సంక్రాంతి సందడి అడుగడుక్కీ కనిపిస్తుంది. షాపింగ్ సెంటర్స్, సినిమాహాళ్ళు, పబ్లిక్ ప్లేసులు జనాలతో కిటకిటలాడిపోతున్నాయి. కాకినాడ దగ్గర వాకలపూడి బీచ్‌లో ఈ మధ్యన నిర్మించిన ఏ.పీ టూరిజం వాళ్ళ హరితా బీచ్ రిసార్ట్స్ ప్రాంతం పర్యాటకులతో ఇసుకవేస్తే రాలనట్టు ఉంది. వరుసగా కట్టిన ఏ.సీ. కాటేజీలకి వశిష్ట, వైనతేయ, సీలేరు లాంటి గోదావరి పాయల పేర్లూ, కాలువల పేర్లూ పెట్టారు. రెండుసంవత్సరాల క్రితం సాగర సంబరాలు మొదలు పెట్టినప్పుడు ప్రారంభించిన శిల్పారామంలో శిల్పాలన్నీ ఇప్పుడు ఈ కాటేజీలకు ఎదురుగా వచ్చేశాయి. కొంచెం దూరంలో ఇప్పటికీ ఉన్న శిల్పారామం పార్క్‌లో మాత్రం వాటిని నిలబెట్టడానికి కట్టిన దిమ్మలు మిగిలాయి.
సముద్రానికీ, రిసార్ట్‌కి మధ్య ఉన్న కాలువమీద చెక్కలవంతెన కట్టారు. ఈ రోజు ఉన్న హెవీ రష్ వల్ల వంతెన దాటాలంటే ఒకవైపు నుంచి వచ్చేవాళ్ళు పూర్తిగా క్రిందకు దిగినవరకూ వంతెనకు రెండవవైపు వాళ్ళు పది, పదిహేను నిమిషాలపాటు వేచి ఉండవలసి వస్తుంది. కొన్ని వందలమంది ఒకేసారి దాటుతుంటే ఆ బరువుకి వంతెన ఆగుతుందా అని సందేహం కలుగుతుంది.
క్రింద కాలువలో బోటు షికారు పెట్టారు. పుట్టీలు అని పిలిచే రౌండ్‌బోట్లు ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిగా ఇక్కడే ఏర్పాటు చేశారు. వాటిని ఎక్కి ఎవరూ బోట్‌షికారు చెయ్యడంలేదు కానీ, కాలువ వొడ్డుమీద రెండు పుట్టీలు నిలిపి ఉన్నాయి. ఇదిగో, ఈ పుట్టీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది?
కెరటాలహోరు, ఆ హోరుని మించి వాటికి ఎదురు వెళుతున్న జనాల కేరింతలు; సముద్రం పైనుంచి వచ్చే చల్లగాలిని రిసార్ట్స్‌లో కూర్చొని ఆస్వాదిస్తున్న భావుకులు; సముద్రానికీ, రిసార్టుకీ మధ్య కాలువలో బోటుషికారు; సరుగుడు చెట్ల వెనుకనుంచి మెల్లగా అస్తమిస్తున్న సూర్యుడు; దూ..రంగా నిలబడి అన్నింటినీ గమనిస్తున్నట్టున్న లైట్‌హౌస్...
ఈ రోజు హడావుడి చూస్తుంటే మామూలు రోజుల్లో కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులని ఆకర్షించగల సౌందర్యం కాకినాడ బీచ్‌కి ఉంది అనిపిస్తుంది. . ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ప్రకృతి ప్రేమికులకి కావలసిన సౌకర్యాలను కల్పించే దిశగా ప్రభుత్వం, టూరిజంశాఖలు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగిస్తే అతిత్వరలోనే పర్యాటక పటం మీద కాకినాడ పేరు ప్రముఖంగా కనిపించవచ్చు.
విష్ కాకినాడ ఆల్ ద బెస్ట్!
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment