Pages

Wednesday, 25 July 2012

సండే మార్కెట్

ఆదివారం మూసిఉన్న షాపు షట్టర్ల ముందు చిన్న చిన్న తాత్కాలికమైన దుకాణాలు వెలుస్తాయి. మెయిన్ రోడ్డులో టౌనుహాలు దగ్గర నుంచి గోల్డ్ మార్కెట్ సెంటర్ వరకూ రోడ్డుకి రెండు వైపులా తోపుడు బళ్ళమీద, సైకిళ్ళ మీదా రకరకాల వస్తువులు అమ్మకానికి వస్తాయి. కాకినాడ ప్రజలూ, సమీపంలోని ఉళ్ళనుంచి ప్రత్యేకంగా షాపింగుకి వచ్చే జనాలతో మెయిన్ రోడ్ కిక్కిరిసిపోతుంది.

బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, చిన్నపిల్లలికి బొమ్మలు, కిచెన్లో ఉపయోగపడే సామాన్లు, సాఫ్ట్ టోయస్, నోవల్టీ ఐటంస్, ఫ్లవర్ వాజులు, వాటిల్లోకి ఆర్టెఫీషియల్ ఫ్లవర్సు, ఇంటిలోకి అలంకరణ వస్తువులు, పోస్టర్లమీద ముద్రించి ఉన్న అందమైన దేవుళ్ళు, సొగసైన సినీతారలు, ముద్దులొలికే చిన్నారులు, మంచి కొటేషన్లు… కాదేదీ అమ్మకానికి అనర్హం అన్నట్టు అన్నీ దొరకుతాయి ఇక్కడ. అన్నింటికంటే ముఖ్యంగా పాతపుస్తకాలు కూడా అమ్మకానికి వస్తాయి.


“సినిమా, బీచ్ తప్పించి ఈఉళ్ళో మరో వినోదం లేదు,” అనే వ్యక్తులు, ఒక్కసారి ఈ మార్కెట్టును నడుస్తూ చూడాలి. 

ఇక్కడ బేరమాడడం ఒక కళ. ఈ విషయంలో మొహమాట పడితే నష్టపోవలసిందే. ఒక వస్తువుని చూపించి, ధర ఎంతో తెలుసుకొని, “నా దగ్గిరి ఇరవై రూపాయలే ఉన్నాయి. ఇత్తే ఇయ్యి, లేపోతే లేదు.” అంటుంది ఒకామె. “యాభై రూపాయలకి ఒక్క రుపాయి కూడా తగ్గేదిలేదు,” అంటాడు అమ్మేవాడు. ఆమె వెళ్ళిపోతున్నట్లు ముందుకు నడుస్తుంది. “సర్లే, నలభై ఇవ్వు,” అంటాడు. ఇంకొక పావుగంట బేరమాడి, పాతిక రుపాయలు చేతిలో పెట్టి, ఆ వస్తువుని పట్టుకొనిపోతుంది. బైక్ మీదో, స్కూటర్ మీదో వచ్చిన వ్యక్తిని – “డబ్బున్న గొప్పోళ్ళు మీరే బేరమాడితే ఎలాబాబు?” అని మధ్యతరగతి ఫాల్స్ ప్రస్టేజ్ ని పొగిడి, అదే వస్తువుని నలభై రూపాయలకి అమ్మేస్తాడు.

చైనా అని పిలువబడే పోర్స్‌లీన్‌తో తయారైన కళాత్మకమైన వస్తువులు అమ్ముతారు - పూలకుండీల దగ్గరనుంచి ఆవకాయజాడీలవరకూ, టీకప్పుల నుండి ఫ్లవర్‌వాజుల వరకూ, అలంకరణ వస్తువుల నుండి డిన్నర్‌సెట్ల వరకూ, యాష్ట్రేల దగ్గరనుండి కొవ్వొత్తుల స్టాండ్‌ల వరకూ. గ్లాస్‌లాంటి మెరుపు, నునుపుదనం, అందమైన డిజైన్లతో రారమ్మని పిలుస్తాయి, కొనమని ఊరిస్తాయి.  

ఎప్పుడో క్రీస్తుపూర్వం 1600 సంవత్సరాలప్పుడే దీనిని చైనాలో వాడేవారట. అందుకే పోర్స్‌లీన్‌ని చైనా అని పిలుస్తారు. మనం తెలుగులో పింగాణీ అంటాం. ఇంతకీ ఇది ఎలా తయారవుతుందో తెలుసా? కేయాలిన్(Kaolin) అనే పదార్థాన్ని(ఇది మట్టిలాంటిదే) పన్నెండువందలనుండి పద్నాలుగువందల డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతవరకూ మరిగించి పింగాణీని తయారు చేస్తారు. ఇంకా చాలా ఇతరపదార్థాలు కూడా కలుపుతారు. ఒక్కోసారి జంతువుల దుమ్ముల పొడిని చేరుస్తారు. ఈ రకంగా తయారు చేసిన పింగాణీని బోన్‌చైనా అని పిలుస్తారు. బోన్‌చైనాతో టీకప్పులూ, డిన్నర్‌సెట్లు తయారు చేస్తారు.

పింగాణీ తయారీలో ఉపయోగించే ముఖ్యమైన ముడిపదార్థం కేయాలిన్ గురించి ఇంకొక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే దీనిని టూత్‌పేస్టుల్లో, సిరామిక్ టైల్స్‌లో, లైటు బల్బుల్లో, రంగుల్లో, సౌందర్య సామాగ్రిలో కూడా వాడతారట.  

అందమైన సోఫాసెట్ ప్రక్కన ఇండోర్‌ప్లాంట్ పెట్టుకోవాలనుకోండి, అప్పుడు లతల డిజైన్ ఉన్న కుండీలో మొక్కని వేసి, మొదలుచుట్టూ గుండ్రని, నున్నటి రాళ్ళని పేర్చి అలంకరిస్తే లివింగ్ రూం అందం రెట్టింపుఅవుతుంది. బోన్‌చైనా టీసెట్లో అతిధులకి టీ అందిస్తే బాగుంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా, చాలా వస్తువులను లైఫ్‌స్టైల్‌లో కలుపుకోవచ్చు.

మరొకచోట చిన్న తోపుడుబండి మీద వేసుకు వచ్చిన వస్తువులని, “ఏదైనా పదే,” అని అరుస్తూ, అమ్ముతూవుంటాడు ఒకడు. బేరం చేసే అవకాశం లేదు. చూడగానే `డర్ట్ చీప్` అనిపించే ఈ వస్తువులు హాట్ కేకుల్లాగ అమ్ముడుపోతాయి.

ఒక పట్టణం యొక్క ఆత్మ ఆవిష్కృతమవ్వాలంటే అది అక్కడ నివశిస్తున్న సామాన్య ప్రజల ద్వారానే జరగాలి. You can get glimpses of Kakinada`s soul in its Sunday market.


సండే మార్కెట్ అంటే…

పేదవాడి అన్ బ్రాండెడ్ బట్టల షాప్

మధ్య తరగతి షాపింగ్ మాల్

చిన్నపిల్లల తీర్తం

బుక్ లవర్ల స్వర్గం

సృజనాత్మక వస్తువులు అమ్మే బూటీక్

కార్లలో వచ్చి ఆగడానికి సిగ్గు పడే సంత


© Dantuluri Kishore Varma 

4 comments:

  1. మీ పరిశీలన బాగుందండి.

    ReplyDelete
  2. నేను రాసిన మొట్టమొదట టపా ఇదేనండి శిశిరగారు.

    ReplyDelete
  3. మొన్న జూన్ ముప్పైన అన్నవరం వెళ్లి తిరుగు ప్రయాణం లో పిఠాపురం వెళ్లి అక్కడినుంచి ఒక స్నేహితుడిని చూడటానికి కాకినాడ వెళ్ళాం. అప్పుడు చూసా సినిమా రోడ్ ఆదివారం హడావిడి ... కోటయ్య కాజాలు కొనుక్కుని తిరిగి వస్తూ.
    కానీ నాకు నచ్చనిది ఒక్క విషయం : గాంధీ నగర్ నుంచి సామర్ల కోట వెళ్ళే రోడ్ కోసం సుమారు పాతిక మందిని అడిగాను అందరూ తప్పుచెప్పారు. ట్రాఫిక్ పోలీసులు , ఆటో డ్రైవర్లు, ఇంకా అనేక మంది నన్ను అక్కడక్కడే తిప్పారు.
    ఒక గంట సమయం, రెండు లీటర్ల పెట్రోల్ వేస్ట్. పైగా వన్ వే అవటం వల్ల వెనక్కి తిరగలేని పరిస్థితి.
    అయినా మీరు చెప్పిన బజార్ సోద్యం సోయగం చూడటం వల్ల విసుగు వెయ్యలేదు.

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగుకి మీకు స్వాగతం ఆత్రేయగారు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!