వంశీ మాస్టర్‌పీస్ సితారలో ఓ సన్నివేశం గుర్తుకు వస్తుంది వీళ్ళని చూస్తుంటే! పగటివేషగాళ్ళు పండగకి ప్రతీసంవత్సరం వెళ్ళే ఊరికి వెళతారు. రాజరికం పోయినా, రాజుగారి కోటమాత్రం మిగిలే ఉంది. పంజరంలో చిలుకలా యువరాణీ. మూసి ఉన్న మహల్ తలుపుల ముందు రోజుకొక వేషం కడతారు. రాముడు, శివుడు.. లాంటి ఎన్ని వేషాలు వేసినా, ఎవరైనా చూసినప్పుడు కదా, వాటికి విలువ? కిటికీ కంతలోనుంచి చూస్తున్న ఓ విశాల నేత్రాన్ని గమనించిన వేషగాడికి హుషారు వస్తుంది. నెమలిలాగ నాట్యం చేస్తాడు.
వొళ్ళంతా రంగుపులుముకోనవసరం లేకుండా నీలమేఘశ్యాముడు చూడండి, చక్కని రంగుచొక్కా తొడిగేసుకొని చిద్విలాసంగా చూస్తున్నాడు. శివుడు మాత్రం కైలాశంనుంచి ఉరుకులెత్తుకొని దుముకుతున్న గంగవైపు చూస్తున్నట్టున్నాడు. బాపూగారి గంగావతరణం గుర్తుందా?
ఇక్కడ వీళ్ళు నెమలిపించాలతో పురివిప్పినట్టు తయారు చేసుకొన్న చాపాలను వెనుక తగిలించుకొని గెంతుతూ, హొయలుపోతూ, కళ్ళుతిప్పుతూ నాట్యంచేస్తున్నారు. డప్పులు వాయించేవాళ్ళ ఉత్సాహం వాళ్ళని మరింత రెచ్చగొడుతుంది.
గత ఏడాది బీచ్‌ఫెస్టివల్‌కి వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకొని జనాలని నవ్విస్తూ తిరుగుతున్న వేషగాళ్ళని చూసి, వాళ్ళ మాస్కుల వెనుక ముఖాలమీద ఏ హవభావాలుంటాయా అనిపించింది. ఒక చిన్న కథ ఇక్కడ చదవండి (ఇది లింక్. క్లిక్ చెయ్యండి). ట్రాంప్ వేషాలేసిన చార్లీ చాప్లిన్, జోకర్ సినిమా తీసి రాజ్‌కపూర్, విచిత్రసోదరుల్లో పొట్టి కమల్‌హాసన్ ఒక మారని అభిప్రాయాన్ని మనమనసులో ముద్రవేశారు.
వొంటిమీద పసుపు రంగు పూసుకొని, నల్ల చారలు వేసుకొని, ఒక చిన్న చెడ్డీ కట్టుకొని పులిముఖాన్ని తగిలించుకొని, తోక పెట్టుకొని డప్పుల మోతకి అనుగుణంగా గెంతులేసే పులిడ్యాన్స్ వాళ్ళని చూశారా ఎప్పుడయినా?
సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల్లో ఏడాదికోరోజు పులి అనే కథ ఒకటి ఉంటుంది. ప్రతీ దసరాకీ నబీ సాయిబు పులివేషం కడతాడు. పేదా, గొప్పా అని తారతమ్యం లేకుండా ఊరంతా వాడి వీరంగాన్ని విరగబడి చూస్తారు. టంకు, టమా అని డప్పులు మ్రోగుతుంటే బారలు వేసుకొంటూ పులిడ్యాన్స్ చేస్తుంటే అందరూ దారి ఇస్తుంటారు. ఆ రోజుకి ఊరిలో వాడే రాజు. చూస్తున్న జనాలు విసిరే డబ్బుల్ని కూడా సామతరాజుల దగ్గరనుంచి కప్పం తీసుకొంటున్న చక్రవర్తిలా తీసుకొని చెడ్డీలో దోపుకొంటాడు. కానీ, వాడు పెళ్ళం ముందు పిల్లే! పులివేషం అయిపోయిన తరువాత ఏడాది అంతా ఎవరూ పని ఇవ్వరు . బీడీల కోస అడుక్కొంటూ, మళ్ళీ సంవత్సరం దసరాకోసం కలలు కంటూ ఉంటాడు - ముగింపు కూదా ఆర్థ్రపూరితంగా ఉంటుంది.
సాహిత్యంలో, సినిమాల్లో అక్కడక్కడా మన సంస్కృతి కనిపిస్తుంది. కానీ, సహజ పరిసరాలలో క్రమంగా మాయమైపోతుంది. కారణాల అన్వేషణ జోలికి వెళ్ళకుండా జానపదకళారూపాలని ఉత్సవాలలో ఇలాగన్నా చూసి ఆనందించగలగడం బాగానే ఉంటుంది. గుడ్డికన్నా మెల్ల నయం కదా?
2014 కాకినాడ సాగర సంబరాలలో తీసిన ఫోటోలు.
© Dantuluri Kishore Varma
జానపద రూపాలు అలా సాగర సంబరాల్లో చూడవలసిందే ఇక, అన్నట్టు ’గుడ్డి కంటే మెల్ల మేలని’ సామెత. ఫోటో లు బావున్నాయి.
ReplyDeleteశర్మగారూ, అవునండి :)
Deleteవర్మగారూ,
ReplyDeleteమంచి వ్యాసానికి చక్కటి ఛాయాచిత్రలూ జతపరిచి మళ్ళీ నా చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలండి!
చిన్నప్పుడు దసరా రోజుల్లో మా ఊరికి కూడా ఇలాగే ఒకటో రెండో కుటుంబాలు వచ్చి, ఊరికి చివర ఒక పాడుబడిన ఇంటిలో ఉంటూ ప్రతీరోజు వేరు వేరు వేషాలు కట్టుకుని ఇంటింటికీ తిరిగే వాళ్ళు. ఇంట్లో వాళ్ళు వద్దంటూ ఎన్ని తిట్టినా, ఆ వేషగాళ్ళ వెనకాలే ఉరంతా తిరగడం అదో పిచ్చి, సరదా! మా వయసులోనే ఉండే వాళ్ళ పిల్లలు రాగయుక్తమైన పద్యాలు అలవోకగా పాడుతుంటే నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూసేవాళ్ళం. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆఖరి రోజున వాళ్ళలో ఒకడు శక్తి వేషం కట్టి, చేత్తో వేప మండలు పట్టుకుని, డప్పు వాయిద్యాలకు అణుగుణంగా వికృతమైన నాట్యం చేస్తూ ఊరేగుతుంటే, వాడి వెనక మేము కూడా పూనకం వచ్చినవాళ్ళలా గంతులు వేసుకుంటూ తిరిగే వాళ్ళం. మధ్య మధ్యలో వాడు ఒక్క సారిగా వెనక్కు తిరిగి, ఒక్క ఉదుటున మామీదకు వస్తే, గట్టిగా ఏడుపు లంకించుకుని తుప్పుందో, తూముందో లెక్క చెయ్యకుండా పారిపోయే వాళ్ళం. కాని మరు నిమిషంలోనె అందరం గుంపుగా చేరుకుని, కళ్ళ నీళ్ళు తుడిచేసుకుని, తొస్సిపళ్ళు బయటపెట్టుకుని "ఓస్, దీనికేనా ఇంత భయపడిపోయాం", అనుకుంటూ వాడి వెనకాలే చేరిపోయె వాళ్ళం.
అసలు ఆ శక్తి వేషాన్ని మళ్ళీ ఒక్క సారి చూడాలని ఎన్ని సార్లు అనుకుంటానో నాకే తెలీదు. సితారలో కూడా, రాళ్ళపల్లి శక్తి వేషం కడితే ఊళ్ళో పిల్లలు జడుసుకుని జ్వరాలు తెచ్చుకున్నారని చెప్తాడుగానీ, వేషాన్ని మాత్రం చూపించలేదు. వంశీగారు ఆ ఒక్క ముక్క చిత్రీకరించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
ఏదేమైనా, చిన్నప్పటి అమాయకపు రోజులు గుర్తు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
భవదీయుడు,
వర్మ
వర్మగారూ, మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. `ఆ రోజులే మంచివి కదా!` అనిపిస్తాయి తలచుకొంటే. నిజానికి నాపోస్ట్‌కంటే మీ కామెంటే బాగుంది :) ధన్యవాదాలు.
Delete