మైసూరులో సారవంతమైన భూములు విస్తారంగా ఉన్నాయి. కానీ, సాగుచెయ్యడానికి జనాలే తక్కువ. అందువల్ల ఆ భూములన్నీ పచ్చికమైదానాల కింద మిగిలిపోయాయి. ఇది ఎప్పటిమాటో. ఉత్తరాదినుంచి పశువులను తోలుకొని చాలా మంది ఈ పచ్చిక మైదానాల వైపు వచ్చేశారు. క్రమంగా బాగా బలసిన మేలుజాతి గిత్తలు, ఆవులకి మైసూరు ప్రసిద్ది చెందింది. ఒకజత మైసురు ఎడ్లు ఉంటే గొప్ప స్టేటస్ సింబల్‌గా భావించేవారు. వాటికోసం సుదూర ప్రాంతాలనుంచి కూడా ప్రజలు మైసూరు పశువుల సంతకు వెళ్ళేవారు. నలభై, యాభై ఏళ్ళ క్రితం మావూరునుంచి అప్పల్రాజుగారూ మరో నలుగురూ కలిసి మైసూరు వెళ్ళడానికి రైలు బండి ఎక్కారు. వెళ్ళడానికి, కొనడానికి ఎన్నిరోజులు పట్టిందో తెలియదు కానీ ఓ అరడజను జతల ఎడ్లను కొని గూడ్స్ వేగన్లో ఎక్కించి, వాటితో పాటూ వెళ్ళినవాళ్ళు కూడా ఎక్కేసి, రాజమండ్రీలో దిగారు. అక్కడనుంచి జగ్గంపేటవరకూ తోలించారు. అక్కడ ఒక మజిలీ. తరువాత జగ్గంపేటనుంచి ప్రత్తిపాడు దగ్గర ఉన్న మా వూరు రాచపల్లి వరకూ తోలుకొని రప్పించారు. మా జత మైసూరు ఎడ్లను వదిలేసి మిగిలినవి ఎవరివి వాళ్ళు తీసుకొని పోయారు.
వీధిచావిట్లో పందిరి గుంజ ప్రక్కనున్న గుబురు పుల్లమావిడిచెట్టు క్రింద మైసూరు ఎడ్లను కట్టేస్తే, పచ్చగడ్డిని తాపీగా నెమరువేస్తూ రాజసంగా కూర్చొన్న వాటిని చూడడానికి ఊరిజనాలు తండోపతండాలుగా వచ్చారు. సూదిగా మెలితిరిగి ఉన్న కొమ్ముల దగ్గరనుంచి, కాలి గిట్టలవరకూ అణువణువునూ పరిశీలిస్తూ `మేలుజాతి ఎడ్లు` అని కితాబునిచ్చారు. చూసే వాళ్ళకి ఆనందం, వినేవాళ్ళకి పరమానందం!
ప్రయాణ బడలిక తీరిన తరువాత అలంకార పర్వం మొదలయ్యింది. గిత్తలకి కొత్తనాడాలు వేయించారు, కొమ్ముల్ని చెక్కించారు. కొమ్ముల్ని చెక్కడానికి నిపుణులు ఉండేవాళ్ళు. చెక్కకి చిత్రీ పట్టినట్టు చిన్న ఉలి తీసుకొని కొమ్ములమీద పై పొరని తొలగించేవారు. తరువాత ఎలిబూడిదని (అంటే కాలిన పిడకల నుంచి వచ్చినది) తీసుకొని వాటికి రుద్దే వారు. కొమ్ముల్ని రుద్దగా, రుద్దగా అవి ఏనుగు దంతాల్లా మెరిసేవి. అప్పుడు పాలిష్ పెట్టాలి. ఈ పనులన్ని చకచకా జరిగాయి. తళ తళా మెరుస్తున్న కొమ్ముల చివర ప్రత్యేకంగా తయారుచేయించిన ఇత్తడి తొడుగులు బిగింపించారు, వాటి కుదుళ్ళకి మువ్వలు కట్టారు. గిత్తలకి ముకుతాళ్ళు వేశారు, మెడలో గంటలు కట్టారు.
ఈ పనులు ఓ వైపు జరుగుతుండగానే మోటబండి చక్రాలను, కాడినీ విప్పేశారు. చక్రాల చూట్టూ ఉన్న అరిగిపోయిన ఇనుప రింగుల్ని(ఇప్పుడు మన కార్లకి ఉండే టైర్లు ఎలాంటివో, అప్పటి బళ్లకు అవి అలాగ) తొలగించి కొత్తవి వేశారు. బండికి క్రింద తారు పూయించారు, పైన రంగులు వేయించారు. ఇరుసుకి క్రీజు పట్టించి, జనపనార చుట్టబెట్టి చక్రాలు బిగించారు, శీలలు తగిలించారు. కాడికూడా వేసేసరికి మరామత్తులు ముగిసి బండి తయారయ్యింది.
అలంకరించడం, బండికి కట్టితోలడం మాట అటుంచి వాటి తిండీ, సంరక్షణ ఖర్చుతో కూడుకొన్న పని. ఉలవలు ఉడికించి, దానిలో తవుడు కలిపి దానా తయారు చెయ్యాలి. పచ్చగడ్డి, జనుమూ కోసుకొని వచ్చి ముక్కలుగా కత్తిరించి వాటికి వెయ్యాలి. బండి కట్టి సవారీకి రడీ చెయ్యాలి. తిరిగి వచ్చిన తరువాత బండివిప్పి, ఎడ్లను శుబ్రంగా తోమి మాలిష్ చెయ్యాలి. వాటిని కడిగి స్నానం చెయ్యించాలి. ఈ పనులన్నీ చెయ్యడానికి ఒక మనిషి నిరంతరం వాటిని కనిపెట్టుకొని వుండేవాడు.
కొత్త బండికి మైసూరు గిత్తల్ని కట్టి వాటి నుదుళ్ళకీ, బండికీ పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టి, కొబ్బరికాయ కొడితే ప్రయాణం మొదలయ్యింది. గేటు దాటి బండి పొలం వైపు పరుగులు పెట్టింది. ప్రతీరోజూ పొలానికి, అప్పుడప్పుడూ పట్నానికి.... అక్కడి నుంచి ఇంటికి..... దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మల్లీశ్వరి సినిమాకి రాసినట్టు...
ఓ ఓ ఓ.. హేయ్...
పరుగులు తియ్యాలి
గిత్తలు ఉరకలు వేయాలి
హేయ్... బిరబిర చరచర పరుగున పరుగున
ఊరు చేరాలి మన ఊరు చేరాలి... ఓ...
హోరుగాలి కారుమబ్బులు
ముసిరేలోగా మూగేలోగా
ఊరు చేరాలి మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ మెళ్లో గంటలు
ఆ... గలగల గలగల
కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ
మెళ్లో గంటలు
వాగులు దాటి
వంకలు దాటి
ఊరు చేరాలి
మన ఊరు చేరాలి...
తరువాత కొంతకాలానికి దూపాడ ఎడ్లని మరొక జతని కొన్నారు. అవి పొట్టిగా ఉండేవి. వాటికోసం ఒక గుర్రబ్బండిని కొని, మరామత్తులు చేయ్యించారు. కాడిని వేయించి, బండిలోపల కుషన్లు కుట్టింపించారు. చక్రాల చుట్టూ ఇనుప రింగుకి బదులుగా రబ్బరు టైరు వేయించారు. సవారీ బండి తయారయ్యింది. సినిమాలకి, పిక్‌నిక్‌లకి ఈ బండిమీదే ప్రయాణం.
.... పరుగులు తియ్యాలి
గిత్తలు ఉరకలు వేయాలి
ఆ... అవిగో అవిగో...
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
అవిగో అవిగో... అవిగో అవిగో
ఆ... పచ్చని తోటల విచ్చిన పూవులు
ఊగే గాలుల తూగే తీగలు... అవిగో...
కొమ్మల మోగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు
అవిగో అవిగో... అవిగో అవిగో...
అర్థ శతాబ్ధం క్రితంవరకూ జీవనవిధానం మెల్లగా సాగే నదిలా ఉండేది. పెరిగిన సాంకేతికత, అభివృద్ది సాక్షిగ ఉప్పెనలా మార్పులు ఒక్కసారిగా ముంచెత్తుకొని వచ్చాయి. చదువులు, వుద్యోగాలు, పట్నవాసాలు, విదేశాలకు వలసలు..... కొన్ని విషయాలను జ్ఞాపకాలుగా మిగిల్చేశాయి.
© Dantuluri Kishore Varma