Pages

Friday, 11 July 2014

సముద్రపు వొడ్డునుంచి మాయమైపోయిన పార్క్!

ఊరినుంచి సముద్రపువొడ్డుకి వెళ్ళాలంటే ప్రపంచం అవతలి వరకూ వెళ్ళినంత కష్టంగా ఉండేది. కాకినాడ సినిమా రోడ్డులో కల్పనా సెంటర్ దగ్గరనుంచి డైరీఫారం సెంటర్‌మీదుగా బీచ్ వైపు వెళ్ళే వాళ్ళం. ఇప్పుడున్న సాంబమూర్తినగర్ వోవర్ బ్రిడ్జ్ అప్పటికి కట్టలేదు. రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి. పట్టాలు దాటాకా అదంతా మరోప్రపంచం. దూరం, దూరంగా విసిరేసినట్టు మత్యకారుల ఇళ్ళు ఉండేవి. అవి దాటి చాలా దూరం వెళితే బీచ్. మధ్యాహ్నం ఏ రెండుగంటలకో ఎండలో పడి అంతదూరం పోతే అక్కడ తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు కానీ, సోడానో, కూల్‌డ్రింకో.. ఏదీ దొరికి చచ్చేది కాదు. తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు దాహంతో నోరు పిడచకట్టుకొని పోయి `ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా?` అనిపించేది. ఇదంతా పంతొమ్మిదివందల తొంభైల్లో మాట.

 అదిగో సరిగ్గా అలాంటి సమయంలో కాకినాడ సముద్రతీరపు ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందేమో అని ఆశ కలిగేలా ఓ పని చేశారు. అదే బీచ్ పార్క్ నిర్మాణం. సముద్రపు వొడ్డున పార్కుకి స్థలం కేటాయించి గోడ కట్టారు. మధ్యలో గుండ్రంగా రెండంతస్థుల సిమ్మెంట్ నిర్మాణం చేశారు. పై అంతస్థుమీదకి వెళ్ళడానికి నాలుగు వైపులనుంచీ మెట్లు నిర్మించారు. ఇక్కడి నుంచి దూరంగా నాగార్జునా ఫెర్టిలైజర్స్, గోదావరీ ఫెర్టిలైజర్స్ ఫేక్టరీలు కనిపించేవి.  పార్కులో ఓ వైపు పిల్లలు ఆడుకోవడానికి జారుడుబల్ల, సీ-సా లాంటివి పెట్టారు. ఆ ప్రదేశం అంతా మొక్కలు నాటి  ఓ ఆకారం తీసుకొని వచ్చారు. 


పార్క్ మధ్యలో బిల్డింగ్ రెస్టారెంట్‌కోసం  అని చెప్పారు. కొంతకాలం బజ్జీలు, చిప్స్, సమోసాలాంటివి ఏవో అమ్మేవారు. జనం పార్క్‌లోనికి వెళ్ళేవారు. తరువాత లోనికెళ్ళి, తిరిగొస్తే వచ్చే కాళ్ళ నొప్పులు గుర్తుకు వచ్చి మానేశారు. క్రమంగా ఏమైపోయిందో తెలియకుండా పార్క్ మాయం అయిపోయింది. షిప్‌బ్రేకింగ్ యూనిట్లో, పోర్ట్ తాలూకు నిర్మాణాలో ఆ ప్రదేశంలో వచ్చాయి. 

సందర్శకుల ఆశల గుర్రాలని ఊహాలోకాల్లోకి పరుగులెత్తించిన పార్క్  ఒకప్పుడు ఆ ప్రదేశంలో ఉండేదని ఇప్పుడు ఎవ్వరికీ  తెలియదు! 
© Dantuluri Kishore Varma

6 comments:

  1. Wow....the pics says it all....sad fact but makes nostalgic...

    ReplyDelete
  2. అప్పట్లో మేము కూడా సంవత్సరంలో ఒక్కసారి అయినా స్కూల్ నుంచి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం...కాని మీరు అన్నట్టు తినడానికి ఎమీ దొరికేది కాదు...అందరం ఎదో ఒకటి ఇంట్లొ చేయించుకుని తీసుకుని వెళ్ళేవాళ్ళం...

    ReplyDelete
    Replies
    1. నిజమే వంశీగారు. మీ జ్ఞాపకాలని పంచుకొన్నందుకు ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!