Pages

Saturday, 25 October 2014

ఇటువంటి బడి..

వీరేంద్ర హెగ్గడే అనే ఆయన గురించి తెలుసుకొంటే ఆనందం వేస్తుంది. కర్నాటకలోని ధర్మశాలలో ఉన్న పురాతనమైన మంజునాథుని దేవాలయం గురించి చాలామంది వినే ఉంటారు. ఆ దేవాలయానికి వంశపారంపర్య ధర్మకర్త ఈయన. కేవలం దేవాలయానికి సంబంధించే కాకుండా సామాజిక సేవకు సంబంధించిన విషయాలలో వీరేంద్ర హెగ్గడే చూపించిన మార్గం ఎంతో విలక్షణంగా ఉంటుంది. 

ప్రస్తుత కాలంలో చదువు అంటే ఏమిటని ఎవరినైనా అడిగితే - పాఠాలని గుర్తుపెట్టుకోవడం, పరీక్షల్లో వేలో లక్షలో సంఖ్యలో ఉండే పోటీదారులతో తలపడి ర్యాంకులు సంపాదించడం, తరువాతి తరగతికి వెళ్ళడం.. అని సమాధానం చెపుతారు. ఇంగ్లీష్‌లో కౌచ్‌పొటేటో అనే పదం ఉంది. బడికి వెళ్ళివచ్చిన తరువాత కాళీ సమయం అంతా సోఫాలో కూర్చొని ఏ చిప్సో తింటూ టీవీ చూడడమో, కంప్యూటర్ గేంలు ఆడుకోవడమో చేసేవాళ్ళని కౌచ్‌పొటేటోలని పిలుస్తారు. ప్రస్తుతం చాలామంది పిల్లల్ని చూస్తుంటే కౌచ్‌పొటేటోల్లాగే అనిపిస్తున్నారు. శారీరకశ్రమ చెయ్యలేరు. ఇంటిలో తమ్ముడో, చెల్లెలో కూడా ఉండని పరిస్థితి కనుక మరొకరి పొడగిట్టడంలేదు. ఖర్మకాలి చదువుకొన్న చదువుకి తగిన ఉద్యోగం రాకపోతే వీళ్ళు ఎందుకూ కొరగాని వాళ్ళలా తయారయ్యే ప్రమాదం ఉంది.    

కానీ దక్షిన కర్నాటకలో వుజైర్ అనే ఊళ్ళో హెగ్గడే స్థాపించిన రత్నమానస అనే పాఠశాలలో చరిత్ర, విజ్ఞానశాస్త్రం, గణితం, రెండో మూడో భాషలతో పాటు జీవితానికి ఉపయోగపడే ఎన్నో నైపుణ్యాలని నేర్పుతారు. ఇక్కడి విద్యయొక్క ప్రత్యేకత ఏమిటంటే విద్యార్థులే తాముండే హాస్టల్‌ను నిర్వహించుకోవాలి. పంటలు పండించుకోవాలి, పశువుల దగ్గర పాలు పిండుకోవాలి, వ్యవసాయ ఉత్పత్తుల్నీ పాలనీ అమ్ముకోవాలి, వచ్చిన సొమ్ముని సహకారసంస్థల్లో, బ్యాంకుల్లో మదుపుచెయ్యాలి, వండుకోవాలి... ఇంకా హాస్టల్లో చెయ్యవలసిన అన్నిపనులనీ విద్యార్థులే స్వయంగా చెయ్యాలి. ఒకపూట చదువు, మరొకపూట ఈ పనులు. మన పనుల్ని ఇతరులమీద ఆధారపడకుండా మనమే చేసుకోవడం, పండించుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం, డబ్బుని నిర్వహించుకోవడం, అవసరం అయినచోట మిగిలిన వారి సహకారం తీసుకోవడం... ఇదే జీవితాన్ని విజయవంతంగా జీవించడానికి కావలసిని నిజమైన చదువు! అలాంటి చదువునే నేర్పిస్తుండడంతో ఇక్కడి విద్యార్థులు విజయాలబాటన నడుస్తున్నారట! 
రత్నమానసలో చేరడానికి రాష్ట్రం నలుమూలలనుంచీ ఎంతో మంది పోటీపడతారు. అయితే ఇక్కడ ప్రవేశ పరిక్షకూడా వినూత్నంగా ఉంటుంది. ప్రవేశం కోరుకొనే విద్యార్థుల్ని హాస్టల్లో మూడురోజులు ఉంచుకొని వాళ్ళ దృక్పదాలని గమనించిన తరువాత ఎంపిక చేస్తారుట. ఎంపికకి తమపనుల్ని చేసుకోగలగడం, మిగిలినవారితో వ్యవహరించడం అనే విషయాలు ముఖ్యమైనవి. అప్పటికే హాస్టల్‌లో ఉండి చదువుకొంటున్న పైతరగతి విద్యార్థుల్లో ఒక్కొక్కరికి కొత్తగా చేరిన వాళ్ళల్లో ఒక్కొక్కరిని అప్పగిస్తారట. అప్పటినుంచి వాళ్ళూ సొంత తమ్ముడికి నేర్పించినట్టు పనులన్నీ నేర్పించాలి.  

రోజువారీ కార్యక్రమాలతో పాటూ ప్రతీవిద్యార్థీ రోజుకొక మంచి విలువలతో కూడిన కథనో,  ఓ మహానీయుడి జీవితచరిత్రనో చదివి తనకు అర్థమైనంత మటుకు దానిగురించి రాయాలి. దీనివల్ల వాళ్ళందరూ ఎంతో స్పూర్తిని పొందుతారు. సాయంత్రం సమయాల్లో ఆటలాడతారు. స్టడీ ట్రిప్పుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, పరిశ్రమలకి, బ్యాంకులకి వెళతారు. అక్కడ జరిగే పనులని గమనిస్తారు. 

రత్నమానసల్లాంటి పాఠశాలలు మనకి కూడా ఉంటే బాగుండుననిపిస్తుంది కదూ? అటువంటివి వచ్చేవరకూ మామూలు బడుల్లో చదువుకొంటున్న పిల్లల్ని ఇంటిదగ్గర తల్లితండ్రులైనా కౌచ్‌పొటేటోల్లా మార్చకుండా రోజువారీ పనులూ, లోకజ్ఞానం నేర్పించడం, చక్కని పుస్తకాలు చదివించడం లాంటివి చేయిస్తే బాగుంటుంది కదా? 

కావాలంటే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఇది కన్నడ భాషలో ఉన్నప్పటికీ, ఈ టపాలో ఉన్న విషయం చదివి, వీడియో చూస్తే విషయం చక్కగా అర్థమౌతుంది.

© Dantuluri Kishore Varma

2 comments:

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!