అలస్కాకి పశ్చిమంగా బేరింగ్ సముద్రంలో సెయింట్ పాల్స్ అనే చిన్నద్వీపం ఉంది. ప్రతీసంవత్సరం జూన్, జూలై మాసాల్లో ఈ ద్వీపంలో ఉన్న నొవస్తోష్నా అనే బీచ్‌కి లక్షలకొద్దీ సీల్ చేపలు వస్తాయి. ఇక్కడికి సమీపంలో ఉన్న చిన్న కొండను ఎక్కి బీచ్ వైపు చూస్తే సముద్రపు కెరటాల మీద లుకలుకమని అసంఖ్యాకమైన సీల్‌చేపలు వొడ్డువైపు ఈదుకొంటూ రావడం కనిపిస్తుంది. ఇక తీరం మీద అయితే కనుచూపు మేర వరకూ లక్షల కొద్దీ సీళ్ళు దెబ్బలాడుకొంటూ, ఆటలాడుకొంటూ, విశ్రాంతి తీసుకొంటూ, కెరటాల హోరుని దాటి రణగొణ ధ్వని చేస్తూ కనిపిస్తాయి. నొవస్తోష్నా సముద్రతీరానికి వచ్చి, పిల్లల్ని పెట్టి అటు ఇటూగా అక్టోబర్ నాటి కల్లా సీలు చేపలన్నీ తిరిగి వెళ్ళిపోతాయి.
చాలా సంవత్సరాల క్రితం సీక్యాచ్ అనే పదిహేను సంవత్సరాల మగ సీల్ ఎప్పటిలాగే ఇక్కడికి వస్తుంది. పదిహేను సంవత్సరాలంటే సీళ్ళ జీవనప్రమాణం ప్రకారం చాలా ఎక్కువ. సీక్యాచ్‌కి మెడమీద జూలు పెరిగి ఉంటుంది, కుక్కలకుండే పదునైన పళ్ళలాగ వొంపుతిరిగిన రెండు కోరలు ఉంటాయి, వెనుక కాళ్ళమీద నీటారుగా నిలబడిందంటే సుమారు నాలుగడుగుల ఎత్తు ఉంటుంది, మూడువందల కేజీల పైనే బరువు ఉంటుంది! ఆ సీజన్ అంతా కెరటాలకి సమీపంలో ఒక రాతి మీద ఉండడానికి చోటుకోసం మిగిలిన సీళ్ళతో సీక్యాచ్ భయంకరంగా పోరాడుతుంది. పోరాటాల ఫలితంగా వొళ్ళంతా రక్తసిక్తమైనా తన చోటుని ఎట్టకేలకు దక్కించుకొంటుంది. ఒక నెల ఆలస్యంగా సీక్యాచ్‌తో జతకట్టే మట్కా అనే ఆడ సీల్ నొవస్తోష్నాకి చేరుకొంది. వాటికి పుట్టిన సీల్‌చేపే కోటిక్. కోటిక్ మిగిలిన అన్ని సీల్స్ లాంటిది కాదు. దీని రంగు తెలుపు. దానిలో ప్రత్యేకత ఏముంది అని సీల్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు. కానీ సీక్యాచ్ ఉద్దేశ్యం ప్రకారం ప్రపంచంలో అప్పటివరకూ తెల్ల సీల్ అనేది లేనే లేదు.
ఓ బుజ్జి కుక్క పిల్ల లాగ తల్లి కూడా బుడి బుడి అడుగులు వేసుకొంటూ నడవడం, తల్లి తెచ్చిన ఆహారం తినడం, మిగిలిన సీలు పిల్లలతో అలసిపోయేటంత వరకూ ఒడ్డుమీద ఆడుకోవడం, ఆ తరువాత నిద్రపోవడం. ఇదే పని కోటిక్‌కి. సీళ్ళు సముద్ర జంతువులు కనుక వాటికి చేపల్లాగ పుట్టకతోనే ఈత వచ్చేస్తుందని అనుకొంటాం. కానీ బుజ్జి పాపలకి ఎలా ఈత రాదో, బుజ్జి సీల్స్‌కి కూడా అలాగే ఈత రాదు. వాటికి భుజాలూ, బుర్రా బరువుగా ఉంటాయి. నీటిలోకి వెళ్ళడంతోనే బుర్ర ములిగి పోతుంది. కానీ ఈత కొట్టడం నేర్చుకొనే వరకూ సీలు చేపలు స్థిమితంగా ఉండలేవు! `ఆరువారల వయసు వరకూ నీటి దగ్గరకు వెళ్ళకు మునిగి పోతావు. వేడి గాలులు, రాకాసి సొరచేపలు హాని చేస్తాయి జాగ్రత్తగా చూసుకో,` అని తల్లి వైట్‌సీల్‌కి చెపుతుంది.
అక్టోబర్ వచ్చింది. కోటిక్ తల్లితో పాటూ సెయింట్ పాల్స్ ద్వీపాన్ని వదిలిపెట్టి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఓ ఆరు మాసాల పాటు ఈదడం, వెల్లకిలా కెరటాల మీద తేలుతూ విశ్రాంతి తీసుకోవడం, డాల్ఫిన్లలాగ నీటిలోనుంచి నాలుగైదు అడుగుల ఎత్తువరకూ గెంతగలగడం, ఆహారం సంపాదించుకోవడం, శత్రువులనుంచి కాపాడుకోవడం, ప్రమాదాలకి దూరంగా ఉండడం, సముద్రపు నీటి ఉష్ణోగ్రతను బట్టి వాతావరణాన్ని తెలుసుకోవడం.. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకొంటుంది. ఆ తరువాత సంవత్సరం సెయింట్ పాల్స్ ద్వీపానికి వచ్చేటప్పటికి కోటిక్ ఒక చక్కనైన సీల్.
ప్రమాదాలు సముద్రంలోనే కాదు, వొడ్డుమీద కూడా ఉంటాయి. ఓ రోజు సీల్‌చేపలను వేటాడే మూఠా నొవస్తోష్నా సముద్రతీరానికి వస్తారు. స్వేశ్చగా ఆడుకొంటున్న ఒకటి రెండు సంవత్సరాల వయసు సీళ్లల్లో ఓ వంద వాటిని ఎంచుకొని, గొర్రెలమందను తోలుకొని పోయినట్టు తీసుకొని పోతారు. మిగిలిన సీళ్ళు చూస్తాయి. కానీ వాటి ఆట వాటిదే. ఎక్కడికి తీసుకెళుతున్నారన్న ధ్యాస వాటికి లేదు. ఇలా ఎందుకు జరుగుతుందని కోటిక్ సహచరులని అడుగుతుంది. కొన్నింటిని ప్రతీరోజూ ముఠా మనుషులు తీసుకొని పోవడం పరిపాటే అని చెపుతాయి. అంతకు మించి వాటికీ ఏమీ తెలియదు. కోటిక్ వాళ్ళను వెంబడిస్తూ వెళ్ళి ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తుంది. ఒక అరమైలు దూరం సీల్స్‌ని అలా నడిపించుకొని పోయిన దుండుగులు దుడ్డుకర్రలతో వాటి నెత్తులమీద మోది, చర్మాలు వొలిచి తీసుకొని పోతారు.
ఈ మారణకాండని చూసిన వైట్‌సీల్‌కి అప్పుడే ఒక లక్ష్యం ఏర్పడుతుంది. మనుష్యులు రాని ఏదైనా సురక్షితమైన తీరానికి తన సహచరులనందరినీ తీసుకొని పోవాలని నిర్ణయించుకొంటుంది. తరువాత నాలుగు సంవత్సరాల పాటు పసిఫిక్ సముద్రంలో ఉత్తరంనుంచి దక్షిణం వరకూ అటువంటి తీరంకోసం వెతుకుతూ జల్లెడ పడుతుంది. సముద్ర జంతువులు ఎన్నింటీనో అడుగుతుంది. వెళ్ళిన ప్రతీచోటా చంపబడ్డ సీళ్ళ ఎముకలు లేదా మనుష్యుల ఉన్న ఆనవాళ్ళూ కనిపిస్తూ ఉంటాయి. తిరిగి తిరిగి అలసి పోయి, నిరుత్సాహంతో తిరుగు దారి పడుతుంది. సరిగ్గా అప్పుడే పచ్చ పచ్చగా చెట్లూ చేమలతో ఉన్న ఓ చిన్న దీవిమీద పండు ముసలి సీల్ ఒకటి కోటిక్ గాధ అంతా విని, మరొక్క సారి ప్రయత్నించమని ఉత్సాహ పరుస్తుంది. ముసలి సీల్ చిన్నప్పుడు తమ జాతిని కాపాడటానికి ఒక తెల్ల సీల్ వస్తుందని ఎవరో చెపుతారు. ఆ సీల్ కోటిక్కేనా!?
ఒకసారి సముద్రపు పక్షి ఒకటి `సీ కౌ` అనే అసహ్యంగా కనిపించే జంతువుకి కోటిక్ వెతికే ప్రదేశం తెలుస్తుందని చెపుతుంది. కోటిక్ చిట్టచివరికి సీ కౌలని వెతికి పట్టుకొంటుంది. వాటిని వెంబండించి వెళుతుంది. సముద్రంలో కొన్ని వేల అడుగుల దూరం వరకూ మునిగి ఉన్న శిల, దాని నుంచి ఓ సొరంగం, ఆ సొరంగం నుంచి దూరి ఉపరితలం మీదకి వెళితే అక్కడ బలమైన కోటగోడ మధ్యలో ఉన్నట్టు విశాలమైన తీరం! మానవ మాత్రుడెవరూ వెళ్ళలేని దుర్భేద్యమైన ప్రదేశం - కోటిక్ కంట పడుతుంది. దాని అన్వేషణ ఫలించింది!
కోటిక్ ఆనందంతో నొవస్తోష్నా తీరానికి తిరిగి వెళుతుంది. తనవాళ్ళనందరినీ వెంటరమ్మని, వాటిని శత్రువులు లేని చోటుకి తీసుకొని వెళతానని చెపుతుంది. నొవస్తోష్నాలో సీల్‌చేపల దృక్పదం వేరు. తీరంలో ఉండడానికి చిన్న చోటుకోసం వందల కొద్దీ ఇతర సీల్స్ తో పోరాడమే వాటి పని. గత నాలుగు సంవత్సరాలలో కోటిక్ ఏనాడు ఆ పని చెయ్యలేదు. దేశ దిమ్మరిలాగ ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. ఇప్పుడు జాతిని ఉద్దరించే మాటలు చెపుతున్నందుకు హేళన చేస్తాయి. `నాకు పోరాడటం రాక కాదు. దమ్ముంటే నాతో తలపడండి. వోడితే నా వెంట రావలసి ఉంటుంది,` అని శవాల్ విసురుతుంది. అనడమే కాదు, తన తెల్లటి చర్మం ఎర్రగా రక్తసిక్తం అయ్యే వరకూ బలిష్టమైన సీళ్ళతో భీకరంగా పోరాడి లొంగదీసుకొంటుంది. పోరాటంలో తనకి తోడు తండ్రి కూడా కలుస్తాడు. ఇద్దరూ వోడించిన వేలకొద్దీ సీళ్ళను తమవెంట కొత్త ప్రదేశానికి తీసుకొని పోతారు. తరువాత సంవత్సరంనుంచి మిగిలిని సీళ్ళు కూడా విషయం తెలుసుకొని క్రమంగా కోటిక్ సామ్రాజ్యానికి తరలిపోతూ ఉంటాయి. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది.
రుడ్‌యార్డ్ కిప్లింగ్ రాసిన జంగిల్‌బుక్‌లో ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆసక్తి ఉంటే అసలు కథని ఇక్కడ చదవండి. ఏనిమేటేడ్ ఫిలింస్ కూడా వచ్చాయి. ఇక్కడ చూడవచ్చు.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment