రాజవీధుల్లోనుంచి అంబారీ కట్టిన ఏనుగు నడచిపోతూ ఉంటే దాని ఠీవీ చూసితీరవలసిందే. పాదచారులు ప్రక్కకి తొలగిపోయి దారి వదులుతారు. ఒక్కోసారి అది మోర పైకెత్తి, తొండం లేపి ఘీంకారం చేసిందంటే దగ్గరలో ఉన్నవాళ్ళకి వెన్నులో వొణుకు పుడుతుంది. దేవుడి సేవలో ఉన్న ఏనుగులకైనా అదే రాజసం. సర్కస్‌లో మావటి చెప్పినట్టు నడుచుకొంటున్నా, ఏనుగుచేసే విన్యాసాలలో లావణ్యం తొణికిసలాడుతుంది. నేషనల్ జియోగ్రాఫిక్ చానల్లో అడివిలో తిరిగే ఏనుగుల గుంపుని చూపిస్తూ ఉంటారు. వాటి స్థిమితమైన లయాత్మక నడక బహు సొగసుగా ఉంటుంది. పరుగెత్తే అశ్వంలో ఒకరకమైన అందముంటే, నడిచివెళ్ళే గజరాజులో మరొక రకమైన అందం ఉంటుంది. ఏది ఏమైనా మనకు తెలుసున్న అందమైన జంతువులలో ఏనుగు మొదటివరసలో ఉంటుంది.
ఏనుగులని చూడాలంటే ఆఫ్రికా ఖండానికో, శ్రీలంకా, ఇండోనేషియా లాంటి దేశాలకో, అదీ కాకపోతే మనకేరళాకో వెళ్ళాలి. లేదంటే పనికిరాని ఇనుపసామాన్లు, కలప లాంటివి పోగేసి ఒక ఏనుగుని తయారుచెయ్యాలి. అది కదలడానికి మోటర్లు, మెషిన్లు తగిలించి, తొండం పైకి ఎత్తడానికి హైడ్రాలిక్స్ ఉపయోగించి, నిజం ఏనుగులాగే కాళ్ళను కదిలించి ముందుకు వెళ్ళడానికి రోబోటిక్స్ సహాయం తీసుకోవాలి. అప్పుడు కేరళ లాంటి ప్రాంతాలనుంచి కూడా ఈ మహా ఏనుగుని చూడటానికి అది ఉన్న ప్రాంతానికి వెళతారు!
ఇదంతా ఎందుకు చెపుతున్నాననే సందేహం వస్తుంది కదా? కొంచెం పాతవిషయమే కానీ, మీకు ఒకవేళ తెలిసి ఉండకపోతే ఆసక్తి కరంగా ఉంటుందని చెపుతున్నాను. ఫ్రాన్స్‌లో నాంటెస్ అనే పట్టణంలో అటువంటి ఏనుగుని తయారు చేశారు. ఓ నలభై తొమ్మిది మంది సందర్శకులని ఎక్కించుకొని, ఘీంకరిస్తూ, తొండంలోనుంచి పొగలు వదులుతూ మందగమనంతో ముందుకుపోతున్న యాంత్రిక గజాన్ని తయారు చెయ్యడానికి చాలా ఖర్చయ్యిఉంటుంది. కానీ, ప్రపంచం దృష్ఠిని తమవైపు ఆకర్షించుకోవడానికి, తమ సృజనాత్మక కళని ప్రదర్శించడానికి అది ఒక గొప్ప ఆలోచన. ఆ వూళ్ళో పాత షిప్‌యార్డ్ గొడౌన్లలో పేరుకుపోయిన పాత ఇనుము, యంత్ర సామాగ్రిని గ్రేట్ ఎలీఫెంట్‌ని తయారు చెయ్యడానికి వాడుకొన్నారు. ఫ్రాంకోయిస్ డెలరోజైర్, పియరి ఆరిఫైస్ అనే ఇద్దరు కళాకారుల సృజన ఇందులో ఉంది. పీసా టవరో, ఈఫిల్ టవరో, కొల్లోసియమో, క్లాక్ టవరో, లండన్‌బ్రిడ్జీనో లేకపోయినా తమకంటూ ఒక ప్రత్యేకతను చూపించుకోవడానికి `మెషీన్స్ ఆఫ్ ఐల్ ఆఫ్ నాంటెస్` ఆలోచన ఫలించింది. ఇప్పుడు యూరోప్ సందర్శించే జనాలు తమ ఐటినరీలో నాంటేస్‌ను కూడా చేర్చుకొంటున్నారట.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment