Pages

Wednesday, 11 December 2013

పిల్లనగ్రోవి

రాత్రి వెన్నెట్లో డాబామీద కూర్చున్నప్పుడు ఎక్కడినుంచో గాలిలో తేలివచ్చే వేణుగానాన్ని ఎప్పుడైనా విన్నారా? సాధనచేస్తున్న వ్యక్తి దానిని ఆపకుండా ఎంతసేపయినా కొనసాగిస్తే బాగుంటుందని అనిపించదూ? అలాంటి అద్బుతమైన అనుభూతులు తరచూ కలగక పోయినా రోజంతా ఆఫీస్‌లో కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చినతరువాత వేడినీళ్ళ స్నానంతో అలసటని వదిలించుకొని, మ్యూజిక్ సిస్టంలో ఏ హరిప్రసాద్ చౌరాసియాదో ఫ్లూట్‌బిట్ వింటుంటే ఎలావుంటుంది? చిరాకులు, పరాకులు, దిగుళ్ళు, కష్టాలు.. అన్నీ చెవుల్లోంచి గుండెల్లోకి ప్రవహించే వేణుగాన ఝరిలో కొట్టుకొని పోతాయి. ధ్యానం చేసినప్పట్టి ప్రశాంతత మనసులో పరచుకొంటుంది. 

పిల్లనగ్రోవిని ఏరకంగా పలికించాలో కృష్ణుడికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. కొండకోనల్లో, పచ్చికబయళ్ళలో, సెలయేళ్ళ జలతరంగిణుల్లో, ఆకుల గలగలల్లో, బృందావనంలో మురళీగానం చేసిన సందడి; గోపికల గుండెల్లో అది సృష్ఠించిన అలజడి రాసలీలలోలుని మాయ. 

ప్రకృతినుంచి పుట్టిన పిల్లనగ్రోవి, ఆ ప్రకృతినే పరవశింపచేస్తుంది. పిల్లనగ్రోవిని తయారుచెయ్యడానికి వెదురుని వాడినా, అడవిలో పెరిగిన ప్రతీ వెదురుకీ వేణువయ్యే అదృష్ఠం ఉండదు. ఒకసారి కృష్ణుడు తనపరివారాన్ని అడిగాడట `మీరు మరొక జన్మలో నాకు నచ్చినట్టుగా పుట్టవలసివస్తే, ఏ రూపంలో జన్మిస్తారు?` అని. కొందరు గోవులుగా అని, కొందరు నెమలిపించంగా అని ఏవేవో చెపుతారు. కానీ, మాధవుడు వేణువే శ్రేష్టమైనదని చెపుతాడు. `వెదురును తొలచి గాలి ప్రవహించడానికి ఖాళీని చేసినట్టు, మీ అహంకారాన్ని విడిచిపెట్టి నాకు అంకితమైతే, దివ్యసంగీతాన్ని మీనుంచి ప్రపంచానికి వినిపిస్తాను,` అంటాడు.

కృష్ణుని వేణుగానాన్ని వినే అదృష్టం మనకి లేకపోయినా, వనవిహారి విడిచివెళ్ళిన కళ మనకి వినిపిస్తూనే ఉంది. హిందూస్థానీ సంగీతంలో, కర్ణాటక సంగీతంలో ఉపయోగించే వేణువులు రెండు ప్రత్యేక తరహాలవి. హిందూస్థానీ సంగీతంలో ఆరుకానీ, ఏడుకానీ రంద్రాలున్న బన్సూరీ అనే వేణువుని ఉపయోగిస్తారు. కర్ణాటక సంగీతంలో ఎనిమిది రంద్రాలున్న దీనినే వేణువు, పిల్లనగ్రోవి అంటారు. ప్రపంచ ప్రఖ్యాత ఫ్లూటిస్ట్ హరిప్రసాద్ చౌరాసియా వాయించే వేణూవు  బన్సూరీనే. 

కే.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకి హరిప్రసాద్ చౌరాసియా తన వేణుగానాన్ని అందించారు. అన్నట్టు ఆ సినిమా చూశారా మీరు?  విధాత తలపున ప్రభవించినదీ పాట చూడండి మరొక్కసారి. వేణుగానం సాగుతూ ఉంటే, నాయిక, నాయకుడి చిత్రాలను సృష్టిస్తుంది. ఆకాశం నుంచి జారిపడుతున్న మురళిని అందుకోవడానికి మైదానంలో పరుగుపెడుతుంది. చివరికి మబ్బుల మధ్యలోనుంచి, ఎగిరే పక్షుల నడుమనుంచి వేగంగా జారిపడిన వేణువు నాయిక చేతుల్లోనికి సుకుమారమైన పువ్వులా వచ్చి వాలుతుంది. 


విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓం..
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ఆ......ఆ.....
సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది (2)
నే పాడిన జీవన గీతం ఈ గీతం..
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన | ప్రాగ్దిశ |
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారముకాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా || విరించినై ||

జనించు ప్రతిశిశుగళమున పలికిన జీవననాద తరంగం
చేతనపొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం | జనించు |
అనాది రాగం ఆదితాళమున అనంత జీవనవాహినిగా
సాగిన సృష్టి విలాసమునే || విరించినై ||
నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం (2)
సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం...
© Dantuluri Kishore Varma 

Tuesday, 10 December 2013

అబద్దాలకోరు!

వాడి పేరు జానో, పీటరో ఏదో ఉంది. నాకు సరిగ్గా గుర్తులేదు. చిన్నప్పుడు వాడి బామ్మ అనేది `ఒరేయ్, సైనికుడివి అవ్వరా బాగుంటుంది. వాళ్ళు కావలసినంత పెడతారు. నీ తిండిపోతు వ్యవహారానికి సరిపోతుంది` అని. వాళ్ళ తాత అనేవాడు, `ఒరేయ్ సైనికుడివి అవ్వరా భలేగా ఉంటుంది. మందు చవకగా దొరుకుతుందట,` అని. వాడు బామ్మ మాట విన్నాడు, తాతమాట విన్నాడు. కానీ వాడి తెలివితేటలకి సైన్యంలో ఏ ఉద్యోగమూ సరిపోలేదు. కాబట్టి వంటవాడిగానే జేరవలసి వచ్చింది.

ఒకసారి పెద్ద యుద్దం వచ్చింది. అటువాళ్ళు, ఇటువాళ్ళనీ; ఇటువాళ్ళు, అటువాళ్ళనీ కాల్చుకొంటున్నారు. బుల్లెట్లు తగిలి చనిపోయిన వాళ్ళు పోతున్నారు. కాళ్ళూ చేతులూ పోగొట్టుకొన్నవాళ్ళు క్రిందపడి కొట్టుకొంటున్నారు. వంటవాడు గుళ్ళు తగలని చాటు ప్రదేశంలో ఉన్నాడు. తుపాకీ గుళ్ళు దూసుకొని పోతున్నాయి. పిరంగి గుళ్ళు పెద్దగా చప్పుళ్ళు చేస్తూ విద్వంసం సృష్ఠిస్తున్నాయి. వంటవాడికి దగ్గరలో పోరాడుతున్న ఒక సైనికుడికి ఎదుటి పక్షం నుంచి ఒక గుండు వచ్చి కాలిపిక్కలో దిగబడిపోయింది. ఒక ఆర్తనాదం చేశాడు. 

వంటవాడు ప్రాణాలకు తెగించి వాడిదగ్గరకి పరిగెత్తుకొని వచ్చాడు. `ఏమయ్యింది?` అన్నాడు.క్షతగాత్రుడు బాధగా మూలుగుతూ, `ఓరేయ్, నాకాలు పోయిందిరా! నన్ను ఆచాటుకు తీసుకొని వెళ్ళు,` అన్నాడు. వంటవాడు, సైనికుడిని భుజమ్మీద ఎక్కించుకొని సుమారు వందగజాల దూరంలో ఉన్న బంకర్ దగ్గరకి మోసుకొని పోతున్నాడు. బాధని వోర్చుకోలేక మూలుగుతున్న సైనికుడు ఆ బాధని మరచిపోవడానికి వంటవాడు వంకాయ మసాలా పెట్టిన కూరని ఎలా వొండాలో చెపుతున్నాడు. 

వంటవాడు చెపుతున్నాడు, సైనికుడు వింటున్నాడు, ఎదుటి పక్షంనుంచి తుపాకీ గుళ్ళు వాళ్ళ తలల ప్రక్కగా దూసుకొని పోతున్నాయి. సైనికుడు వింటున్నాడు, వంటవాడు చెపుతున్నాడు. అప్పుడు జరిగింది ఒక జరగ కూడని విషయం. ఓ పిరంగి గుండు సైనికుడి తలని తీసుకొని పోయింది. అది జరిగిన విషయం వంకాయ మసాలా కూరలో ములిగిపోయిన వంటవాడికి తెలియనేలేదు. సైనికుడి మొండాన్ని మోసుకుపోతున్నాడు. 

వాళ్ళ కమాండర్ చూశాడు. `ఒరేయ్ బుర్ర తక్కువ వెధవా, ఆ తలలేని మొండాన్ని ఎక్కడికి తీసుకొని పోతున్నావు?` అన్నాడు.  `తలకాదు సార్, వీడికి కాలు పోయింది,` అన్నాడు. `నీమొహం, వాడికి పోయింది తలే. కావాలంటే చూడు,` అన్నాడు కమాండర్. అప్పుడు చూశాడు వంటవాడు, తనభుజమ్మీద ఉన్న మొండాన్ని. కోపంగా నేలమీద పడేశాడు. `నాకు వీడు స్వయంగా చెప్పాడు సర్, కాలే పోయిందని. అబద్దాలకోరు,` అన్నాడు.

(ఒకజోక్ ఆధారంగా రాసినది) 
© Dantuluri Kishore Varma 

Monday, 9 December 2013

ఎల్లుండి ఎంత మంచిదో, ఈ రోజూ అంతే మంచిది.

ఏమండోయ్, ఎల్లుండి మహత్తరమైన రోజట మీకు తెలుసా? ఎందుకంటారేమిటండీ బాబూ.. రైజింగ్ నెంబరు 11.12.13. పైపెచ్చు టోటలు తొమ్మిది! వ్యాపారం మొదలు పెడితే దిన దిన ప్రవర్ధమానం అవుతుందట. పెళ్ళిచేసుకొంటే పదకొండులో రెండు ఒకట్లు ఉన్నాయి కనుక కవల పిల్లలు పుట్టడం ఖాయమట. 

క్రీస్తుశకం ప్రారంభమై ఎల్లుండికి 7,35,214 రోజులు. జనవరి ఒకటి 0001 సంవత్సరాలు నుంచి డిసెంబర్ పదకొండు, రెండువేల పదమూడు వరకూ టైం అండ్ డేట్ డాట్ కాం అనే వెబ్‌సైటులో డేట్ టు డేట్ కాలిక్యులేటర్ ఉపయోగించి లెక్కిస్తే వచ్చిన సంఖ్య అది. 

కాలాన్ని లెక్కించడానికి మనిషి ఏర్పాటు చేసుకొన్నది క్యాలండర్. క్రీస్తు పుట్టినదిగా భావించిన సంవత్సరం నుంచి మొదలవుతుంది. మన అందరికి తెలుసు కదా, క్రీస్తు పుట్టినరోజు క్రిస్‌మస్ డిసెంబర్ 25 అని? అంటే క్రీస్తుశకం జీసస్ పుట్టినరోజునుంచీ మొదలవలేదు. ఆ సంవత్సరంలో అంతకుముందే జనవరి ఒకటినుంచి మొదలయ్యింది. అలా ఎందుకు మొదలు పెట్టారో నాకు తెలియదు. ఎవరు మొదలు పెట్టారో అంతకన్నా తెలియదు. 

కానీ...

సరదాకి చిన్న చిక్కు ప్రశ్న. 01.01.0001 శనివారం అయ్యింది. ఒకవేళ ఈ కేలెండర్ని సృష్ఠించిన వాళ్ళు ఏదో ఒక కారణం చేత అంతకు రెండురోజుల ముందు  అంటే గురువారాన్ని ఈ శకం యొక్క మొదటిరోజుగా తీసుకొంటే. ఈ రోజు, ఏ తారీఖు అయ్యి ఉండేది? 

ఆ.. మీరు కనిపెట్టేశారు. మీరనుకొన్నది నిజమే. క్రీస్తుశకం మొదలయ్యి ఈ రోజుకే 7,35,214 రోజులు అయి వుండేది. ఈ రోజు 11.12.13 అయ్యివుండేది! 

అప్పుడు, ఎల్లుండి మహామంచి రోజనీ, అన్ని పనులూ ఆరోజే మొదలు పెట్టమనీ చెప్పే వాళ్ళంతా, వాటిని ఈ రోజే మొదలు పెట్టమని  ఉండేవారు కదా? 

కనుక నేను చెప్పొచ్చేది ఏమిటంటే మీరు ప్రారంభించాలనుకొనే మంచి పనుల్ని ఎల్లుండి వరకూ వాయిదా వెయ్యకుండా, ఈ రోజే దివ్యంగా మొదలు పెట్టవచ్చు. ఎల్లుండి ఎంత మంచిదో, ఈ రోజూ అంతే మంచిది. ఏమంటారు?  


© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!