అనుకోకుండా ఒక్కోసారి అవకాశాలు అలా కలిసివచ్చేస్తూ ఉంటాయి. వాటిని కాదని తోసిపుచ్చలేం, అవునని అందిపుచ్చుకోలేం. నేషనల్ హైవే ప్రక్కన నాలుగు గంటల నిరీక్షణ ఎంత ఫిలాసఫీని తీసుకొచ్చేసిందో చూడండి. ఉదయం ఎనిమిది గంటలకి ఎండలో వేడి సుర్రుమనిపించకముందే కారు ఇంజను హీటెక్కిపోయింది. ఈ రోజు ప్రయాణం ఉందని తెలిసి నిన్నరాత్రి తనని అద్దంలా మెరిసిపోయేలా తుడిచాననే కృతజ్ఞత కూడా లేకుండా ఈ కారు టక్కున ఆగిపోయింది. ఫోన్‌చేసి పిలిచిన మెకానిక్ అరవై కిలోమీటర్ల దూరం నుంచి రావడానికి మిట్టమిడసరం అయ్యింది. ర((య్, ర((య్ మని దూసుకుపోతున్న కార్లు, లారీలు; హార్స్ పవర్ సరిపోకపోయినా వాటితో పోటీపడి ముందుకు వెళ్ళిపోవాలనుకొంటున్న ఆత్రపు ఆటోలు; నిండు గర్భిణిల్లా ఆర్టీసీ బస్సులు; నత్త నడకల సైకిళ్ళు; ఎక్కడికీ వెళ్ళకుండా నిశ్చలంగా నేషనల్ హైవే, నేనూ సహవాసం చేశాం.
పదవుతూ ఉండగా ఒక నడివయసు వ్యక్తి బొబ్బాయ కాయలు బుట్టలో పెట్టుకొని, సైకిల్ వెనుక కారియర్కి కట్టి తీసుకొని వచ్చాడు. చెట్టుక్రింద చిన్న నీడలో పిండిసంచి పరచి, దానిమీద కాయలని పేర్చాడు. ఒక ముగ్గిన కాయ తీసుకొని తొక్క చెక్కి, చీరికలు చేసి, ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లో వేసి సైకిల్ హ్యాండిల్కి తగిలించాడు. వేగంగాపోయే వాహనాలు తప్ప పెద్దగా మనుష్యసంచారం లేని ఈ ప్రదేశంలో బొప్పాయి చీరికలు అమ్మే అదృష్టం ఈతనికి ఉంటుందా అనే సందేహం కలుగుతుంది. రెండవ కాయ చెక్కుతున్నాడు. `అది కూడా తగిలిస్తాడా?` అనుకొంటూ ఉన్నాను. చెక్కడం పూర్తయ్యింది. ఎవరో వచ్చి మొదటి సంచితో తగిలించిన చీరికలని కొనుక్కొని పోయారు. దాని ప్లేస్‌లో రెండవ సంచి తగిలించాడు. ఒకే వేగంతో ఆ వ్యక్తి అలా తన పనిని చేస్తూనే పోయాడు. రెండు గంటల సమయంలో ఎప్పుడూ ఒకేసారి రెండు సంచులు సైకిల్ హ్యాండిల్‌కి తగిలించి లేవు. ఆ వ్యక్తి కాయలను చెక్కకుండా ఎప్పుడూ లేడు.
`భోజనం తెచ్చుకొన్నావా? సాయంత్రం వరకూ ఇక్కడే ఉండి కాయలు అమ్ముతావా?` అని అడిగాను. మద్యాహ్నం మూడుగంటల వరకూ ఉంటానన్నాడు. మిగిలిన కాయల్ని మరునాడు అమ్ముకొంటాడట. `ఎవరో ముందుగానే నిర్ణయించినట్టు సరిగ్గా కాయ తరువాత కాయ ఎలా అమ్ముడుపోతుంది?` అన్నాను. `అంతా దేవుడి దయ,` అన్నట్టు ఆకాశం కేసి చెయ్యిచూపించాడు.
అతను చెప్పలేదు కానీ ఆ ప్రదేశంలో గంటకి మూడు, నాలుగు కాయలు అమ్మగలిగినంత సంభావ్యత ఉంటుందని రోజూ వ్యాపారం చేస్తున్న అతనికి తెలుసు. కాబట్టి తన వేగాన్ని నియంత్రించుకొని పావుగంటకి ఒక్కొక్క కాయ చొప్పున చెక్కుతున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి కొంచెం జనాలు ఎక్కువగా నడిచే ప్రదేశంలో తన వ్యాపారాన్ని చేస్తూ ఉంటే గంటకి ఎనిమిదో, పదో కాయలు ఆమ్మి ఉండేవాడు. అప్పుడు తప్పని సరిగా వేగం పెంచాలి. అయిదారునిమిషాలకి ఒక్కో బొప్పాయికాయిని చెక్కాలి.
`మద్యాహ్నం మూడు తరువాత కాయలకోసం ఎవరైనా వస్తే, నువ్వు లేకపోతే ఎలాగా?` అన్నాను. ఎవరూ రారన్నాడు. `ఎందుకని,` అడిగితే చిరునవ్వు నవ్వి ఊరుకొన్నాడు. బహుశా కారణం తనకు తెలియదేమో!
నిజానికి ఎవరూ, ఏమీ అమ్మని చోట ఎవరైనా ఏమి కొనుక్కోవడానికి ఆగుతారూ?
* * *
ఈ రోజు ఎన్నో పనులు పూర్తిచెయ్యాలని ఊరికి బయలు దేరాను. చాలా వ్యవహారాలున్నాయి. తొందరగా మొదలు పెట్టకపోతే అన్నింటినీ పూర్తిచెయ్యలేను. రోడ్డువార నిరీక్షణవల్ల అవన్నీ ఏమయిపోతాయి? నాలుగు గంటల ఆలస్యం అయినా అనుకొన్న పనులన్నీ సాయంత్రానికి పూర్తయిపోయాయి! `ఎలా?` అంటే బొప్పాయి కాయలమ్మే వ్యక్తిలా నేను ఆకాశం కేసి చెయ్యి చూపించను. ఎందుకంటే అతని ద్వారానే ఈ రోజు నాకొక విషయం బోధపడింది. అందుబాటులో ఉన్న సమయమే పనులయొక్క వేగాన్ని నిర్ణయిస్తుందని.
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకి డెడ్‌లైన్స్ అందుకే ఇస్తారేమో!
© Dantuluri Kishore Varma
మీ ఆలోచనా శైలి చాలా గొప్పది సర్,
ReplyDeleteఇలా ఎందుకన్నానంటే మనస్సులో ఉన్నది పేపర్ మీద పెట్టే సరికి మారిపోతుంది,
కానీ మీ మనస్సు నుండే మేము డైరెక్ట్గా చదువుతున్నామేమో అనిపిస్తుంది.
ఇకపొతే ఆ చిన్న వ్యాపారస్తులకు ఆత్మస్థైర్యమే రక్ష.
మీ ప్రశంసకి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు మెరాజ్‌గారు. :)
DeleteExcellent Analysis Sir....
DeleteThank you Chowdary garu :)
Deleteచక్కని విశ్లేషణ..బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు రామకృష్ణా రెడ్డి గారు
Deletelogical post :)
ReplyDeleteథాంక్స్ కృష్ణచైతన్య గారు :)
Delete