రాజా పార్క్ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న రామారావుపేట వీధిలో ఆంధ్రసాహిత్య పరిషత్ ఆర్క్యలాజికల్ మ్యూజియం ఉంది. మ్యూజియంకి ఆంధ్ర సాహిత్య పరిషత్ అనే పేరు ఏమిటి అనే అనుమానం వస్తుంది ఎవరికైనా. చాలా కాలం క్రితం అంటే 1911లో జయంతి రామయ్య పంతులు అనే ఆయన ఆంధ్ర సాహిత్య పరిషత్‌ని మద్రాసులో ప్రారంభించారట. తెలుగు నిఘంటువులలో తలమానికం లాంటి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువుని రాసి, ముద్రించినది ఈయనే. పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలలో మొదటిది `ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక` అనే దాన్ని ప్రచురించడం. ఇది కాక అరుదైన తాళపత్ర గ్రంధాలనీ, చేతివ్రాత ప్రతులనీ సేకరించి ప్రచురించడం. పిఠాపురం రాజా వారి ఆర్థిక సహకారంతో పరిషత్ కార్యక్రమాలు చక్కగా కొనసాగాయి. 1919 లో పరిషత్‌ని మద్రాసునుంచి కాకినాడకు తరలించారు. 1973లో సేకరణలు అన్నీ పురావస్తు శాఖకు అప్పగించారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం కాకినాడలో ఈ మ్యూజియం నడుస్తుంది.
క్రీస్తుశకం 11వ శతాబ్ధంలో నన్నయ్య రచించిన మహాభారతంలోని ఆదిపర్వం, 14వ శతాబ్ధం నాటి శ్రీనాథ విరిచిత భీమఖండం, 16వ శతాబ్ధంలో పిల్లలమర్రి చినవీరభద్రుడు రచించిన జైమినీ భారతం, రామాయణంలో కిష్కిందకాండ, నటరాజ యశోభూషణం లాంటి ఎన్నో తాళపత్ర గ్రంధాలు ప్రదర్శనలో ఉంచారు. ఇవికాక 19శతాబ్ధపు ఆంధ్ర శబ్ధ చింతామణి, శ్రీనాధుని శివరాత్రి మహత్యము లాంటి చేతివ్రాత ప్రతులు ఉన్నాయి. ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటి ఉంది. తాళపత్ర గ్రంధాలు కానీ, చేతివ్రాత ప్రతులు కానీ ఆయా కవులు స్వయంగా రాసినవి అనుకోవడానికి లేదు. ఇప్పటి ముద్రణలాగ అప్పుడు మూల గ్రంధం నుంచి ఎన్నో నకళ్ళు తయారు చేసి వ్యవహారంలోకి తెచ్చేవారట. కాబట్టి ఇవి మూల గ్రంధాలు కావచ్చు, నకళ్ళు కావచ్చు. ఈ గ్రంధాలతోపాటూ, అక్షరాల ముద్రణకి బంగారాన్ని వాడిన అరబిక్ పుస్తకం మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణ.
2,50,000 సంవత్సరాల నాటి పాత శిలాయుగపు రాతి పనిముట్లు ఉన్నాయి. ఇవి పశ్చిమగోదావరి జిల్లాలో పెదవేగి గ్రామంలో తవ్వి తీసినవి. ఒకటవ శతాబ్ధంలో కాకినాడ సమీపంలో చొల్లంగి గ్రామంలో ప్రజలు వాడిన మట్టిపాత్రలు ఉన్నాయి. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాల్లో ఉపయోగించిన కత్తులు, బాకులు, సింధునది నాగరికతకు చెందిన ముద్రల నకళ్ళు, ఐదవ శతాబ్ధంనాటి యక్షిణుల ప్రతిమలు, తెలుగు లిపి పరిణామక్రమాన్ని తెలియజేసే చార్టులు, తూర్పు చాళుక్యుల దాన శాసనాలు, బ్రిటీషువాళ్ళ నాణాలు, ఏనుగు దంతంతో చేసిన పెద్ద పాచికలు, పురాతన పంచలోహ విగ్రహాలు, శిల్పాలు ఎన్నో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
మ్యూజియం సిబ్బంది ఓపికగా పురాతన వస్తువులనన్నంటినీ చూపిస్తూ, వాటి గురించి వివరించారు. వంద చరిత్ర పాఠాలు చెప్పినా అర్థం కాని విశేషాలు ఒక్క మ్యూజియం సందర్శనతో అర్థమవుతాయి. కాకినాడ, పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు విద్యార్థులని మ్యూజియం చూడడానికి పంపిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రకమైన ప్రయత్నాలు మొదలు పెట్టామనీ; ప్రతీ సంవత్సరం క్విజ్, వ్యాసరచన పోటీలు లాంటివి నిర్వహిస్తున్నామని క్యూరేటర్ శ్రీ తిమ్మరాజుగారు చెప్పారు.
వివిధ కాలాలకు చెందిన ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. మ్యూజియం ప్రతీరోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తెరిచి ఉంటుంది. ప్రతీ శుక్రవారం, రెండవ శనివారం శలవు.
© Dantuluri Kishore Varma
We were seeing this Museum since 1977 but never went inside, that too living very other side of the Park. We do not know that so much valuable documents are inside,
ReplyDeleteThanks for the info. Can u please tell us the visiting hours.
చలపతిగారూ ధన్యవాదాలు. మ్యూజియంని తప్పనిసరిగా విజిట్ చెయ్యండి. విజిటింగ్ అవర్స్ - ప్రతీరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ. ప్రతీ శుక్రవారం, రెండవ శనివారం శలవు.
Delete