Pages

Sunday, 20 July 2014

ఇళ్ళు ఇలా కూడా కట్టుకోవచ్చు!

ప్యూరిఫైడ్ వాటరో, కూల్‌డ్రింకో తాగేసి ఖాళీ ప్లాస్టిక్ సీసాల్ని పారేస్తాం.  రైలు పట్టాలకి ఇరువైపులా, రోడ్లమీద, చెత్తకుండీల దగ్గర, డ్రెయిన్లలో, పిక్నిక్ స్పాట్ల దగ్గర కుప్పలు తెప్పలుగా పెట్ బాటిల్స్ అని పిలవబడే పాలిథిన్ టెరెప్తలేట్ సీసాలు పోగుపడిపోతున్నాయి. వీటిని అలాగే వదిలేస్తే పర్యావరణానికి చాలా నష్టం అని చెపుతారు. ఒక్కొక్క సీసా క్రమంగా భూమిలో కప్పడిపోయి, మట్టిలో కలిసిపోవడానికి వెయ్యి సంవత్సరాల కాలం పడుతుందట. అలా కాకుండా వాటిని రీ సైకిల్ చేస్తే మరొక రకమైన ప్లాస్టిక్ వస్తువులుగా తయారు చేసుకోవచ్చు. రీసైక్లింగ్ వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి - మొదటిది చెత్తను వదిలించుకోవడం, రెండవది కొత్తగా ప్లాస్టిక్ తయారు చెయ్యడానికి కావలసిన సహజ వనరులని వినియోగించనక్కర్లేక పోవడం. కానీ, ఈ ప్లాస్టిక్ బాటిల్స్ విషయంలో వందశాతం రీసైక్లింగ్ జరగడంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇరవై నుంచి ముప్పై శాతం సీసాలు మాత్రమే రీసైక్లింగ్‌ద్వారా తిరిగి వినియోగింపబడుతున్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వాడేసిన ప్లాస్టిక్ సీసాల్ని ఎక్కువ సంఖ్యలో ఉపయోగించుకొనే గొప్ప ఆలోచనని మీతో పంచుకొందామని ఈ టపా. 

ఈ రోజు ఒక వీడియో చూశాను. ఓ ఇంజనీరింగ్ కాలేజీవాళ్ళూ విద్యార్థులచేత ఒక షెడ్ కట్టించారు. షెడ్లు నిర్మించడం కొత్తవిషయం కాదు. కానీ నిర్మాణానికి అవసరమైన ఇటుకలకు బదులుగా పెట్ బాటిల్స్‌ని వినియోగించడం ఇక్కడ గమనించ వలసిన విషయం. ఖాళీ సీసాల్లో మట్టిని కూరి, మూతలు పెట్టేసి వాటిని ఇటుకలుగా ఉపయోగించారు. గోడలు కట్టేసిన తరువాత సిమ్మెంటుతో ప్లాస్టరింగ్ చెయ్యడమో, పాతకాలం పల్లెటూరి గుడిసెలకి మెత్తినట్టు ఎర్రమట్టిని మెత్తడమో చేస్తే గోడల లోపల ఉన్నవి ఇటికలో, పెట్ బాటిల్సో తెలియనే తెలియదు. నిర్మాణాన్ని వివరంగా చూపించిన ఓ వీడియోని ఇక్కడ చూడండి.
పెద్ద నిర్మాణాలని చెయ్యడానికి ఈ విధానం ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలియదు కానీ షెడ్లు, ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు, వాటర్‌టేంకులు లాంటివాటిని చక్కగా కట్టుకోవచ్చు. పల్లెటూరిలో ఉన్న ఒక పేద రైతుకూలీ తన ఇంటికి చేర్చి ఓ మరుగుదొడ్డిని   కట్టుకోవాలనుకొంటే ప్రతీరోజు తనకున్న ఖాళీ సమయాల్లో సేకరించి పెట్టుకొన్న ప్లాస్టిక్ బాటిల్స్‌లో మట్టిని నింపుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ తలో చెయ్యీ వేస్తే కొద్దిరోజుల్లోనే కట్టుబడికి అవసరమైన సీసా ఇటికలు తయారు చేసుకోవచ్చు, సీసాల్ని సేకరించడం పెద్ద సమస్యకాదు. అవి ఉచితంగా లభించక పోతే పాత పేపర్లు, చెత్త సామాన్ల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర చాలా తక్కువ ధరకి దొరుకుతాయి.   

ప్లాస్టిక్ సీసాలతో నిర్మించిన ఇళ్ళు భూకంపాలకి నిలబడతాయా? అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవిస్తే నిప్పు తొందరగా అంటుకోవడం, విషతుల్యమైన పొగలని వెలువరించడం జరగుతుందా? అనే విషయాలు తెలియవు.   

వీడియో చూసిన తరువాత ఆసక్తికరంగా అనిపించడంతో కొంత గూగుల్ సెర్చ్ చేసి వివరాలు తెలుసుకొన్నాను. ఈ నిర్మాణ విధానం కొత్తదేమీ కాదు. చాలా కాలంనుంచి వివిధ దేశాల్లో అవలంభిస్తున్నారు. మనరాష్ట్రంలో మాత్రం ఎక్కడా ఇలా నిర్మాణాలు చేస్తున్నట్టు లేదు. కాబట్టి మనవరకూ ఇది కొత్త విషయమే!    

© Dantuluri Kishore Varma

2 comments:

  1. అయ్యో మేము ఇల్లు కట్టేసుకున్నాం , లేకుంటే ఇలా ట్రై చేసే వాళ్ళం వర్మాజి.

    ReplyDelete
    Replies
    1. హా..హా... మరేం పరవాలేదు మెరాజ్‌గారు. తెలుసున్నవాళ్ళు ఎవరైనా కట్టుకొంటుంటే చెప్పండి - ఈ టెక్నాలజీ ఏమైనా ఉపయోగించుకొంటారేమో! :)

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!