననాయకుడి బ్లెస్సింగ్స్ అవసరం మరి దేనికైనా!   
© Dantuluri Kishore Varma

3 comments:

  1. < "షోరూంల బయట .............. పడిగాపులు పడుతున్నారు"

    ఏవిటో, అంతా మాయ !

    ----------------------------------------
    (అవును వర్మ గారూ, మీ బ్లాగులో right click ని disable చేసినట్లున్నారు మీరు. మీ పోస్టులో వ్యాఖ్య వ్రాసేటప్పుడు పోస్టులోని ఏదన్నా వాక్యాన్ని కోట్ చెయ్యడం కోసం కాపీ చేద్దామనుకుంటే ఒప్పుకోవడంలేదు. దాంతో ఆ వాక్యాన్ని తిరిగి టైప్ చేయాల్సివస్తోంది. కించిత్తు ఇబ్బందిగా ఉంది.)

    ReplyDelete
    Replies
    1. నరశింహారావుగారూ మీరు అన్న ఇబ్బంది నిజమే. కొన్ని కాపీక్యాట్‌ల నుంచి డాటాను రక్షించుకోవడానికి అలా చెయ్యవలసి వచ్చింది.ఆలశ్యంగా జవాబు ఇస్తున్నందుకు మన్నించాలి.

      Delete
    2. మీరన్న సమస్యా వాస్తవమేలెండి. మీ జాగ్రత్తలో మీరుండాల్సిందే కదా.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!