బహుళ అంతస్థుల భవనాలు, మేడలు, గుడిసెలు, షాపులు, ఎత్తైన విగ్రహాలు, కరెంటు స్థంభాలు, అక్కడక్కడా చెట్లు... నగరాల్లో ఇవన్నీ రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోచోట అస్తవ్యస్తంగా చిక్కులు పడిపోయినట్టున్న కరెంటు వైర్లు, హోర్డింగులు, అడ్డదిడ్డంగా కట్టిన బిల్డింగులు, ఫ్లెక్స్ బ్యానర్లు చూస్తున్న కళ్ళకి విసుగు పుట్టిస్తాయి. వాయు కాలుష్యం, నీటికాలుష్యం లాగా ఇది దృశ్య కాలుష్యం.
బైకులోనో, కారులోనో వేగంగా పోతూ ఉంటామా.. ఈ దృశ్య కాలుష్యాన్ని చూసి నగరజీవితమంటేనే విసుగుపుట్టేస్తుంది. కానీ అంతలోనే అకస్మాత్తుగా ఏ ఆలయ గోపురాలో, మసీదు గుమ్మటాలో, మీనార్లో కనిపించి మన విసుగునంతా `ఉఫ్!` అని ఊది పారేస్తాయి. సరిగ్గా ఆ సమయానికి మనదగ్గర కెమేరా ఉందనుకోండి, ఆగ గలిగిన వెసలుబాటు ఉంటే ఓ స్నేప్‌ని `స్నిప్` మనిపించి ముందుకు పోవడమే.
అలా మనసుకి నచ్చిన ఫోటోలు తీసి, అవకాశం ఉన్నంత మేర మీతో పంచుకొంటూ ఉంటాను. కావాలంటే చూడండి నా బ్లాగ్‌నిండా గుళ్ళు, గోపురాలు.. వగైరా ఎన్నో కనిపిస్తాయి. అవన్నీ చూసి మీరంతా నేనేదో పేద్ద భక్తుడిని అనుకొనే ప్రమాదం కూడా లేకపోలేదు.
అసలు విషయం వదిలి పెట్టేసి ఎక్కడికో వచ్చేశాను చూశారా? అప్పుడెప్పుడో వైజాగ్ వెళ్ళినప్పుడు మురళీ నగర్ ఏరియాలో అలా పోతూ, పోతూ అందంగా కనిపించిన ఈ మసీదుని కెమేరాలో బంధించాను. రేపటి నుంచి ముస్లిం సోదరుల ఉపవాసమాసం రంజాన్ మొదలవుతుంది కదా? అందుకే అందరికీ రంజాన్ ముబారక్ చెపుతూ ఈ చాయాచిత్రం.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment