రిఫ్రిజిరేటర్ అనే మాట ఎవ్వరికీ తెలియని రోజులవి. పల్లపు వీధివాళ్ళు నలుగురైదుగురు కలిసి ఐస్ ఫేక్టరీ పెట్టారు. ఫేక్టరీ అంటే అదేదో చాలా పెద్దదేమీ కాదు. గోలీ సోడాలూ, డ్రింకులూ చల్లబరచడానికి ఐసు దిమ్మలూ; ఊరూరూ సైకిలుమీద తిరిగి అమ్ముకొనే పుల్లైసు బండివాళ్ళకి సరఫరా కోసం పాలైసు, ఆరెంజ్ ఐసు, కోలా ఐసు, మేంగో ఐసు లాంటివి తయారు చేసే ఒక చిన్న గదిలాంటి షాపు. ఈ ఫేక్టరీ పెట్టడంతో ఊరికి చాలా అభివృద్ది వచ్చినట్టైపోయింది. `మా వూళ్ళో ఐసు ఫేక్టరీ పెట్టారు తెలుసా!` లాంటి గర్వంతో కూడిన మాటలు కూడా కొంతమంది చెప్పుకొనేవారు. చుట్టుప్రక్కల నాలుగైదు గ్రామాలకి ఇదొక్కటే మరి. ఎండలు మండిపోతున్న సమయంలో ఇది అందుబాటులో ఉండడం ఒక రకంగా అదృష్టమే! మిట్టమిడసరం పెద్దవాళ్ళు అందరూ పడుకొన్న తరువాత పదిపైసలు చేతిలో పట్టుకొని ఒక్క పరుగు తీస్తే, ఎండ నెత్తిమీద `సుర్రు`మనిపించే లోగా ఐసు ఫేక్టరీ దగ్గరకు చేరిపోయే వాళ్ళం. పుల్ల ఐసు చల్లదనం, రుచీ మధురం.
మావిడిపళ్ళు సమృద్దిగా ఉండేవేమో, `చక్కగా నాలుగు పళ్ళు తీసుకొని తినండిరా,` అని పెద్దవాళ్ళు మొత్తుకొనేవారు. తిని,తిని మొహంమొత్తి ఉన్న పిల్లలకి అవి అప్రియమైన మాటల్లా ఉండేవి. బాగా ముగ్గిన పాపారాజు గోవా పళ్ళ నుంచి రసం పిండి పెద్ద పెద్ద గాజు సీసాలలోకి నింపి, ఐసు ఫేక్టరీకి ఉదయాన్నే పంపేవారు. మద్యాహ్నం ఐసులుకోసం వెళ్ళినప్పుడు వాటిని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని ఇంటిల్లపాదీ లోటా గ్లాసుల్లో నింపుకొని, ఒక్కో గుటకా మ్రింగుతుంటే........ ఆహా!
కొన్ని జ్ఞాపకాలు ఎన్నేళ్ళయినా అలా నిలిచిపోతాయి.
సాయంత్రం పూట పొలానికి వెళ్ళిపోతే పాలికాపుని అప్పటికప్పుడు చెట్టెక్కించి ముంజికాయలు దింపించేవారు. ఒక్కో గెలనుంచీ కాయలు నరికి, ముంజులు కనిపించే వరకూ ముచ్చిక కోసి ఇస్తే - బొటన వేలు గుచ్చి తియ్యని రసాన్నీ, ముంజునీ అస్వాదిస్తూ తింటుంటే....
రోడ్డు ప్రక్కన బండిమీద జాడీలో పెరుగు, పంచదార, ఐసు వేసి కవ్వంతో చిలికి, గ్లాసులో వేసి, పైన స్పూనుతో కొంచం మీగడ వేసి అందించిన లస్సీ గొంతుక దిగుతుంటే....
పుచ్చకాయ ముక్కలు, బొప్పాయి చీరికలు, కొబ్బరి బొండంలో చల్లని నీళ్ళు........
వేపచెట్ల చల్లని నీడ, గోదావరి మీదనుంచి వచ్చే గాలి తెమ్మెర, ఆరుబయట వెన్నెట్లో మడతమంచం మీద వెల్లకిలా పడుకొన్నప్పుడు కనిపించే చలువబంతి లాంటి చందమామ....
అన్నింటి కంటే ముఖ్యంగా శెలవులు, కజిన్స్‌తో ఆటలు, బోది కాలువల్లో, పంపుషేడ్డుల దగ్గర స్నానాలు....
అన్నింటి కంటే ముఖ్యంగా శెలవులు, కజిన్స్‌తో ఆటలు, బోది కాలువల్లో, పంపుషేడ్డుల దగ్గర స్నానాలు....
వేసవి అంటే ఉక్కబోత, కరెంట్ కట్, కణకణ మండే ఎండలే కాదు. వాటితో పాటూ పైవన్నీ తీసుకొని వచ్చే అమృతకాలం. ఇవన్నీ గుర్తుకు వస్తే ఎప్పుడైనా సరే మనసు రాజమందిరం అయిపోదూ?
© Dantuluri Kishore Varma