తూర్పుగోదావరి జిల్లా మురమళ్ళలో ప్రముఖమైన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దేవాలయం ఉంది.
వీరేశ్వరస్వామి, భద్రకాళి ఎవరో తెలుసుకోవాలంటే దక్షయజ్ఞం గురించి తెలుసుకోవాలి. `మనకాకినాడలో..` బ్లాగులో ఇదివరలో పాదగయ టపాలోనూ, ద్రాక్షారామం టపాలోనూ దక్షయజ్ఞం గురించి ప్రస్తావించడం జరిగింది. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి పరమేశ్వరుడిని పరిణయమాడింది. తరువాత కొంతకాలానికి దక్షుడు యజ్ఞం చెయ్యతలపెట్టాడు. అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి - కూతురికీ, అల్లుడికీ తప్ప. అయినప్పటికీ సతీదేవి వెళ్ళింది. పిలువని పేరంటం కనుక తండ్రిగారి ఇంట ఆమెకి అవమానం జరిగింది. అగ్నిని సృష్టించుకొని, దానిలోనికి ప్రవేశించి ఆత్మాహుతి చేసుకొంది. శివుడు మహోగ్రుడయ్యాడు. తన జటాజూటంనుంచి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు దక్షుడిని సమ్హరించాడు. కానీ యజ్ఞభంగం మంచిది కాదు. అందువలన దేవతల కోరికమీద దక్షుని మొండానికి మేకతలను తగిలించి యజ్ఞ పరిసమాప్తి చేయిస్తాడు. మహోగ్రానికి నిలువెత్తురూపమైన వీరభద్రుడి కోపం అప్పటికీ తగ్గలేదు. దక్షయజ్ఞ కథకు సంబందించిన సన్నివేశ చిత్రాలు ఈ దేవాలయంలో ముఖమండప గోడలమీద అందంగా చిత్రీకరించారు. వాటిని తరువాతి టపాలో ఇస్తాను.
వీరభద్రుడిని శాంతింప చెయ్యవలసిన అవసరం ఉంది. అందుకోసం ఆదిపరాశక్తి తన పదహారుకళలలో ఒకకళని భద్రకాళిగా పంపుతుంది. ఆమెను చూసి వీరభద్రుడు కొంత శాంతిస్తాడు. ఇప్పటి మురమళ్ళ అప్పటిలో మునిమండలం అనే పేరుతో ఉండేది. ఇది ఒక మునివాటిక - వృద్దగౌతమీ నదీతీరం, ప్రశాంతమైన ప్రదేశం. అదిగో సరిగ్గా ఆ ప్రదేశంలోనే భద్రకాళి వ్యక్తమయ్యింది. మునుల సమక్షంలో వీరభద్రుడు, భద్రకాళీల వివాహం గాంధర్వ శైలిలో జరిగింది. వీరభద్రుడు పూర్తిగా శాంతించాడు. ఇది ఈ దేవాలయం యొక్క స్థలపురాణం.
ఇక దేవాలయం యొక్క ప్రత్యేకత విషయానికి వస్తే స్వామివారికి, అమ్మవారికి ప్రతిరోజూ కళ్యాణం జరిపిస్తారు. పల్లకీలో లేదా నందివాహనం మీద గ్రామోత్సవం నిర్వహిస్తారు. మేళతాళాలతో, యక్షగానాలతో, వేదమంత్రాల నడుమ మండపంలో కళ్యాణం జరిపిస్తారు. తల్లితండ్రులు పెళ్ళికాని యుక్తవయసు పిల్లల పేరుమీద కళ్యాణం జరిపిస్తే తొందరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. వైశాఖ శుద్ధ పంచమినాడు వీరేశ్వరస్వామి, భద్రకాళీఅమ్మవార్ల వివాహం జరిగిందట. కాబట్టి ప్రతీసంవత్సరం ఈ సమయానికి ఐదురోజులపాటు - వైశాఖ శుద్ధ చవితినుంచి అష్టమి వరకు - బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఈ దేవాలయానికి వెనుక లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. శివకేశవులని ఒకేసారి దర్శించుకోవచ్చు.
కాకినాడనుంచి యానం మీదుగా అమలాపురం వెళుతుంటే కాకినాడకు 38 కిలోమీటర్ల దూరంలో మురమళ్ళ గ్రామం ఉంది. అమలాపురం నుంచి అయితే ముమ్మిడివరం మీదుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రీ నుంచి సుమారు వందకిలోమీటర్లు ఉంటుంది. కాకినాడ, అమలాపురం, రాజమండ్రీల నుంచి మురమళ్ళకు ఆర్టీసీ బస్సుసౌకర్యం ఉంది. అన్నో బస్సులు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment