కాలంకాని కాలంలో మండుటెండలు! విజయవాడకి ప్రయాణం. చివరినిమిషంలో రిజర్వేషన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? సర్కార్ ఎక్స్‌ప్రెస్ కాకినాడలోనే బయలుదేరుతుంది కనుక పోర్టు ష్టేషన్‌కి అరగంట ముందే చేరుకొని జనరల్ కంపార్ట్‌మెంట్‌లో చోటు సంపాదించాం. కోరి కోరి వోవెన్‌లోకి ప్రవేశించినట్టు ఉంది. క్రమంగా సీట్లన్నీ నిండిపోయాయి. నుంచొనే జాగా కూడా జనాలతో కిక్కిరిసిపోయింది. రాజకీయాలు, కుటుంబ కలహాలు, కాలేజీ కబుర్లు, రియల్ఎస్టేట్ ఎస్టిమేషన్లు, సినిమాలు, వ్యాపకాలు... ఎవరి ధోరణి వాళ్లది. ఇవన్నీ కాక అరడజనుమంది కుర్రాళ్ళు కలిసి ఆడుకొంటున్న హౌసీగేం. రేడియోలో స్టేషన్లన్నీ కలిసిపోయి వస్తున్నట్టు ఉంది గోల. చిన్నగా తలనొప్పి మొదలవుతున్న సమయానికి కనిపించింది రైలు కిటికీలోనుంచి అల్లంత దూరంలో నల్లని మేఘం ఒకటి. కలిసి మాతో పాటు కొంతదూరం ప్రయాణించిన వర్షమేఘం ఒక్కసారి చిరుజల్లులు కురిపించింది. చల్లగాలి రైలుపెట్టెలో ఉక్కిపోతున్న జనాలకు సేదతీర్చింది. కురిసినది ఐదు నిమిషాలయినా, అడుగంటుకు పోయిన వోపికని ప్రోగుచేసి మిగిలిన ప్రయాణాన్ని కొనసాగించగలిగే ఉత్సాహాన్ని ఇచ్చింది. వర్షానికి ముందు, కురుస్తూ ఉండగా, ఆ తరువాత తీసిన ఫోటోలు కొన్ని మీ కోసం..
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment