Pages

Saturday, 31 January 2015

కాలువ గట్టు మీద...

ఇది ఏ ఊరు?

ఏ ఊరయితే ఏమిటి? చూడండి కాలువ గట్టు ఎంత బాగుందో? 

చూస్తున్నా! చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ సీతాకోక చిలుకల్లా ఎగిరి వస్తున్నాయి. స్నేహితులతో కలిసి గంటలు, గంటలు కాలువలో ఈత కొట్టేవాళ్ళం తెలుసా? ఓ సారి సుబ్బారావు నీళల్లోకి దిగిన తరువాత వాడి బట్టలు దాచేసాం. చాలా సేపు వెతుక్కొని, ఇమ్మని బ్రతిమాలి, లాభం లేక రెండు అరిటాకులు అడ్డం పెట్టుకొని ఊళ్ళోకి ఒకే పరుగు పెట్టాడు. ఆ సంఘటన తలచుకొంటే ఇప్పటికీ నవ్వు ఆగదు.      
ఇలాంటి కాలువే మావూళ్ళోది కూడా. అవతలి గట్టుకి వెళ్ళడానికి బల్ల కట్టు ఉండేది. పొడవైన వెదురు కర్రని నీటి అడుగుభాగానికి గుచ్చి బల్లకట్టుని ముందుకి నెట్టేవారు. గట్టు మీదే ఓ గుడిసెలో కుటుంబంతో పాటూ బల్లకట్టు పోలయ్య ఉండేవాడు. మోతుబర్లందరూ పెద్దపండగలప్పుడు పొలంలో పనిచేసే పాలేర్లతో పాటూ పోలయ్యకి కూడా వడ్లు కొలిచేవారు. 
చల్లని చెట్టు నీడలో నీళ్ళని చూస్తుంటే వాటిలోకి దిగాలని అనిపించడం లేదూ? దోసిటితో నీళ్ళు తీసుకొని ముఖంమీద చిలకరించుకొంటే ఎంత బాగుంటుందండీ అసలు!? కానీ, దిగుదామంటే  షూ తడిచిపోతుంది. బట్టలు మురికై పోతాయి. చిన్నప్పుడు అవేమీ పట్టించుకొనే వాళ్ళం కాదు. కలువపువ్వుల కోసం పోటీలుపడి మరీ నీటిలోకి దిగేసేవాళ్ళం. 
ఎవరో పశువుల కోసం గడ్డి కోసుకొంటున్నట్టున్నారు. 
ఇతను చూడండి అడ్డుకట్ట మీద నుంచి తలమీద అంత బరువుతో అడుగు తడబడకుండా ఎలా చకచక మని నడిచేస్తున్నాడో.    
కాలువ కొంచెం ఇరుకుగా ఉన్న చోట ఆ గట్టునుంచి, ఈ గట్టుకి అడ్డంగా సగానికి చెక్కిన ఒకే ఒక తాటి మాను ఇలానే వేశారు మా కాలువ గట్టున కూడా. అలవాటు ఉంటే కానీ దాన్ని దాటలేం. మాఊరి మునసబు గారి మేనల్లుడు ఓ సారి పట్నం నుంచి వస్తూ  తాటిపట్టి మీదనుంచి దాటడానికి కొంచెం సంశయిస్తున్నాడు. అదిగో సరిగ్గా అప్పుడు జూనియర్ కాలేజికి వెళుతున్న అమ్మయిలు అవతలి గట్టుమీదకి వచ్చారు. వాళ్ళల్లో మునసబుగారి అమ్మాయి కూడా ఉంది. పట్నం బావ తటపటాయింపు చూసి ముసిముసినవ్వులు నవ్వింది. మనోడికి అవమానంగా అనిపించింది. ధైర్యంగా ముందడుగు వేశాడు.  కాలు తడబడింది. దబ్బున కాలువలో పడ్డాడు. అమ్మాయిల నవ్వులు ఎగసిపడిన నీటి తుంపరలు అయిపోయాయి.
వరిచేలు, కొబ్బరిచెట్లూ భలేగా ఉన్నాయి మాష్టారు. ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతదూరమైనా నడిచేయ్యొచ్చు. 
ఇక్కడ చూడండి. ఈ కాలిబాట వెంట అలా వెళ్ళామనుకోండి కళ్ళాం వస్తుంది. సరిగ్గా చూడండి చిన్న దిమ్మలా కనిపిస్తుంది. దాన్లో ఒక పాక కూడా ఉంది. వరిచేలు కోసేసిన తరువాత ఆరబెట్టి, తరువాత కుప్ప నూర్పుళ్ళు చేస్తారు. పూర్వం ఎడ్లబళ్ళతో నూరిస్తే, ఇప్పుడు ట్రాక్టర్లు, వరినూర్పు యంత్రాలు ఉపయోగిస్తున్నారు. నూర్పుళ్ళు అయిన తరువాత, ధాన్యాన్ని ఎగరబోసి బస్తాల్లో కట్టేస్తారు. రైతులు ఈ పనులన్నీ  కళ్ళాల్లోనే చేసుకొంటారు.  
చింత లేకుండా ప్రశాంతంగా పనిచేసుకొనే ఈ మనుష్యులని చూస్తే ఈర్ష్యగా ఉంటుంది మాష్టారు. మీరేమంటారు?
దూరపు కొండలు నునుపు. మనం `స్ట్రెస్సో!` అని ఓ ప్రక్కనుంచి గోల పెడుతుంటే, ఉద్యోగాలు వెతుక్కొని ఇక్కడి వాళ్ళు పట్టణాలకి వలసపోతున్నారు. ప్రశాంతతని చూసి ముచ్చట పడతాం కానీ, `మా పొలం పనులు మీకిచ్చేస్తాం, మీ ఉద్యోగాలు మాకిచ్చేస్తారా?` అని ఇక్కడి వాళ్ళు అడిగితే మనం ఏం చెపుతాం!?
నామాట అలా ఉంఛండి. మీరయితే ఏమి చేస్తారు?

© Dantuluri Kishore Varma

Thursday, 29 January 2015

నడిచే ఆనందం

మణిరత్నం గీతాంజలి సినిమాలో `ఆమనీ పాడవే కోయిలా..` అని హీరోగారు పాడుకొంటూ వెళుతుంటే పాటతో పాటు వినిపించే సంగీతం, కనిపించే దృశ్యం మనసుని కట్టి పడేస్తాయి. మంచుకురిసే ఉషోదయాల్లోనో, చలి గిలిగింతలు పెట్టే సాయంకాలాల్లోనే అలాంటి ప్రకృతిలో నడిచే అదృష్టం ఎంతమందికి ఉంటుంది?  హిల్ స్టేషన్లలోనో, పచ్చని పల్లెటూళ్ళలోనో ఉండేవాళ్ళ సంగతి ప్రక్కన పెడితే కాకినాడలోనో, హైదరాబాదులోనో.. అలాంటి మరో పట్టణంలోనో నివశించే వాళ్ళకి స్వచ్చమైన గాలి పీల్చుకొనే అవకాశమే గగనం అయిపోతుంది. అయితే ఎప్పుడైనా పార్కులకి వెళితే మాత్రం కొంతలో కొంత ఆనందం.
జన్మభూమి పార్క్, కాకినాడ 
హెన్రీ డేవిడ్ థోరో గురించి ఎప్పుడైనా విన్నారా? ఈయన వాల్డెన్ అనే సరస్సు ప్రక్కన తన స్వహస్తాలతో ఒక చిన్న కేబిన్ నిర్మిచుకొని రెండు సంవత్సరాలు ప్రకృతితో సహజీవనం చేసాడు. తన అనుభవాలని వాల్డెన్ అనే పుస్తకంలో రాశాడు. థోరో ఆలోచనలు కొన్ని మహాత్మా గాంధీని ప్రభావితం చేశాయని చెపుతారు. నడవడం గురించి థోరో ఏమంటాడో తెలుసా?  `నా కాళ్ళు నడవడం మొదలు పెట్టడంతోనే, నా ఆలోచనలు ప్రవహించడం మొదలవుతాయి,` అని. ఉదయం నడిచే నడక ఒక వరం లాంటిదని కూడా అంటాడు. 

నీటికి సమీపంలో, నీడనిచ్చే వృక్షాల క్రిందనుంచి, మెత్తటి పచ్చికమీద, తలలూపే మొక్కల మధ్య అలా అలా నాలుగడుగులు వేస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మొక్కలూ, చెట్లూ, ప్రవహించే నీరూ నెగిటివ్ ఎనర్జీని పీల్చుకొంటాయట. అందుకే ధ్యానం చేసుకొన్నప్పుడు ఎలాంటి ప్రశాంతత లభిస్తుందో ప్రకృతిలో గడిపినప్పుడు కూడా అటువంటి ప్రశాంతతే కలుగుతుంది. దానికి తోడు సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. ప్రకృతిలోకి వెళ్ళడం అంటే మనసులోనికి వెళ్ళడమే అని ఒక పెద్దాయన అంటాడు. దీనిలో ఎంతో నిజం ఉంది. సుర్యరశ్మిని ఆకులు పీల్చుకొన్నట్టు, ఆనందాన్ని మనసు పీల్చుకొంటుంది. 
పొలం గట్లమీద, పచ్చిక మైదానాల్లో, అడవి దారుల్లో, కొండవాలుల్లో నడిచే అవకాశం రోజూ రాకపోవచ్చు.. కానీ ఎప్పుడైనా పార్కుల్లో అయినా నడవచ్చు కదా?  ప్రకృతిలో నడుస్తుంటే మనతో పాటూ ఆనందం నడుస్తున్నట్టే!

© Dantuluri Kishore Varma

Tuesday, 27 January 2015

అతను భగవధ్గీతను చదివుంటే...

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సువ:
మామకా: పాణ్డవాశ్చైవా కిమకుర్వత సంజయ.

`యుద్ధం చెయ్యడానికి సన్నద్దులైన పాండవులూ, కౌరవులూ కురుక్షేత్రంలో ఏమిచేశారు?` అని దృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. భగవద్గీతలోని అర్జున విషాదయోగంలో మొట్టమొదటి శ్లోకం ఇది. సంజయుడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి వ్యాఖ్యాత. చూసినది చూసినట్టు దృతరాష్ట్రునికి విన్నవిస్తున్నాడు. ఇరుపక్షాల సైన్యాలూ రణరంగంలో మోహరించి ఉన్నాయి. దుర్యోధనుడు తమ పక్షం వారు, ఎదుటి పక్షపు వీరులతో సమవుజ్జీలుగా ఉన్నారని సేనానాయకుడైన ద్రోణాచార్యుడితో చెపుతాడు. అప్పుడు భీష్మాదులు బిగ్గరగా శంఖారావాలు చేసి యుద్దానికి తయారుగా ఉన్నామని సన్నద్ధత  వ్యక్తం చేస్తారు. 

పాండవ పక్షం నుంచి అర్జనుని రధసారధి శ్రీకృష్ణుడు పాంచజన్యాన్నీ, అర్జునుడు దేవదత్తాన్నీ, ధర్మరాజు అనంతవిజయాన్నీ, భీముడు పౌండ్రాన్నీ, నకులుడు సుఘోషాన్నీ, సహదేవుడు మణిపుష్పకాన్నీ పూరిస్తారు. ఇవన్ని వాళ్ళ వాళ్ళ శంఖాల పేర్లు. ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. అప్పుడు  కృష్ణుడితో అర్జునుడు- 

సేనయోరుభయోర్మధ్యే రధం స్థాపయ మేzచ్యుత.

అంటూ తన రధాన్ని ఇరుపక్షాలమధ్యా నిలుపమని చెపుతాడు. ఇరువైపులా ఉన్న వీరులను చూస్తాడు. వారిలో గురువులు, తాతలు, తండ్రులు,  కొడుకులు, అన్నదమ్ములు, మనుమలు, మేనమామలు, స్నేహితులు ఉన్నారు. `వీరితోనా నేను యుద్ధం చెయ్యబోతున్నది!` అనే తలంపు అర్జునుడ్ని ఒక్క క్షణంలో నిర్వీర్యుడిని చేసింది. స్వజనులను చంపి ఎవరైనా సాధించేది ఏముంటుంది?    


నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా.  

వైరాగ్యం ఆ మహావీరుడ్ని ఆవహించింది. `రాజ్యంతోనూ, అది సమకూర్చే సుఖాలతోనూ మనకేమిటి అవసరం? అవేవీ నాకు అక్కర్లెద్దు,` అంటున్నాడు అర్జునుడు.  స్వజనాపేక్ష చేత అర్జునుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యాడు. ఈ లోపం `నా అయుదాల్ని విడిచిపెడుతున్నాను. ఈ యుద్దరంగంలో కౌరవులు నన్ను సంహరించినా కూడా మంచిదే,` అనేంతవరకూ అర్జునుడ్ని తీసుకొని వెళ్ళింది. తన నిర్ణయాన్ని సమర్ధించుకోవడానికి కౌరవులను చంపడంవల్ల పాపం కలుగుతుందని, నరకానికి పోతామని, వంశం నాశనం అవుతుందని.. ఎన్నో సాకులు చెపుతాడు.  కొండను తవ్వి వజ్రాన్ని వెలికితీసినట్టు, అపోహలను తొలగించి అర్జునుడిలో వజ్రసంకల్పాన్ని శ్రీకృష్ణుడు కల్పించకపోతే పాండవ మధ్యముడు కోరుకొన్నట్టే దుర్యోధనాదులు విజయాన్నీ, రాజ్యాన్ని పొంది వుండేవారు.

ఇప్పుడు భగవధ్గీతను విడిచిపెట్టి కొంచెం పశ్చిమంగా వెళ్ళి షేక్స్పియర్ రాసిన విషాదాంత నాటకం హేంలెట్‌లో ఏమయ్యిందో చూద్దాం. హేంలెట్ డెన్‌మార్క్ యువరాజు. అతని పినతండ్రి క్లాడియస్ హేంలెట్ తండ్రిని  చంపి రాజు అవుతాడు. అంతేకాకుండా వదినగారిని పెళ్ళాడి తన రాణిని చేసుకొంటాడు. ఓ వెన్నెల రాత్రి చంపబడిన రాజు ఆత్మ తన కొడుకు హేంలెట్‌కి కనిపించి జరిగిన కుట్రగురించి చెపుతుంది. ప్రతీకారం తీర్చుకోమని కోరుతుంది. `ఆత్మ చెప్పిన విషయం నిజమా, కాదా?` అనే సందేహంలో పడతాడు హేంలెట్. ఒక నాటక బృందాన్ని పిలిచి తన తండ్రిని చంపిన కుట్రని పోలిన సన్నివేశంతో ఓ నాటకాన్ని రాజమహల్లో వేయిస్తాడు. నాటకాన్ని చూస్తూ కళవెళ పడిన పినతండ్రి క్లాడియస్‌ని గమనించిన హేంలెట్‌కి తండ్రి ఆత్మ చెప్పిన విషయం నిజమే అని నిర్ధారణ అవుతుంది. క్లాడియస్ తత్తరపాటులో ఉన్నాడు. ఆ క్షణంలోనే హేంలెట్ అతనిని సంహరించాలి. అలాగే చేసి ఉండాలని విమర్శకులు ఇప్పటికీ నొక్కి వొక్కాణిస్తున్నారు. అర్జునుడిలో స్వజనాపేక్షలాగ హేంలెట్‌లో ఇండెసిసివ్‌నెస్(ఏదైనా పని చెయ్యడమా, మానడమా అనే ఊగిసలాట) అనే లోపం ఉంది. అయితే దురదృష్టవశాత్తూ కృష్ణుడిలాంటి కౌన్సిలర్ అతనికి లేక చివరికి తాను చంపబడడమే కాకుండా, తనవాళ్ళందరూ దుర్మరణం పొందడానికి కారణం అవుతాడు. 

ఉదయం మేల్కొన్న దగ్గరనుంచీ, రాత్రి నిద్రపోయేవరకూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ప్రతీపనికీ రెండు ఆప్షన్‌లు ఉంటాయి - చెయ్యడం, చెయ్యకపోవడం అనేవి.  చిన్న పనులని ప్రక్కన పెడితే ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో చెయ్యవలసిన పనిని చెయ్యక పోవడం వల్ల, చెయ్యకూడని పని చెయ్యడం వల్లా అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది. సభావేదికమీద మన అభిప్రాయాలని చెప్పవలసి వచ్చినప్పుడు తప్పు మాట్లాడితే జనాలు నవ్వుతారని వెనకడుగు వేస్తాం; నష్టం వస్తుందేమో అనే సందేహంతో మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా ఊరుకొంటాం; పోటీని చూసి భయపడి పరీక్షల్లో పూర్తి సామర్ద్యాన్ని ప్రదర్శించలేకపోతాం; సమయం, డబ్బూ అందుబాటులో ఉన్నా సినిమాలు, స్నేహితులూ లాంటి ఆకర్షణల్లో పడి ఉద్యోగానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి నైపుణ్యాలని మెరుగు పరచుకోవడానికి బద్దకిస్తాం. చూశారా మన లోపాలు విజయావకాశాలని ఎలా దెబ్బతీస్తున్నాయో!  

హేంలెట్ భగవధ్గీతను చదివుంటే ఏమయ్యేది? ఈ షేక్స్పియర్ నాటకం సుఖాంతమయ్యేదా? నిజానికి ఎక్కడో భారతదేశంలో పుట్టిన గీతని డెన్మార్క్ యువరాజు చదివే అవకాశం లేనేలేదు కాబట్టి ఈ ఊహని కొంచంసేపు ప్రక్కన పెట్టి మనదగ్గరకి వద్దాం. `మోహంలో పడకుండా సరైన సమయంలో సరైన పని చెయ్యి,` అని భోధించిన గీత మనకేమైనా ఉపయోగపడుతుందంటారా? 

© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!