భాషలకి లిపి లేని అతి పురాతనమైన కాలం నుంచీ సంస్కృతిని కథలు, పాటలు, సామెతలు, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు...గా కూర్చి తరతరాలుగా ఒకరినుంచి ఒకరికి మౌఖికంగా అందిస్తూ సజీవంగా ఉంచిన జాన పద కళారూపాలకు ఏ దేశమైనా, ఏ భాషైనా ఋణపడి ఉండవలసిందే.
అమ్మపాడే లాలిపాట; తాత చెప్పే టక్కుటమార మాంత్రికుల, అపురూప సౌందర్య రాకుమార్తెల, సౌర్య సుందర రాజకుమారుల కథలు; పొలంలో కలుపు తిసే పాట, నాట్లు వేసే పాట, కుప్ప నూర్చే పాట, నావమీద సరంగు దూరంగా ఉన్న ప్రియురాలిని తలచుకొంటూ పాడే విరహపు పాట, పండుగ పాట; హరిదాసు సంకీర్తన; బుర్రకథలో పరాక్రమ వర్ణన, కరుణరస పోషణ; వీధినాటకాలలో చాంతాడు నిడివి సంభాషణలు; పామరులుకూడా అలవోకగా చెప్పె సామెతలు - ఎవరు నేర్పేరు వీళ్ళందరికీ ఈ విధ్యలన్నీ, ఏ బడిలో చదువుకొన్నారని?
కాలం మారేకోద్దీ మనం ముందుకో, వెనక్కో వెళుతున్నాం.
పిల్ల ఏడుస్తుందని తల్లిపాడే పనిలేదు - తండ్రి దగ్గరి స్మార్ట్ ఫోన్లులో లేదా ఐపోడ్ లో జస్టిన్ బైబరో మరెవరిదో సాంగ్ రెడీగా ఉంటుంది. సెమీ అర్బనైజ్ అయిన పల్లెల్లో పొలం పాటో, సరంగు పాటో వినే అదృష్టం ఎప్పుడో కోల్పోయాం."తోలుబొమ్మలాట అంటే `దశావతారం` సినిమాలో `ముకుందా...ముకుందా...` అనే పాటలో చూపించారు చూడు," అనే దాకా వచ్చాం.
కథలువినడానికి - చెప్పే తాతలూ, బామ్మలూ ఎక్కడో పల్లెలోనో, వృద్దాశ్రమంలోనో ఎప్పుడూరాని మనకోసం ఎదురుచూసే చకోరపక్షులు. పిల్లలదగ్గర ఎవరైనా తెలుగు సామెతలు చెబితే, "పల్లెటూరి స్లాంగ్ నేర్పి పిల్లలిని పాడుచేస్తున్నరని," విసుక్కోంటాం. హరికథలు, బుర్రకథలు, వీధినాటకాలు వెంటిలేటర్లమీద తుదిశ్వాశ తీసుకొంటున్నాయి.
జానపదమంటే ప్లాస్టిక్ పూల అలంకరణలతో, ఆర్బాటమైన టీ.వీ. రియాలిటీ షో సెట్టింగులమీద గొంతెత్తిపాడే కళాకారులు, వాళ్ళని కృతకంగా అనుకరించే ఏంకర్లు, "మైండ్ బ్లోయింగ్," అని అరిచే జడ్జీలే మనకి గుర్తుకువచ్చేది.
ఒకప్పటి పామరుడైన పశువులకాపరికి, ఈ రోజు అతిపెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివే అదే వయసు పిల్లోడి కంటే మన సంసృతి గురించి, సాంప్రదాయాల గురించి, పురాణా గురించి, ఇతిహాసాల గురించి నిశ్సందేహంగా ఎక్కువ తెలిసి ఉండేది. విచారించవలసిన విషయమే. కానీ ఏమిచేస్తాం! ఈ రోజు (22.08.2012) అంతర్జాతీయ జానపద దినోత్సవం (వాల్డ్ ఫోక్లోర్ డే). విచారంగానో, ఆనందంగానో మన జానపద కళలని గుర్తుచేసుకొందాం.
© Dantuluri Kishore Varma
అద్భుతంగా చెప్పారండీ! ప్రతీ ఒక్కరూ ఆలోచించవలసిన విషయం.
ReplyDeleteథాంక్యూ సోమచ్ రసజ్ఞగారు!
ReplyDelete