Pages

Sunday 27 July 2014

అమృతం కురిసిన రాత్రి

అమృతం కురిసిన రాత్రి మళ్ళీ చదివాను.

"కవిత్వమొక అల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసును
కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకి తెలుసు
కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు"

అంటాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. నిజానికి ప్రొసైక్ భావాన్ని పోయట్రీగా మార్చడం తిలక్‌కీ చాలా బాగా తెలుసు. మాటల్ని కూర్చి మనసులో భావాన్ని మనోహరంగా మలచడంలో అతనొక అల్కెమిస్టే.  అందుకే తిలక్ మాటల్లోనే

"నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు.."

యవ్వనపు తొలిరోజులని తలచుకొంటూ రాసిన `ఆ రోజులు` కవితలో మాటల లయ చూడాలి.

"పచ్చని పచ్చికల మధ్య
విచ్చిన తోటల మధ్య
వెచ్చని స్వప్నాల మధ్య
మచ్చికపడని పావురాల మధ్య
పరువానికి వచ్చిన ఆడపిల్లల మధ్య
పరుగెత్తే నిర్ఘరుల మధ్య
తెరులెత్తే మునిమాపుల మద్య.."

ఇక భావుకత్వం ఎంత బాగుంటుందనీ- 

"సగం మబ్బు సూర్యుడి మీద
శాటిన్ తెరలా కప్పుకుంది
సంజ యెరుపు సెలయేటి మీద
చల్లిన తొలి సిగ్గులా వుంది"

అంటాడు స్వేచ్చా విహారం కవితలో. ఇంకా..

"ఒకరినడుం ఒకరు చుట్టి
ఉల్లాసంగా తిరుగుదాం
సరుగుడు చెట్ల నీడలలో
విరుగుడు చేవ తోటలలో
మునిమాపు వేళ రెండు నక్షత్రాలు
ముద్దు పెట్టుకొంటున్నప్పుడు
మునికాళ్ళమీద నిలిచి దేవతలు
మనని అసూయగా చూస్తున్నప్పుడు"  

అంతేనా? జీవిత సత్యాల్ని కవితా పంక్తుల్లో కలబోసి అందిస్తాడు. "జీవితపు చక్రాల సీల ఊడిపోతే, బ్రతుకు బురదలోపడి దొర్లుతుందని.."  "పడుకొనేముందు పాన్పుకింద పాముందో లేదో చూసుకో, ప్రబల శత్రువెవడో నిన్ను వెన్నంటి వున్నాడు కాసుకో" అని హెచ్చరికలు జారీ చేస్తాడు. 

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో రాస్తూవుండినందు వల్లనేమో తిలక్ కవితలు చాలా వాటిల్లో సైనికుడి బెంగ,  తల్లి ఆవేదన, భార్య అనుభవించే విషాదం కనిపిస్తాయి. వాటితో పాటూ యుద్ద బీబత్సంకూడా.

సైనికుడి ఉత్తరంలో -

"దూరంగా ఆల్ప్స్ మీద మంచు ధు:ఖంలా కరుగుతోంది
ప్రభాతం సముద్రం మీద వెండి నౌకలా ఊగుతుంది
తిరికి ఎప్పుడు మన ఊరు వస్తానో!
నిన్ను చూస్తానో?" అని సైనికుడు వాపోతే.. 

తపాలా బంట్రోతులో -

"గుడిసెముందు కూర్చున్న పండుముసలి అవ్వ
గడచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలవ
కనపడీ కనపడని కళ్ళల్లో
కొడగట్టిన ప్రాణపు దీపంలో
తాను కనిన తన ప్రాణం
తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం
తన బాబు తన ఊపిరి
అస్సాం రైఫిల్సులో సోల్జర్ సిమ్మాచలం
కోసం నిరీక్షణ.."

`అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ` అనే కవితలో సైన్యంలో ఉన్న తండ్రి గురించి `ఇంకా రాడేం?` అని ఒక కుర్రాడు తల్లిని అడుగుతూ ఉంటాడు. రేడియోలో విషాద వార్త విన్నదేమో - అలా అడుగుతున్న కుమారుడ్ని అక్కున చేర్చుకొని రుద్ధ కంఠంతో `జైహింద్` అని మెల్లగా పలుకుతుంది. ఆ మాట స్వర్గంలో ఒక వీరుడికి హాయిగా తియ్యగా వినబడుతుంది. 

యుద్దానికి విసిగిపోయిన సైనికుడిలాగానే తాను కూడా శాంతికోసం పరితపించాడు. అందుకే శాంతి ఆచూకీ కోసం `ప్రకటన` జారీచేశాడు. శ్రీశ్రీ గురించి `ప్రపంచం బాధ అతని బాధ అని ఎవరో చెప్పినట్టు తిలక్ కూడా కవిగా ఆర్తగీతం ఆలపించి `నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు` అని తానన్న మాటల్ని సార్ధకం చేసుకొంటాడు. 

"అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
నేను మాత్రం
తలుపు తెరచి యిల్లు విడిచి
ఎక్కడికో దూరంగా
కొండదాటి కోనదాటి
వెన్నెల మైదానంలోకి
వెళ్ళి నిలుచున్నాను.

ఆకాశంమీద అప్సరసలు
ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు
వారి పాదాల తారా మంజీరాలు
ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి
వారి ధమ్మిల్లాల పారిజాతాలు
గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి
వారు పృధు వక్షోజ నితంబ భారలై
యౌవన ధనస్సుల్లా వంగిపోతున్నారు

నన్ను చూసిచూసి కిలకిల నవ్వి యిలా అన్నారు
చూడు వీడు
అందమైన వాడు
ఆనందం మనిషైన వాడు
కలలు పట్టు కుచ్చులూగుతూన్నకిరీటం ధరించాడు
కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు
ఎర్రని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు
ఎవరికి దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు
జీవితాన్ని ప్రేమించినవాడు జీవించడం తెలిసినవాడు
నవనవాలైన ఊహావర్ణార్ణ వాల మీద ఉదయించిన సూర్యుడు
ఇతడే సుమీ మన ప్రియుడు నరుడు మనకి వరుడు

జలజలమని కురిసిందివాన
జాల్వారింది అమృతంపు సోన
దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను
దుఃఖాన్నీ చావునీ వెళ్ళిపొమ్మన్నాను
కాంక్షా మధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను
జీవితాన్ని హసన్మందార మాలగా భరించాను
జైత్రయాత్ర పథంలో తొలి అడుగు పెట్టాను

అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
అలసి నిత్యజీవితంలో సొలసి సుషుస్తి చెందారు
అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు
అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు
అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయారు

అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని!"

ఉదయ, సాయంత్రాలు; మంచుకురిసే ఉషోదయాలు; వర్షం కురుస్తున్న రాత్రులు; అన్ని సమయాలు, కాలాలు... తిలక్ కవితల్లో ప్రాణంపోసుకొన్నాయి. నలభై అయిదేళ్ళకే తిలక్ కాలం చేస్తే (1921- 1966) అతని మరణానంతరం తిలక్ కవితలని సంకలనంగా చేసి అమృతం కురిసిన రాత్రి అనే పేరుతో 1969లో విడుదల చేశారు. ఈ సంకలనానికి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది. 

అమృతం కురిసిన రాత్రిని మళ్ళీ మళ్ళీ చదవాలి.
© Dantuluri Kishore Varma

8 comments:

  1. అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు..ఈ లైన్లు ఎందుకోగాని నేనెప్పుడు రాత్రి పూట నిద్రలేచినా పదే పదే గుర్తుకు వస్తుంటాయి.మంచి కవిత ని గుర్తుచేశారు.ధన్యవాదాలు వర్మ గారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ మూర్తి గారు :)

      Delete
  2. ఇది ఎప్పుడు చదువినా ఓ కొత్తలోకానికి వెళ్ళిన భావన కలుగుతుంది.
    మరో మారు గుర్తుచేసి ,మీ అభిరుచి ఎంతగొప్పదో తెలియజేశారు వర్మాజి

    ReplyDelete
    Replies
    1. ముందుగా హ్యాట్సాఫ్ టు తిలక్! ఇంత మంచి కవిత్వాన్ని తెలుగువాళ్ళకు ఇచ్చినందుకు. తరువాత థాంక్స్ మీకు. అభిప్రాయం తెలియజేసినందుకు.

      Delete
  3. చాన్నాళ్ల తర్వాత, తిరిగి, మీ మూలముగా మరో మారు చదివాను. మీ ప్రయత్నము మంచిది. అభినందన.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రసాదరావుగారు :)

      Delete
    2. Idi Kavithvaniki diddina Thilakam

      Delete
    3. అవును శరత్‌చంద్ర గారూ, తిలక్ దిద్దిన తిలకం.
      మంచి పరిశీలన.
      ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!