Pages

Wednesday, 20 March 2013

ఎంత కష్టం! - ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

రెండుసంవత్సరాల క్రితం మా ఇంటి లివింగ్‌రూంకి ఉన్న వెంటిలేటర్లో రెండు పిచ్చుకలు గూడు పెట్టుకొన్నాయి. ఎక్కడికో ఎగిరి వెళ్ళడం - కొంచెంసేపు తరువాత  పీచు, పుల్ల ముక్కలు, తాళ్ళు లాంటివి ముక్కున కరచుకొని రావడం - గూడు కట్టుకోవడానికి చాలా శ్రమించాయి. కొన్నిరోజులకి గూటిలోనుంచి వచ్చే అల్లరి పెరిగి పోయింది. రెండు కిచకిచలకి బదులు ఎన్నో పిచ్చిక గొంతులు కలిపి కోరస్ పాడేవి. నాలుగో, అయిదో పిల్లలు, తల్లిపిచ్చుక, తండ్రి పిచ్చుక కలిపి రణగొణ ధ్వని చేసేవి. రాత్రీ, పగలు అనే భేదం లేదు. అలా కొంతకాలం గడిచిన తరువాత గూడు ఖాళీ అయిపోయింది. పిల్లలు ఎగరగలిగే వయసు వచ్చి ఎక్కడికో ఎగిరిపోయి ఉంటాయి. ఖాళీ గూడు అలాగే ఉండిపోయింది. తరువాతి సీజన్‌కి కూడా మళ్ళీ అలాగే జరిగింది. మేం ఆ ఇల్లు మారి వేరే చోటుకి రావడంతో ఇప్పుడు మాకు పిచ్చుకలు ఎక్కడా కనిపించడం లేదు.  
రెండు మూడు దశాబ్ధాల క్రితం వరకూ విరివిగా కనిపించే పిచ్చుకలు, ఇప్పుడు చాలా అరుదయిపోయాయి.  అంతర్ధానమైపోతున్న పిచ్చుకల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతుంది. గతసంవత్సరం దీనిని ఢిల్లీ స్టేట్ బర్డ్‌గా ప్రకటించారు. భారత తపాలా శాఖ కూడా పోస్టల్ స్టేంప్‌ని విడుదల చేసింది. మార్చ్ 20 ని  ప్రపంచ పిచ్చుకల దినోత్సవం - వాల్డ్ స్పారో డేగా జరుపుకొంటున్నారు. 
బుల్లి పిచ్చుకకి పెద్ద కష్టం వచ్చిపడింది. కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్టు, పిచ్చుకల ప్రస్థుత దుస్థితికి కూడా చాలా మానవ తప్పిదాలు ఉన్నాయి. ప్రకృతికి హాని చేసే ప్రతీ పనీ జీవసమతుల్యాన్ని దెబ్బతీసే అంశంగా పరిణమిస్తుందని పర్యావరణవేత్తలు చెపుతూనే ఉన్నారు. సెల్‌టవర్లు, విరివిగా వాడుతున్న పురుగుమందులు, వాతావరణ కాలుష్యం, పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు, తరిగి పోతున్న వనసంపద లాంటివన్నీ పిచ్చుక అస్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. 

నేచర్ ఫరెవర్ సొసైటీ వాళ్ళు పిచ్చుకల సంరక్షణకోసం కొన్ని సూచనలు చేస్తున్నారు:

- పిచ్చుకల నివాసంకోసం పెట్టెలను ఏర్పాటు చెయ్యడం
- ఒక పాత్రలో నీటిని పక్షులకి అందుబాటులో ఉంచడం, దాన్ని ప్రతీరోజూ మార్చడం
- ఆహారాన్ని అందుబాటులో ఉంచడం
- మొక్కల్ని పెంచడం
- గార్దెన్లలో పురుగులు, కీటకాలు అభివృద్ది అయ్యేలా పెంటను(మేన్యూర్) జల్లడం.

త్వరలోనే మళ్ళీ పిచ్చుకల కిచకిచలు విరివిగా వినే అదృష్టం కలగాలని ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సాక్షిగా కోరుకొందాం.
Photo : The Hindu
© Dantuluri Kishore Varma 

4 comments:

  1. పిచ్చుకల లాంటి చిన్న పక్షుల అదృశ్యానికి సెల్ టవర్లే కారణమనుకుంటాను.
    మిగతా సమస్యలున్నా పావురాలు లాంటివి మనగలుగుతున్నాయి కదా!

    ReplyDelete
  2. I suppose it is a misconception. I have seen the sparrow at many places. The decrease is due to the use of indiscriminate usage of pesticides There are residuals of pesticides on all the food stuffs of sparrows. Their breeding had diminished due to this reason. The same is the case with human reproduction. Why ladies of this age are not conceiving second time, which has become a rarity?

    ReplyDelete
  3. మన మధ్య ఎక్కువగా కనిపించే, జీవించే పక్షులు పిచుకలు. ఇలా కనుమరుగవటం బాధాకరమే. ఇలాంటి జీవులనీ జూ లో చూసే పరిస్థితి రాకుండా ఉండాలంటే మనిషి మనిషినే కాదు ప్రకృతినీ ప్రకృతిగా ఉండనివ్వాలి.
    తపాలాబిళ్ళ పై పోస్టల్ వాళ్ళు మంచి చిత్రం ఎంచుకున్నారు. ఇలాగన్నా వీటిని గుర్తుచేసుకోవటం శోచనీయం!
    మంచి జ్ఞాపిక మీ వ్యాసం కిషోర్ గారూ!

    ReplyDelete
  4. బోనగిరిగారు నాబ్లాగుకి మీకు స్వాగతం. ఆహారం లభ్యతలేక పోవడం, ఫెస్టిసైడ్స్ ఎక్కువగా ఉపయోగించడం... మొదలైన ఎన్నో పిచ్చుకల సంఖ్య తగ్గడానికి కారణమై ఉండవచ్చు. శర్మగారూ ఈ విషయం టపాలో ప్రస్తావించాను. బోనగిరి గారు, శర్మగారు, చిన్ని ఆశగారు మీ స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!