Pages

Friday, 31 January 2014

యెంకిపాటలు

నండూరి సుబ్బారావు గారి(1895 -1957) యెంకిపాటలు యెంకి, నాయుడు బావల ప్రేమని, విరహాన్ని, సరసాన్ని, శృంగారాన్ని తేటతెలుగు మాటల్లో ఆవిష్కరిస్తాయి.

యెంకిలాంటి చక్కని పిల్ల మరెక్కడా ఉండదన్నంత అబ్బరంగా చెపుతాడు నాయుడుబావ...

సెక్కిట సిన్నీ మచ్చ
సెపితే సాలదు లచ్చ
వొక్క నవ్వే యేలు
వొజ్జిర వొయిడూరాలు

ఇక ఆమె అలంకారం ఎలా ఉంటుందనుకొన్నారు?

మెళ్ళో పూసలపేరు
తల్లో పూవులసేరు
కళ్ళెత్తితే సాలు
కనకాబిసేకాలు

చక్కని కబుర్లు చెపుతుంది, పాటలూ పాడుతుంది...

పదమూ పాడిందంటె
పాపాలు పోవాల
కతలూ సెప్పిందంటె
కలకాల ముండాల

ఇన్ని ఉన్న చక్కదనాల చుక్కకి దొరికిపోయాడు ఇలా.. 

రాసోరింటికైన
రంగుతెచ్చే పిల్ల
నా సొమ్ము - నా గుండె
నమిలి మింగిన పిల్ల

యెంకికి తనంటే ఎంత ప్రేమో ఆమె చూపుల్లోనే చూసుకొంటాడు. అతను ఎంకిపాట పాడుతుంటే, ఆమె గోడవారన చేరి గుటకలేస్తుందట - చక్కగా పాడుతున్నాడని మురిపమేమో! నలుగురమ్మలూ చేరి పాటని మెచ్చుకొంటే యెంకి చూపుల్లో సోద్దెం ఏమీటో? పొరుగమ్మతో సరసమాడేవేళ, పొలమెల్లి అతను పొద్దుబోయి వచ్చేవేళ రకరకాలుగా చూస్తుంటే- ఆమెకళ్ళల్లో ఎన్నెన్ని బాసలు పలుకుతాయో! మరి నోరు తెరిచి చెపితే ఎలాఉంటుందంటే? మరమమిడిసి మనసిస్తే, అతని నీడలోనే మేడ కడతా నంటుంది. 

అలాంటి యెంకి, నాయుడు బావలు కలిస్తే వాళ్ళ సరసాలు ఎలా ఉంటాయో చెప్పాలంటే `వొనలచ్చిమి` పాటే పాడుకోవాలి. 

జాము రేతిరియేళ జడుపు గిడుపూ మాని
సెట్టు పుట్టాదాటి సేనులో నేనుంటె

మెల్లంగ వస్తాది నాయెంకీ 
సల్లంగ వస్తాది నాయెంకీ

పచ్చని సేలోకి పండుయెన్నెల్లోన
నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటె

వొయ్యార మొలికించు నాయెంకీ 
వొనలచ్చి మనిపించు నాయెంకీ

యెంకివస్తాదాని యెదురూగ నేబోయి
గట్టుమీదా దాని కంటి కాపడగానె

కాలు కదపాలేదు నాయెంకీ 
కరిగి నీరౌతాది నాయెంకీ

మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి
గోనెపట్టా యేసి గొంగడీ పైనేసి

కూలాస గుంటాది నాయెంకీ 
కులుకు సూపెడతాది నాయెంకీ

యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి
మల్లీ యెప్పటల్లె తెల్లారబోతుంటె

సెందురుణ్నీ తిట్టు నాయెంకీ 
సూరియుణ్నీ తిట్టు నాయెంకీ

ఆమెని వొదిలి అతను, అతన్ని వొదిలి ఆమే ఎక్కడి కన్నా వెళ్ళారా, క్షణక్షణం ఆ తలపులతోనే సతమతమౌతారు. నీళ్ళు తేబోతుంటే ఆమె వెంట ఎవరో నడిచి నట్టు ఉంటుందట, అద్దంలో చూసుకొంటే వెనుక ఎవరో నుంచుని నవ్వినట్టుంటుందట యెంకికి. ఆ ఎవరో, మరెవరో కాదు - నాయుడు బావే! ఇక నాయుడు కయితే -

యెంకి వస్తాదాని
యెదురు తెన్నులు కాసి
దిగులుట్టి తలదించి
తిరిగి సూసేతలికి

యెంకి రావాలి నాయెదర నిలవాలి
కులుకుతా నన్నేటో పలకరించాలి

పిల్ల పొరుగూ రెల్లి
మల్లి రాలేదని
వొల్లంత వుడుకెత్తి
వొక్కణ్ణి పొడుకుంటె

ఘల్లుమంటా యెంకి కాలుపెట్టాలి
యెల్లి వొచ్చా నంట యెంకి నవ్వాలి

యెంకి కోపాలొచ్చి
యేదేశమో పోయి
కల్లో నా కాపడితె
కళ్ళు తెరిసే తలికి

తళుకుమని యెంకి నాదరికి రావాలి
నిదర కాబోసంటు నింద నాడాలి 

అసలు ఇంత గొప్పగా ఎలా రాయగలిగేరు అంటే? నండూరి సుబ్బారావుగారే పుస్తకానికి రాసిన పీఠికలో అంటారు - తాను మద్రాసులో చదువుకొనే రోజుల్లో ఒకనాడు ట్రాంబండిలో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా `గుండే గొంతుకలోన కొట్లాడతాది` అని ఒక పల్లవి మనసులోనికి వచ్చిందట. దానిని అలా మననం చేసుకొంటూ ఉంటే ఇల్లుచేరే సరికి పాట తయారయిపోయింది. అదే మొదటి పాట. 1925 లో 35 పాటలతో పుస్తకం విడుదల చేశారు. తరువాత 27 సంవత్సరాలకి ఎంకి కొత్తపాటల సంపుటి వచ్చింది. 

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
కూకుండ నీదురా కూసింతసేపు!

నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది
యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! 
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది
దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ! 
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

యీడుండ మంటాది యిలుదూరిపోతాది
యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

మందో మాకో యెట్టి మరిగించినాదీ
వల్లకుందామంటే పాణమాగదురా! 
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

గుడిపాటి వెంకటాచలం, దేవులపల్లి కృష్ణశాస్త్రీ, నండూరి సుబ్బారావులు మిత్రులు. ఏలూరులో రైలు కట్టకవతల, మైదానం దగ్గరలో, మిణుగురుపురుగులు వాలిన చెట్టుక్రింద నండురివారిని కూర్చోబెట్టుకొని చలం యెంకిపాటల్ని పాడించుకొని తన్మయత్వంతో వినేవారట. ఇక కృష్ణశాస్త్రిగారయితే ఏ సభలోనయినా చక్కగా ఆ పాటల్ని పాడి సభికులని ఆనందపరిచేవారట. మొదటిలో జనాల్లో యెంకిపాటలపట్ల వ్యతిరేకత వచ్చినా, క్రమంగా వాటిల్లో గొప్పతనం తెలిసివచ్చింది. రేడియోవాళ్ళు వరసలు కట్టి పాడించారు. ఎంకీ, నాయుడుబావలు రాధా కృష్ణులంత గొప్పవాళ్ళయిపోయారు. 

© Dantuluri Kishore Varma

Thursday, 30 January 2014

పల్లెకు పోదాం చలో.. చలో..

ఒక ప్రోజెక్ట్ మొదలు పెట్టి, దానికోసం ఒక పెయింటర్‌కి రెండు బొమ్మలు పెయింట్ చేసే పని అప్పగించాను. తీరుబడిలేని కమర్షియల్ ఆర్టిస్టు అతను. కానీ, మాట తీసెయ్యలేక రాత్రంతా కూర్చొని  ఉదయానికల్లా పెయింట్ చేసి ఇచ్చాడు. అతనికి బొమ్మలు వెయ్యడంతో నిద్రలేకుండా పోతే, నాకు అవి ఎలా వస్తాయో తెలియక నిద్ర పట్టలేదు. బాపూ బొమ్మలో అందమైన వంకర గీతలు, దామెర్ల రామారావు బొమ్మల్లో సొగసు, టర్నర్ వాటర్ కలర్స్‌లో వెలుగూ కలిసి ఊహల్లోనే అద్భుతంగా కనిపించడం మొదలయ్యాయి. ప్రొద్దుటే వాటిని ఎలా చూసానో అనే విషయాన్ని ప్రక్కన పెడితే - మన బ్లాగర్ మిత్రులు చిన్నిఆశలాగ చిత్రకారుడినయినా కాకపోతినే అని నాకు నేనే వగచాను. అతనికిచ్చిన రిఫరెన్సుల్ని నేనుకూడా పెయింట్‌చెయ్యడం  ప్రయత్నిస్తే బాగుంటుందని అనిపించిన ఒకానొక క్షణంలో బ్రష్‌ని వాటర్ కలర్లో ముంచి డ్రాయింగ్ షీటు మీద యుద్దం మొదలుపెట్టా! దాని ఫలితమే ఈ `పల్లెకు పోదాం.. చలో.. చలో..` పెయింటింగ్. 

క్షణక్షణం సినిమాలో పరేష్ రావల్ పియానో మీద ఒకరాగం వాయించి, తన కూనిరాగం కూడా కలిపి అనుచరుడ్ని..`ఇది ఏం పాటో చెప్పు?` అని అడుగుతాడు. పాపం వాడు, `తెల్వాదు సార్,` అంటాడు.

పరేష్ రావల్ పాటలాగ అయ్యింది నా పెయింటింగ్ సంగతి. ప్చ్! ఏం చేస్తాం, కళను నేర్చుకోలేక పోతిమి.  

© Dantuluri Kishore Varma

Sunday, 26 January 2014

గుడ్డికన్నా మెల్ల నయం కదా?

వంశీ మాస్టర్‌పీస్ సితారలో ఓ సన్నివేశం గుర్తుకు వస్తుంది వీళ్ళని చూస్తుంటే! పగటివేషగాళ్ళు పండగకి ప్రతీసంవత్సరం వెళ్ళే ఊరికి వెళతారు. రాజరికం పోయినా, రాజుగారి కోటమాత్రం మిగిలే ఉంది. పంజరంలో చిలుకలా యువరాణీ. మూసి ఉన్న మహల్ తలుపుల ముందు రోజుకొక వేషం కడతారు. రాముడు, శివుడు.. లాంటి ఎన్ని వేషాలు వేసినా, ఎవరైనా చూసినప్పుడు కదా, వాటికి విలువ? కిటికీ కంతలోనుంచి చూస్తున్న ఓ విశాల నేత్రాన్ని గమనించిన వేషగాడికి హుషారు వస్తుంది. నెమలిలాగ నాట్యం చేస్తాడు.   
వొళ్ళంతా రంగుపులుముకోనవసరం లేకుండా నీలమేఘశ్యాముడు చూడండి, చక్కని రంగుచొక్కా తొడిగేసుకొని చిద్విలాసంగా చూస్తున్నాడు. శివుడు మాత్రం కైలాశంనుంచి ఉరుకులెత్తుకొని దుముకుతున్న గంగవైపు చూస్తున్నట్టున్నాడు. బాపూగారి గంగావతరణం గుర్తుందా? 

ఇక్కడ వీళ్ళు నెమలిపించాలతో పురివిప్పినట్టు తయారు చేసుకొన్న చాపాలను వెనుక తగిలించుకొని గెంతుతూ, హొయలుపోతూ, కళ్ళుతిప్పుతూ నాట్యంచేస్తున్నారు. డప్పులు వాయించేవాళ్ళ ఉత్సాహం వాళ్ళని మరింత రెచ్చగొడుతుంది. 


గత ఏడాది బీచ్‌ఫెస్టివల్‌కి వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకొని జనాలని నవ్విస్తూ తిరుగుతున్న వేషగాళ్ళని చూసి, వాళ్ళ మాస్కుల వెనుక ముఖాలమీద ఏ హవభావాలుంటాయా అనిపించింది. ఒక చిన్న కథ ఇక్కడ చదవండి (ఇది లింక్. క్లిక్ చెయ్యండి). ట్రాంప్ వేషాలేసిన చార్లీ చాప్లిన్, జోకర్ సినిమా తీసి రాజ్‌కపూర్, విచిత్రసోదరుల్లో పొట్టి కమల్‌హాసన్ ఒక మారని అభిప్రాయాన్ని మనమనసులో ముద్రవేశారు. 
వొంటిమీద పసుపు రంగు పూసుకొని, నల్ల చారలు వేసుకొని, ఒక చిన్న చెడ్డీ కట్టుకొని పులిముఖాన్ని తగిలించుకొని, తోక పెట్టుకొని డప్పుల మోతకి అనుగుణంగా గెంతులేసే పులిడ్యాన్స్ వాళ్ళని చూశారా ఎప్పుడయినా? 

సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల్లో ఏడాదికోరోజు పులి అనే కథ ఒకటి ఉంటుంది. ప్రతీ దసరాకీ నబీ సాయిబు పులివేషం కడతాడు. పేదా, గొప్పా అని తారతమ్యం లేకుండా ఊరంతా వాడి వీరంగాన్ని విరగబడి చూస్తారు. టంకు, టమా అని డప్పులు మ్రోగుతుంటే బారలు వేసుకొంటూ  పులిడ్యాన్స్ చేస్తుంటే అందరూ దారి ఇస్తుంటారు. ఆ రోజుకి ఊరిలో వాడే రాజు. చూస్తున్న జనాలు విసిరే డబ్బుల్ని కూడా సామతరాజుల దగ్గరనుంచి కప్పం తీసుకొంటున్న చక్రవర్తిలా తీసుకొని చెడ్డీలో దోపుకొంటాడు. కానీ, వాడు పెళ్ళం ముందు పిల్లే! పులివేషం అయిపోయిన తరువాత ఏడాది అంతా ఎవరూ పని ఇవ్వరు . బీడీల కోస అడుక్కొంటూ, మళ్ళీ సంవత్సరం దసరాకోసం కలలు కంటూ ఉంటాడు - ముగింపు కూదా ఆర్థ్రపూరితంగా ఉంటుంది. 

సాహిత్యంలో, సినిమాల్లో అక్కడక్కడా మన సంస్కృతి కనిపిస్తుంది. కానీ, సహజ పరిసరాలలో క్రమంగా మాయమైపోతుంది. కారణాల అన్వేషణ జోలికి వెళ్ళకుండా జానపదకళారూపాలని ఉత్సవాలలో ఇలాగన్నా చూసి ఆనందించగలగడం బాగానే ఉంటుంది. గుడ్డికన్నా మెల్ల నయం కదా?

2014 కాకినాడ సాగర సంబరాలలో తీసిన ఫోటోలు. 
© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!