
దసరా నవరాత్రులు సందర్భంగా
బెజవాడ కనకదుర్గమ్మ రోజుకో అవతారంతో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఊరంతా సందడిగా ఉంది.
ముందరి టపాలో పనిమీద విజయవాడ వెళ్ళానని చెప్పాను కదా? ఓ రోజు పని తొందరగా ముగించుకొని సాయంత్రం ఏడుగంటలకి గుడికి వెళ్ళాం. ప్రభుత్వ వాహనాలు మినహా మరి ఏ విధమైన వాహనాలు కొండపైకి వెళ్ళే అవకాశం లేకపోవడంతో కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర మమ్మల్ని దించేసి ఆటో వెళ్ళిపోయింది. దేవస్థానం ఉచిత బస్సులు కూడా భక్తులని కొండ దిగువనే దించేస్తున్నాయి. ఎవరైనా అక్కడినుంచి కొండవైపుకి నడచి వెళ్ళాలి. కొండ దిగువన వినాయకుడి గుడిదగ్గరనుంచి పై వరకూ దర్శనం క్యూ ఉంది. పోలీసులు, వాలంటీర్లు మంచి సర్వీస్ చేస్తున్నారు. క్యూలైన్‌లో భక్తులకి వాటర్‌ప్యాకెట్‌లు సరఫరా చేస్తున్నారు. అవసరమైన వాళ్ళకి ఇంగ్లీష్ మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ మరునాడు మూలా నక్షత్రమైన కారణంగా అమ్మవారిని సరస్వతీ అవతారంలో అలంకరించడానికి కావలసిన ఏర్పాట్ల దృష్ట్యా పదిన్నరకే దర్శనం నిలిపి వేస్తామని, కాబట్టి క్యూలైన్లో ఉన్నవాళ్ళు తొందరగా నడవాలని మైకులో ఎనౌన్స్‌మెంట్ ఇస్తున్నారు. పరుగు లాంటి నడక. ఎంతసమయం పడుతుందో అనుకొంటుండగానే ముప్పావుగంటలో చక్కని దర్శనం అయ్యింది.
 |
దసరా సంబరాల స్వాగతద్వారం |
 |
ఇంద్రకీలాద్రి మీద దసరా లైటింగ్ |
 |
సాంస్కృతిక కార్యక్రమాల్లో చక్కని పాటకి నృత్యాభినయంచేస్తున్న ఓ చిన్నారి |
 |
తీర్థం లేకపోతే సందడి అంతగా ఉండదేమో! |
 |
కనకదుర్గలు |
మనకాకినాడలో బ్లాగ్ పాఠకులందరికీ దసరా శుభాకాంక్షలు.
© Dantuluri Kishore Varma
సంతోషం. అదృష్టవంతులు. పద్ధెనిమిదేళ్ళు విజయవాడలో ఉన్నానుగానీ ఏ సంవత్సరమూ దసరాల సమయంలో దుర్గగుడిని సమీపించే సాహసం చెయ్యలేదు.
ReplyDeleteధన్యవాదాలు నారాయణస్వామిగారు.
Deleteకాకినాడ నుంచి దగ్గర్లో ఉన్న దేవాలయాలు చూడాలని ఉంది.బంధువుల ఇంటి నుంచి కాకినాడ నుంచి కార్లో వెళితే సాయంత్రం ఇంటికి వచ్చేలా మార్గ దర్శనం చేయగలరా? కాకినాడ లో మూడు రోజులు ఉంటాము. ఎలా ప్లాన్ చేయాలి. దయ చేసి చెప్పగలరు.
ReplyDeleteమూడురోజులూ మూడు రూట్లలో వెళ్ళండి.
Delete1. మొదటిరోజు కాకినాడకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నవరం వెళ్ళండి - అక్కడి దర్శనంతరువాత తిరిగి వచ్చేటప్పుడు పిఠాపురంలో పాదగయ కుక్కుటేశ్వరస్వామి దేవాలయం మరియు పురుహూతికా అమ్మవారు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. పిఠాపురంలోనే ఉన్న కుంతీమాధవస్వామి దేవాలయం కూడా దర్శించండి. తిరిగి వచ్చేటప్పుడు కాకినాడ ఊరిలో ప్రవేశించాకా పరిపూర్ణానందస్వామి వారి శ్రీపీఠాన్ని చూడవచ్చు. కాకినాడలో బందువుల ఇంటిలో ఉంటామంటున్నారు కనుక సాయంత్రం రిఫ్రెష్ అయ్యాక సర్పవరంలో ఉన్న ప్రాచీన వైష్ణవ దేవాలయం భావన్నారాయణస్వామి గుడి చూడండి.
2. రెండవరోజు కాకినాడనుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సామర్లకోటకి వెళ్ళండి. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కుమారారామ స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. అది చూసుకొన్న తరువాత ద్వారపూడి వెళ్ళండి. ఇది సామర్లకోటనుంచి సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఒకే ప్రాంగణంలో చాలా గుడులు ఉన్నాయి. ద్వారపూడి నుంచి మరికొంత దూరంలో బిక్కవోలు ఉంది. ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మొదలైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దారిలోనే బలబద్రపురంలో ఆంధ్రా శిరిడిసాయి దేవాలయం ఉంది. ఈ గుడులు దర్శించుకొన్న తరువాత మీకు సమయం మిగిలితే దగ్గరలోనే ఉన్న కడియపులంక వెళ్ళవచ్చు. చాలా నర్సరీలు ఉన్నాయి కడియంలో - తిరిగి కాకినాడ.
3. మూడవరోజు కాకినాడ నుంచి ద్రాక్షారామ (ఇది మరొక పంచారామ క్షేత్రం) 28 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిపల్లి వెళ్ళవచ్చు. తిరిగి వచ్చేటప్పుడు యానం మీదుగా వస్తే మట్లపాలెంలో ఉన్న మహాలక్ష్మి గుడి, అది దాటిన వెంటనే జామికాయల తూము దగ్గర ఉన్న శ్రీ జియ్యరు స్వామి ఆశ్రమంలో నిర్మించిన అందమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి గుడి చూడండి.