Pages

Thursday, 16 November 2017

భీమేశ్వరాలయం స్టాంప్

ద్రాక్షారామం -

1. పంచారామాలలో ఒకటి
2. త్రిలింగాలలో ఒకటి (శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం)
3. నూట ఎనిమిది అతిగొప్ప శైవక్షేత్రాలలో ఒకటి
4. దక్షిణకాశీ
5. అంతే కాకుండా ఆదిశంకరాచార్యులవారిచే ప్రతిష్టించబడిన మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో(18) ఒకటి అని చెపుతారు. 

ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కనుకే ఈ క్షేత్రాన్ని గొప్పగా ప్రస్తుతించడం జరిగింది.

ఈ సంవత్సరం నవంబర్ ఒకటవ తారీఖున భారత తపాలా శాఖ ద్రాక్షారామంలో ఆలయంయొక్క కమెమొరేటివ్ స్టాంప్‌ని విడుదల చేసింది. అందుగురించే ఈ టపా. 
ఆలయ విశేషాల గురించి ఇదివరలో వేసిన మరో రెండు టపాలను ఇక్కడ చదవవచ్చు.   

© Dantuluri Kishore Varma

Friday, 20 October 2017

కార్తీకం

మహావిష్ణువుకి, పరమశివునికి ఇష్టమైన మాసం
అన్ని మాసాలలోనూ ఉత్తమమైనదిగా చెప్పబడే కార్తీకం... 
వచ్చేసింది. 
తెల్లవారుజామున కృత్తికా నక్షత్రం వెళ్ళకముందే చేసే చన్నీటి స్నానాలు
ప్రమిదలలో, అరటి దోనెలలో వెలిగించే నూనె దీపాల కాంతులు
సోమవారం ఉపవాసాలు
కార్తీక పౌర్ణమి నోములు
వనభోజనాలు
దేవాలయ దర్శనాలు 
దానాలు....
వచ్చేశాయి.
గుడులని భక్తులతో
గుండెల్ని భక్తితో నింపే కార్తీకమాసం ....

అందరికీ ఆధ్యాత్మిక అనుభూతులని పంచాలని కోరుకొంటూ...

 © Dantuluri Kishore Varma

Saturday, 14 October 2017

ప్రొద్దున్న లేస్తే మళ్ళీ మనం మనమే!

రోజూ...

ఈదవలసిన సముద్రాలు  
ఎక్కవలసిన కొండలు
గెలవవలసిన యుద్దాలు
నెరవేర్చవలసిన ప్రమాణాలు...

ఎన్నెన్ని ఉంటాయి!

కాలంతో పరుగులుపెట్టి పోతున్నప్పుడు
వ్యామోహాలలో పడిపోయి ఊపిరిసలపనప్పుడు
`అడ్డదారిలోపడి వెనక్కి నడిచేవాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాడిని నేను,` అని అన్నమాచార్యుడికి వేంకటేశ్వరుడు చెప్పినట్టు మనకి ఎవరుంటారు చెప్పండి?
కానీ, ఏదో ఓ శనివారం సాయంత్రం...
దారితప్పో, తెలిసో దేవాలయం మెట్లెక్కితే...
భజనమండపంలోనుంచి వినిపించే కీర్తనలలో లయ
ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గాలిలో తేలివచ్చే వెలిగించిన కర్పూరపు వాసన
అలంకరించిన స్వామి చిరునవ్వులో సౌందర్యం
పూజారి ఇచ్చిన కొబ్బరిచిప్పని గుడిచప్టామీద పగలగొడుతున్నప్పుడు మనసులో పరచుకొని ఉండే శాంతి...

ముందుకుపోయే దారి ఇదే అని చెపుతాయి. 
వచ్చిన చిక్కల్లా ఏమిటంటే?

బయటకి వస్తూ గుడిమెట్లముందు వదిలిపెట్టిన చెప్పులతోపాటూ ప్రపంచాన్ని కూడా తొడుక్కొని అలవాటైన దారిలో అడుగుపెడతాం.
ప్రొద్దున్న లేస్తే మళ్ళీ మనం మనమే!
(మొదటి మూడు ఫోటోలూ జగన్నధపురం వేంకటేశ్వరస్వామి గుడి దగ్గర తీసినవి. నాలుగవ పోటో గూగుల్ నుంచి తీసుకొన్నది).
 © Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!