రాత్రి వెన్నెట్లో డాబామీద కూర్చున్నప్పుడు ఎక్కడినుంచో గాలిలో తేలివచ్చే వేణుగానాన్ని ఎప్పుడైనా విన్నారా? సాధనచేస్తున్న వ్యక్తి దానిని ఆపకుండా ఎంతసేపయినా కొనసాగిస్తే బాగుంటుందని అనిపించదూ? అలాంటి అద్బుతమైన అనుభూతులు తరచూ కలగక పోయినా రోజంతా ఆఫీస్‌లో కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చినతరువాత వేడినీళ్ళ స్నానంతో అలసటని వదిలించుకొని, మ్యూజిక్ సిస్టంలో ఏ హరిప్రసాద్ చౌరాసియాదో ఫ్లూట్‌బిట్ వింటుంటే ఎలావుంటుంది? చిరాకులు, పరాకులు, దిగుళ్ళు, కష్టాలు.. అన్నీ చెవుల్లోంచి గుండెల్లోకి ప్రవహించే వేణుగాన ఝరిలో కొట్టుకొని పోతాయి. ధ్యానం చేసినప్పట్టి ప్రశాంతత మనసులో పరచుకొంటుంది.
పిల్లనగ్రోవిని ఏరకంగా పలికించాలో కృష్ణుడికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. కొండకోనల్లో, పచ్చికబయళ్ళలో, సెలయేళ్ళ జలతరంగిణుల్లో, ఆకుల గలగలల్లో, బృందావనంలో మురళీగానం చేసిన సందడి; గోపికల గుండెల్లో అది సృష్ఠించిన అలజడి రాసలీలలోలుని మాయ.
ప్రకృతినుంచి పుట్టిన పిల్లనగ్రోవి, ఆ ప్రకృతినే పరవశింపచేస్తుంది. పిల్లనగ్రోవిని తయారుచెయ్యడానికి వెదురుని వాడినా, అడవిలో పెరిగిన ప్రతీ వెదురుకీ వేణువయ్యే అదృష్ఠం ఉండదు. ఒకసారి కృష్ణుడు తనపరివారాన్ని అడిగాడట `మీరు మరొక జన్మలో నాకు నచ్చినట్టుగా పుట్టవలసివస్తే, ఏ రూపంలో జన్మిస్తారు?` అని. కొందరు గోవులుగా అని, కొందరు నెమలిపించంగా అని ఏవేవో చెపుతారు. కానీ, మాధవుడు వేణువే శ్రేష్టమైనదని చెపుతాడు. `వెదురును తొలచి గాలి ప్రవహించడానికి ఖాళీని చేసినట్టు, మీ అహంకారాన్ని విడిచిపెట్టి నాకు అంకితమైతే, దివ్యసంగీతాన్ని మీనుంచి ప్రపంచానికి వినిపిస్తాను,` అంటాడు.
కృష్ణుని వేణుగానాన్ని వినే అదృష్టం మనకి లేకపోయినా, వనవిహారి విడిచివెళ్ళిన కళ మనకి వినిపిస్తూనే ఉంది. హిందూస్థానీ సంగీతంలో, కర్ణాటక సంగీతంలో ఉపయోగించే వేణువులు రెండు ప్రత్యేక తరహాలవి. హిందూస్థానీ సంగీతంలో ఆరుకానీ, ఏడుకానీ రంద్రాలున్న బన్సూరీ అనే వేణువుని ఉపయోగిస్తారు. కర్ణాటక సంగీతంలో ఎనిమిది రంద్రాలున్న దీనినే వేణువు, పిల్లనగ్రోవి అంటారు. ప్రపంచ ప్రఖ్యాత ఫ్లూటిస్ట్ హరిప్రసాద్ చౌరాసియా వాయించే వేణూవు బన్సూరీనే.
కే.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకి హరిప్రసాద్ చౌరాసియా తన వేణుగానాన్ని అందించారు. అన్నట్టు ఆ సినిమా చూశారా మీరు? విధాత తలపున ప్రభవించినదీ పాట చూడండి మరొక్కసారి. వేణుగానం సాగుతూ ఉంటే, నాయిక, నాయకుడి చిత్రాలను సృష్టిస్తుంది. ఆకాశం నుంచి జారిపడుతున్న మురళిని అందుకోవడానికి మైదానంలో పరుగుపెడుతుంది. చివరికి మబ్బుల మధ్యలోనుంచి, ఎగిరే పక్షుల నడుమనుంచి వేగంగా జారిపడిన వేణువు నాయిక చేతుల్లోనికి సుకుమారమైన పువ్వులా వచ్చి వాలుతుంది.
విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓం..
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ఆ......ఆ.....
సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది (2)
నే పాడిన జీవన గీతం ఈ గీతం..
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన | ప్రాగ్దిశ |
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారముకాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా || విరించినై ||
జనించు ప్రతిశిశుగళమున పలికిన జీవననాద తరంగం
చేతనపొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం | జనించు |
అనాది రాగం ఆదితాళమున అనంత జీవనవాహినిగా
సాగిన సృష్టి విలాసమునే || విరించినై ||
నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం (2)
సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం...
© Dantuluri Kishore Varma
బాగుందండి పోస్ట్ .నా ఫావ్రెట్ పాట
ReplyDeleteసంగీతం, సాహిత్యం, పిక్చరైజేషన్, సుహాసిని నటన అన్నీ కలిసి ఈ పాటని ఫేవరెట్ సాంగ్‌ని చేసాయి. నిజానికి ఈ పాట నచ్చని వాళ్ళు అరుదుగా ఉంటారు. మీ కామెంటుకి ధన్యవాదాలు రాధికగారు.
Delete