Pages

Monday, 11 March 2013

రాజమండ్రీ

రాజమండ్రీలో కోటిపల్లి బస్టాండు దాటిన తరువాత రైల్వేస్టేషన్‌కి వెళ్ళే దారిలో ఎడమవైపు సందులో పాత ఇల్లు ఒకటి ఉండేది. ఆ ఇంటి డాబామీద  ఒక చిన్నగది. ఏ ఫైవ్‌స్టార్ హోటల్ రూంకీ లేని ప్రత్యేకత దానికి ఉండేది. సాయంత్రం అయ్యేసరికి చల్లగా వీచే గోదావరి గాలి, రాత్రి అయ్యేసరికి చంద్రుడు ఉండే రోజుల్లో అయితే పుచ్చపువ్వులాంటి వెన్నెల, లేని రోజుల్లో అయితే చిరుగులు పడిన నల్ల దుప్పటిలా ఆకాశమంతా నక్షత్రాల గుంపులు. ఆ గది ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, దానిలో కొంతకాలం నేను ఉన్నాను. మీరు అడగవచ్చు, `నువ్వు గాంధీవా? ఐన్‌స్టీనువా?? నువ్వుంటే ప్రత్యేకమైనది అయిపోవడానికి?` అని. మీగురించి కాదండీ, నాకు స్పెషల్ అని. 

నా రూమ్మేట్, మా కంపెనీలోనే పనిచేసే నా వయసు కుర్రోడే. అతనికి ఒక టేప్‌రికార్డర్ ఉండేది.  సోనీ సిక్స్‌టీ కేసెట్‌లో పన్నెండు నుంచి పద్నాలుగు పాటలు పట్టేవి. ఓ శెలవురోజు కేసెట్ రికార్డింగ్ సెంటరు దగ్గర ఓపికగా కూర్చుని అక్కడ ఉన్న లిస్టుల్లో వెతికి, వెతికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత పాటలు అన్నీ ఒక కేసెట్లో చేయించాను. ఏ దివిలో విరిసిన పారిజాతమో, అభినవతారవో, మల్లెపువ్వు వాడిపోగ, నేనొక ప్రేమ పిపాసిని, మధుమాసవేళలో, అలివేణీ ఆణిముత్యమా, కలువకు చంద్రుడు ఎంతో దూరం, మామా చందమామ, మందారం ముద్దమందారం, పూచే పూలలోన, ఇదేపాట ప్రతీచోట... లాంటి పాటలన్నీ ఒకచోట చేర్చి నేను చెప్పిన డాబామీద కూర్చుని వింటే ఎలా ఉంటుందో ఊహించండి. బాలు గళానికి ఫిదా అయిపోయాం.
 సాయంత్రం ఆఫీసునుంచి వచ్చిన తరువాత పాటలు వింటూ కూర్చుంటే సమయం తెలిసేది కాదు. కడుపులో నకనకలాడుతుండగా కంగారుగా శ్రీనివాసు మెస్‌కి పరుగు పెట్టేవాళ్ళం. చామదుంపల పులుసుపెట్టి వండిన కూర అద్భుతంగా ఉండేది. నచ్చని కూర ఉంటే ఆమ్లెట్  వేసేవాడు. ఒక్కోసారి మేం వెళ్ళేసరికి అంతా అయిపోయేది. ఈసురో మంటూ శ్యామలా థియేటర్ వరకూ నడక - జెకే టిఫిన్ సెంటర్లో సాంబార్ ఇడ్లీ కోసం.
పలచబడిపోతున్న ట్రాఫిక్ చూసుకొంటూ కొన్నిసార్లు కోటగుమ్మంవరకూ పోయేవాళ్ళం. వేరే ఊళ్ళనుంచి షాపింగ్‌కి వచ్చినవాళ్ళు, రాజమండ్రీ వాస్తవ్యులు, రోడ్డుమీద సరుకులు పెట్టి అమ్మే వర్తకులు.. ఇరుకురోడ్లు ఎప్పుడో కానీ ఖాళీగా కనిపించవు. మణికంఠా పుస్తకాల షాపులో ఇంగ్లీష్ నావల్స్ దొరికేవి. ఆర్కే నారాయణ్ రాసిన పుస్తకాలు అరవై రూపాయలకి ఒకటి లభించేది. అదృష్ఠం బాగుండి షాపు తెరిచి ఉంటే ఓ వారానికి సరిపడే నావల్ దొరికినట్టే. అక్కడి నుంచి ఇంకొంచం ముందుకి వెళితే రాజమండ్రీకే ప్రత్యేకం సేమియా, రోజ్‌మిల్క్, కోవా అమ్మే షాపు ఉండేది. గ్లాసులో ఐసువేసి, పలుచగా ఉన్న కోవా నింపి పైన పొడవైన గ్లాస్ బాటిల్లోనుంచి కలర్ సిరప్ వొంపి, ఒక ప్లాస్టిక్ స్పూన్ గుచ్చి ఇస్తే - గుంపులు, గుంపులుగా నుంచుని జనాలు ఆరుచిని ఆస్వాదిస్తుంటే చూసే ఎవరికైనా నోరూరడం తద్యం. 
ఒక్కో రోజు గోదావరి గట్టుమీద కూర్చుని బ్రిడ్జ్‌మీదనుంచి పోతున్న రైళ్ళని, వెలుగుతున్న విద్యుత్ లైట్లని, లంగరువేసి ఉన్న పడవల్నీ, ఊగుతున్న మర్రి చెట్టు ఆకుల్నీ, ఒడ్డుని తాకుతున్న అలల్నీ చూస్తూ నిమిషాలు గంటలు అయ్యేవి.
మంచుకురుస్తున్నప్పుడు రోడ్డు వెంబడి నడవడం, ఎండ మండిపోతున్నప్పుడు చెట్టునీడల్లో సైకిలు మీద పెట్టి చీరికలుగా కోసి అమ్ముతున్న పుచ్చకాయ ముక్కలో, బొప్పాయి ముక్కలో తినడం, స్కూటర్‌మీద కొవ్వూరు వెళుతున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్ దాటడం, పేపరుమిల్లు వైపు వెళ్ళే దారిలో పాతపుస్తకాల షాపు, దామెర్ల రామారావు ఆర్టు గేలరీ, లాలా చెరువు దగ్గర దాబాలో రోటి, దాల్ కాంబినేషన్.... రాజమండ్రీ అంటే పంచేద్రియాలూ ప్లస్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతాయి.

© Dantuluri Kishore Varma 

15 comments:

  1. బాగున్నాయి జ్ఞాపకాలు

    ReplyDelete
  2. రాజమంద్రితో జన్మ జన్మల సంబంధం కదండీ! ఎంత చెప్పినా ఏమి చెప్పినా బాగుంటుంది.

    ReplyDelete
  3. రాధికగారు మీకు ఈ టపా నచ్చి, ఆవిషయం కామెంటు ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. శర్మగారు ఇంకా చాలా రాద్దామనుకొన్నాను. బోరుకొడతానేమో అనే అనుమానంతో అక్కడితో సరిపెట్టా. :)

    ReplyDelete
  5. మీ టపాలు చదువుతుంటే నేను తిరిగిన ప్రదేశాలు నా కాలేజి రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇప్పటికీ శ్యామలా థియేటర్ సెంటర్ విజయా టాకీస్ అలా నడుచుకుంటూ వెళితే కోటగుమ్మం సెంటర్ గుర్తుకొస్తున్నాయి. బాల్య ఙ్ఞాపకాలను గుర్తుకుచేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  6. మీకు నచ్చినందుకు చాలా సంతోషం మానసవీణ ఆచార్యులు గారు.

    ReplyDelete
  7. mee tapa chaala bagundi sir......... Rajahmundry ni marokasari gurtuchesaru......... thank you.....

    ReplyDelete
  8. Chala chala hayiga vuntundi ituvanti posts chadivinappudu.

    Thank you.

    ReplyDelete
    Replies
    1. హరనాథ్‌గారు, మీ కామెంట్‌కి ధన్యవాదాలు.

      Delete
  9. rajahmundry gurinchi baga chepparandi thanks.

    ReplyDelete
    Replies
    1. నాకు బాగా నచ్చిన జ్ఞాపకాలండి. అందుకే పోస్టు బాగా వచ్చింది. ధన్యవాదాలు.

      Delete
  10. Replies
    1. good mornin ing sir, rajamundri goorchi cheppi okasari vellela chesaru.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!