మణిరత్నం గీతాంజలి సినిమాలో `ఆమనీ పాడవే కోయిలా..` అని హీరోగారు పాడుకొంటూ వెళుతుంటే పాటతో పాటు వినిపించే సంగీతం, కనిపించే దృశ్యం మనసుని కట్టి పడేస్తాయి. మంచుకురిసే ఉషోదయాల్లోనో, చలి గిలిగింతలు పెట్టే సాయంకాలాల్లోనే అలాంటి ప్రకృతిలో నడిచే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? హిల్ స్టేషన్లలోనో, పచ్చని పల్లెటూళ్ళలోనో ఉండేవాళ్ళ సంగతి ప్రక్కన పెడితే కాకినాడలోనో, హైదరాబాదులోనో.. అలాంటి మరో పట్టణంలోనో నివశించే వాళ్ళకి స్వచ్చమైన గాలి పీల్చుకొనే అవకాశమే గగనం అయిపోతుంది. అయితే ఎప్పుడైనా పార్కులకి వెళితే మాత్రం కొంతలో కొంత ఆనందం.
జన్మభూమి పార్క్, కాకినాడ |
హెన్రీ డేవిడ్ థోరో గురించి ఎప్పుడైనా విన్నారా? ఈయన వాల్డెన్ అనే సరస్సు ప్రక్కన తన స్వహస్తాలతో ఒక చిన్న కేబిన్ నిర్మిచుకొని రెండు సంవత్సరాలు ప్రకృతితో సహజీవనం చేసాడు. తన అనుభవాలని వాల్డెన్ అనే పుస్తకంలో రాశాడు. థోరో ఆలోచనలు కొన్ని మహాత్మా గాంధీని ప్రభావితం చేశాయని చెపుతారు. నడవడం గురించి థోరో ఏమంటాడో తెలుసా? `నా కాళ్ళు నడవడం మొదలు పెట్టడంతోనే, నా ఆలోచనలు ప్రవహించడం మొదలవుతాయి,` అని. ఉదయం నడిచే నడక ఒక వరం లాంటిదని కూడా అంటాడు.
నీటికి సమీపంలో, నీడనిచ్చే వృక్షాల క్రిందనుంచి, మెత్తటి పచ్చికమీద, తలలూపే మొక్కల మధ్య అలా అలా నాలుగడుగులు వేస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మొక్కలూ, చెట్లూ, ప్రవహించే నీరూ నెగిటివ్ ఎనర్జీని పీల్చుకొంటాయట. అందుకే ధ్యానం చేసుకొన్నప్పుడు ఎలాంటి ప్రశాంతత లభిస్తుందో ప్రకృతిలో గడిపినప్పుడు కూడా అటువంటి ప్రశాంతతే కలుగుతుంది. దానికి తోడు సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. ప్రకృతిలోకి వెళ్ళడం అంటే మనసులోనికి వెళ్ళడమే అని ఒక పెద్దాయన అంటాడు. దీనిలో ఎంతో నిజం ఉంది. సుర్యరశ్మిని ఆకులు పీల్చుకొన్నట్టు, ఆనందాన్ని మనసు పీల్చుకొంటుంది.
పొలం గట్లమీద, పచ్చిక మైదానాల్లో, అడవి దారుల్లో, కొండవాలుల్లో నడిచే అవకాశం రోజూ రాకపోవచ్చు.. కానీ ఎప్పుడైనా పార్కుల్లో అయినా నడవచ్చు కదా? ప్రకృతిలో నడుస్తుంటే మనతో పాటూ ఆనందం నడుస్తున్నట్టే!
© Dantuluri Kishore Varma
well said కిషోర్ గారు .. థోరో గురించి మంచి విశేషాలు తెలిపారు . thank you. చెట్టుచాటు నుండి అరసగం పైన కనిపించిన పాపాయికి దీవెనలు .
ReplyDeleteధన్యవాదాలు వనజ గారు. ఆమె మా చిన్నమ్మాయి వర్షిత.
Delete