Pages

Monday, 3 March 2014

మా ఊరు పిల్లంక - బై శుభ

యానం నుంచి ద్రాక్షారామం వెళ్ళేదారిలో ఇంజరం ఊరిలోనుంచి ఎడమవైపుకి తిరిగి గోదావరి గట్టు ఎక్కేస్తే ... ఓ తల్లీ గోదారి తుళ్లి తుళ్లి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరి. పల్లె పల్లె పచ్చాని పందిరి అన్నట్టు గట్టుకి ఓ వైపు గోదావరి, మరోవైపు పచ్చని చేలూ, చేలగట్లమీద వరసల్లో కొబ్బరిచెట్లూ.. వీటన్నింటికీ మించి ఆనందం కలిగించేది `మా వూరు వచ్చేస్తున్నాం` అన్న ఫీలింగు. ఇంతకీ మావూరి పేరు చెప్పలేదు కదూ? పిల్లంక. 

ఊరంటే నా స్నేహితులూ, బందువులూ, నేను చదువుకొన్న స్కూలు, ఊరిలోనుంచి బయటకు వెళ్ళినా, తిరిగి వచ్చినా తప్పనిసరిగా హాయ్ చెప్పే గోదావరీ, గోదావరి మధ్యలో లంకలూ, కాలవగట్లమీద నడచి వెళ్ళడం, పంటుమీద, పడవలమీదా నది దాటడం గుర్తుకు వస్తాయి.  

శేఖర్ కమ్ముల, వంశీ, బాపు... సెల్యులాయిడ్ మీద చూపించిన దానికంటే పిల్లంకలో గోదావరి బాగుంటుంది.
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ఒక్కటే కాదు, పిల్లంక కూడా.
పిల్లంక కాలువ గట్టు. నా చిన్నప్పుడు మా ఊరికి బస్సు ఉండేది కాదు. ఇంజరం వంతెన వరకూ నావలమీద వెళ్ళి బస్సు ఎక్కేవాళ్ళం. కాలువలో నావమీద ప్రయాణం ఒక ప్లజంట్ మెమొరీ. తరువాత, హై స్కూల్ కి నడచి ఈ దారి వెంటే వెళ్ళేవాళ్ళం. మధ్యలో మామిడి కాయలు, చింతకాయలు.... గోల్డెన్ డేస్.
గోపాలస్వామి గుడి ఉంది. ఎప్పుడు కట్టారో తెలియదు కానీ శిధిలావస్థకి వచ్చేసింది. అందరం చూసి బాధపడటమే కానీ చెయ్యగలిగింది ఏమీ లేదు. 

రెండుసంవత్సరాల క్రితం నా కజిన్ సతీష్ పిల్లంక పేరుమీద ఫేస్‌బుక్ గ్రూప్ ప్రారంభించాడు. ఎవరో గుడి అవస్థ గురించి ఒక పోస్ట్ పెట్టారు. సభ్యులందరూ తక్షణం స్పందించారు. విరాళాలు పోగయ్యాయి. సంవత్సరం తిరిగేసరికి గుడి మరామత్తులు జరిగిపోయాయి. గుడికి చేర్చి కళ్యాణమండపం నిర్మించారు, రంగులు వేశారు. ఇప్పుడు మా వేణుగోపాలస్వామి వెలిగిపోతున్నాడు.
మావూరి యూత్ ఉంది. 
ప్రతీసంవత్సరం పెద్దపండగకి సభ్యులు అంతాకలిసి గెట్‌టుగెదర్ ఏర్పాటు చేస్తారు. ముందటేడు ఊరి ఆడబడుచులని కూడా పిలవాలని మంచి ఆలోచన వచ్చింది ఓ బుర్రలోకి. ఇంకేముంది ఆ ఏడాది పండుగకీ, మళ్ళీ ఈ పండుగకీ అంతా వచ్చి కలిశారు. ఊరంతా సందడే సందడి. కేరింతలతో, తుళ్ళింతలతో, ఆటల పాటలతో మారు మోగిపోయింది. 
గోదావరికి, వేణుగోపాలస్వామికి, పిల్లంకయూత్‌కి, ఫేస్‌బుక్‌గ్రూపుకి, హోల్‌మొత్తంగా మావూరికి జై! 


© Dantuluri Subha

దీని సోయగం చూడండి!

రాజవీధుల్లోనుంచి అంబారీ కట్టిన ఏనుగు నడచిపోతూ ఉంటే దాని ఠీవీ చూసితీరవలసిందే. పాదచారులు ప్రక్కకి తొలగిపోయి దారి వదులుతారు. ఒక్కోసారి అది మోర పైకెత్తి, తొండం లేపి ఘీంకారం చేసిందంటే దగ్గరలో ఉన్నవాళ్ళకి వెన్నులో వొణుకు పుడుతుంది. దేవుడి సేవలో ఉన్న ఏనుగులకైనా అదే రాజసం. సర్కస్‌లో మావటి చెప్పినట్టు నడుచుకొంటున్నా, ఏనుగుచేసే విన్యాసాలలో లావణ్యం తొణికిసలాడుతుంది. నేషనల్ జియోగ్రాఫిక్ చానల్లో అడివిలో తిరిగే ఏనుగుల గుంపుని చూపిస్తూ ఉంటారు. వాటి స్థిమితమైన లయాత్మక నడక బహు సొగసుగా ఉంటుంది. పరుగెత్తే అశ్వంలో ఒకరకమైన అందముంటే, నడిచివెళ్ళే గజరాజులో మరొక రకమైన అందం ఉంటుంది. ఏది ఏమైనా మనకు తెలుసున్న అందమైన జంతువులలో ఏనుగు మొదటివరసలో ఉంటుంది.   

ఏనుగులని చూడాలంటే ఆఫ్రికా ఖండానికో, శ్రీలంకా, ఇండోనేషియా లాంటి దేశాలకో, అదీ కాకపోతే మనకేరళాకో వెళ్ళాలి. లేదంటే పనికిరాని ఇనుపసామాన్లు, కలప లాంటివి పోగేసి ఒక ఏనుగుని తయారుచెయ్యాలి. అది కదలడానికి మోటర్లు, మెషిన్లు తగిలించి, తొండం పైకి ఎత్తడానికి హైడ్రాలిక్స్ ఉపయోగించి, నిజం ఏనుగులాగే కాళ్ళను కదిలించి ముందుకు వెళ్ళడానికి రోబోటిక్స్ సహాయం తీసుకోవాలి. అప్పుడు కేరళ లాంటి ప్రాంతాలనుంచి కూడా ఈ మహా ఏనుగుని చూడటానికి అది ఉన్న ప్రాంతానికి వెళతారు! 
ఇదంతా ఎందుకు చెపుతున్నాననే సందేహం వస్తుంది కదా? కొంచెం పాతవిషయమే కానీ, మీకు ఒకవేళ తెలిసి ఉండకపోతే ఆసక్తి కరంగా ఉంటుందని చెపుతున్నాను. ఫ్రాన్స్‌లో నాంటెస్ అనే పట్టణంలో అటువంటి ఏనుగుని తయారు చేశారు. ఓ నలభై తొమ్మిది మంది సందర్శకులని ఎక్కించుకొని, ఘీంకరిస్తూ, తొండంలోనుంచి పొగలు వదులుతూ మందగమనంతో ముందుకుపోతున్న యాంత్రిక గజాన్ని తయారు చెయ్యడానికి చాలా ఖర్చయ్యిఉంటుంది. కానీ, ప్రపంచం దృష్ఠిని తమవైపు ఆకర్షించుకోవడానికి, తమ సృజనాత్మక కళని ప్రదర్శించడానికి అది ఒక గొప్ప ఆలోచన. ఆ వూళ్ళో పాత షిప్‌యార్డ్ గొడౌన్లలో పేరుకుపోయిన పాత ఇనుము, యంత్ర సామాగ్రిని గ్రేట్ ఎలీఫెంట్‌ని తయారు చెయ్యడానికి వాడుకొన్నారు. ఫ్రాంకోయిస్ డెలరోజైర్, పియరి ఆరిఫైస్ అనే ఇద్దరు కళాకారుల సృజన ఇందులో ఉంది. పీసా టవరో, ఈఫిల్ టవరో, కొల్లోసియమో, క్లాక్ టవరో, లండన్‌బ్రిడ్జీనో లేకపోయినా తమకంటూ ఒక ప్రత్యేకతను చూపించుకోవడానికి `మెషీన్స్ ఆఫ్ ఐల్ ఆఫ్ నాంటెస్` ఆలోచన ఫలించింది. ఇప్పుడు యూరోప్ సందర్శించే జనాలు తమ ఐటినరీలో నాంటేస్‌ను కూడా చేర్చుకొంటున్నారట. 



© Dantuluri Kishore Varma

Saturday, 1 March 2014

రంగరాయా మెడికల్ కాలేజ్

Google images

కల్నల్ డి.ఎస్.రాజు గారు, డాక్టర్ ఎం.వీ.కృష్ణారావుగార్లు కోస్తాప్రాంతంలో విద్యార్థులకి వైద్యవిద్యని అందించే ఉద్దేశ్యంతో ఒక ప్రైవేట్ వైద్య కళాశాలని స్థాపించాలని అనుకొన్నారట. మెడికల్ కాలేజీని ప్రారంభించాలంటే చిన్నవిషయంకాదు. కాబట్టి విరాళాలు సేకరించారు.  విరాళాలు ఇచ్చినవారిలో తణుకు వాస్తవ్యులు ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ గారు ఒకరు. ఆయన బావగారు రంగారావు అప్పటికే స్వర్గస్తులయ్యారు. ఆ రంగారావుగారి పేరుమీదే దీనికి రంగరాయా మెడికల్ కాలేజ్ అని పేరుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోనే గొప్పకాలేజీలలో ఇది ఒకటి. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నీలంసంజీవరెడ్డిగారు 1958లో ప్రారంభోత్సవంచేశారు. 1977లో ప్రయివేట్ యాజమాన్యం నుంచి రంగరాయ మెడికల్ కాలేజీ ప్రభుత్వ కాలేజీగా మారింది. 

కాలేజీ స్థాపించి 50సంవత్సరాలు అయిన సందర్భంగా 2008లో భారత తపాలా శాఖవారు రంగరాయ మెడికల్ కాలేజీ ఫస్ట్‌డే కవర్‌ను విడుదల చేశారు.  

© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!