10 వ శతాబ్ధానికి చెందిన కుమారారామం అని పిలువబడే సామర్లకోట (Samalkot) శివాలయం కాకినాడకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమేశ్వరస్వామి కొలువై ఉన్న పురాతన దేవాలయం ఇది. ఆయన దేవేరి బాలా త్రిపుర సుందరి. లభిస్తున్న శాశనాల ప్రకారం ఈ ప్రాంతాన్నీ పాలించిన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తుంది. క్రీస్తుశకం 892 నుంచి 921 వరకూ కుమారా రామాన్ని రాజధానిగా మొదటి చాళుక్య భీముడు పరిపాలించాడు. ఈ ఆలయ ప్రాకారాన్ని, మండపాలనీ ఈయనే నిర్మించాడు.
సామర్లకోట పంచారామక్షేత్రాలలో(మొత్తం ఐదు శివాలయాలు) ఒకటి. మిగిలిన నాలుగూ... గుంటూరుజిల్లా అమరావతిలో ఉన్న అమరారామం, తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఉన్న ద్రాక్షారామం, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న క్షీరారామం, పశ్చిమగోదావరి జిల్లాలోనే భీమవరం గునుపూడిలో భీమారామం.
14వ శతాభ్దం లో శ్రీనాధుడు రచించిన భీమేశ్వరపురాణం లో పంచారామాల వివరం ఉంది. క్షీరసాగరమదనం తరువాత అసురులు శివుడిని గురించి ఘోరతపస్సుచేసి ఎన్నోవరాలు పొందారు. ఆ గర్వంతో వాళ్ళు దేవతలని అష్టకష్టాలు పెట్టడంతో, శివుడు పాశుపతాస్త్రం ప్రయోగించి వాళ్ళని నాశనంచేస్తాడు. అగ్నిజ్వాలలలో సర్వం ఆహుతి అయినా.. అసురులు పూజించిన శివలింగం మాత్రం అలాగే ఉంటుంది. దానిని అయిదు భాగాలు చేసి, పంచారామాలలో శివుడు ప్రతిష్టింపచేశాడని ఈ పురాణం చెపుతుంది. ముఖ్యంగా ఇక్కడ కుమార స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించిన కారణంగా ఈ ప్రదేశాన్ని కుమారా రామం అంటారు. ప్రతీ సంవత్సరం చైత్ర, వైసాఖ మాసాల్లోసూర్యకిరణాలు ఉదయం పూట భీమేశ్వరస్వామి పాదాలను, సాయంత్రంపూట బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాదాలను తాకుతాయి. ఈ దేవాలయం నిర్మాణంలో ద్రాక్షారామక్షేత్రాన్ని పోలి ఉంటుంది. రాతితో నిర్మించిన రెండు ప్రాకారాలు - లోపలి ప్రాకారం నుంచి నాలుగువైపులా ప్రవేశ ద్వారాలు ఉంటాయి. లోపలివైపు ఈ గోడ రెండు అంతస్తులుగా కట్టబడింది.
స్థూపాకారపు శివలింగం, ఏకశిలా నంది, కోనేటి పుష్కరిణి, చిన్ని నమూనా దేవాలయము, కాంతులీనే ఉన్నతమైన ధ్వజ స్థంభము, శిల్పకళా సంపద..... వందస్థంభాల మండపం... ఈ దేవాలయ విశేషాలు.
బయటి ప్రాంగణంలో రాతితో నిర్మించిన మందిరం, మొదలు చుట్టూ చెట్టునీడలో భక్తులు కూర్చోవడానికి గుండ్రంగా కట్టిన అరుగు, బ్యాక్‌గ్రౌండ్లో రాతి ప్రాక్రారం, పొడవుగా సాగిన నీడలు... మంచి చిత్రకారుడు ఎవరైనా దీనిని వాటర్ కలర్స్‌తో అద్భుతమైన బొమ్మ గీయవచ్చు.
సామర్లకోటశివాలయం - కుమారారామం కనీసం ఒక్కసారయినా చూడవలసిన ప్రదేశం. ఓం నమశ్శివాయ!
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment