Pages

Thursday, 26 July 2012

పులసల పులుసు

ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఎర్రగోదావరి నీరు సముద్రంలో కలిసే సమయంలో ఆస్ట్రేలియాలో పుట్టిన పులస చేపలు సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీదుతాయి. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలస అని పిలుస్తారు. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారిపోతుంది. ఇలస పులసగా మారుతుంది. పులసలు గోదావరి జిల్లాలకే ప్రత్యేకం. తూర్పుగోదావరిజిల్లా కాట్రేనికోన, యానం, దవళేశ్వరం; పశ్చిమగోదావరి జిల్లా సిద్దాంతం  దగ్గర పులసలు దొరుకుతాయి. కేవలం ఒకేఒక్క సీజన్లో అరుదుగా లభ్యం అవడం వలన వీటికి మంచి గిరాకీ ఉంటుంది. కేజీ పులస ధర  వేలల్లో ఉన్నా దూరప్రాంతాలనుంచి కూడా వచ్చి కొనుక్కొని తీసుకువెళతారు. న్యూస్‌పేపర్లలో, టీవీల్లో, కథల్లో, ఇలాంటి బ్లాగుల్లో పులసల రుచిగురించి `అమోఘం, అత్యద్భుతం, అమృతమయం` అని ఊదరగొట్టేస్తూ ఉండడంవల్ల కూడా ఎక్కడెక్కడి నుంచో చేపలప్రేమికులు లొట్టలేసుకొంటూ ఉభయగోదావరి జిల్లాల్లో పులసలు లభించే ప్రాంతాలకి వచ్చేసి, కొనుక్కొంటూ పులస ధర ఆకాశాన్నంటే క్రమంలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. చాలాసార్లు పులసంత రుచి ఉండని ఇలసల్నే పులసలుగా నమ్మించి అమ్మేస్తూ ఉంటారు కనుక, ఈ విషయంలో కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్ళని కొనుక్కొంటున్నప్పుడు ప్రక్కన ఉంచుకోవడం ఉత్తమం.

అతిశయోక్తి అనుకోకుండా నామాట నమ్మండి పులసల పులుసు రుచి నిజ్జంగానే అమోఘం. కాకపోతే సరిగ్గా వొండుకోవాలి. కట్టెల పొయ్యి మీద, మట్టి కుండలో పులస పులుసు వండితే దాని రుచికి సాటే ఉండదు. పులస పులుసుని ఉల్లిపాయలు, వెల్లుల్లి, దనియాలు, జీలకర్ర పేస్ట్, నిలువుగా చీరిన పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, బెండకాయ ముక్కలు, ఆవకాయ నూనె లతో తయారుచేస్తారు.

వంశీ రాసిన `మా పసలపూడి కథలు` తూర్పు గోదావరి నేటివిటీని చక్కగా అవిష్కరిస్తాయి. మనుషుల స్వభావాలని, జరిగిన సంఘటలని, పల్లెల్ల అందాలని, గోదావరి గలగలల్ని ఆవిష్కరించిన సాహితీ సుమాలు ఇవి. గోదావరి జిల్లాల కథల విరించి - వంశీ రాసిన `చిట్టెమ్మ కాసే చేపల పులుసు` కథలో చిట్టెమ్మ పులసల పులుసు తయారు చేసిన విధానం చదివితే ఎవరికైనా నోరూరడం ఖాయం. సందర్భానుసారంగా ఉంటుందని ఆ నాలుగు ముక్కలూ ఇక్కడ ఉట్టంకిస్తున్నాను చిత్తగించండి.
"ఉల్లిపాయ ముక్కలూ, వెల్లుల్లి పాయరేకలూ, అల్లం, జీలకర్ర, ధనియాలు కలిపి ముద్ద కింద నూరి ఒక సీవండి గిన్నెలో వేసింది. గుప్పెడు పొడుగాటి మిరప పళ్ళని తీసుకొచ్చి రోట్లో వేసి ముతగ్గా దంచి ఇంకో చిన్న గిన్నెలో వేసేకా లోపలికెళ్ళి చాలా వెడల్పాటి మట్టిదాక బయటికి తెచ్చింది. ...... దాకని మండుతున్న చింతపుల్ల పొయ్యి మీద పెట్టి రమణ నువ్వుల గానుగలోంచి తెచ్చిన నువ్వుల నూని అందులో వేసి సెగొచ్చేదాకా కాగేకా నూరిన ముద్దలన్నీ ఒకదాని తర్వాత ఒకటేసి చెక్క గరిటితో దోరగా వేయించేకా అంతసేపు లేత కొబ్బరినీళ్ళల్లో నానేసిన పాత చింతపండుని పులుసుగా పిసికి దాక సగానికి పైగా నిండేలాగ వేసింది. టమాటా పళ్ళు కసకసమంటా పిసికేసి జల్లేసింది. చిటికనవేలు సైజులో కోసిన లేత బెండకాయ ముక్కలేసి ఆ తర్వాత  ఒకో చేప ముక్కా పులుసులో ములిగేలాగ వేస్తా వచ్చింది. అలాగ అన్నీ వేసేసేక దాకకి సరిపడా చేయించిన జల్లిమూకుడు తెచ్చి పైనబెట్టి పొయ్యిలో మండుతున్న చింతపుల్ల లెగదోసింది.

పావుగంట దాటింది.

కుతకుతా ఉడుకుతా బుళుకు బుళుకు మనే బుడగల్తో చప్పుళ్ళు చేస్తుంది దాకలో పులుసు. కమ్మటి పులుసు వాసన నోరురించే వాసన. అలాగ కాసేపు ఉడకనిచ్చి ఆ తర్వాత పొయ్యిలో మండుతున్న చింతపేడుల్ని వెన్నక్కి లాగేసి నీళ్ళు చల్లేసరికి సుయ్యిమంటా ఆరిపోయినియ్యా పుల్లలు.

ఇప్పుడు లోపలున్న చింతనిప్పుల్తో సెగమీద మరుగుతుంది పులుసు. ఇలా మరగడంవల్ల చేపముక్కల్లో సన్నటి ముళ్ళు అన్నీ కరిగిపోతాయంట. అలా కరిగి మరిగి మరిగి కాసేపటికి చక్కటి రుచి వచ్చేలాగ చిక్కబడింది పులుసు. ఇంకాస్సేపయ్యేకా దాక కిందకి దింపేసి వెన్నపూస ముద్ద ఆ పులుసులో వేసి పొయార్పేసింది. మొత్తం వెడంతా పోయి చల్లరేకా సీవండి రేకులో ఉంచుకొన్న ఆవకాయతేట ఆ పులుసులో కలిపేసి `తెల్లరేకా తీద్దారిలే` అనుకుంటా భోషాణం పెట్టెలో పెట్టేసింది.

`అమ్మో ఎంత రుసీ` అంటూ ఎగిరి గంతేసుకొంటా తిన్నారు జనాలు."

Pulasa season has come - get ready to have ambrosial pulasa pulusu
© Dantuluri Kishore Varma

4 comments:

  1. అబ్బబ్బా...ఏం రాసారండి. వెజిటేరియన్ అయిన నాకే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి. రాసినందుకు వంశీ గారికి, పంచుకున్నందుకు మీకు...వేసుకోండి రెండు వీరతాళ్ళు :)

    ReplyDelete
    Replies
    1. మీరిచ్చిన వీరతాడు సూపర్. ధన్యవాదాలు.

      Delete
  2. పుస్తి లు అమ్ముకొని అయినా పులస తినాలి అంటారు , నిజమే నా సర్ ? పులస రుచి ఇంకా చేయలేదు ఎప్పుడో చేస్తానో ఏమో

    ReplyDelete
    Replies
    1. అమ్మడం అనే నిర్ణయం ఎవరికి వారే తీసుకోవాలికానీ నానుడి ఉన్నమాట మాత్రం నిజమే. పులసల పులుసు నిజ్జంగానే బాగుంటుంది.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!