Pages

Sunday, 19 August 2012

కాంక్రిట్ జంగిల్ లో జీవనవైవిధ్యం

సెంట్రల్ జూ అధారిటీచే మినీ జూగా గుర్తింపబడిన కే.వీ.కే రాజు సుందరవనం ఎన్.ఎఫ్.సీ.ఎల్ గ్రీన్ బెల్ట్ లో ఉంది
నెమళ్ళు, ఈమూ పక్షులు, తాబేళ్ళు, తొండాపుకోళ్ళు అనబడే పక్షులు, మనదేశంలో అరుదుగా ఉండే గునియా పిగ్స్(నిజానికి ఇవి పిగ్స్ కాదు. తోకలేని ఎలుకలా ఉండే జంతువులు)....
గునియా పిగ్స్
ఖజానా బాతులు, మచ్చల జింకలు, వీటికంటే పెద్దగా ఉండే అడవి జింకలు, దుప్పులు, లవ్ బర్డ్స్, కుందేళ్ళు... వంటి జంతువులని ఇక్కడ సంరక్షిస్తున్నారు. 
పచ్చికాయగూరలని తరిగి తాబేళ్ళకు ఆహారంగా వేస్తున్నారు.
పరిశ్రమ ప్రకృతి తో మమేకమై ఉండాలనే ఆలోచనతో అభివృద్ది చేసినట్లు నాగార్జునా ఎరువుల కర్మాగారం చుట్టూ పెంచిన గ్రీన్ బెల్ట్, పట్టణం మధ్యలో నిజమైన అడవిలా ఉంటుంది.   
సుమారు 170 రకాలకి చెందిన 4 లక్షల వృక్షాలు ఇక్కడ ఉన్నాయి.
ఒక్కరోజు ఈ అడవి దారుల వెంట నడక ఒక సంవత్సరపు బడలికని పోగొడుతుంది.
ఎఫారెస్టేషన్ కోసం ప్రత్యేకంగా నర్సరీ అభివృద్ది చేశారు.
జలచరాలకి, వలసపక్షులకి, జంతువుల నీటి అవసరాలకి 11 చలమలు, చెరువులు ఉన్నాయి. 
ఫ్రెంచ్ రచయిత మార్సెల్ ప్రౌస్ట్ చెప్పినట్టు- The real voyage of discovery consists not in seeking new landscapes but in having new eyes.
140 రకాల జీవజాతులతో, 700 ఎకరాలు విస్తీర్ణంలో మొత్తం పరిశ్రమ వైశాల్యంలో రమారమి 70 శాతం గ్రీన్ బెల్ట్ కి కేటాయించి నాగార్జునా ఫెర్టిలైజర్స్ మిగిలిన పరిశ్రమలకి ఆదర్శ ప్రాయంగా ఉంది.
మనకాకినాడలో మనిషి సృష్ఠించిన అరణ్యం, జనారణ్యంలో మినీ జూ, కాంక్రిట్ జంగిల్ లో జీవనవైవిధ్యం...  
Hats off to NFCL.
© Dantuluri Kishore Varma

Sunday, 12 August 2012

గాంధీ మందిరం

గాంధీగారు కాకినాడ వచ్చిన సందర్భానికి గుర్తుగా 1950 లో గాంధీ మందిరం నిర్మించారు, తరువాత పాత భవనం స్థానంలో 2008లో ప్రస్తుతం ఉన్న భవనాన్ని నిర్మించారు.సాంబమూర్తి నగర్ ఓవర్ బ్రిడ్జికి దగ్గర, మునిసిపల్ ఆఫీస్ వెనుకవైపు `గాంధీ మందిరం` ఉంది. 
మొదటిలో ప్రపంచం నిన్ను గుర్తించదు, తరువాత నిన్ను చూసినవ్వుతుంది, నీమీద యుద్దంచేస్తుంది. కానీ చివరికి నువ్వే గెలుస్తావు అంటాడు గాంధీజీ. 
ప్రతీ అడుగులోనూ గాంధీగారు చెప్పిన సక్సెస్ మంత్రాన్ని జ్ఞాపకం చేసుకొందాం.  మన పనికి గుర్తింపులేదని నిరుత్సాహపడినా, నవ్వారని చిన్నబుచ్చుకొన్నా, ప్రతికూల పరిస్థితులని సృస్టించారని పారిపోయినా పరాజితులమౌతాం. ఏపనిచేస్తూఉన్నా గెలుపుమీద దృష్టినిలిపి, గాంధీజీ మాటలని జ్ఞాపకం ఉంచుకొని, ముందుకు సాగితే ధృఢనిశ్చయం కలుగుతుంది. విజయం మన సొంతమౌతుంది. 

నూలుఒడుకుతున్న గాంధీగారి కాంస్య విగ్రహం, ఆయన జీవితంలో ముఖ్యమైన సంఘటనల్ని తెలియజేసే ఫొటోగ్రాఫులు, పోట్రైట్లు ఉంచారు.
మహాత్ముని ఆటోబయోగ్రఫీ `స్టోరీ ఆఫ్ మై ఎక్ష్పెరిమెంట్స్ విత్ ట్రూత్` చదువుతున్నప్పుడు, ఆపుస్తకంలో మనం చూడని ఫోటో లు మనకి ఇక్కడ కనిపిస్తాయి.
పచ్చని లాన్తో, గార్డెన్తో జనసమ్మర్ధం ఎక్కువగా ఉండని గాంధీ మందిరం దగ్గర కొంతసేపు మహాత్ముని ఆదర్శాలని, సత్యనిష్ఠని జ్ఞాపకం చేసుకొంటే బాగుంటుంది. 
100 మందీ, 200 మందీ పట్టే రెండు మీటింగ్ హాల్స్ ఉన్నాయి. పెళ్ళిల్ల లాంటివి కాకుండా మిగిలిన గెట్ టుగేదర్లకి ఈ మీటింగ్ హాళ్ళని నామమాత్రపు అద్దెకి ఇస్తున్నారు. లైబ్రరీ కూడా ఉంది. 
ప్రతీరోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకూ మందిరం మరియూ లైబ్రరీలు తెరుస్తారు. శుక్రవారాలు శెలవు.    
రఘుపతి రాఘవ రాజారాం
పతీత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరోనాం 
సబ్ కో సన్మతి దే భగవాన్    

మహాత్మా గాంధీ జీవితచరిత్ర అయిదు గంటల నిడివి గల డాక్యుమెంటరీ ఇక్కడ చూడండి

© Dantuluri Kishore Varma

Friday, 10 August 2012

`మహర్షి` బులుసు సాంబమూర్తి

స్వాతంత్ర్య సమర యోధుడు బులుసు సాంబమూర్తిని `మహర్షి` అని వ్యవహరించడంలోనే ఆయన వ్యక్తిత్వం వ్యక్తమౌతుంది. 1923లో కాకినాడలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభలు జరిగినప్పుడు వాటి నిర్వాహణా బాధ్యతని సాంబమూర్తి గారికి అప్పగించారు. అంతకు కొన్నిరోజుల ముందు ఆయన ఏకైక కుమారుడు మరణించినా చలించకుండా తన కర్తవ్య నిర్వాహణ చేశారు. ఈ సందర్భంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ "తన కన్నిటిని ముత్యాలుగా మార్చి ఈ సభలకు విచ్చేసిన నాయకులను ఆహ్వానించారని" చెప్పారట.

మనకి పూర్ణ స్వరాజ్యం కావాలని 1923 సభలలోనే సాంబమూర్తిగారు ప్రతిపాదించినా, అప్పటి నాయకులు దానికి అంగీకరించలేదని చెబుతారు. ఎట్టకేలకు 1929లో లాహోర్ కాంగ్రెస్ సభల సమయంలో పూర్ణస్వరాజ్య ప్రతిపాదన జరిగింది. 1930 ఉప్పుసత్యాగ్రహ సమయంలో తన సహచరులతో చొల్లంగి సముద్రతీరానికి వెళ్ళి ఉప్పును తయారుచేశారు. కోస్తాతీరం ప్రజలు ఈ సంఘటనవల్ల చాలా ప్రభావితులయ్యారు. అప్పటిలో సాంబమూర్తిగారిని అరెస్టుచేసి వెల్లూరు జైలుకి తరలించారు. 1935లో మద్రాసు ప్రోవిన్షియల్ ఎస్సెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంసాదించినప్పుడు, సీ.రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ప్రభుత్యాన్ని ఏర్పాటుచేశారు. సాంబమూర్తిగారు 1937 నుంచి 1942 వరకూ స్పీకరుగా ఉన్నారు. 
 స్పీకరుగా
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినతరువాతకూడా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం జరిగిన పొరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇంతటి విశేష వ్యక్తిత్వం గల ఈయన తూర్పుగోదావరి జిల్లాలో దుళ్ళ గ్రామంలో బ్రాహ్మణ వేదపండితుల ఇంటిలో జన్మించారు(1886).విజయనగరంలో మహారాజా కాలేజీలో పట్టబద్రులై, అక్కడే కొంతకాలం అధ్యాపకుడిగా ఉన్నారు. తరువాత కాకినాడలో క్రిమినల్ లాయరుగా మంచిపేరు గడించారు. ఇక్కడే స్థిరపడ్డారు.

విచారించవలసిన విషయం ఏమిటంటే, తనచివరిరోజులు పేదరికంలో, అనారోగ్యంతో గడిపి, ప్రభుత్వం చేత నిర్లక్ష్యం చేయబడి 1958వ సంవత్సరంలో మరణించారు.
            2008లో పోస్టల్ డిపార్టుమెంట్ విడుదల చేసిన మహర్షి బులుసు సాంబమూర్తి పోస్టల్ స్టాంపు

© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!