Pages

Saturday, 25 May 2013

వేసవనేది లేకపోతే మధురమైన జ్ఞాపకాలే లేకుండా పోతాయి!

`ఎండ నిప్పులు చెరుగుతుంది.`
`వేసవితాపం శృతిమించిపోతుంది.`
`ఇలాంటి ఎండలు నేను ఎప్పుడూ చూడలేదు.`
`జనాలు ఎండవేడికి పిట్టాల్లా రాలిపోతున్నారు`
`అసలు వేసవనేది లేకపోతే?` ......
ఇలాంటి మాటలు నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచీ ప్రతీసంవత్సరం వింటున్నాను. క్రమంగా వేసవి తాపం పెరుగుతున్న మాట వాస్తవమే కానీ, అసలు వేసవనేది లేకపోతే మనకి మధురమైన జ్ఞాపకాలే లేకుండా పోతాయి. 

వేసవితో మనందరికీ లవ్‌హేట్ రిలేషన్ షిప్ ఉంటుంది. కమ్మగా పాడే కోయిలపాటలు ఇప్పుడే వినిపిస్తూ ఉంటాయి. పిల్లలకి శెలవులు, కావలసినంత సమయం, చదువనే బాధ్యతలేకుండా బలాదూరు తిరగ గలిగిన అవకాశం ఉన్న కాలం.. అమ్మమ్మ, తాతయ్య ఇంటిలో కజిన్స్‌తో కలిసి ఆటలాడుకోవడం...  అన్నీ ఈ కాలలంలోనే కుదురుతాయి. పచ్చిమామిడికాయ బద్దలకి ఉప్పూకారం అద్దుకొని తిన్న సందర్భాలు జ్ఞాపకం ఉన్నాయా? చిన్నప్పుడు చెరువుల్లో, దొరువుల్లో చల్లటినీటిలో జలకాలాడినప్పటి జ్ఞాపకాలు వేసవి కాలంలోనివే. పుచ్చకాయల్లో తియ్యని నీళ్ళు, మావిడిపళ్ళ మధుర రసం, ముంజికాయల్లో మృదువైన ముంజులు, నోరూరించే హిమక్రీములు, పళ్ళరసాలు, మల్లెపువ్వులు వేసవి ఆనందాలకి కొనసాగింపు. అయితే... ఎండలు మండే కాలంలో ఉక్కబోత, చెమట, గాళుపులు, పవర్‌కట్‌లు నచ్చని విషయాలు. ఎండ వేడి లేకపోతే ఊటీ గురించో, కాశ్మీరు గురించో ఆలోచించే వాళ్ళు ఎవరయినా ఉంటారా?   వడదెబ్బ, నోరు పిడచకట్టుకొనిపోవడం  మరి ఏ ఇతర కాలంలోనూ మనల్ని ఇబ్బంది పెట్టవు.  కానీ... అంతగా దాహార్తి ఉంటుందికనుకనే పుచ్చకాయలో, కొబ్బరిబొండాలో... పుల్లయిసులో, చెరుకురసమో ఈ కాలంలో ఉన్నంత అద్భుతంగా మరెప్పుడూ ఉండవు.  

ఎవరో అన్నారు, `మనకే కాదు ఈ రోజు లంబసింగి లోనే 42 డిగ్రీలు దాటిందట,` అని. లంబసింగి గురించి అంతకుముందు ఎప్పుడో విన్నాను. ఎక్కువ వర్షంకురిసేచోటో, మంచుకురిసే ప్రదేశమో జ్ఞాపకంలేదు. ప్రతీ సందేహానికీ సమాదానం చెప్పే గూగుల్ గూటిలో రాసిపెడితే, ఒక వీడియోని నా చేతిలో పెట్టింది .మీ ఉక్కబోతని మరచిపోయి - చలిదుప్పట్లు కప్పుకొనితిరుగుతున్న గిరిపుత్రుల్ని కాసేపు చూడండి. ఇలాంటి ప్రదేశానికి చలో అంటే బాగుంటుంది కదా? ఈ ఏడాదికి నాకయితే సాధ్యం కాదులెండి. ఈ రోజు కన్న కలని మరో వసంతానికి వాయిదా వేస్తే, ఈ వేసవి వెళ్ళిన దగ్గరనుంచీ, మళ్ళీవేసవికోసం ఎదురు చూడాలి! 

`వడదెబ్బ బారిన పడకండి, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంద`ని పేపర్లలో, టీవీల్లో చెపుతున్నారు. ఎండవేడికి తట్టుకోలేక చెట్ల కొమ్మలపైనుంచి నేలరాలుతున్న గబ్బిలాలూ, పక్షులు; దాహార్తితో కుళాయిల దగ్గర చేరుతున్న చిన్న చిన్న జంతువులు; కర్ఫ్యూ విధించినట్టు జనసంచారంలేక నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు, ముఖ్యమైన పనులతో, తప్పనిసరి ప్రయాణాలతో మార్గమధ్యంలోనే ప్రాణాలుపోగొట్టుకొంటున్న వృద్దులు, యువకులు, పిల్లలు...ప్రతీరోజూ  చూడవలసివస్తున్న వార్తలు. వెలుగు ఉన్నప్పుడు, చీకటి ఉన్నట్టు -  ఇవికూడా వేసవికే ప్రత్యేకం.  

ప్రతీ మేఘానికీ వెండి అంచు ఉన్నట్టు భరించలేని వేసవికి కూడా పైన చెప్పిన కొన్నిప్రత్యేకతలు ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని, మండేకాలాన్ని దాటేస్తే మట్టివాసనతో వర్షాకాలం వచ్చేస్తుంది.
  
© Dantuluri Kishore Varma 

Tuesday, 21 May 2013

రక్తదానం

దేశంలో ఏ మూలనైనా ఏ గ్రూపు రక్తదాతలు కావలసివచ్చినా వెంటనే లభ్యమయ్యే విధంగా friends2support.org అనే వెబ్‌సైట్ ద్వారా విశేషసేవలు అందిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌లోనికి వెళ్ళి, కనిపిస్తున్న ఫీల్డ్స్‌లో

1.కావలసిన బ్లడ్‌గ్రూప్
2.రాష్ట్రం
3.జిల్లా
4.నగరం

ఎంచుకొని, సబ్‌మిట్ చేస్తే; మీప్రాంతంలో అందుబాటులో ఉన్న రక్తదాతల వివరాలు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా కనిపిస్తాయి.  

ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌ద్వారా లక్షకి పైగా రక్తదాతలు తమ పేర్లు నమోదు చేసుకొని ఉన్నారట. కొత్తగా ఎవరైనా దాతలు తమపేర్లు ఈ సైటుద్వారానే నమోదు చేసుకోవచ్చు.

ఈ రోజు డెక్కన్‌క్రానికల్ న్యూస్‌పేపర్‌లో ఈ స్వచ్చంద సేవకుల గురించి వచ్చిన వార్త చూసి, అందరికీ ఉపయోగ పడుతుందనే ఉద్దేశ్యంతో వివరాలు ఇస్తున్నాను.

© Dantuluri Kishore Varma 

కాకినాడ ఎక్స్‌పెరిమెంట్‌

ఒక దేశం అభివృద్ది సాధించాలంటే, సంపదలతో తులతూగాలంటే వ్యవసాయం, పరిశ్రమలు ప్రధానమైన పాత్ర పోషించాలి. భారతదేశంలాంటి చాలా దేశాల్లో వ్యవసాయం సాంప్రదాయకమైన వృత్తిగా ఉన్న కారణంగా చాలా కాలం ఒకతరం తరువాత మరొకతరం సాగుచేసే మెళుకువలని అందిపుచ్చుకొంటూ ముందుకు సాగింది. తర్వాత క్రమంగా వేరే రంగాల్లో కూడా అభివృద్ది సాధించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ సొంత వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించాలంటే; పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలంటే వ్యక్తులకి కావలసిన మార్గదర్శకత్వం ఎక్కడినుంచి వస్తుంది?  

వ్యాపార ఆలోచనని ఆచరణలో పెట్టడానికి కావలసిన ప్రణాళిక, మూలధనం సమకూర్చుకోవడం, మానవ వనరులు నిర్వాహణ, సంస్థని విజయవంతంగా నడిపించడానికి అవసరమయ్యే నాయకత్వ లక్షణాలు మొదలనవి ఎలా సమకూరుతాయి? ఇవి వ్యాపారవేత్తల వంశంలో పారంపర్యంగా వస్తాయా? వ్యవసాయ లేదా వృత్తి పరమైన నేపద్యం నుంచి వచ్చిన వాళ్ళకి అవి అందుకోలేనంత ఎత్తులో ఉండిపోతాయా? ఈ సక్సెస్ సూత్రాలని సామాన్యులకి కూడా నేర్పించ గలిగితే ఎన్నో కొత్త వ్యాపార ఆలోచనలు సఫలీకృతమై, దేశ ఆర్థికవ్యవస్థ పురోగతి సాధిస్తుంది. కానీ, వాటిని నేర్పించడం సాధ్యమేనా?
సాధ్యమే అని నిరూపించడానికి అవసరమైన ప్రయోగం 1961వ సంవత్సరంలో జరిగింది. కాకినాడ ఎక్స్‌పెరిమెంట్‌గా ప్రపంచ వ్యాప్తంగా ప్రశిద్దమైన ఈ ప్రయోగం  ఎన్నో దేశాలలో `ఎంటర్‌ప్రెన్యూవర్  డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(EDP)లకి` అధారమైంది. డేవిడ్ మెక్‌క్లేలాండ్ అనేఆయన `ఏదయినా పని పూర్తిచెయ్యలనే తపనని కలిగిస్తే, ఎవరయినా ఏదయినా సాధించగలర`నే సూత్రాన్ని నిరూపించడానికి మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి 51 మంది వ్యక్తులని ఎంపికచేసి, హైదరాబాద్‌లో మూడు నెలల శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇది విజయవంతం అయ్యింది. శిక్షణలో పాల్గొన్న వ్యక్తులు వాళ్ళ లక్ష్యాలని చేరుకోవడంలో సఫలీకృతం అయ్యారు.  డేవిడ్ మెక్‌క్లేలాండ్ `ఎచీవింగ్ సొసైటీ` అనే తన పుస్తకంలో  ఈ విషయాలని పొందుపరచాడు. అయితే ఏమిటట అంటారా?  

ఈ పరిశోధనా ఫలితాలని ఆధారంగా చేసుకొని మనదేశంలో పెద్ద ఎత్తున ఎంటర్‌ప్రెన్యువర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఈడీపీని అందిస్తున్నాయి. ఈ హవా మనదేశం తోనే ఆగిపోలేదు. అమెరికా, ఇంగ్లండ్ లతో సహా ఇంకా చాలా దేశాలు కాకినాడ ఎక్స్‌పెరిమెంట్ నుంచి స్పూరి అందుకొని ఈ శిక్షణని అందిస్తున్నాయి. ప్రపంచ పారిశ్రామికాభివృద్ది శిక్షణకి పునాది మనకాకినాడలో ఉండడం గర్వకారణమే కదా!

© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!